Story Board : ఇరాన్ యుద్ధం మళ్లీ మొదలవుతోందా..? మాంద్యం ముప్పు ఖాయమేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచం ప్రశాంతంగా ఉండే సూచనలు ఇప్పట్లో కనిపించడం లేదు. ఉక్రెయిన్ యుద్ధంతో సగం కుదేలైన ప్రపంచం.. ఇరాన్ యుద్ధం తర్వాత చమురు మంటల్లో చిక్కుకుంది. దీంతో అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ తరుణంలో శాంతి ఒప్పందం కుదరడంతో.. మార్కెట్లు కూడా కాస్త కోలుకున్నాయి. కానీ ఈ సానుకూల సంకేతాలు పూర్తిస్థాయిలో కనపడక ముందే.. అమెరికా ఇరాన్‌పై, ఇజ్రాయెల్ లెబనాన్ పై దాడులు మొదలుపెట్టాయి. ఇవి చాలదన్నట్టుగా విదేశీయులు కీవ్‌ను విడిచివెళ్లాలని రష్యా సూచించడం ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోస్తోంది. ఈ వరుస ఘటనలు.. మళ్లీ మాంద్యం భయాల్ని కొనితెస్తున్నాయనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. నాలుగేళ్లు దాటినా ఉక్రెయిన్ యుద్ధం ఆగలేదు. నాలుగు వారాలకే ఇరాన్ యుద్ధం ప్రపంచాన్ని కుదిపేసింది. ఓవైపు ప్రపంచం వీలైనంత త్వరగా యుద్ధాలు ఆగాలని కోరుకుంటోంది. కానీ శాంతి ఆలోచనల్నే తుంగలో తొక్కుతూ అమెరికా, ఇజ్రాయెల్, రష్యా దూకుడు ప్రదర్శిస్తున్నాయి.
ప్రపంచం అల్లకల్లోలంగా ఉంది. మొదట ఉక్రెయిన్ యుద్ధం.. తర్వాత ఇరాన్ యుద్ధం ఆర్థికవ్యవస్థల్ని కుదిపేశాయి. ఏ యుద్ధం ఎలాంటి తీవ్ర పరిణామాలకు దారితీస్తుందోనని ప్రపంచ దేశాలన్నీ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ఊపిరి బిగబట్టాయి. నాలుగేళ్లు దాటినా కొనసాగుతున్న ఉక్రెయిన్ యుద్ధానికి ఇప్పట్లో తెరపడే సూచనలు కనిపించడం లేదు. కాకపోతే అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదురుతుందన్న సూచనలతో.. ఓ సంక్షోభం అయినా ఆగుతుందని మార్కెట్లు కాస్త ఊపిరి పీల్చుకున్నాయి. చాలా రోజుల నష్టాల తర్వాత కాస్త లాభాలు కళ్లజూశాయి. కానీ ఈ కాస్త సానుకూలతకు ఆదిలోనే హంసపాదు పడింది. ఓవైపు సాంకేతికంగా కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నా.. దాన్ని బేఖాతరు చేస్తూ.. అమెరికా అర్థరాత్రి ఇరాన్‌పై విరుచుకుపడింది. అదేమంటే ఆత్మరక్షణ సాకు చెప్పింది. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా లెబనాన్‌పై దాడులు ఉధృతం చేయాలని ఇజ్రాయెల్ సైన్యాన్ని ఆదేశించారు. ఇలాంటి ఆదేశాలు వస్తున్నప్పుడు.. ఇక కాల్పుల విరమణ ఒప్పందానికి అర్థమేమిటనే ప్రశ్నలకు ఇప్పట్లో జవాబులు వచ్చేలా లేవు.
Also Read
- Story Board: దేశ రాజకీయం యువత చుట్టూ తిరగబోతోందా? అందుకే పార్టీలన్నీ Gen-Z జపం చేస్తున్నాయా?
- Story Board : జెన్ జి ఉద్యమాలు.. సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తున్న యువత..
