సెప్టెంబర్ 17.. తెలంగాణ చరిత్రలో మర్చిపోలేని రోజు.. రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్యానికి పరివర్తన చెందిన రోజు. ఆ రోజు ఏం జరిగిందో చరిత్రలో నిక్షిప్తమై ఉంది. కానీ అసలు నిజాలు దాచేసి.. కీలక ఘట్టానికి తోచిన భాష్యం చెప్పడమే వివాదానికి దారితీస్తోంది. ఈ గొడవలో రాజకీయ పార్టీలు కూడా దూరి.. స్వప్రయోజనాల కోసం పాకులాడటం మరీ విడ్డూరం. చరిత్ర ఏంటో తెలిసీ.. రాజకీయ లబ్ధి కోసం ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
సెప్టెంబర్ 17 అంటే ఒక ఉద్యమం, ఒక ఉద్వేగం. చరిత్రలో నిలిచిపోయిన సందర్భం. పాత తరాల పోరాటానికి, భావి తరాలు స్ఫూర్తి పొందడానికి సూచిక. అప్పుడు జరిగింది. నిరంకుశ ప్రభువుకు, ప్రజలకు మధ్య జరిగిన పోరు. కానీ దాన్ని హిందూ ముస్లిం మతాల మధ్య గొడవగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం వివాదం రేపుతోంది.
రాచరికం హద్దుమీరినప్పుడు.. నిరంకుశత్వం పతాకస్థాయికి చేరినప్పుడు.. కచ్చితంగా విప్లవం వస్తుంది. తెలంగాణలో కూడా అదే జరిగింది. ఏళ్ల తరబడి నిజాం నిరంకుశ పాలనలో విసిగిపోయిన ప్రజలు.. పోరాటాలకు సిద్ధమయ్యారు. ప్రతి గ్రామంలో కుల, మతాలకు అతీతంగా జనం ఏకమై యుద్ధానికి నడుం బిగించారు. చావో రేవో తేల్చుకోవడానికి తెగించి రంగంలోకి దూకారు. నిజాం ముస్లిం. మెజార్టీ ప్రజలు హిందువులు. ఇది నిజమే. కానీ పోరాటం మత కోణంలో జరగలేదు. నిజాం నిరంకుశత్వమే కాదు.. నిజాంను అడ్డుపెట్టుకుని హిందూ దొరలు చేసే అరాచకాలు కూడా తక్కువేం కాదు. ఈ మొత్తం అరాచకాలకు వ్యతిరేకంగా రైతాంగ పోరాటం జరిగింది. దీనికి విద్యావంతులు, మేధావులు సహకరించారు. షోయబుల్లాఖాన్ ముస్లిం అయినా.. ఓ జర్నలిస్టుగా నిజాం నిరకుంశత్వంపై పెన్ను ఎక్కుపెట్టి బలైపోయారు. ఇలా ఎన్నో బలిదానాల తర్వాత.. ఎంతోమంది యోధులు అమరులయ్యాక.. నిజాం సైన్యం బాగా బలహీనపడింది. ఆ తర్వాతే యూనియన్ సైన్యం ఆపరేషన్ పోలో పేరుతో హైదరాబాద్ లో ప్రవేశించింది. అప్పటికే బలహీనపడ్డ నిజాం సైన్యం పెద్దగా ప్రతిఘటించకుండానే చేతులెత్తేసింది. నిజాం రాజు అప్పటి యూనియన్ హోం మంత్రి సర్దార్ పటేల్ కు లొంగిపోయారు.
