Story Board : రాయితీలు తీసుకుంటూ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పన్నెండేళ్లుగా కార్పొరేట్ కంపెనీలు అడిగినవన్నీ చేశామని, కానీ అట్నుంచి రావాల్సిన రియాక్షన్ రావడం లేదని ప్రధాని నరేంద్ర మోడీ అసహనం వ్యక్తం చేశారు. పన్ను రాయితీలు, రుణమాఫీలు, భూములు.. ఇలా అన్నీ తీసుకుంటూ కూడా.. ఉద్యోగాల కల్పన ఎందుకు చేయడం లేదని, వేతనాలు ఎందుకు పెంచడం లేదని కంపెనీలను ఆయన నిలదీశారు. కార్పొరేట్లకు సామాజిక బాధ్యత ఉందన్న సంగతి మరోసారి గుర్తుచేసిన మోడీ.. ప్రభుత్వాలు తమను ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాయో అర్థం చేసుకోవాలని హితవు పలికారు. దేశంలో నిరుద్యోగంపై ఆందోళన పెరుగుతున్న తరుణంలో.. ప్రధాని కార్పొరేట్లపై ప్రశ్నలు సంధించారు. కొద్దిరోజులుగా విపక్షాల విమర్శలతో మోడీ కంపెనీలపై సీరియస్ అయ్యారు. ఇంతకాలం కార్పొరేట్లకు లబ్ధి చేకూరుస్తున్నామనే నిందను మోస్తున్నా.. అటు నుంచి ఆశించిన స్పందన లేకపోవడం పీఎంను ఈ స్థాయిలో రియాక్ట్ అయ్యేలా చేసిందనే వాదన వినిపిస్తోంది.
దేశంలో 140 కోట్లకు పైగా జనాభా ఉంది. పావు వంతుకు పైగా జనాభాలో యువతే ఉన్నారు. అందరికీ ప్రభుత్వోద్యోగాల కల్పన అసాధ్యం. ఈ విషయం గుర్తించే ప్రభుత్వాలు చాలా కాలంగా ప్రైవేట్ రంగాన్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చాయి. ఇటీవల అయితే ప్రభుత్వాలు పోటీపడి మరీ కంపెనీలు అడిగిన బెనిఫిట్స్ అన్నీ ఇస్తూ వచ్చాయి. ఒక్కసారి అడిగినదానికి మించి ఇచ్చిన సందర్భాలూ ఉన్నాయి. ఏతావాతా కంపెనీలతో ప్రభుత్వాల వ్యవహారశైలిలో గణనీయంగా మార్పు వచ్చింది. పీఎం స్థాయి వ్యక్తులు కూడా.. కార్పొరేట్లకు అడిగిన వెంటనే అపాయింట్మెంట్లు ఇస్తూ.. చివరకు విధానాల రూపకల్పనలోనూ వారి సలహాలు తీసుకుంటున్నారు. కంపెనీల సాధకబాధకాలు పట్టించుకుంటున్నారు. ప్రభుత్వం ఈ స్థాయిలో ఎక్స్ట్రా మైల్ వెళ్తున్నా.. కార్పొరేట్ కంపెనీలు కనీస స్థాయిలోనూ ఉద్యోగాల కల్పన పెంచడం లేదనేది ఎవరో కాదు.. స్వయంగా ప్రధాని గమనించిన విషయం. ఫిక్కీ సమావేశంలో తన మనసులోని అసంతృప్తిని పూర్తిస్థాయిలో వెళ్లగక్కిన పీఎం.. కనీసం గాంధీజీ స్వదేశీ మంత్రాన్నైనా గౌరవించాలని కంపెనీలకు గట్టిగానే తలంటారు.
Also Read
- OTR : బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? విలువైన లోహాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
- Story Board : ఢిల్లీ కాలుష్యాన్ని ఎంతకాలం భరించాలి ?జనం అనారోగ్యం పాలైనా పట్టించుకోరా ?
- Story Board : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ నకు షాక్... ప్రపంచవ్యాప్తంగా సానుకూల పరిణామాలు..!
- Story Board: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్‌నకు షాక్... ప్రపంచవ్యాప్తంగా సానుకూల పరిణామాలు..!
ప్రైవేట్ కంపెనీలకు ప్రభుత్వ ప్రోత్సాహం విషయానికొస్తే.. సింగిల్ విండో పాలసీలు, రుణాలు ఇప్పించడం, రుణమాఫీలు చేయడం, భూములు ఇవ్వడం, పన్ను రాయితీలు కల్పించడం.. వంటి లక్షా తొంభై పనులున్నాయి. బదులుగా ప్రభుత్వాలు అడుగుతున్నది ఒక్కటే. యువతకు ఇతోధికంగా ఉద్యోగాలు కల్పించాలని మాత్రమే. కానీ ఆ కనీస కోరికను కూడా కంపెనీలు మన్నించడం లేదు. పైగా ప్రభుత్వాల దగ్గర అనుమతులు తీసుకునేటప్పుడు వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్దానాలు చేస్తూ.. వాస్తవంగా పదుల సంఖ్యలోనే ఉద్యోగాలిచ్చి మమ అనిపిస్తున్నాయి. ఈ దారుణం చాలా కాలంగా అంతూపొంతూ లేకుండా సాగుతూనే ఉంది.
