Ganesh Chaturthi :నేలసారం చూడకుండా విత్తునాటితే మొక్క మొలవదు. అలాగే పూజ సారం తెలియకుండా దేవుడ్ని కొలిస్తే ఫలితం ఉండదు. అన్ని పనులను వినాయకుడి పూజతోనే ప్రారంభిస్తారు. అంతటి ప్రాధాన్యం కలిగిన విఘ్నేశ్వరుడి నుంచి నేటి యువతరం, పిల్లలు అందిపుచ్చుకోవాల్సిన అంశాలెన్నో ఉన్నాయి. వాటిని తెలుసుకుని అర్థం చేసుకుంటే ఎన్నో విజయాలను సొంతం చేసుకోవచ్చు.
శివపార్వతుల ముద్దుల కొడుకు విఘ్నేశ్వరుడి జన్మదినమే వినాయక చవితి. ఏటా భాద్రపద మాసంలో శుక్లపక్ష చవితి రోజున దేశవ్యాప్తంగా ఈపర్వదినాన్ని కన్నులపండుగగా జరుపుకొంటారు.. భారతీయ సమాజంలో వినాయక చవితికి విశిష్టమైన ప్రాముఖ్యం ఉంది, ఆది దంపతుల ప్రథమ కుమారుడైన వినాయకుడిని పూజించనిదే ఏ పనీ ప్రారంభించరు, ఆ గణనాథుని కృప ఉంటే అన్నీ విజయాలే లభిస్తాయనేది ప్రజల విశ్వాసం.
ప్రకృతిలో మమేకమవుతూ నేల, నీరు, చెట్టూ పుట్టా.. తదితర వాటిని ఆరాధించడం మన సంస్కృతిలో అనాదిగా వస్తున్న ఆచారం. హిందువుల పండుగల్లో వినాయక చవితికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ పర్వదినం నాడు వీధివీధినా వినాయక విగ్రహాలను నెలకొల్పి తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. గణేశచతుర్థినాడు వినాయక ఆరాధాన కాలాన్ని.. ప్రకృతిని.. జీవుల్ని నియంత్రించే ఈశ్వరుడి అనుగ్రహంతో, అన్ని అవరోధాల్ని అధిగమించడానికి నిర్వహిస్తారు. తుండం అంటే ఖండించడం. విఘ్నేశ్వరుడు వక్రాలన్నింటినీ ఖండించే భవ్య రూపధారి. అభ్యుదయంలో.. పురోగతిలో ఏర్పడే విఘ్నాలే వక్రాలు. అడ్డువచ్చే వక్రాల్ని తొలగించే వక్రతుండ విజయకారకుడు.. వరసిద్ధి వినాయకుడు. యజ్ఞత్వం, దైవత్వం, మంత్రత్వం, ద్రవ్యత్వం అనే నాలుగు అంశాలతో కూడుకున్నదే గణపతి ఆరాధన. వినాయకుడు నాలుగు వేదాల్లో ఆవరించిన వేదమూర్తి.
ఏటా వినాయకుడిని ప్రతిష్ఠిస్తాం.. పండుగకు రెండ్రోజుల ముందు నుంచే వీధివీధినా విగ్రహాలు పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తాం. నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం. తర్వాత ఆ ఆదిదేవుడిని నిమజ్జనానికి తీసుకెళ్తాం. ఆ సమయం మనకెంతో సంబురంగా సాగుతుంది. యువతకు, పిల్లలకైతే రోజులు క్షణాల్లా గడిచిపోతాయి. అయితే.. గణపతిని ప్రతిష్ఠించాం.. పూజించాం.. సాగనంపాం అనుకుంటే సరిపోదు. ఆ లంబోదరుడిని చూసి మనమెంతో నేర్చుకోవాల్సి ఉంది. మూషిక వాహనంపై కనిపించే గణనాథుడి ప్రతి అవయవమూ మనకు ఒక సందేశాన్నిస్తుంది. గణనాథుడి నుంచి స్ఫూర్తి పొందితే విద్యార్థులు విజేతలుగా నిలిచేందుకు దారి కనిపిస్తుంది. కుంగుబాటుకు గురయ్యేవారికి ధైర్యం నూరిపోస్తుంది. ఎదిగినా ఒదిగి ఉండాలనే ఔన్నత్యాన్ని చూపిస్తుంది. ఆత్మ విశ్వాసాన్ని పెంచుకునేందుకు ఔషధిలా పనిచేస్తుంది. వ్యాసుడు మహాభారత రచనకు గణేశుని దంతాన్నే కలంగా వినియోగించాడు. గణపతి పూజకు వినియోగించే 21 రకాల పత్రిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. పార్వతీదేవి నలుగు పిండితో బొమ్మను చేసి ప్రాణంపోసిగణపతిని తయారు చేసింది. ఆపై ఇంటి గుమ్మం దగ్గర కాపలా ఉంచింది. అప్పుడు శివుడు రావడం, వినాయకుడు అడ్డుకున్నాడు. ప్రమథ గణాలు చెప్పినా, ఆఖరికి యుద్ధానికి దిగినా భయపడలేదు. శివుని ఆగ్రహానికి గురికాక తప్పలేదు. తనకు అప్పగించిన పనిని, తాను ఒప్పుకున్న పని చేయడంలో ఎలాంటి అవాంతరాలు ఎదురైనా బెదిరిపోకూడదనే సందేశం ఈ కథలో ఉంది. ప్రాణానికి ప్రమాదం ఏర్పడినా విధిని నిర్వర్తించాలనే నిబద్ధతకు కట్టుబడి ఉండాలి. శ్రీకృష్ణుడు తన శమంతకమణిని దొంగిలించాడని సత్రాజిత్తు ఆరోపిస్తాడు. కృష్ణుడు చవితి చంద్రుడు చూడటం.. ఆ మణి ఎలా జాంబవంతుని దగ్గరకు చేరిందో తెలుసుకొని ఆయనతో పోరాడి ఆ మణిని అప్పగిస్తాడు.