అసలు యూనియన్ సైన్యం ఎక్కడా నిజాం సేనతో నేరుగా యుద్ధం చేయలేదు. ముఖాముఖి పోరుకు దిగాల్సిన పనిలేకుండానే హైదరాబాద్ సంస్థానం భారత్ లో విలీనమైంది. కానీ పోలీస్ చర్య కంటే ముందే రజాకార్ల దౌర్జన్యాలకు, నిజాం సైన్యం ఆగడాలకు సామాన్యులు బలైపోయారు. ఇక్కడ హిందువులు, ముస్లింలు అనే తేడా ఎవరూ చూడలేదు. అవకాశం ఉన్నవాడు దోచుకున్నాడు. శక్తి లేనివాడు బలైపోయాడు. జరిగింది ఇదైతే.. సాయుధ పోరాటాన్ని మతం కోణంతో చూడటం గందరగోళానికి దారితీసింది. తెలంగాణలో ఇప్పటికీ నాటి ఘటనలకు సాక్షులు చాలా మంది ఉన్నారు. అసలు జరిగిందేంటి.. ఇప్పుడు చేస్తున్న ప్రచారమేంటి అని వాళ్లు మథనపడుతున్నారు. పోరాటాన్ని గౌరవించకపోగా.. తప్పుడు భాష్యాలు చెప్పి.. ప్రాణాలు అర్పించిన వాళ్లను అవమానిస్తున్నారనే వాదన కూడా బయల్దేరింది.
కులం, మతం, ప్రాంతం, వర్గం.. ఇవన్నీ కడుపు నిండిన వాళ్ల మాటలు. అసలు భూమి కోసం, భుక్తి కోసం జరిగిన పోరాటం వీటికి తావు ఉండే ప్రశ్నే లేదు. నిజాం గద్దె దిగాలనే ఏకైక సంకల్పంతో.. అత్యంత సాహసంతో జరిగిన సాయుధ రైతాంగ పోరాటానికి మతం ముసుగు అద్దడం, ఎవరికి తోచిన భాష్యం వాళ్ల చెప్పడం వివాదానికి దారితీస్తోంది. సెప్టెంబర్ 17 చరిత్రను ఎవరికి తోచిన విధంగా వాళ్లు అన్వయించుకుంటున్నారే కానీ.. ఆ ఉద్యమ ఆకాంక్షలు ఎంతవరకు నెరవేరాయి.. మిగిలిపోయిన లక్ష్యాలను సాధించడానికి ఎలాంటి కార్యాచరణ తీసుకుంటారో ఎవరూ చెప్పడం లేదు. అంటే రాజకీయమే ముఖ్యం కానీ.. ప్రజా సంక్షేమంపై శ్రద్ధ లేనట్టే. అప్పుడెప్పుడో నిజాం రాజు నిరంకుశుడు అని తిరుగుబాటు వచ్చింది. మరిప్పుడు ప్రజాస్వామ్యంలో కూడా ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోకుండా రాజకీయ పార్టీలు సొంత అజెండాల కోసం పనిచేస్తే ఏమనాలి. వీళ్లెప్పుడు మారతారనుకోవాలి. ఒకసారి చరిత్ర చదువుకుని.. ప్రస్తుత తెలంగాణ సమాజాన్ని పరిశీలిస్తే.. నిజాలు అర్థమౌతాయ. కానీ ఏ పార్టీకి అంత తీరిక, ఓపిక రెండూ లేవు. ఎవరికి వారు పొలిటికల రేస్ లో పరిగెడుతున్నారు. దారిలో ఏం దొరికితే దాన్ని తీసుకుంటున్నారు. సెప్టెంబర్ 17 కూడా అలాంటిదే. వారి దృష్టిలో దానికి అంతకు మించిన ప్రత్యేకత ఏమీ లేదు. కానీ ప్రజలకు మాత్రం సెప్టెంబర్ 17తో భావోద్వేగ బంధం ఉంది. అసలు బంధాన్ని తుంచేసి.. కొసరు సంబంధాలు అంటగట్టే పనిలో బిజీగా ఉన్నాయి పార్టీలన్నీ.