- Story Board : రాజధానిని రగిలించారు.. చట్టసభల్ని స్తంభింపజేశారు
- Story Board : ఎల్‌నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ఏ యుద్ధంలో అయినా కాల్పుల విరమణ జరిగాక.. ఉద్రిక్తతలు చల్లారతాయి. కానీ ఇరాన్ యుద్ధంలో పోరు కంటే శాంతే ఎక్కువగా భయపెడుతోంది. అందుకే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరాక కూడా.. చమురు ధరలు దిగిరావటానికి సంకోచిస్తున్నాయి. కాస్త ధైర్యం చేసి కమ్‌బ్యాక్ ఇద్దామనుకున్న మార్కెట్ల ఆశలపై .. అటు ట్రంప్, ఇటు నెతన్యాహు ఇద్దరూ కలిసికట్టుగా నీళ్లు చల్లారు. దీంతో రేపోమాపో ఇరాన్ యుద్ధానికి హేతుబద్ధమైన ముగింపు దక్కుతుందని సంబరపడ్డ ప్రపంచానికి కోలుకోలేని షాక్ తగిలింది. ఇప్పుడు మళ్లీ యుద్ధం మొదలైతే.. అది మరోస్థాయిలో జరుగుతుందని ముందే సూచనలున్నాయి. అదే జరిగితే.. అప్పుడు ఎలాంటి దుష్పరిణామాలుంటాయో ఊహించటానికి కూడా ఆర్థికవేత్తలు ఇష్టపడటం లేదు. ఆ స్థాయిలో విధ్వంసం ఉంటుందనే అంచనాలు అన్ని దేశాల్నీ కలవరపెడుతున్నాయి.
ఇరాన్ యుద్ధం సంగతి ఇలా ఉంటే.. ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా మరోస్థాయికి తీసుకెళ్లాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాలిచ్చారు. అమెరికా విదేశాంగ మంత్రి రూబియోతో మాట్లాడిన రష్యా విదేశాంగ మంత్రి లవ్రోవ్.. కీవ్ లో విదేశీయులు, ఇతర దేశాల దౌత్య సిబ్బంది తక్షణమే వెళ్లిపోవాలని సూచించారు. కీవ్‌పై ఉధృతంగా దాడులు చేస్తామని చెప్పేశారు. ఆ తర్వాత రష్యా విదేశాంగ శాఖ కూడా వివరంగా ప్రకటన విడుదల చేసింది. అయితే రష్యా ఇలాంటి ప్రకటనలు చేయడం ఇదే తొలిసారి కాదు. కొద్దిరోజుల క్రితం కూడా కీవ్‌పై ఉధృత దాడులు తప్పవని హెచ్చరించింది. కానీ వాటిని ఎప్పటికప్పుడు ఉక్రెయిన్ కొట్టిపారేస్తూ వచ్చింది. అంతమాత్రాన పుతిన్ హెచ్చరికల్ని లైట్ తీస్కునే పరిస్థితి లేదంటున్నారు విశ్లేషకులు.
ప్రస్తుతం ప్రపంచం పరిస్థితి ఎలా ఉందంటే.. ఎక్కడనుంచైనా సరే ఏ చిన్న మంచి కబురు విన్నా.. అదే పదివేలు అనుకుంటోంది. మరీ ముఖ్యంగా అన్ని దేశాల్నీ భయపెడుతున్న యుద్ధాలు ఆగిపోతాయనే ఆశ లేకపోయినా.. కనీసం ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాలనే దింపుడు కళ్లెం ఆశ పెట్టుకుంది. కానీ కొన్ని గంటల వ్యవధిలో తారుమారైన పరిస్థితులు.. ఆ ఆశలపైనా నీళ్లు చల్లుతున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా మొదట్లో యూరప్ అల్లకల్లోలమైపోయింది. ఆ తర్వాత యుద్ధానికి అలవాటుపడి.. ఇతర దేశాల తోడ్పాటుతో కాస్త నిలదొక్కుకుంది. ఇప్పటికీ పూర్తిస్థాయిలో కోలుకోలేదు. ఇక కొన్ని దేశాల్లో ఆహార సంక్షోభం వచ్చినా.. అధిక నిల్వలున్న దేశాలు ఆదుకోవడంతో ఆపద తప్పింది. కానీ ఇరాన్ యుద్ధం ఉక్రెయిన్ యుద్ధాన్ని మించిపోయింది. ఏ దేశాన్నీ వదలకుండా.. ప్రతి దేశాన్నీ ముప్పుతిప్పలు పెట్టింది. ఆధునిక ప్రపంచానికి ప్రాణవాయువుతో సమానమైన ఇంధనం ఇప్పుడు కరువైపోయింది. ఇంధన సంక్షోభం శరవేగంగా ప్రపంచాన్ని చుట్టుముట్టింది. అంతటితో ఆగితే పర్వాలేదు. కానీ సమీప భవిష్యత్తులో కూడా చమురు సరఫరా సాధారణ స్థితికి చేరే అవకాశం లేకపోవడం.. మరింతగా భయపెడుతున్న విషయమని చెప్పక తప్పదు.
మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి, అస్థిరత రాజ్యమేలుతోంది. ఎవరూ ప్రశాంతంగా గుండెల మీద చేయి వేసుకుని ఉండే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వాల దగ్గర్నుంచి పౌరుల దాకా అందరికీ ఎప్పుడేమౌతుందోననే చింత నిద్ర పట్టకుండా చేస్తోంది. మొన్నటిదాకా ఏ ప్రాంతంలో యుద్ధం వస్తే.. ఆ చుట్టుపక్కల దేశాలే ప్రభావితం అయ్యేవి. మిగతా ప్రపంచం చీకూ చింతా లేకుండా ఉండేది. కానీ ఆధునిక సాంకేతికత పెరిగిన తరుణంలో.. ప్రపంచీకరణ పతాకస్థాయికి చేరిన సందర్భంలో.. యుద్ధం ఎక్కడ జరిగినా.. ప్రపంచం మొత్తంపైనా దుష్ప్రభావం తప్పడం లేదు. దీంతో ఒకవేళ యుద్ధం ఆగినా.. ఆదుకోవటానికి, తోడ్పాటు అందించటానికి ఎవరూ లేకుండా పోతున్న చోద్యం కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే జరుగుతున్న యుద్ధాల కంటే.. వాటి ప్రభావానికి ప్రపంచం లోనౌతున్న తీరే ఎక్కువగా భయపెడుతోందన్న విషయం కాదనలేని సత్యం.
నిజానికి రెండు ప్రపంచ యుద్ధాల తర్వాత.. అసలు సంఘర్షణకు తావులేని ప్రపంచాన్ని నిర్మించాలని అన్ని దేశాలు ఓ మాటనుకున్నాయి. అందుకు తగ్గట్టుగానే కొన్ని వ్యవస్థలకు రూపకల్పన చేశాయి. కానీ ఆ తర్వాత కూడా అడపాదడపా యుద్ధాలు వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ వ్యవస్థల వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. పోనీ మొన్నటిదాకా యుద్ధాలు జరిగినా.. అవి ఓ పద్ధతిలో జరిగాయి. ఒక్కసారి ఉధృతి తగ్గాక, కాల్పుల విరమణ ఒప్పందం కుదిరాక.. రోజుల వ్యవధిలోనే ఉద్రిక్తతలు చల్లబడ్డాయి. కానీ ప్రస్తుత ఇరాన్ యుద్ధం మాత్రం యుద్ధం-శాంతి ఎపిసోడ్లను రిపీట్ చేస్తూ.. అనూహ్యంగా సాగుతోంది. అన్నంటికీ మించి యుద్ధం కంటే శాంతే భయంకరంగా ఉంటుందనే వింత దుస్థితిని ప్రపంచానికి పరిచయం చేసింది. అందుకే ఇప్పుడు ఇరాన్ యుద్ధం పేరు చెబితే చాలు.. ప్రపంచంలో ప్రతి పౌరుడూ ఉలిక్కిపడుతున్నాయి. ప్రతి దేశమూ కంగారు పడుతోంది. ఏ దేశ మార్కెట్ చూసినా.. యుద్ధ భయంతో గుడ్లు తేలేస్తోంది. పెట్టుబడిదారులైతే.. ఏ రంగంలో పెట్టుబడి పెట్టినా నష్టాలు తప్పవేమోనని చాలా టెన్షన్ పడుతున్నారు. అసలు ఇలాంటి దుస్థితిని ప్రపంచం గతంలో చూడలేదేమో అనే అభిప్రాయాలకూ కొదువలేదు. ఏతావాతా ఇప్పటిదాకా జరిగిన యుద్ధాలు వేరు.. ఇప్పుడు జరుగుతున్న ఇరాన్ యుద్ధం వేరని ప్రపంచం ఫిక్సైపోయింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. ఇరాన్ యుద్ధం నిజంగానే ఆగినా.. అది వాస్తవమేనని నమ్మటానికి ప్రపంచానికి కొంత సమయం పడుతుందనడంలో అతిశయోక్తి లేనే లేదు.
- Tags
- NTV Telugu
- story board
తాజావార్తలు
-
Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
-
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
-
August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్‌పై ప్రభావం చూపే 10 మార్పులు..
-
Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
-
Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్‌తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!