శ్రీకృష్ణునంతటి వానిపై ఓ వ్యక్తి ఆరోపణ చేస్తే ఆయనను బంధించి ఏమైనా చేయగలడు. కానీ సహనంతో అసలు కారణాన్ని అన్వేషించి శమంతక మణి పొందాడు.మనల్ని ఎవరు విమర్శించినా కుంగిపోవడమో, ఆగ్రహించడమో చేయకూడదని నేర్చుకోవాలి. లంబోదరుడి ఏనుగుతలఉన్నతమైన ఆలోచనలు ఉండాలని, పెద్ద చెవులు ఎక్కువగా విని తక్కువగా మాట్లాడాలని చెబుతాయి. * చిన్న కళ్లు విషయాలను సూక్ష్మంగా పరిశీలించాలని, పెద్ద బొజ్జ నిశ్చింతగా జీవించాలని సూచిస్తాయి. గజాసురుడనే రాక్షసుడు శివుడి కోసం తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షమైతే ఆయన తన ఉదరంలోనే ఉండాలని కోరతాడు. అప్పుడు దేవతలంతా గంగిరెద్దుల మేళంతో వచ్చి ఆడి, పాడి అతడినిచంపి శివుని విడిపిస్తారు. ఎంతటివారైనా మితిమీరిన స్వార్థంతో కోరికలు కోరకూడదని అవగతం చేసుకోవాలి. సర్వపుణ్య నదుల్లో స్నానమాచరించి వచ్చినవారికే ప్రమథ గణాలపై అధిపత్యం ఇస్తానని శివుడు షరతులు పెట్టాడు.కుమారస్వామి నెమలి వాహనంపై రివ్వున వెళ్లిపోగా, వినాయకుడు మాత్రం భక్తి విశ్వాసాలతో శివపార్వతులకు ప్రదక్షిణ చేసి పోటీలో గెలుపొందాడు. అమ్మానాన్నలపై భక్తి గౌరవాలు కలిగి ఉండాలి. వారే ప్రత్యక్ష దేవతలని తెలుసుకోవాలనేది వినాయకుడు ఇచ్చే సందేశం.
వినాయకుడికి ఉన్న ప్రతిపేరు మనకు పాఠమే. విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలను తొలగించేవాడు. ఆటంకాలు ఏర్పడకుండా చూసేవాడు. యువత ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది విఘ్నాలను అధిగమించడం. సమస్యలు ఎదురైనప్పుడు దాన్ని విఘ్నంగా తలిస్తే ముందుకెళ్లలేమని తెలుసుకోవాలి. గజాననుడు అంటే ఏనుగు ముఖం కలవాడు అని అర్థం. లంబోదరుడు అని కూడా అంటారు. విజయం సాధించడానికి, గౌరవం పొందడానికి రూపంతో, ఆకారంతో సంబంధంలేదనే విషయాన్ని ఈ పేర్లు సూచిస్తాయి. ఎవరికైనా తన మేధస్సు, నడవడిక, బుద్ధిబలం మాత్రమే విజయతీరాలకు చేరుస్తాయని గజాననుడు తన కథలో నిరూపించాడు. అవనీషుడు అంటే ప్రపంచాన్ని ఏలేవాడని అర్థం. సోదరుడు కుమారస్వామితో పోటీపడాల్సి వచ్చినప్పుడు వాహన సదుపాయం గాని, పోటీపడే సామర్థ్యంగాని లేనప్పుడు తన యుక్తితో గెలుపును పొందగలిగాడు. సౌకర్యాలు, వసతులు మాత్రమే సామర్థ్యానికి ప్రతీకకాదని యువత గుర్తించాలి. అన్ని నాయకత్వ లక్షణాలు కలిగిన నాయకుడు. నాయకత్వం అంటే మందికి ముందుగా నిలవడం కాదు. అందరినీ నడిపించడం. తనవారిని గెలిపించడం. వినాయకుడి నుంచి పొందాల్సింది, గుర్తించాల్సింది ఇదే.
