Story Board : స్వతంత్ర భారత ప్రస్థానం ఎలా ఉంది..? ఇన్నేళ్లలో మనం ఏం సాధించాం..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆకలి కేకల నుంచి స్వయం సమృద్ధి వరకూ.. పేద దేశం నుంచి ఆర్థిక శక్తిగా ఆశలు పెంచుకునే వరకూ.. ఉపగ్రహాన్ని అబ్బురంగా చూసిన కాలం నుంచి.. అంతరిక్ష శక్తిగా ఎదుగుదల వరకూ.. మన దేశం ఎత్తుపల్లాలు చూసింది. ఎన్నో ఘనతల్ని.. కొన్ని అపజయాల్ని కూడా తన ఖాతాలో వేసుకుంది. ఎన్ని ఒడుదుడుకులెదురైనా.. స్వతంత్ర భారత్ ప్రస్థానం అప్రతిహతంగా సాగడమే కాకుండా.. భవిష్యత్తుపై కొత్త ఆశల్ని పెంచుతోంది. ఇన్నేళ్లలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవాలు ఓ ఎత్తైతే.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యువ శక్తి జాగృతమైన ఈ ఇండిపెండెన్స్ డే మరో ఎత్తు అనే అభిప్రాయాలున్నాయి. 1947 నుంచీ ఇప్పటిదాకా ఏటా మనం స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటూనే ఉన్నాం. కానీ ఈ ఎనభయ్యో స్వాతంత్ర్య దినోత్సవానికి మాత్రం చాలా ప్రత్యేకత ఉంది. కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా యువత సొంత గొంతుకను వినిపిస్తూ.. దేశానికి కొత్త దారి చూపించే ప్రయత్నం చేస్తోంది. అప్పట్లో స్వాతంత్ర్యోద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న యువశక్తి.. ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్లకి నాయకత్వం తీసుకోవటానికి ముందుకు రావడం.. దేశాన్ని కీలక మలుపులో నిలబెడుతోంది.
ఎనభయ్యో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. మన దేశ ప్రస్థానాన్ని ఓసారి గుర్తుచేసుకుంటే.. రాజులు పోయారు. రాజ్యాలు పోయాయి. చివరకు బూజుపట్టిన పాతకాలపు విధానాలన్నీ రద్దయ్యాయి. ఆ మాటకొస్తే 1947లో స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర్నుంచీ మన దేశం ప్రతి దశాబ్దంలోనూ సరికొత్త ఆశలు, ఆకాంక్షలతో ఎప్పటికప్పుడు కొత్త దారుల్లోనే ప్రయాణించింది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో విజయాలు, అపజయాల సంగతి పక్కనపెడితే.. కోట్ల మంది దేశ ప్రజల్లో స్వాతంత్ర్య స్ఫూర్తి ఎక్కడా తగ్గకుండా చూడటంలో మన దేశం కచ్చితంగా విజయవంతమైంది. తరాలు మారినా, కాలాలు మారినా. విధానాలు మారినా.. ఏం మారినా.. ఇప్పటికీ స్వాతంత్ర్య దినోత్సవం వస్తే మాత్రం ఉత్సాహం, ఉద్వేగానికి ఎక్కడా లోటుండటం లేదు. అంతేకాదు ఏం చెప్పినా బోర్గా ఫీలయ్యే కొత్త తరం కూడా మన స్వాతంత్రోద్యమ చరిత్రను, పోరాటయోధుల గాథల్ని ఆసక్తిగా తెలుసుకోవడమే స్వాతంత్ర్య స్ఫూర్తికి తిరుగులేని నిదర్శనం. ఏటా కేవలం జెండా పండుగకే పరిమితమయ్యే యువత.. ఈసారి మాత్రం మరో అడుగు ముందుకేసింది. దేశంలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న జాడ్యాలపై యుద్ధం ప్రకటించింది. ఇన్నేళ్లూ ప్రభుత్వాలు ఏదో చేస్తాయని ఎదురుచూశాం.. ఇక మేమే నాయకత్వం వహిస్తాం.. దేశాన్ని కొత్తదారిలో నడిపిస్తాం అని ముందుకొస్తోంది. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన జెన్జీ ఉద్యమం.. మొత్తంగా వ్యవస్థల కళ్లు తెరిపించిందనడంలో సందేహం లేదు. నిజానికి గతంలోనూ యువత ఉద్యమాలు చేసినా.. అందుకు భిన్నంగా ఆవేశానికి ఆలోచనను మేళవించడం.. సమస్యలకు పరిష్కారమార్గాలు కూడా సూచించడం.. కచ్చితంగా దేశ భవిష్యత్తుకు సానుకూల సంకేతంగా చూస్తున్నారు దేశ ప్రజలు.