సందర్భం ఏదైనా రాజకీయం చేయాల్సిందే. చరిత్రను కూడా ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు తగ్గట్టుగా తిరగరాయాల్సిందే. అంతే. ఇక్కడ నిజానిజాలకు తావు లేదు. ప్రజలతో సంబంధమే లేదు. మేం చెప్పిందే నిజం.. కాదు కాదు మాదే అసలైన నిజం. ఇలా ఎవరికి వారు సొంత డబ్బాలు కొట్టుకుంటూనే ఉన్నారు. చరిత్ర పుటల్లో భద్రంగా ఉన్న ఘట్టాల గురించి.. ఇంత నిస్సిగ్గుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటే.. ఓట్ల కోసం ఎంతకైనా దిగజారతారని అర్థం చేసుకోవాలి. చరిత్రలో మంచి, చెడు రెండూ ఉన్నా.. మంచి నుంచి స్ఫూర్తి పొందాలి. చెడును చూసి మరోసారి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. అంతేకానీ ఓటు బ్యాంకు పాలిటిక్స్ కు ఏది పనికొస్తే దాన్ని ప్రజలపై రుద్దే సంస్కృతికి తెరతీయకూడదు. ఏ పని చేసినా.. అందులో రాజకీయం వెతుక్కోవడం అలవాటైన నేతలకు.. ఇప్పుడు సెప్టెంబర్ 17ను కూడా అలాగే చేస్తున్నాయి. పార్టీకో పేరుతో కార్యక్రమాలు చేస్తూ.. ప్రజలకు అసలు చరిత్ర ఏంటో తెలియకుండా చాలా జాగ్రత్తపడుతున్నాయి. భావి తరాలకు నిజాలు తెలియకుండా మసపూసి మారేడుకాయ చేస్తున్నాయి. పార్టీకో నినాదంతో ఊదరగొడుతూ.. ప్రజల్ని పిచ్చి భ్రాంతిలో ముంచేసే ప్రయత్నం చేస్తున్నాయి. సెప్టెంబర్ 17కు ఏ పార్టీ కూడా ఛాంపియన్ కాదు. అసలు ఛాంపియన్లు ప్రజలు. ఈ నిజం ఒప్పుకోవడానికి పార్టీలకు హిపోక్రసీ అడ్డం వస్తోంది. దాన్ని కప్పి పుచ్చుకోవడానికి రకరకాల ముసుగులు వేసుకుని.. నానా పాట్లు పడుతున్నాయి.
సెప్టెంబర్ 17, 1948 నాడు నాటి హైదరాబాద్ రాజ్యాన్ని పోలీస్ యాక్షన్ పేరు మీద జరిగిన సైనిక చర్య ద్వారా భారత సమాఖ్యలో కలిపారు. నేడు అది తెలంగాణ రాష్ట్ర రాజకీయ చర్చలకు కేంద్ర బిందువుగా మారింది. రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల ఫలితాలని నిర్ణయించే ఒక ముఖ్యమైన అంశంగా ఇది ముందుకు రాబోతోంది అనేది సుస్పష్టం.
హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయ్యిందా లేక విమోచనం లభించిందా? నిజాం రాజు పాలన ఎలా అంతమయ్యింది? సాయుధ పోరాటం ఏమేరకు నిజాంను గద్దె దించగలిగింది? హైదరాబాద్‌పై పోలీస్ యాక్షన్ పేరుతో జరిగింది ఏంటి? నిజాంపై యుద్ధం చేయడంలో నెహ్రూ-పటేల్ పాత్ర ఏంటి? అసలు సెప్టెంబర్-17న ఏంజరిగింది?
అసలేం జరిగిందో అందరికీ తెలసు. జరిగింది సీక్రెట్ ఏం కాదు. బహిరంగంగానే జరిగింది. నిజాం లొంగిపోయాడు. రజాకార్లు పారిపోయారు. దేశ్ ముఖ్ లు సర్దుకున్నారు. ప్రజలు మాత్రం అలాగే మిగిలిపోయారు. 1948 సెప్టెంబర్ 17 తర్వాత కొన్నాళ్ల పాటు యూనియన్ సైన్యాలు హైదరాబాద్ సంస్థానంలో ఎందుకున్నాయి.. ఏం చేశాయనేది మరో కథ.
