Story Bord : పార్లమెంట్ మాన్సూన్ సెషన్ కీలకం కాబోతుందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Story Bord : 2029 ఎన్నికల కోసం అటు జాతీయస్థాయిలో.. ఇటు రాష్ట్రస్థాయిలో కీలక కసరత్తు జరుగుతోంది. ఈ నెల 21 నుంచి జరిగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్రానికి కీలక అజెండా ఉంది. మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును కూడా ఆమోదింపజేసుకోవటానికి ఇప్పటికే ఎంపీలను కూడగడుతోంది. పనిలోపనిగా పునర్విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు లాంఛనమేనని ఇక్కడి పార్టీలు అంచనాలు పెట్టుకున్నాయి. ఇందుకు అనుగుణంగా ఏపీలో ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయి కసరత్తు మొదలుపెట్టాయి. తెలంగాణలో హైదరాబాద్‌లో పెరిగే సీట్లే కీలకం కానున్న తరుణంలో.. ఇక్కడ పట్టు పెంచుకునే పార్టీకి అడ్వాంటేజ్ వస్తుందని అంచనా. బెంగాల్ ఎన్నికల్లో గెలుపు తర్వాత బీజేపీ.. జాతీయస్థాయిలో తన వ్యూహాలకు వేగంగా పదును పెడుతోంది. ముఖ్యంగా మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లుల్ని నెగ్గించుకోవాలనే పట్టుదలతో కనిపిస్తోంది. ఇప్పటికే ఎంపీల బలం కూడగట్టిన బీజేపీ.. ఈ అజెండాకు ఆమోదముద్ర వేసుకుని.. వచ్చే ఎన్నికలకు సన్నద్ధం కావాలనే వ్యూహంతో ఉంది.
ఒక్కో ఎన్నికకు ఒక్కో వ్యూహం అనుసరిస్తూ.. గత పన్నెండేళ్లుగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ.. ఇప్పుడు వచ్చే ఎన్నికల కోసం పకడ్బందీ కసరత్తుకు రంగం సిద్ధం చేసింది. ఈ నెల 21 నుంచి మొదలయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్ని దానికి వేదికగా ఎంచుకుంది. ఈసారి పార్లమెంట్ సెషన్ కోసం కేంద్రం ఇప్పటికే కీలక అజెండాను రెడీ చేసింది. గతంలో చేదు అనుభవం ఎదురైన మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లుల్ని ఈసారి ఎలాగైనా ఆమోదింపజేసుకోవాలనే లక్ష్యంతో ఉంది. అందుకోసం ఇప్పటికే కావాల్సిన సంఖ్యాబలాన్ని కూడగడుతోంది. ఈ రెండు బిల్లుల ఆమోదానికీ, వచ్చే ఎన్నికల సన్నద్ధతకూ విడదీయలేని సంబంధం ఉండటంతో.. ఈసారి ఎలాగైనా బిల్లులు గట్టెక్కి తీరాలని బీజేపీ పట్టుదలతో కనిపిస్తోంది. అందుకే ఎందుకైనా మంచిదని ప్లాన్ ఏతో పాటు ప్లాన్ బీని కూడా సిద్ధం చేసుకుందని అంటున్నారు. ఇంకా అవసరమైతే ప్రతిపక్షానికి పార్లమెంట్ సాక్షిగా మరిన్ని షాకులకూ వ్యూహాలు రచిస్తోంది. ఈసారి జమిలి ఎన్నికలు జరుగుతాయనే అంచనాలు ఉండటంతో.. ఎన్నికల వ్యూహరచనకు ఎక్కువ సమయం తీసుకోకుండా.. అనుకున్న వ్యూహాలు అనుకున్నట్టుగా అమలు కావాలంటే.. ఈ రెండు బిల్లులు గట్టెక్కడం కీలకమనేది బీజేపీ వేసుకుంటున్న రాజకీయ లెక్క.
Also Read
ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి డీలిమిటేషన్ విషయంలో ఎంపీ స్థానాలకే పరిమితమైనా.. ఏపీ, తెలంగాణను ప్రత్యేక కేసుగా చూడక తప్పదు. అలా చూసినప్పుడు పునర్విభజన చట్టం ప్రకారం.. ఏపీలో అసెంబ్లీ సీట్లు 175 నుంచి 225కి, తెలంగాణలో అసెంబ్లీ సీట్లు 119 నుంచి 153 పెరుగుతాయని చెబుతున్నారు. ఒకవేళ కేంద్రం ప్రతిపాదించిన యాభై శాతం పెంపు ఫార్ములాను అప్లై చేస్తే.. ఏపీలో అసెంబ్లీ సీట్లు 175 నుంచి 262 లేదా 263కు పెరుగుతాయి. అదే తెలంగాణలో అసెంబ్లీ సీట్లు 119 నుంచి 178 లేదా 179కి పెరుగుతాయి. ఈ రెండు రాష్ట్రాల్లో సీట్ల పెంపుకు ఎవరూ అభ్యంతర పెట్టే అవకాశాల్లేకపోవడంతో.. ఈ పని కూడా పూర్తైపోతుందని రాజకీయ వర్గాలు లెక్కలేస్తున్నాయి.
