NTV Telugu Site icon

Story board: మోడీ మ్యాజిక్ పనిచేసిందా..? ఆప్‌ ఓటమికి కారణాలేంటి..? కాంగ్రెస్‌ అనుకున్నది సాధించిందా..?

Story Board

Story Board

Story board: ఢిల్లీలో ఉత్కంఠకు తెరపడింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజం చేస్తూ కమలం వికసించింది. ఆప్ కు పట్టున్న ప్రాంతాల్లో కూడా బీజేపీ అభ్యర్థులు విజయం సాధించటం.. ఆ పార్టీ వ్యూహానికి అద్దం పడుతోంది. ఆప్ దిగ్గజాల్ని ఓటమి బాట పట్టించిన ఢిల్లీ ఓటర్లు.. కాషాయ పార్టీకి రాచబాట వేశారు. ఢిల్లీ అభివృద్ధికి గ్యారంటీ ఇచ్చిన మోడీ.. ఉచిత పథకాల విషయంలోనూ తగ్గలేదు. మరిప్పుుడు బీజేపీ ఎలాంటి పాలనా విధానం తీసుకొస్తుందనేది చూడాల్సి ఉంది. పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్నా.. పక్కలో బల్లెంలా ఆప్ ఢిల్లీలో అధికారం చెలాయించింది. మొదట్లో బీజేపీ ఆప్ ను లైట్ తీస్కుంది. కానీ కేజ్రీవాల్ చీటికీమాటికీ కేంద్రంతో గొడవ పెట్టుకోవడం, నేరుగా మోడీని టార్గెట్ చేయడం.. తానే భవిష్యత్ ప్రధాని అనే ఊహల్లో ఉండటం.. కాషాయ పార్టీకి కోపం తెప్పించాయి. దీంతో పక్కా ప్లాన్ ప్రకారం ఆప్ కు ఉచ్చులు వేస్తూ వచ్చింది. కొన్ని ఉచ్చుల నుంచి తప్పించుకున్న ఆప్.. లిక్కర్ స్కామ్ నుంచి మాత్రం బయటపడలేకపోయింది. పైగా ఈ ఒక్క స్కామ్ పార్టీ పరువుని యమునలో ముంచేసింది. కేజ్రీవాల్ క్లీన్ ఇమేజ్ కు మరకలు పడ్డాయి. మిడిల్ క్లాస్ ఎక్కువగా ఉండే ఢిల్లీలో.. ఆప్ కూడా ఆ తాను ముక్కే అనే విషయం జీర్ణించుకోలేకపోయారు జనం. ఇటు బీజేపీ మాత్రం ఆప్ వైఫల్యాల పునాదులపై పార్టీని మరింతగా బలోపేతం చేసుకుంది. ఆరెస్సెస్ కూడా చాప కింద నీరులా వ్యూహాలు అమలు చేసింది. ఇవన్నీ కలిసొచ్చి.. బీజేపీని హస్తిన గద్దెనెక్కించాయి. ఆప్ స్వయకృతాలతోనే దెబ్బతిందని స్పష్టమవుతోంది.

ఆప్ ఎక్కువగా ఆశలు పెట్టుకున్న అంశం కేజ్రీవాల్ అరెస్ట్ పై సానుభూతి. కానీ ఢిల్లీ జనం దాన్ని మరో కోణంలో చూశారు. జార్ఖండ్ లో హేమంత్ సోరెన్ అరెస్ట్ పై సానుభూతి జేఎంఎంని గెలిపించినట్టే.. ఇక్కడా జరుగుతుందనుకున్న ఆప్ లెక్క తప్పింది. ఆమ్ ఆద్మీ పార్టీ అని పేరు పెట్టుకుని వందల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ చేయడం, ఆ స్కామ్ లో అడ్డంగా బుక్కై జైలుకు వెళ్లటం.. చీపురు పార్టీని కూడా కళంకిత పార్టీగా ముద్రకొట్టాయి. అవినీతి లేని సమాజం పేరుతో కేజ్రీవాల్ తమకు నమ్మకద్రోహం చేశారని ఢిల్లీ జనం అనుకున్నారు. జనంలో వచ్చిన ఈ మార్పును బీజేపీ పసిగట్టకలిగినా.. ఆప్ మాత్రం తప్పులో కాలేసింది.