వినాయక చవితి పండగను ఒక్క మన దేశంలోనే కాదు.. ప్రపంచంలో అనేక దేశాలు జరుపుకుంటాయి. ఒకొక్క దేశం అక్కడ సంస్కృతి సంప్రదాయాలను అనుసరించి గణేశుడి పుట్టిన రోజు వేడుకలను నిర్వహిస్తారు. అయితే అక్కడ గణేశుడి విగ్రహాలు కొంచెం భిన్నంగా ఉంటాయి. శ్రీలంకలో గణేశుడి ప్రతిమలు అనేకం దర్శనమిస్తాయి. ఇక్కడ వినాయకుడు ఫొటోల్లో గొడ్డలి, శబ్దం మోడకా పట్టుకొని నాలుగు ఆయుధాలతో కనిపిస్తాడు. గణేషుడిని గ్రామ దేవతగానూ పూజిస్తుంటారు.. త్రిమూర్తుల్లో బ్రహ్మ, విష్ణు శివుడు కంటే ప్రథమ పూజ్యుడిగా ఆరాధిస్తుంటారు. అఖండ భారతంలో ఒక దేశం ఆఫ్ఘనిస్తాన్ . పురాతన కాలంలో గణేశుడిని ఆఫ్ఘనిస్తాన్‌లో మహా వినాయక అని పిలిచేవారు. 6వ శతాబ్దం ప్రారంభంలో ఉన్న గణేశుడి ప్రతిమలు ఇప్పుడు కాబూల్‌లోని దర్గా పిర్ రట్టన్ నాథ్‌లో కనిస్తాయి. చైనాలో మొదటి ఆరవ శతాబ్దంలో కుంగ్-హ్సీన్ వద్ద గణేషుడిని ఆరాదించేవారు. గణేషుడు కుడి చేతిలో కమలం పట్టుకొని వజ్రసానాలో కూర్చుంటాడు. ఎడమవైపు స్వీట్ ఆభరణం ఉంటుంది.. తున్-హువాంగ్‌లో గణేశుడు తన సోదరుడు కార్తికేయుడితో కనిపిస్తాడు. జపాన్‌లో వినాయకుడు.. 9వ శతాబ్దంలో బౌద్ధ సన్యాసి, కోబో లేదా కొలోహో డైషిగా కనిపిస్తాడు. జపనీస్ వినాయక విరిగిన దంతం, ముల్లంగి, గొడ్డలిని ధరించి ఉంటాడు. మయన్మార్‌లో 5వ -7వ శతాబ్దాల మధ్య హిందూ మతం బాగా ప్రాచుర్యం పొందింది. దక్షిణ మయన్మార్‌లో అవరోధాలను తొలగించే దేవుడిగా గణేశుడు అనేక ఫొటోలు దర్శనమిస్తాయి. ఉత్తర భాగంలో గణేశను సంరక్షక దేవతగా కొలుస్తారు. పద్మాసనంలో గొడ్డలి, రోసరీ, శంఖాన్ని పట్టుకొని, మిగిలిన చేతిని ఒడిలో ఉంచినట్టుగా కనిపిస్తాడు. ఇక్కడ గణేశుడిని మహ పిన్న అని పిలుస్తారు. థాయ్‌లాండ్‌లో గణేశుడు 6వ శతాబ్దంలో హిందూ సోమ రాజవంశం కాలంలో గణేశుడు భూమిపైకి వచ్చినట్టు చెబుతుంటారు. ఈ రాజవంశం రాజులు గణేశుడికి అనేక దేవాలయాలను నిర్మించారు. యజ్ఞోపవీతాన్ని ధరించిన భంగిమలో గణేశుడు కనిపిస్తాడు.. కుడి కాలు కింద ఎలుక ఉంటుంది. ఇండోనేషియా గణేశుడికి భారతీయుడి గణేశుడి పెద్దగా తేడా ఉండదు. ఇక్కడ 15 వ శతాబ్దం గణేశుడి ఉత్సవాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. బాలిలో ప్రకృతి విపత్తు సంభవించినప్పుడల్లా గణేశుడిని ప్రసన్నం చేసుకోవడానికి రిషిగానా అనే వేడుక నిర్వహిస్తారు. వినాయకుడి ఫొటోల్లో యుద్ధ గొడ్డలి, రోసరీ, విరిగిన దంత, లడ్డుతో గిన్నెతో దర్శనమిస్తాడు. బోర్నియోలో కూడా గణేశుడు విభిన్న రూపాల్లో