కంపెనీలు నిజంగా సమస్యల్లో ఉండి ప్రభుత్వం దగ్గర బెనిఫిట్స్ తీసుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదు. సాధారణంగా ఏ సర్కారైనా కంపెనీలను ఆదుకునేది వాటి ఉద్యోగులు రోడ్డున పడకూడదనే ఉద్దేశంతో మాత్రమే. కానీ ప్రభుత్వాల ఆ బలహీనతను ఆసరాగా తీసుకుని కంపెనీలు చెలరేగిపోతున్నాయి. లేని నష్టాలు ఉన్నట్టుగా చూపిండం, వచ్చిన లాభాలు రానట్టుగా లెక్కలు రాయడం, అదేమంటే బిజినెస్ నష్టాల్లో ఉందని కాకమ్మకథలు చెప్పడంలో ఆరితేరాయి. పోనీ ఉద్యోగుల విషయంలో అయినా సరిగా వ్యవహరిస్తాయా అంటే అదీ లేదు. ఏ కంపెనీలోనూ లేబర్ రూల్స్‌కు అసలు చోటే లేదు. కనీస ఉద్యోగ భద్రత కూడా లేదు. ఎందుకు ఎప్పుడు ఎవరి ఉద్యోగం పోతుందో ఏమీ తెలియదు. ప్రభుత్వాలు పెట్టే నిబంధనలేవీ కార్పొరేట్లకు వర్తించవు. కార్పొరేట్లు సొంత రూల్స్ పెట్టుకుని అవే పాటించాలని ఉద్యోగులపై ఒత్తిడి చేస్తాయి. కాదంటే పింక్ స్లిప్ ఇచ్చి ఇంటికి పంపిస్తాయి. ఇప్పటికే ఇండియా కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగమంటే బానిసత్వమే అని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి.
కార్పొరేట్ కంపెనీల లీలలు అన్నీ ఇన్నీ కాదు. వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతామని మాయమాటలు చెప్పి.. భారీ పరిమాణంలో భూములు తీసుకుని.. చివరకు ఏళ్ల తరబడి వాటిని ఖాళీగా ఉంచుతాయి. లేదంటే కొంత భూమిలో పేరుకి ఓ బిల్డింగ్ కట్టి.. మిగతా భూముల్ని తనఖా పెడతాయి. కాదంటే ఆ భూమిలోనూ బిల్డింగులు కట్టి.. వాటిని వేరే కంపెనీలకు లీజుకిస్తాయి. ఇలా ప్రభుత్వాల నుంచి తేరగా కొట్టేసిన భూముల్ని ఉపయోగించుకుని తమ ఆస్తులు పెంచుకోవడంలో కంపెనీలు ఆరితేరాయి. చివరకు కేంద్రానికి ఒకలా, రాష్ట్రానికి మరోలా బిజినెస్ రిపోర్టులు ఇచ్చే కంపెనీలూ ఉన్నాయంటే నమ్మాల్సిందే.
ప్రభుత్వాల దగ్గర బెనిఫిట్స్ తీసుకునేటప్పుడు మీ నిబంధనలన్నీ పాటిస్తామని కంపెనీలు చిలక పలకులు పలుకుతాయి. ఆ తర్వాత ఆర్థిక స్వేచ్ఛ, విధానపరమైన స్వేచ్ఛ పేరుతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తాయి. ఎప్పుడైనా ప్రభుత్వాలు నిలదీస్తే.. ఇలా అతిగా జోక్యం చేసుకుంటే.. కంపెనీలు నడిపే పరిస్థితి ఉండదని, ఆ తర్వాత మీఇష్టం అని సర్కారుల్నే బెదిరిస్తాయి. ఇలా తమకు కావాల్సినవన్నీ చేయించుకోవడం, తమ బాధ్యతల దగ్గరకు వచ్చేసరికి చాకచక్యంగా తప్పుకోవడం కార్పొరేట్ కంపెనీలకు వెన్నతో పెట్టిన విద్య అయిపోయింది.