నిజానికి బెంగాల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర్నుంచీ బీజేపీ పొలిటికల్ గేర్ మార్చింది. ఇకపై నాన్చుడు బేరానికి తావు లేదని, అనుకున్న పని అయిపోవాల్సిందేననే వేగిరపాటుతో కనిపిస్తోంది. పార్లమెంట్లో అనుకున్న అజెండా అమలుకు సంఖ్యాబలం అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో అవసరానికి మించిన ఎంపీల బలం సేకరిస్తోంది. ఇప్పటికే టీఎంసీ, శివసేన ఉద్ధవ్ థాక్రే ఎంపీలు పరోక్షంగా ఎన్డీఏకు మద్దతు పలికేలా చేసుకుంది. ఇంతటితో ఆగకుండా యూపీలో సమాజ్ వాదీ పార్టీ, ఒడిషాలో బిజూ జనతాదళ్ పార్టీ నుంచి కూడా బలం కూడగట్టే పనిలో పడింది. చివరకు తమిళనాడులో డీఎంకేతో కూడా లోపాయికారీ డీల్ చేసుకుంటున్నారనే చర్చ గట్టిగా జరుగుతోంది. కేవలం ప్రధాన పార్టీలే కాకుండా చిన్న పార్టీలు, ఇండిపెండెంట్లు.. కారెవరూ సంప్రదింపులకు అనర్హం అనే రీతిలో హస్తినలో నంబర్ గేమ్ నడుస్తోంది. ఇందుకోసం బీజేపీ కీలక నేతలు రంగంలోకి దిగారంటే.. ఆ పార్టీ ఈ విషయాన్ని ఎంత సీరియస్‌గా తీసుకుంటుందో అర్థం చేసుకోవచ్చు.
పార్లమెంట్ కు కేంద్రం ఇప్పటికే ఓ అజెండా అనుకుంది. దాని కోసం కసరత్తు వేగంగా పూర్తిచేస్తోంది. కానీ ఇప్పుడు కూడగడుతున్న సంఖ్యాబలం చూస్తే.. కేవలం అనుకున్న అజెండాతో ఆగుతారా.. లేదంటే దేశాన్ని ఆశ్చర్యపరిచేలా మరో కీలక నిర్ణయం తీసుకుంటారా అనే అనుమానాలూ లేకపోలేదు. ఆమాటకొస్తే యూనిఫామ్ సివిల్ కోడ్ ఎప్పట్నుంచో పెండింగ్‌లో ఉంది. ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దశల వారీగా అమలౌతున్న యూసీసీని.. ఈసారి పార్లమెంట్ సెషన్లో పెట్టేసి.. అందరికీ షాకిస్తారా.. లేదా అనేది మరో ఆసక్తికర చర్చ. కానీ ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదని, ఇంతకు మించి దేశం మొత్తం భావోద్వేగంతో కనెక్ట్ అయ్యే పని ఏదో చేస్తారని, దానికి సంబంధించిన హింట్ పార్లమెంట్ వేదికగా ఇస్తారనేది రాజకీయ వర్గాల అభిప్రాయంగా ఉంది. అంతేకాదు నీట్, అయోధ్య అంశాలతో ఇరుకునపడ్డ కేంద్రం.. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా.. డ్యామేజ్ కంట్రోల్‌కు కూడా దిగుతుందనే అంచనాలున్నాయి. అసలివేమీ కాకుండా.. ఎవరి ఊహకూ అందని, అందరూ చర్చించుకునేలా ఇతర అంశాలను ఏమైనా ముందుకుతెస్తారా అనేది చూడాల్సి ఉంది.