దర్శనమిస్తాడు. కొంబెంగ్ వద్ద ఒక గుహలో.. నాలుగు ఆయుధాలతో గణేశుడు కనిపిస్తాడు. ఆయన చేతుల్లో గొడ్డలి, రోసరీ ఉంటాయి. గణేశుడి తొండం నిటారుగా ఉండి కనుబొమ్మల మధ్య జటముకుట ఉంటుంది. కంబోడియాలో చాలా హిందూ దేవతల ఆలయాలున్నాయి. ఇక్కడ దేవుడిని ప్రా కేన్స్ అంటారు. కొన్ని చోట్ల గణేశుడితో పాటు శివుడు, పార్వతి కనిపిస్తారు. ఖైమర్ కాలంలో.. గణేశుడి శంఖాకార కిరీటం ధరించి కనిపిస్తాడు. ఇక్కడ గణేశుడి చెవులు, మెడ, తల-దుస్తులు, కుండ-బొడ్డు, రెండు ఆయుధాలు, తొండం ఎడమ వైపుకు తిరిగి ఉంటుంది.
భారతదేశం అంతటా వినాయకచవతి ఉత్సవాలు నిర్వహిస్తారు. మహారాష్ట్రలో మాత్రం ఈ పండగను అంత్యంత ఘనంగా చేపడుతారు. ఈ వేడుకలను వైభవంగా నిర్వహించడం ఇతర రాష్ట్రాలకు పరిచయం చేసింది మహారాష్ట్రనే. ఛత్రపతి శివాజీ ఆ రాష్ట్రాన్ని పాలించిన సమయం నుంచి ఇది మొదలైంది. జాతీయవాది, స్వతంత్ర పోరాట యోధుడు బాలగంగాధర్ తిలక్ దీనిని మరింత ముందుకు తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వినాయక చవితి ఉత్సవాలు కొనసాగుతూనే ఉన్నాయి.
భక్తితో కేవలం గరిక సమర్పిస్తే చాలు.. విఘ్నాలన్నింటినీ తొలగించి విజయాలను అందిస్తానని అభయమిస్తాడు.. వినాయకుడు. అలాంటి గణేషుడికి ఇప్పుడైతే రకరకాల ఆకృతులు, భారీ ఎత్తున మండపాలు, విద్యుత్ దీప కాంతుల్లో హంగూ ఆర్భాటంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇక ఈ భారీ ఖాయుడు ఎంత ఎత్తు ఉంటే అంత పేరు. మరి ఒకప్పుడు ఈ వినాయక ఉత్సవాలు ఎలా ఉండేవి..? నవరాత్రుల సంప్రదాయం ఎప్పటి నుంచి మొదలైంది..? భక్తితో పాటు స్వాతంత్య్ర కాంక్ష కూడా దాగున్న చరిత్ర ఏంటి..?
ఏ పూజ చేయాలన్నా.. దేవుడిని ఏది కోరుకోవాలన్నా.. ముందుగా ఆ వినాయకుడి అనుమతి తీసుకోవాలి. అలాంటి వినాయకుడిని నవరాత్రుల పాటు పూజించే సంప్రదాయం చాలాకాలంగా కొనసాగుతూ వస్తోంది. భారీ ఎత్తున మండపాలు ఏర్పాటు చేయడమే కాదు వెరైటీ రూపాల్లో విగ్రహాలను పూజించడం కూడా ఈ రోజుల్లో సాధారణంగా కనిపిస్తూనే ఉంటుంది. రకరకాల ఆకృతుల్లో తయారు చేయడం ముచ్చటగొలుపుతుంది. సమకాలీన అంశాలతో కూడిన విగ్రహాలు తయారు చేయడం కూడా ఆనవాయితీగా వస్తోంది. ఇక వినాయకుడి ఎత్తు కూడా అందరిలో ఆసక్తిని రేపే అంశంగా మారింది. ఎంత ఎక్కువ ఎత్తులో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే అంత ప్రచారం వస్తుంది. ఇప్పటికీ దేశంలో రకరకాల ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన వినాయకుడి వల్లే ఆయా ప్రాంతాలకు ఆ పేరు స్థిరపడిపోయింది.