ఆప్ అధినేత కేజ్రివాల్ కూడా తన నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. ఈ తరుణంలో ఢిల్లీ సచివాలయ ఉద్యోగులకు లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. దీంతో ఢిల్లీ సెక్రటేరియట్‌ను సీజ్ చేశారు. సచివాలయం నుంచి ఏ ఒక్క ఫైల్, రికార్డు, హార్డ్ డ్రైవ్ బయటకు వెళ్లకూడదని లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. పదేళ్లకు పైగా ఢిల్లీలో అధికారం చెలాయించిన ఆప్‌పై బీజేపీ కొన్నేళ్లుగా అవినీతి ఆరోపణలు చేస్తూ వస్తోంది. ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే అసెంబ్లీలో కాగ్ నివేదికలు ప్రవేశపెడతామని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఆ మేరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలను జారీ చేశారు. గత ప్రభుత్వానికి సంబంధించి ఒక్క ఫైల్‌ కూడా బయటకు వెళ్లకూడదని పేర్కొన్నారు. గతంలో పలు రాష్ట్రాల్లో అధికారం చేతులు మారినపుడు ఫైళ్లు చోరీకి గురయ్యాయి. ఢిల్లీలో అలా జరగకూడదని బీజేపీ కృత నిశ్చయంతో ఉంది. ఈ మేరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ రంగంలోకి దిగారు.

ఢిల్లీలో అధికార పక్షంగా బీజేపీ, ప్రతిపక్షంగా ఆప్ సెటిలయ్యాయి. కాంగ్రెస్ మాత్రం ముచ్చటగా మూడోసారి సున్నా సీట్లకే పరిమితమైంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ఓ అగ్రశ్రేణి శక్తిగా కొనసాగింది. ముఖ్యంగా షీలా దీక్షిత్ నేతృత్వంలో 1998, 2003, 2008 ఎన్నికల్లో విజయ పరంపర సాధించి.. మూడుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే.. 2014 తర్వాత రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. 2011లో జరిగిన అన్నా హజారే ఉద్యమం రాజకీయం మీద పెను ప్రభావం చూపింది. ఈ ఉద్యమం నుంచి పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ 2013లో తొలిసారి ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేసి 28 సీట్లు గెలుచుకుంది. ఆ తర్వాత 2015, 2020 ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికారం చేపట్టింది. ప్రజా సమస్యలపై కేజ్రీవాల్ ప్రభావం, మినిమం బిల్స్, ఉచిత విద్యుత్, నీటి సరఫరా, ఆరోగ్య పథకాలు వంటి సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుకున్నారు. అటు షీలా దీక్షిత్ తర్వాత కాంగ్రెస్ పార్టీ బలహీనపడిపోయింది. క్షేత్ర స్థాయిలో మద్దతుదారులు క్రమంగా ఆప్ వైపుకు మారిపోయారు. 2014 నాటి మోడీ ప్రభంజనం.. ఆప్ ఆకర్షణ వల్ల యువ ఓటర్లు కాంగ్రెస్‌ను పూర్తిగా పక్కన పెట్టారు. బీజేపీతో పోటీ చేసే స్థాయిలో నిలబడలేకపోవడం, విపక్షంగా కాంగ్రెస్ తేలిపోవడం.. దీనిలో భాగంగా ఉన్నాయి.

ఢిల్లీ ప్రజలు తమ నిర్ణయాన్ని మార్చుకోవడానికి గల కారణాలను విశ్లేషిస్తే.. ఆప్ పై వ్యతిరేకత పెరగడం ముఖ్య కారణంగా కనిపిస్తోంది. విద్యుత్, నీటి ఉచిత సదుపాయాల్లో వచ్చిన అవాంతరాలు. ఆరోగ్య సంరక్షణలో లోపాలు, మోహల్లా క్లినిక్స్ పై ప్రజల్లో అసంతృప్తి, కేజ్రీవాల్ పై వచ్చిన అవినీతి ఆరోపణలు ఎక్కువగా దీనిలో ఉన్నాయి. బీజేపీ అధికారంలోకి రావడానికి గల కారణాల్లో.. కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాలు.. హిందూత్వ రాజకీయం ప్రభావం.. సుస్థిర అభివృద్ధి పేరుతో ప్రజలను ఆకట్టుకోవడం ముఖ్య కారణాలుగా ఉన్నాయి. కాంగ్రెస్ విఫలం అవ్వడానికి గల కారణాల్లో.. ఢిల్లీలో తగినంత ప్రచారం లేకపోవడం, యువతలో మద్దతు కోల్పోవడం, సమర్థ నాయకత్వం లేకపోవడం ముఖ్య కారణాలు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో కాంగ్రెస్ నుంచి ఆప్ వైపు, ఆ తర్వాత బీజేపీకి మారుతున్న ప్రజా మద్దతు ఒక ముఖ్యమైన పరిణామంగా చెప్పవచ్చు. 2014 తర్వాత ఆప్ విపరీతంగా బలపడగా.. కాంగ్రెస్ పూర్తిగా దెబ్బతింది.