భౌగోళికంగా ఐక్యమైన, పాలనకు అనువైన దేశాన్ని పాలక పార్టీగా కాంగ్రెస్ కోరుకుంది. పోలీసు చర్య తర్వాత హైదరాబాద్ సంస్థానం విలీనమయ్యాకే అలాంటి దేశం ఏర్పడింది. కశ్మీర్, జునా గఢ్, హైదరాబాద్ సంస్థానాల్లో అనేక మరణాలు, హింసకు దారి తీసేటటువంటి బలప్రయోగం జరపడం కేంద్ర ప్రభుత్వానికి అవసర మైంది. అది పూర్తిగా మరొక గాథ.
సెప్టెంబర్ -17న హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయిందా లేక తెలంగాణా ప్రజలకు నిజాం కబంధ హస్తాల నుంచి విమోచనం లభించిందా అనే అంశంపై భిన్న వాదనలున్నాయి. దీనిపై వాదించేవారు ఎవరైనా తమకు అనుకూలమైన వాదనలనే తెరమీదికి తీసుకువస్తారు. 1948 సెప్టెంబర్-17న పోలీసు చర్యతో నిజాం భారత ప్రభుత్వానికి లొంగిపోయాడు. దీంతో తెలంగాణా ప్రాంతం భారతదేశంలో విలీనమైనపోయినట్లేనని చాలా మంది వాదన. అందుకే సెప్టెంబర్-17ను విలీన దినోత్సవంగా జరపాలంటారు.
అయితే సెప్టెంబర్-17న తెలంగాణా పూర్తిగా భారతదేశంలో విలీనం కాలేదనేది కూడా అంతే వాస్తవం. సాంకేతికంగా 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చేవరకు తెలంగాణా నిజాం పాలనలోనే ఉంది. అయితే పేరుకే నిజాం ప్రభువు అయినప్పటికీ ఇక్కడ పౌరప్రభుత్వం ఏర్పాటు నుంచి సైనిక శక్తి అంతా భారత ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లిపోయింది. దీంతో నిజాం దుష్టపాలన నుంచి ఖాసీం రజ్వీలాంటి రజాకార్ నాయకుల నుంచి తెలంగాణా ప్రజలు విముక్తి పొందారు. అందుకే సెప్టెంబర్-17ను విమోచన దినంగా పరిగణించాలని మరికొందరివాదన.
సెప్టెంబర్-17న తెలంగాణా విలీనం జరిగిందా లేక విమోచన జరిగిందా అనే చర్చ సుదీర్ఘ కాలంగా కొనసాగుతూనే ఉంది. అయితే 1948 సెప్టెంబర్-13 నుంచి 17వ తేదీ వరకు జరిగిన పోలీసు చర్య వల్లే తెలంగాణా నిజాం పాలన నుంచి విముక్తి పొందిందనేది అందరూ అంగీకరించే వాస్తవం. హైదరాబాద్ సంస్థానంను చుట్టుముట్టిన భారత సైన్యం హైదరాబాద్ నగరానికి చేరుకుని నిజాంను లొంగదీసుకున్న ఆపరేషన్ పోలో తెలంగాణా చరిత్ర గతిని మార్చేసింది. తెలంగాణా ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ప్రసాదించింది. ఇంతటి కీలక పరిణామాలకు కేంద్రబిందువైన ఆపరేషన్ పోలోకు ముందు చాలా తతంగమే నడిచింది. అయితే ఆపరేషన్ పోలో 5 రోజుల్లో ముగిసిపోయినా సైనిక చర్య తప్పదనే సంకేతాలు 13 నెలల ముందే అంటే.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజునే కనిపించాయి.
బ్రిటిష్ పాలనలో నాటి ఉపఖండంలో ఉన్న సంస్థానాల్లో హైదరాబాద్ అన్నిటికన్నా పెద్దది. అందులో నేటి తెలంగాణ రాష్ట్రం, నేటి మహారాష్ట్రలోని మరఠ్వాడా ప్రాంతం, నేటి కర్నాటకలోని నాలుగు కన్నడ భాష జిల్లాలు హైదరాబాద్ రాజ్యంలో భాగంగా ఉండేవి.