అసలు వినాయకుడి రూపమే విపరీతంగా ఆకట్టుకుంటుంది. చిన్నారుల నుంచి పెద్దవారి వరకు ఏకదంతుడిని ఇష్టపడని వారంటూ ఉండరు. అందుకే మనదేశంలో అతిముఖ్యమైన పండగల్లో వినాయకచవితి ఒకటి. ఈ పండగకు పురాణాల్లో ఎలా అయితే ప్రాముఖ్యత ఉందో.. నవరాత్రి ఉత్సవాలకు కూడా చారిత్రక నేపథ్యం ఉంది. స్వాతంత్య్రానికి పూర్వం హిందువులను ఏకం చేసే వేదికలుగా వినాయక మండపాలు ఉండేవి. అప్పట్లో అప్పుడు మనదేశాన్ని ఏలుతున్న బ్రిటీష్ ప్రభుత్వం ప్రజల సమావేశాలపై ఆంక్షలు విధించింది. స్వాతంత్య్రం కోసం ఎక్కడైనా సమావేశాలు ఏర్పాటు చేసి తమపై తిరుగుబాటు చేస్తారనే భయంతో ఈ నిషేధాలు అమల్లోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా సామాజిక, రాజకీయ సమావేశాలను ఉక్కుపాదంతో అణిచివేసింది. దీంతో భారతీయులు ఒకచోట కలిసే అవకాశం లేకుండా పోయింది. బ్రిటీష్ రూల్స్‌ను తప్పించుకునేందుకు అప్పటి మహారాష్ట్రకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు బాలగంగాధర్ తిలక్ సరికొత్త సంప్రదాయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. సామాజిక, రాజకీయ సమావేశాలపై ఆంక్షలు పెడితే ఆయన ఆధ్యాత్మిక బాటను ఎంచుకున్నారు. అప్పటివరకు హిందువులంతా ఇళ్లల్లోనే ఐకమత్యంగా చేసుకునే వినాయక చవితిని సామాజిక పండగగా మార్చారు. 1892 నుంచి చవితి వేడుకలను బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించాలని పిలుపునిచ్చారు. 9 రోజుల పాటు ఉత్సవాలు జరుపుకోవాలని నిర్దేశించారు.
అప్పటి సామాజిక పరిస్థితుల్లో ఆంగ్లేయుల పాలన నుంచి విముక్తి కలిగించడానికి ప్రజల్లో జాతీయ భావం, ఐకమత్యం పెంపొందించడానికి వినాయక చవితి పర్వదినాన్ని జాతీయ సమాఖ్య పండగగా చవితి వేడుకను జరిపారు. పేద, ధనిక, వర్ణ భేదాలు లేకుండా అందరూ ఏకతాటి పైకొస్తారని ఆశించారు. సామూహికంగా వేడుకలను జరుపుకుంటే ప్రజల మధ్య ఎలాంటి తారతమ్యాలు ఏర్పడవని తిలక్ నమ్మారు. అంతా ఐకమత్యంగా ఉండి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమిస్తారని తిలక్ విశ్వసించారు. అలా చవితి వేడుకలను బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించడం మొదలుపెట్టారు. ఈ ఉత్సవాల ద్వారా ముఖ్యంగా హిందువుల్లో ఐకమత్యం పెరిగింది. 9 రోజుల పాటు దేశంలోని మిగతా చోట్ల జరుగుతున్న ఉద్యమం గురించి చర్చించుకునే వేదికగా వినాయక మండపాలు ఉండేవి. నవరాత్రులు ముగిశాక సమీపంలోని నదిలో లేదా సముద్రంలో విగ్రహాన్ని నిమజ్జనం చేయడం కూడా అప్పటి నుంచే ప్రారంభమైంది. ప్రస్తుత చవితి ఉత్సవాలకు మూలం తిలక్ తీసుకొచ్చిన సంప్రదాయమే అని చెప్పుకోవాలి.
అలా వినాయక చవితి ఉత్సవాల ద్వారా ప్రజల్లో స్పష్టమైన మార్పు కనిపించింది. ఏటా నిర్వహించే చవితి నవరాత్రుల కోసం చాలామంది ఎదురుచూసేవారు. ఇదే కాలక్రమంలో స్వాతంత్య్ర ఉద్యమం మరింత తీవ్రమయ్యేందుకు దోహదపడింది. భారతీయుల పూజా మందిరాల్లో నిర్వహించుకునే గణేశ పూజకు సామూహికమైన, సామాజికమైన, సార్వజనీనమైన ప్రాధాన్యత అందించడంలో బాలగంగాధర తిలక్ చేసిన కృషి గొప్పది. క్రీస్తుపూర్వం 271 నుంచే వినాయకుడిని పూజించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. అప్పట్లో మనదేశాన్ని పాలించిన శాతవాహనులు, చాళుక్యులు కూడా వినాయకుడిని పూజించేవారు. ఆ తర్వాత ఛత్రపతి శివాజీ కూడా వినాయకుడిని తన ఇష్టదైవంగా పూజించినట్లు చరిత్రకారులు చెబుతారు.