Also Read
- Story Board : అమిత్ షా రాజీనామాకు రాహుల్ పట్టు.., కీలక బిల్లుల ముంగిట పార్లమెంట్ దారెటు?
- Story Board : తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన SIR ప్రక్రియ.. గందరగోళం మధ్యే డిజిటలైజేషన్
- Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
అలాగని దేశంలో మొన్నటిదాకా యువతకు ప్రాధాన్యత లేదా.. అంటే ఉంది. కేవలం పార్టీల యువజన విభాగాలకు మాత్రమే యువ శక్తి పరిమితమైంది. ఒక్క మాటలో చెప్పాలంటే పెద్ద పార్టీలకు పిల్ల పార్టీల హోదాకే పరిమితం. అంతకుమించి యువతతో ఉపయోగం ఉందని పార్టీలు ఆలోచించలేదు. ఎక్కడైనా యువ నేతలు కాస్త క్రియాశీలకంగా మారినా.. వారి ముందరికాళ్లకు బంధాలు వేశాయి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. సరికొత్త ఉత్సాహంతో తొణికిసలాడుతున్న జెన్జీ.. అన్ని సంప్రదాయ బంధనాలనూ తెంచుకుంటోంది. తామేం చేస్తున్నామో.. తమకో స్పష్టత ఉందని నినదిస్తోంది. ఏకంగా రాజ్యాంగంలో ఆర్టికల్స్ చదివి వినిపించి మరీ.. దేశ ప్రజల్ని సమస్యలపై జాగృతం చేసిన తీరు.. నభూతో నభవిష్యతి. అసలు రాజ్యాంగంలో ఏముంది..? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి..? నేతలు ప్రజల్ని ఎలా మభ్యపెడుతున్నారు..? ఈ దుస్థితి ఎంతకాలం..? అంటూ యువతరం లేవనెత్తిన ప్రశ్నలే.. ఇప్పుడు దేశాన్ని కొత్త దారిలో నడుపుతాయని మేధావులు అభిప్రాయపడుతున్నారు.
200 ఏళ్ల బానిస సంకెళ్లను తెంచటానికి జాతి యావత్తు స్వాతంత్ర్య పోరాటం చేసింది. ఆ పోరాటంలో యువతే ముందుండి నడిపించింది. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వాళ్లు తమ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా.. ఈ దేశం స్వేచ్ఛావాయువులు పీల్చుకునేలా ఉద్యమించారు. అప్పట్లో ఆలోచనను ఆవేశం డామినేట్ చేసేది. కానీ స్వాతంత్ర్య భారతం పరిణతి చెందేకొద్దీ.. ఈ దేశపు యువతలో కూడా చెప్పుకోదగ్గ మార్పు వచ్చిందనే వాస్తవం కళ్లకు కడుతోంది. గతంలో మాదిరిగా కీలక అంశాలకు మసిపూసి మారేడుకాయ చేస్తే కుదరదని, అనుకున్నది సాధించేవరకు నిలదీస్తూనే ఉంటామని జెన్జీ.. నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. దేశవ్యాప్తంగా జాగృతమైన యువ శక్తి సత్తా ఏ స్థాయిలో ఉందంటే.. పార్లమెంట్ మాన్సూన్ సెషన్ లో అసలు బిజినెస్సే జరగకుండా తుడిచిపెట్టుకుపోయినా.. యువత నిర్దేశించిన అజెండాను మాత్రం అన్ని పార్టీలూ భయభక్తులతో అమలు చేశాయి. ఇది శాంపిల్ మాత్రమే.. ఇంకా మిగతా సమస్యల పరిష్కారం కోసం కూడా ఉద్యమిస్తాం అని యువత ఇప్పటికే సంకల్పం చేసింది.
ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. అలాగే ఈ దేశం స్వతంత్రంగా ఉందంటే.. పౌరులందరి భావాలకూ మన్నన దక్కాలనేదే అసలు ఉద్దేశం. మరీ ముఖ్యంగా రేపటి పౌరులు, దేశ భవిష్యత్తును ప్రతిబింబించే యువత అభిప్రాయం ఇంకా కీలకం. కానీ ఇన్నేళ్లూ నయానో భయానో యువత అభిప్రాయాల్ని తొక్కిపెట్టారు. ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ స్థాయిలో యువత గళమెత్తలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఓ స్పష్టమైన కార్యాచరణ, నిర్దిష్టమైన అజెండాతో యువ శక్తి కదం తొక్కుతోంది. ఈ దేశం ఎదుర్కుంటున్న సమస్యల్ని విశ్లేషించడంలోనూ తామెంత ముందున్నామో యువత తమ లక్ష్యాలతోనే చాటిచెప్పింది. ప్రతిభాసామర్థ్యాలకు కొదువ లేని భారత్ విద్యావ్యవస్థను వేరుపురుగులా తొలుస్తున్న లీకేజీల సమస్యపై గళమెత్తడం.. కచ్చితంగా దేశానికి మెరుగైన భవిష్యత్తును హామీ ఇస్తుందనడంలో సందేహం లేదు. అంతటితో ఆగకుండా విద్యావ్యవస్థ ప్రక్షాళన కోసం జెన్జీ డిమాండ్ చేయడం కూడా శుభ పరిణామమేనని నిపుణులు చెబుతున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ప్రతి ముప్ఫయ్యేళ్లకి ఓ నిర్దిష్ట అజెండాతో దేశం పురోగమించింది. కానీ ఇంతవరకూ విద్యావ్యవస్థలో మాత్రం చెప్పుకోదగ్గ సంస్కరణలు రాని మాట నిజం. అదే సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలన్నీ.. మొదట విద్యావ్యవస్థను చక్కదిద్దుకున్నాకే.. ప్రపంచ శక్తులుగా ఎదిగాయనే సంగతి మర్చిపోకూడదు. ఇదే విషయాన్ని గుర్తుచేస్తూ.. మనమూ, మన విద్యావ్యవస్థ కూడా మారాలని విద్యావేత్తలు ఎంత మొత్తుకున్నా.. ఇప్పటిదాకా ప్రభుత్వాలు అంతగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు విద్యార్థి లోకం సూటిగా లక్ష్యాన్ని గురిపెట్టడంతో.. త్వరలోనే దేశంలో కొత్త మార్పు చూస్తామనే ఆశలు రెక్కలు తొడుక్కుంటున్నాయి.
అలాగని ఉన్న విద్యావ్యవస్థ నాసిరకం అనే అభిప్రాయం విద్యార్థులకూ లేదు. కాకపోతే ఎప్పటికప్పుడు స్వీయ లోపాల్ని సవరించుకుంటూ.. మరింత మెరుగ్గా తమను తాము ఆవిష్కరించుకునే వ్యవస్థలే బలంగా నిలబడి.. బలమైన దేశాల్ని నిర్మిస్తాయి. మన దేశ చరిత్రతో పాటు ప్రపంచ చరిత్ర చూసుకున్నా.. ఈ నగ్నసత్యం అడుగడుగునా నిరూపితమైంది. అందుకే బలమైన విద్యావ్యవస్థతోనే బలమైన దేశాన్ని నిర్మించగలమని.. అప్పుడే వికసిత్ భారత్ సాధ్యపడుతుందని జెన్జీ ఆత్మవిశ్వాసంతో వాదిస్తోంది. అందుకోసం ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలో కూడా ఫిక్సైన యువత.. ఇకపై దేశాన్ని ఎలా ముందుకు నడపాలో.. ప్రభుత్వాలకు తామే మార్గనిర్దేశం చేస్తామని చొరవ తీసుకుంటోంది. ఇప్పటికే ప్రధాని, సీజేఐ లాంటి అత్యున్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు కూడా పాతికేళ్ల కుర్రకారు ఆలోచనకు మన్నన ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చేసింది. భవిష్యత్తులో యువత మరింద దూకుడుగా ముందుకొచ్చి.. వికసిత్ భారత్ సంకల్పానికి నాయకత్వం వహిస్తే.. భారత్ అగ్రరాజ్యం కాకుండా ఏ శక్తీ ఆపలేదనే వాదన వినిపిస్తోంది.
తాజావార్తలు
-
Story Board : స్వతంత్ర భారత ప్రస్థానం ఎలా ఉంది..? ఇన్నేళ్లలో మనం ఏం సాధించాం..?
-
CM Revanth Reddy : ఉత్తర తెలంగాణకు సీఎం రేవంత్ వరాలు.. రూ.16 వేల కోట్ల పనులకు శ్రీకారం..
-
OTR: కోదండరాంకు యువత సెగ..! నాడు నమ్మినవాళ్లే ఇప్పుడు నిలదీస్తున్నారా..?
-
Nitin Nabin: నితిన్ నబీన్ ఏపీ పర్యటన ఖరారు.. ఆగస్టు 17 నుంచి 21 వరకు..
-
OTR: బీఆర్ఎస్కు కాంగ్రెస్ బిగ్ కౌంటర్..! 10 ఏళ్ల భూ కేటాయింపుల చిట్టా..!
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!