హైదరాబాద్ రాజు ముస్లిం కాగా ఎక్కువ భాగం ప్రజలు హిందువులు. ఆయన పాలన ఒక వారసత్వ, రాచరిక, నిరంకుశ పాలన కావడంతో హైదరాబాద్ రాజ్యంలో పౌర, ప్రజస్వామ్య హక్కుల పరిస్థితి మరీ అధ్వానంగా ఉండేది. ఉర్దూ రాజ్య భాష కావడంతో అత్యధికులు మాట్లాడే తెలుగు, కన్నడ, మరాఠీ భాషలకి ప్రభుత్వం నుండి గుర్తింపుగానీ, ప్రోత్సాహంగానీ ఉండేది కాదు.
నిజాం రాజ్యపు సామాజిక మద్దతుదారులుగా జాగీర్దారులు, దేశ్ ముఖ్‌లు, దేశ్ పాండేలు, భూస్వామ్య దొరలు ఉండేవారు. మొత్తం భూములలో 60% దివానీ లేదా ఖల్సా ఖాతా కింద ఉండేవి. వాటికి సంబంధించిన పన్ను వసూలు చాలా భాగం వరకు భూస్వామ్య దొరల చేతిలో, పట్వారీ, మాలీ పటేల్, పోలీస్ పటేల్‌గా పిలిచే రెవెన్యూ అధికారుల చేతులలో ఉండేది.
బ్యూరోక్రసీలో ముస్లిం ఉన్నత వర్గాలది గుత్తాధిపత్యం కాగా గ్రామీణ ప్రాంతం హిందూ భూస్వాముల అధీనంలో ఉండేది. ఈ భూస్వామ్య వర్గమే నిజాం పాలనకు పునాది. చాలా మంది అనుకునేటట్టు కాకుండా నిజాం రాజు ఏనాడు కూడా ప్రజా వ్యహారాలలో ఇది మతోన్మాదం అనిపించే రీతిలో మతానికి ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఈ తరుణంలో, ప్రజల ఆకాంక్షలు, వారి సమీకరణాలు అనేక రూపాలు తీసుకున్నాయి. వీటి నుండి పుట్టుకొచ్చినవే ఆర్య సమాజ్, గ్రంథాలయ ఉద్యమం, రైతాంగ సాయుధ పోరాటం.
ఈ రైతాంగ సాయుధ పోరాటం, ప్రజా బాహుళ్య పోరాటాల నేపథ్యంలోనే హైదరాబాద్ పాలక వర్గం రజాకార్ల మద్దతుతో మతోన్మాద బాట పట్టింది. అయితే పైన చెప్పుకున్నట్టు నిజాంకు పునాదిగా నిలబడింది హిందూ భూస్వామ్య వర్గాలే. అటువంటి పరిస్థితులలో నిజాం పాలన అంతా కూడా ముస్లిం మతోన్మాద పాలన అని చెప్పడం అసంబద్ధమైన విషయం.
భారత సమాఖ్య సైనిక చర్య కారణంగా నిజాం లొంగిపోయిన విషయం మీద ఆయా వర్గాల రాజకీయ, భావజాల అవగాహన బట్టి అనేక కథనాలు చలామణీలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరుగుతున్న పరిణామాలు కూడా కొత్త రాజకీయ ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. సాయుధ రైతాంగ పోరాటం ముగిసిన పాతికేళ్ల వరకూ అసలు నిజాంకు వ్యతిరేకంగా ఎలాంటి గ్రంథాలూ లేవు. సరిగ్గా సాయుధ రైతాంగ పోరాట రజతోత్సవాలు జరుపుకునే సమయంలోనే.. నిజాం ను విలన్ గా చిత్రీకరించే పుస్తకాలు వెలువడ్డాయి. దీనికి మాభూమి సినిమా తోడైంది. హిందూ భూస్వాముల అరాచకాల్ని కూడా నిజాంకు అంటగట్టే పని మొదలైంది. అలా నిజాంపై అత్యంత క్రూరుడనే ముద్ర పడింది. అసలు నిజాలు వెలుగు చూడకుండా సమాధి చేసే ప్రయత్నాలు అప్పట్నుంచే ప్రారంభమయ్యాయి. చివరకు బండెనక బండి కట్టి అనే పాట కూడా నిజాంకు వ్యతిరేకంగా రాయలేదు. ఓ హిందూ భూస్వామికి వ్యతిరేకంగా రాసిన పాటను.. నిజాంకు ఆపాదించారు. ఇలా అన్నిరకాలుగా చరిత్రను వక్రీకరించారు.