బహిరంగ ప్రదేశంలో పెద్ద మట్టి గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించిన మొదటి వ్యక్తి బాలగంగాధర్ తిలక్ అని ప్రజలు నమ్ముతారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కులమతాలకు అతీతంగా చిన్న పెద్ద తేడా లేకుండా, పేద ధనిక అన్న వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరూ వినాయక చవితి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే గతంలో జాతీయవాద స్ఫూర్తి నింపిన వినాయక మండపాలు.. ఆ తర్వాత లలిత కళలకు వేదికలుగా మారాయి. ఇప్పుడు మండపాల దగ్గర రికార్డింగ్ డాన్సులు, అక్కడక్కడా తాగుబోతుల వీరంగాలు.. వినాయకుడి స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయి. ఉత్సవాల నిర్వహణ తీరును సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే అసలు వినాయక చవితి ఎందుకు చేసుకుంటున్నామో తెలియకుండా పోయే ప్రమాదం ఉంది.
భారతీయ పండుగల్లో ఆధ్యాత్మికతతోపాటు సమిష్టితత్వం, ఉత్సాహం నింపే వాటిలో వినాయక చవితి వేడుకలు అత్యంత ప్రధానమైనవి. ఈ పండుగ రాకతో పల్లెలు, పట్టణాల్లోనూ కోలాహలం నెలకొంsది. ఉత్సాహభరిత వాతావరణంలో జరుపుకొనే పండుగల్లో వినాయక చవితిదే మొదటి స్థానం.
ప్రతి ఏడాది భాద్రపదమాసం శుక్ల చతుర్థి రోజు హస్త నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
ఏ పని మొదలుపెట్టాలన్నా, అనుకున్న పని ఫలప్రదం కావాలన్నా ముందుగా విఘ్నాధిపతి అయిన వినాయకుడిని వేడుకుంటారు. విఘ్నాలు అంటే ఆటంకాలు…ఆటంకాలు లేకుండా తలపెట్టిన పని పూర్తయ్యేలా చేయమని గణపతిని వేడుకుంటారు. అందుకే విఘ్నవినాశకుడు అయిన వినాయక చవితికి ఎంతో విశిష్టత ఉంది. ఈ పండుగ వెనుక ఆసక్తికరమైన గాధలున్నాయి.
ఓసారి శివుడు లేని సమయంలో పార్వతీ దేవి స్నానానికి వెళ్తూ.. తన ఇంటికి రక్షకునిగా ఎవరైనా ఉంటే బాగుండునని భావించింది. నలుగుతో గణేశుడిని మలచి ప్రాణం పోసి..ద్వారపాలకునిగా ఉండమని ఆజ్ఞాపించి స్నానానికి వెళ్లింది. అదే సమయంలో వచ్చిన శివుడిని లోనికి వెళ్లకుండా అడ్డుకుంటాడు వినాయకుడు. కోపం తెచ్చుకున్న పరమ శివుడు గణేశుని శిరస్సు ఖండిస్తాడు. ఇంతలో బయటకు వచ్చిన పార్వతీదేవి..పుత్రశోకంలో కాళిగా మారుతుంది. పార్వతీ దేవి ఆగ్రహానికి భయపడిన దేవతలంతా పరమశివుడిని వేడుకొనగా ఉత్తరం వైపు తల పెట్టి నిద్రించే ప్రాణి తలను ఖండించి తీసుకురమ్మని అనుచరులకు ఆజ్ఞాపిస్తాడు.శివుని ఆజ్ఞననుసరించి వెళ్ళిన అనుచరులకు ఉత్తరం వైపు తల పెట్టి నిద్రిస్తున్న ఒక ఏనుగు కనిపిస్తుంది. వారు ఆ ఏనుగు శిరస్సు ఖండించి తీసుకువస్తే శివుడు ఆ శిరస్సును వినాయకుడి శరీరంపై అమరుస్తాడు. తన కొడుకు తిరిగి ప్రాణం పోసుకున్నందుకు పార్వతీ దేవి సంతోషిస్తుంది. ఏనుగు శిరస్సు ని ధరించడంతో.. వినాయకుడు గజాననుడయ్యాడు.