ఏతావాతా ఒకటి మాత్రం పక్కా. వచ్చే ఎన్నికలకు పార్లమెంట్ మాన్సూన్ సెషన్లోనే అజెండా సెట్ అవుతుంది. ఎన్నికల సన్నద్ధతను అధికార పక్షం దాదాపుగా పూర్తిచేస్తుంది. అందుకు అవసరమైన అన్ని పనులూ చేస్తోంది. అవసరమైతే సెషన్‌ను పొడిగిస్తారనే చర్చ కూడా లేకపోలేదు.అటు బీజేపీలో కూడా ఈసారి పార్లమెంట్ సెషన్లో జరిగే పనులపై రకరకాల అభిప్రాయాలున్నాయి. కీలక విషయాలు అగ్రనేతలకు మినహా మిగతావారికి తెలిసే అవకాశం లేకపోవడంతో.. ఎవరికి తోచినట్టుగా వారు ఊహాగానాలు చేస్తున్నారు. కొందరు నేతలైతే మరో అడుగు ముందుకేసి.. ఏవో లీకులిచ్చి మరింత కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఏదేమైనా ఇప్పటికే ప్రధానిగా పలు రికార్డులు బద్దలు కొట్టిన మోడీ.. ఈసారి ఎన్నికల్ని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే బీజేపీ కసరత్తు చేస్తున్న విషయం ఇప్పటికే స్పష్టమైంది. ఈసారి ఎన్నికల్లో గట్టెక్కితే.. ఇక కేంద్రంలో ఎదురుండదనే ఉద్దేశంతో బీజేపీ కనిపిస్తోంది. ఇందుకు తగ్గట్టుగా ప్రతిపక్షాలు కూడా కాషాయ పార్టీకి బ్రేకులేయాలనే ప్రయత్నాలు చేయడం.. ఆ పార్టీలో మరింత కసిని పెంచుతోందనే చర్చ కూడా జరుగుతోంది.
ఆమాటకొస్తే.. వచ్చే ఎన్నికల అజెండా గత పార్లమెంట్ సమావేశాల్లోనే పూర్తి కావాల్సింది. కానీ ప్రతిపక్షాలు తొలిసారి ఏకతాటిపైకి వచ్చి.. అధికార పక్షానికి అస్సలు ఛాన్స్ ఇవ్వకుండా.. మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లుల్ని విజయవంతంగా అడ్డుకున్నాయి. ఊహించని ఈ పరిణామంతో బీజేపీ కూడా కొంత వెనకడుగు వేసింది. కానీ మొన్నటి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఆశాజనకమైన ఫలితాలు రావడంతో.. కాషాయ పార్టీకి మళ్లీ ఊపొచ్చింది. ఇదే జోష్‌లో పార్లమెంట్లో వ్యూహాలు పక్కాగా అమలుచేయాలని స్కెచ్ గీస్తోంది.
అన్నింటికీ మించి కేంద్రంలో బలమైన సర్కారు అని చెప్పుకోవాలంటే.. పార్లమెంట్‌లోనూ ఆధిపత్యం ప్రదర్శించటం అత్యవసరం. మొన్నటిదాకా పార్లమెంట్లో అనుకున్నట్టుగా వ్యూహాలు అమలుచేసిన బీజేపీ.. ప్రతిపక్షాల్ని కూడా విజయవంతంగా చీకాకు పెట్టగలిగింది. కానీ ఇటీవల ముగిసిన సెషన్ మాత్రం అధికార పక్షానికి చేదు అనుభవం మిగిల్చింది. ఈ మరకను చెరిపేసుకోవడంతో పాటు.. పార్లమెంట్లో తనకు తిరుగులేదని చాటుకోవడం కూడా అధికార పక్షానికి ఎన్నికల ముందు కీలకంగా మారింది. అందుకే ఈ ఒక్క సెషన్లో అన్ని లెక్కలూ సరిచేయాలనే సంకల్పం బీజేపీలో కనిపిస్తోంది. అంతేకాదు తద్వారా ఒక్కసారి అనుకున్న పనిని ఎన్ని అవాంతరాలు వచ్చినా చేసి తీరతామనే సంకేతాలు దేశ ప్రజలకు ఇవ్వడంతో పాటు.. వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీకి తిరుగుండదనే మానసిక భావనను సొంత పార్టీ నేతలు, క్యాడర్‌కు ఇవ్వడమే లక్ష్యంగా కీలక కసరత్తు జరుగుతోంది.
తాజావార్తలు
-
Story Bord : పార్లమెంట్ మాన్సూన్ సెషన్ కీలకం కాబోతుందా..?
-
CM Chandrababu: ‘స్వర్ణ కుప్పం విజన్ 2029’కు శ్రీకారం.. కుప్పం రూపురేఖలు మార్చే మాస్టర్ ప్లాన్‌పై చంద్రబాబు సమీక్ష
-
Mumbai: భారీ వర్షాలతో ఆర్థిక రాజధాని అతలాకుతలం.. 12 గంటల్లో 200 మి.మీ రికార్డ్ వర్షం
-
Priyadarshan: హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ తండ్రితో అక్షయ్ కుమార్ సినిమా!
-
PoK: పీఓకేలో పాక్ అణచివేత.. భారత్ జోక్యం కోరిన JAAC
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్‌పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..