బ్రిటిష్ వలస రాజ్యపు ఆధీనంలోనే ఉన్నప్పటికీ హైదరాబాద్ రాజ్యం ఒక స్వతంత్ర రాజకీయ వ్యవస్థ. హైదరాబాద్ రాజ్యం భారత సమాఖ్యలో చర్చల ద్వారా కాకుండా సైనిక చర్య ద్వారా భాగం అయ్యింది కాబట్టి అది దురాక్రమణ అని ఒక భావన. ఈ భావన ప్రకారం ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, సైనిక చర్య ద్వారా బలప్రయోగం జరపడం.
అయితే చేరిక అనే పదం నిజాం వైపు నుండి ఒక అంగీకారం ఉంది అనే భావనని తెలియచేస్తుంది. కమ్యూనిస్ట్ సాయుధ పోరాటానికి భారత సమాఖ్యకి మధ్యలో నిజాం నలిగిపోతున్నాడు కాబట్టి.. భారత సమాఖ్యలో చేరి ఆ సాయుధ పోరాటాన్ని అణిచివేసే బాధ్యత సమాఖ్యకి అప్పగించాడు అనే ఒక అభిప్రాయం కూడా ఉంది.
విప్లవ వామపక్ష శిబిరంలో ఈ మొత్తం విషయానికి సంబంధించి వేరే అభిప్రాయం ఉంది. ఈ శిబిరానికి ఈ మొత్తం వ్యవహారం ఒక విద్రోహం. తెలంగాణ ప్రజలకి భూమి, భుక్తి, విముక్తిని నిరాకరిస్తున్న భూస్వామ్య వ్యవస్థను కూలదోయడానికి జరుగుతున్న రైతాంగ పోరాటాన్ని హింసాత్మకంగా అణిచి వేయడం కూడా దీనిలో భాగమని ఈ శిబిరం వాదన. ఈ రైతాంగ పోరాటంలో పేద ముస్లిం రైతాంగం, కౌలుదారులు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో బందగీ అనే ఆయన ముస్లిం భాగస్వామ్యానికి ప్రతీకగా నిలిస్తే మఖ్దూం మొహియుద్దీన్, ఆలం ఖుందిమిరీ లాంటి మేధావులు నిజాం వ్యతిరేక పోరాటానికి ప్రతీకలు.
హైదరాబాద్ సంస్థానం అంటే తెలంగాణ మాత్రమే కాదు. కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు కూడా. ఆయా రాష్ట్రాల్లో ఎప్పట్నుంచో వేడుకలు జరుగుతున్నాయి. కానీ తెలంగాణలో మాత్రం అధికారిక వేడుకలు జరపడం ఇదే తొలిసారి. అదీ ఎన్నికల తరుణంలో జరగడం అనుమానాలకు తావిస్తోంది. పార్టీలు చరిత్రను గుర్తిస్తున్నాయా.. యోధుల్ని స్మరించుకుంటున్నాయా.. భవిష్యత్ ప్రయోజనాల కోసం ఎదురుచూస్తున్నాయా అనేదే అసలు నిజం.