మరొక గాధ ప్రకారం గజాసురుడనే రాక్షసుని తపస్సుకి మెచ్చి ..అతడి పొట్టలోనే ఉండిపోతాడు శివుడు. పతిని తీసుకురమ్మని శ్రీ మహావిష్ణువుని పంపిస్తుంది పార్వతీదేవి. అలా శ్రీ మహావిష్ణువు గంగిరెద్దుని ఆడించేవాని రూపంలో వెళ్లి గజాసురుని మెప్పించి..పరమేశ్వరుడిని తీసుకుని కైలాశానికి బయలుదేరుతాడు. ఆ గజాసురుడి తలే..వినాయకుడికి అమర్చారని మరో పురాణగాధ.
విఘ్నాధిపతిగా వినాయకుడికిని పూజించడం వెనుక ఓ పురాణ గాధ ఉంది. ఒకసారి దేవతలు, ఋషులు శివుడిని కలిసి విఘ్నాలకు అధిపతిగా ఎవరినైనా నియమించమని అడుగుతారు. అప్పుడు శివపార్వతుల రెండవ కుమారుడు అయిన కుమార స్వామి… వినాయకుడు పొట్టిగా, లావుగా ఉన్నందువల్ల తనని విఘ్నాధిపతిగా నియమించమని అడుగుతాడు. శివుడు వినాయకుడికి, కుమారస్వామికి ప్రపంచం లో ఉన్న పవిత్ర నదులలో స్నానమాచరించి ఎవరైతే ముందుగా తన దగ్గరికి వస్తారో వాళ్ళే విఘ్నాధిపతి అవుతారు అని చెప్తాడు. నెమలి వాహనంపై కుమారస్వామి పవిత్ర నదులలో స్నానమాచరించడానికి బయలుదేరతాడు. తన అవతారం చూసి కొంచెం కలత చెందిన వినాయకుడు తల్లిదండ్రుల వద్దకు వెళ్లి సోదరుని వలే వేగంగా తాను కదలలేను కాబట్టి మీరే నాకు ఈ పరీక్ష నెగ్గేందుకు మార్గం తెలియచేయమని ప్రార్ధిస్తాడు.
వినాయక ప్రతిమలను నిమజ్జనం చేయడం వెనుక చాలా కారణాలే ఉన్నాయి. ప్రకృతి ప్రకారం చూస్తే వినాయక చవితి వర్షాకాలం ప్రారంభంలో వస్తుంది. వర్షాకాలం ప్రారంభానికి ముందే చెరువుల నుంచి మట్టి సేకరించి దాంతో విగ్రహాలు చేసి వాటిని పూజించిన తర్వాత తిరిగి చెరువులో కలుపుతారు. విగ్రహాలకు మట్టి తీయడం వల్ల చెరువుల్లో లోతు పెరుగుతుంది. ఆ తర్వాత ఆయుర్వేద గుణాలున్న పత్రితో కలిపి విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల నీళ్లు పారే వీలుంటుంది. అందులో ఆయుర్వేద గుణాలు కూడా కలుస్తాయి కాబట్టి వాటిని తాగడం వల్ల ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
పౌరాణిక కారణాలను చూస్తే.. వినాయకుడు కైలాసం నుంచి భూలోకానికి వచ్చి కేవలం పది రోజులు మాత్రమే ఉండి తిరిగి కైలాసానికి వెళ్లిపోతాడు. భక్తులు నిత్యం పూజలందిస్తూ ఉంటే కైలాసానికి దూరంగా ఉంటాడని పదిరోజుల పాటు పూజలందుకొని తిరిగి రమ్మని చెప్పి వినాయకుడిని పార్వతీ దేవి పంపినట్లుగా చాలామంది చెబుతుంటారు. ఏ దేవతా విగ్రహం అయినా మట్టితో చేస్తే అది కేవలం నవ రాత్రులు మాత్రమే పూజించడానికి అర్హత ఉంటుందని ఆ తర్వాత అందులో దైవత్వం పోతుందని అందుకే నిమజ్జనం చేయాలని కూడా చెబుతారు. వినాయక నిమజ్జనంతో పాటు దుర్గామాత విగ్రహాలను కూడా నవరాత్రులు పూర్తయ్యాక నిమజ్జనం చేయడం ఆనవాయితీ.