దీనికి తోడు ప్రభుత్వాలు పెడుతున్న పెట్టుబడుల సదస్సులు కార్పొరేట్ కంపెనీలు వరంలా మారాయి. ఒకే కంపెనీ ఓ అక్షరం మార్చో.. మరో కంపెనీతో చిన్న డీల్ పెట్టుకునో.. కొత్త కంపెనీలా బిల్డప్ ఇస్తూ.. మరిన్ని భూములు కొట్టేస్తోంది. అదేమంటే సాంకేతిక లొసుగుల్ని సాకుగా చూపుతుంది. భారీగా పెట్టుబడుల్ని ఆకర్షించే తొందరలో ఉన్న ప్రభుత్వాల్ని తేలికగా బురిడీ కొట్టించవచ్చనేది కార్పొరేట్ కంపెనీల మాస్టర్ ప్లాన్. కొన్ని కంపెనీలు ఐటీ, జీఎస్టీ అధికారుల్ని కూడా విజయవంతంగా పక్కతోవ పట్టిస్తున్నాయి. కుదిరితే కంట్రోల్ చేయడం, కాదంటే కాక్ అండు బుల్ స్టోరీస్ చెప్పడం కంపెనీలకు అలవాటైపోయింది. చివరకు ప్రధాని స్థాయి వ్యక్తులకు ఇచ్చే హామీల్ని కూడా కంపెనీలు నిలబెట్టుకోవడం లేదని ఫిక్కీ సదస్సులో పీఎం ప్రశ్నలు చెప్పకనే చెబుతున్నాయి.
దేశంలో ప్రైవేటీకరణను ప్రోత్సహించి.. యువతకు ఇబ్బడిముబ్బడిగా ఉద్యోగాలు కల్పించాలనే ప్రభుత్వాల ఆశయం కార్పొరేట్లకు బాగా తెలుసు. అయితే సర్కారు ఆశయం కోసం తామెందుకు పనిచేయాలని కంపెనీలు ఆలోచిస్తున్నాయి. పైగా తీసుకున్న బెనిఫిట్స్ అన్నింటికీ లెక్కగట్టి ఉద్యోగాలిమ్మంటే ఎలాగని, తమ కష్టనష్టాలు అర్థం చేసుకోవాలనేది కార్పొరేట్ల మనసులో మాట. అసలు బెనిఫిట్స్ అంటే తిరుపతి హుండీలో వేసే కానుకలు అనుకోవాలని, ఆమాత్రం తెలియకపోవడం ప్రధాని అమాయకత్వమేనని కంపెనీలు అనుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేశంలో తోలుమందం అధికార వ్యవస్థ ఉన్నట్టే అంతకు మించిన రీతిలో కార్పొరేట్ కంపెనీలు తయారయ్యాయి. ఎవరేమనుకున్నా తామనుకున్నదే చేయాలని కంపెనీలు చాలా కాలం క్రితమే ఫిక్సయ్యాయి. అందుకే తమకు అవసరమైనప్పుడు ఒకలా.. కడుపు నిండాక మరోలా మాట్లాడటం వాటికి అలవాటైపోయింది.
ఇక కార్పొరేట్ ప్రపంచంలో ఎవరికీ ప్రశ్నించే అవకాశం లేకపోవడం.. కంపెనీలు మరింతగా చెలరేగేలా చేస్తోంది. చివరకు వ్యవస్థలు, ప్రభుత్వాలు ప్రశ్నించినా కూడా.. ఏదో రకంగా బ్లాక్మెయిల్ చేసి కాలం గడిపేస్తున్నాయి. అసలు ప్రధాని మోడీ అడిగిన ప్రశ్నల్ని యథాతథంగా కార్పొరేట్ కంపెనీలకు అన్వయిస్తే.. ఒక్క కంపెనీ అయినా తీసుకున్న బెనిఫిట్స్‌కు న్యాయం చేసిందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఓవైపు ప్రభుత్వాల దగ్గర్నుంచి అన్నీ తీసుకుంటూ.. మరోవైపు ఉద్యోగుల్నీ దోచేస్తూ.. కేవలం తమ సంపద పెంచుకోవడమే పరమావధిగా కార్పొరేట్లు వ్యవహరిస్తున్నారు. ఈ పోకడలే దేశంలో ఆదాయ అంతరాలు పెంచుతున్నాయని, సంపద అంతా ఓ శాతం ధనవంతుల దగ్గరే పోగుపడేలా చేస్తోందని ఆర్థికవేత్తలు ఎప్పట్నుంచో మొత్తుకుంటున్నారు.
తాజావార్తలు
-
Story Board : రాయితీలు తీసుకుంటూ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో అద్భుత ఘట్టం.. వైభవంగా తులసీ దామోదర కల్యాణం.!
-
Yuzvendra Chahal: రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. కీలక బాధ్యతలు అప్పగింత..
-
Asaduddin Owaisi : ఒవైసీకి పోలీసుల గౌరవ వందనం.. అసలు ట్విస్ట్ ఇదే.!
-
OTR: రాజాం మున్సిపాలిటీలో జనసేనకు సొంత పార్టీ సెగ.. టీడీపీ నేతల అలక
ట్రెండింగ్
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్‌తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!