ఒక్క మాటలో చెప్పాలంటే, విముక్తి అంటే కేవలం ప్రభుత్వం మారటం మాత్రమే కాదు. విముక్తి అంటే సమాజం పూర్తిగా రూపాంతరం చెందటం. ఏ రకమైన చారిత్రక పరిశోధనని చూసినా కూడా సెప్టెంబర్ 17, 1948 నాడు హైదరాబాద్ రాజ్యం భారత సమాఖ్యలో భాగం అయ్యిందని ఉంటుంది. దానికి కొనసాగింపుగా జనవరి 26, 1950 నాడు అమలులోకి వచ్చిన భారత రాజ్యాంగం ద్వారా హైదరాబాద్ ప్రజాస్వామ్య గణతంత్రమైన భారత దేశంలో భాగం అయ్యింది.
అయితే విముక్తి అనేటప్పుడు కొన్ని ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. భూస్వామ్యం అంతానికి, కుల పెత్తనం నిర్మూలన కోసం ఎంతో సుదీర్ఘ పోరాటం జరిగింది. సెప్టెంబర్ 17తో ఈ రెండింటికీ తెరపడిందా? సెప్టెంబర్ 17 అనే ఒక ఘటన గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక విమర్శనాత్మక చారిత్రక దృక్పథం ఆధారంగా.. కులం, వర్గం, ఆధిపత్యం, అధికారం లాంటి ముఖ్యమైన అంశాలు చర్చలో భాగం అవ్వాలి. ఘటనని వివరించటమే కాకుండా దానికి ఒక లోతుని, దాని పరిధిని విస్తరించడమే చరిత్ర ముందున్న ఒక ముఖ్యమైన కర్తవ్యం.
తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. దీనిని ఒక్కక్కరు ఒక్కో పేరుతో.. ఒక్కో అంశాన్ని పేర్కొంటూ గుర్తుచేసుకుంటారు. ఇప్పుడే ఇదే అంశాన్ని రాజకీయ పార్టీలు హాట్ టాపిక్ గా మార్చాయి. ఈ విషయంలో ఎవరికి వారు పై చేయి సాధించే విధంగా వ్యూహరచన చేశారు. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్-బీజేపీ-కాంగ్రెస్ ల మధ్య కొనసాగుతున్న రాజకీయ పోటీకి సెప్టెంబర్ 17 కీలక అంశంగా మారింది. ఆ రోజున కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు వేరువేరు పేర్లతో భారీ కార్యక్రమాలు నిర్వహించాయి. అయితే, దీని వెనుక పొలిటికల్ మైలేజీ లక్ష్యంగా కనిపిస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సెప్టెంబర్ 17ను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నంగా కనిపిస్తున్నది.
1948 సెప్టెంబర్‌లో అనేక పరిణామాలు జరిగాయి. అప్పడు జరిగిన ఘటనలపై గురించి.. రకరకాల వ్యాఖ్యానాలు ప్రచారంలో ఉన్నాయి. కొంతమంది తమకు తెలిసింది చెబుతున్నారు. మరికొంతమంది ఊహించి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. నేటితరం గందరగోళానికి గురవుతున్నారు. అసలు విషయం తెలుసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.
విదేశీ వలస పాలన నుంచి స్వతంత్రం సాధిస్తే.. విముక్తి పదం వాడుతాం. ఇంకా విస్తృత అర్థంలో.. రాజకీయ స్వతంత్రం తోపాటు.. ఆర్ధిక, సామాజిక మార్పులు వస్తే అది ప్రజలకు నిజమైన విముక్తి. ముస్లిం పరిపాలన నుంచి హిందువులకు విముక్తి లభించిందని ప్రచారం చేస్తున్నారు. ఒక శత్రువును సృష్టించి.. లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు.. ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన ముగ్గురు నాయకుల్లో.. రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి తోపాటు.. మఖ్దూం మొహినోద్దీన్ ఉన్న వాస్తవాన్ని విస్మరిస్తున్నారు.