గణనాథుడిని స్మరించడానికి భక్తజనం ఊగిపోతున్నారు. గణపతి బప్ప మోరియా (Ganapathi Bappa Moriya) .. నినాదాలు మార్మోగుతున్నాయి. ఈ గణపతి బప్పా మోరియా పదానికి వెనుక ఉన్న కథ తెలుసా.. మోరియా అని ఎందుకంటారు?పూర్వం గండకిని పరిపాలించే రాక్షస రాజు సింధురాసురుడు . 2000 ఏళ్లు తపస్సు చేసి సూర్యుని నుంచి అమృతం పొందాడు. అమృతం అతని ఉదరంలో ఉన్నంతకాలం, అతనికి మృత్యు భయం ఉండదు. ఈ ధైర్యంతో సింధురాసురుడు తన పరాక్రమంతో ముల్లోకాలను జయించాలని సంకల్పించాడు. ముందు దేవతలను జయించి వారిని కారాగారంలో బంధించాడు. తరువాత కైలాసం, వైకుంఠాలపై దండెత్తాడు. పార్వతీ పరమేశ్వరులు కూడ సింధురాసుని బాధలు పడలేక కైలాసాన్ని వదిలి మేరుపర్వతంలో ఉన్నారు. సింధురాసురుడు శ్రీ మహావిష్ణువును తన గండకి రాజ్యంలో ఉండమని ఆజ్ఞాపించాడు. ఈ పరిస్థితులలో దేవ గురువైన బృహస్పతి.. వినాయకుని ప్రార్ధించి, ఆయనను శరణు వేడుకోండి అని దేవతలకు సలహా ఇచ్చాడు. వారు అలాగే చేశారు. వారి ప్రార్థనలను మన్నించి, గణపతి సాక్షాత్కరించి, తాను పార్వతీదేవికి కుమారుడిగా జన్మించి, సింధురాసురుని చంపేస్తానని మాట ఇచ్చాడు. మాట ప్రకారం పార్వతీ తనయుడిగా జన్మించాడు. కొంతకాలానికి సింధురాసురుని మిత్రుడయిన కమలాసురుడు శివునిపై యుద్ధానికి వెళ్లాడు. అప్పడు పార్వతి కుమారుడైన గణపతి నెమలి వాహనారూఢుడై కమలాసురునితో ఘోర యుద్ధం చేశాడు. గణపతి కమలాసురుని ఎదుర్కొని తన శిరస్సును ఖండించాడు. ఆ శిరస్సు మోర్గాం క్షేత్రంలో పడింది. తరువాత గణపతి పార్వతీ పరమేశ్వరులతో కలిసి గండకికి వెళ్ళి, దేవతలను చెరసాల నుంచి విడిపించమని సింధురాసురుని ఆదేశించారు. అతడు పాటించనందుకు, 3 రోజులు గణపతి యుద్ధం చేశాడు. చివరకు సింధురాసురుడు ఖడ్గం ధరించి గణపతి వైపు పరిగెత్తాడు. అప్పడు గణపతి చిన్న రూపాన్ని ధరించి, నెమలి వాహనాన్ని వీడి, క్రింద నుంచి సింధురాసురుని ఉదరంపై ఒక బాణం వేశాడు. అది అతని ఉదరాన్ని చీల్చి వేసింది. వెంటనే ఉదరంలో ఉన్న అమృతమంతా బయటకు వచ్చింది. దానితో సింధు రాసురుడు మరణించాడు. దేవతలు ఆనందించి, గణపతిని పూజించి కొనియాడారు. అప్పడు మోర్గాం క్షేత్రంలో దేవాలయాన్ని నిర్మించి, గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ విధంగా మోర్గాం, మోరేశ్వర్ గణపతి పుణ్య క్షేత్రమైంది. గణపతి మయూర వాహనంపై వచ్చినందుకు, ఆయనకు మయూరేశ్వర్ అనే పేరు కూడ వచ్చింది. మరాఠీ భాషలో మోర్ అంటే నెమలి. ఆ ప్రదేశంలో నెమళ్లు ఎక్కువగా ఉండటం చేత, ఆ గ్రామానికి మోర్గాం అనే పేరు వచ్చింది. నెమలిని వాహనం చేసుకున్నందుకు గాను, గణపతి మోరేశ్వర్ అయ్యాడు. అందుకే గణపతి బప్పా మోరియా అని భక్తులు అంటారు. ఇలా వినాయకుడి విగ్రహం, రూపం, పండగ చేసే విధానం, ఆఖరికి వినాయకుడి నినాదం ప్రతిదీ సందేశమయమే. వినాయకచవితి పండగ అంతరార్థాన్ని అర్థం చేసుకుంటే.. ఎన్నో జీవితపాఠాలు నేర్చుకునే అవకాశం ఉంది. సరిగా అర్థం చేసుకుంటే.. వినాయకుడి కథకు మించిన వ్యక్తిత్వ వికాస పాఠం మరొకటి లేదు.