భారత స్వాతంత్య్రోద్యమం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం దశాబ్దాలపాటు సమాంతరంగా సాగాయి. జాతీయోద్యమంలో చోటుచేసుకున్న ‘జలియన్‌వాలా బాగ్’ దురంతం వంటివాటికి ఉన్న గుర్తింపు నిజాం రాజ్యంలో చోటుచేసుకున్న దుర్ఘటనలకు లభించలేదు. గుండ్రాంపల్లి, బైరాన్‌పల్లి వంటి వందలాది గ్రామాలను నిరంకుశ నిజాం జలియన్‌వాలా బాగ్‌లుగా మార్చివేశాడు. చివరికి 1948 సెప్టెంబర్ 17న భారత యూనియన్ ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్యతో హైదరాబాద్ సంస్థానం భారత్‌లో కలిసిపోయింది. ఈ క్రమంలో లక్షలాది ప్రజలు అసువులు బాశారు. చరిత్రాత్మకమైన సాయుధ పోరాటానికీ, భారత్‌లో హైదరాబాద్ కలిసిన సెప్టెంబర్ 17కూ స్వార్థపూరిత రాజకీయాల వల్ల తగిన గుర్తింపు రాకపోవడం బాధాకరం.
దశాబ్దాల తరబడి జరిగిన తెలంగాణ ఉద్యమం విభిన్న మతాల, విభిన్న వర్గాల, విభిన్న కులాల సమాహారంగా జరిగిన ఒక లౌకిక, ప్రజాస్వామ్య, ప్రజా బాహుళ్య ఉద్యమానికి ప్రతీక. అటువంటి ఉద్యమం ఫలితమైన తెలంగాణ తన ఈ ప్రగతిశీల స్వభావానికి కట్టుబడి ఉంటుందా లేక మత ప్రభావంలో పడుతుందా అనేది వేచిచూడాల్సిన విషయం.
ప్రతి ఏడాదీ సెప్టెంబర్ 17కు ముందు మొదలయ్యే చర్చ ఈసారి మరింత తీవ్రమైంది. హైదరాబాద్ విమోచనా దినంగా ఏడాది పొడవునా సంబరాలు జరుపుతామని బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఐక్యతా విగ్రహం పేరిట భారీ సర్దార్ పటేల్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. దాన్ని విముక్తి విగ్రహం అని ఎందుకు అనలేదు? సమైక్యతా వైఖరి, విముక్తి వైఖరి మధ్య ఉన్న సూక్ష్మమైన తేడా వల్ల విముక్తి వైఖరితో ముస్లిం జనాభాను రెచ్చగొట్టవచ్చు. కానీ పాత గాయాలను మర్చిపోవడంలో, రాజీపడి శాంతియుతంగా జీవించడంలో తామెంతో ఉదార హృదయులమని భారత ప్రజలు నిరూపించుకున్నారు. అందుకే విలీనమా, విమోచనా అనే ప్రశ్నలను దాటి సమైక్యత అనే సమాధానం దగ్గర స్థిరపడటమే ఇప్పుడు మనకు కావలసింది.
తెలంగాణ ప్రజలు, ఇతర పార్టీలు ఒక సామూహిక సంక ల్పంతో సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినంగా జరుపు కోవడమే సరైనది. అప్పుడు మాత్రమే ఈ సమస్య చుట్టూ ఉన్న మత పరమైన ఎజెండాను సామూహికంగా పాతరేయవచ్చు. హైదరాబాద్ చేరిక ఒప్పందంపై ఇరువురూ సంతకాలు చేశాక సర్దార్ పటేల్, నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పక్కపక్కనే నడుచుకుంటూ వెళుతున్న చక్కటి ఫొటోగ్రాఫ్ కనబడుతుంది. పైగా జునాగఢ్ పాలకుడిలా కాకుండా, ఉస్మాన్ అలీఖాన్ భారత్‌లోనే చివరివరకూ ఉండిపోయారు. ఆయన గానీ, ఆయన కుటుంబం గానీ పాకిస్తాన్ పట్ల ఎన్నడూ విశ్వాసంతో లేరు. ఆయన కుటుంబ ఆస్తిలో చాలా భాగాన్ని భారత యానియన్‌కే ఇచ్చేశారు. ఢిల్లీలోని సుప్రసిద్ధమైన హైదరాబాద్ హౌజ్ కూడా భారత ప్రభుత్వానికి నిజాం ఇచ్చిందే.