Story Board: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్‌నకు షాక్… ప్రపంచవ్యాప్తంగా సానుకూల పరిణామాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Story Board: ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కాకముందే ఉక్రెయిన్ యుద్ధం మొదలైనా.. దాని ప్రభావం ప్రపంచ మార్కెట్లపై స్వల్పకాలమే పడింది. కానీ అసలు యుద్ధాలే లేకుండా చేస్తానని బీరాలు పలికిన.. ఉరుము లేని పిడుగులా ఇరాన్ యుద్ధం తెచ్చిపెట్టిన.. మొత్తంగా ప్రపంచ మార్కెట్లను పడేశారు. దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కొడిగడుతున్న దీపంలా ఊగిసలాడుతూనే ఉంది. దీనికి తోడు ట్రంప్ ఎడాపెడా సుంకాల బాదుడు, యుద్ధం విషయంలోనూ తీవ్రమైన అనిశ్చితితో మదుపర్లు డీలా పడ్డారు. ఇది చాలదన్నట్టుగా వ్యాపారవర్గాల విషయంలో ట్రంప్ అనుసరించిన వైఖరి కూడా ప్రతికూల సంకేతాలు పంపింది. ఏకంగా దిగ్గజ కంపెనీల అధిపతుల్ని వైట్‌హౌస్‌కు విందుకు పిలిచి.. అమెరికాలో పెట్టుబడులు పెట్టకపోతే మీ సంగతి చూస్తామని బెదిరించడం.. మొత్తం వ్యాపార ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఏరోజు ఏ దేశంపై సుంకాల కత్తి దూస్తారో తెలియక.. వాణిజ్య రంగం రెక్కలు తెగిన పక్షిలా అయిపోయింది. మొదట్లో ట్రంప్ విధానాల్ని ప్రతిఘటించాలనే ఆలోచన వచ్చినవారు కూడా.. దాని వల్ల పెద్దగా ఉపయోగం లేదని, ట్రంప్ మరింతగా మొండికేస్తారని అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. చివరకు అమెరికా సుప్రీంకోర్టు చెప్పినా సుంకాల విషయంలో వెనక్కితగ్గని ట్రంప్.. మొత్తంగా ప్రపంచానికి ఉక్కపోత తెప్పించారు. దీంతో ట్రంప్ ఎప్పుడి దిగిపోతారా అని ఎదురుచూడటం తప్ప మరేమీ చేయలేమని ప్రపంచ దేశాలన్నీ నీరసపడ్డాయి. ఇలాంటి తరుణంలో మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల గెలుపు ఊహించిందే అయినా.. మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో వచ్చిన బ్లూవేవ్.. అందరికీ కొత్త ఉత్సాహం ఇచ్చింది. ఇప్పటికిప్పుడు ట్రంప్ పదవి ఊడకపోయినా.. ఆయన దూకుడుకైతే కచ్చితంగా కళ్లెం పడుతుందనే ఆశలు ఊపిరిపోసుకుంటున్నాయి.
ప్రస్తుత మధ్యంతర ఎన్నికల ఫలితాల్ని విశ్లేషిస్తే.. డెమోక్రాట్లు రిపబ్లికన్ల కంచుకోటలు బద్దలు కొట్టారు. 32 ఏళ్ల తర్వాత రిపబ్లికన్లు తమకు పెట్టనికోటలా ఉన్న టెక్సాస్‌లో రాష్ట్రస్థాయి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. సెనేట్, గవర్నర్ స్థానాల్ని కూడా డెమోక్రాట్లే దక్కించుకున్నారు. సౌత్ కరోలినా, కాన్సాస్ లో అయితే డెమోక్రాట్లు 1932 తర్వాత తొలిసారి విజయం సాధించారు. అలాగే అయోవా, మైనే, ఓహియో, నార్త్ కరోలినా కూడా డెమోక్రాట్ల కైవసం అయ్యాయి. ఇక్కడ ట్రంప్ ఓటమికి గల ప్రధాన కారణాలు చూస్తే.. ట్రంప్ అధ్యక్ష రేటింగులు ఘోరంగా పడిపోవడం, ఆర్థిక ఒత్తిళ్లు, జీవనవ్యయం పెరుగుదల, కాంగ్రెస్ అధ్యక్షుడు తానా అంటే తందానా అంటోందనే అసంతృప్తి కీలక పాత్ర పోషించాయి. ఏకంగా 79 శాతం మంది ఓటర్లు ద్రవ్యోల్బణాన్ని ప్రధాన సమస్యగా చెప్పారు. ట్రంప్ సుంకాలు, విధానాల కారణంగానే ధరలు పెరిగాయని 62 శాతం మంది ఓటర్లు అభిప్రాయపడ్డారు. ప్రతి పది మంది ఓటర్లలో ఏడుగురు.. ట్రంప్ విధానాల్ని అడ్డుకోవడంలో కాంగ్రెస్ సంతృప్తికర పాత్ర పోషించడం లేదనే భావన వ్యక్తం చేశారు. సబర్బన్ ఓటర్లు డెమోక్రాట్లకు బలమైన మద్దతిచ్చారు. హిస్పానిక్ ఓటర్లలోనూ ప్రతి పదిమందిలో ఏడుగురికి ట్రంప్ విధానాలు ఏ మాత్రం నచ్చలేదు. అధ్యక్ష ఎన్నికలతో పోలిస్తే.. యువత కూడా భారీగా మనసు మార్చుకుని ఏకంగా 63 శాతం మంది డెమోక్రాట్లకు జై కొట్టారు.
Also Read
- Story Board : మొన్న అర్నబ్.. ఇప్పుడు మురసు.. ఏపీని వణికించిన వరుస తుపాన్లు..
- Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
- Story Board: ఇప్పుడు ధనుష్.. నిన్న విజయ్.. సినిమా వాళ్లు లేకుండా తమిళ రాజకీయం నడవదా..?
- Story Board: లిక్విడ్ క్యాష్ గగనమైపోయిందా..? ప్లాస్టిక్ కరెన్సీకి, నగదు కొరతకూ లింక్ ఉందా..?
అమెరికా రాజకీయాల్లో అనిశ్చితి తొలగిపోవడం, ట్రంప్ కూడా పరాజయాన్ని అంగీకరిస్తూ డెమోక్రాట్లతో కలిసి పనిచేస్తానని ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో నమ్మకం పెరిగింది. అమెరికా మార్కెట్లలో డౌ జోన్స్ ఏకంగా 3 శాతం పెరిగి సరికొత్త రికార్డులను సృష్టించింది. S&P 500, నాస్డాక్ కూడా భారీగా లాభపడ్డాయి. ఈ గ్లోబల్ పాజిటివ్ సెంటిమెంట్‌తో భారతీయ స్టాక్ మార్కెట్లలో సరికొత్త ఉత్సాహం వచ్చింది. బీఎస్ఈ సెన్సెక్స్ 2,000 పాయింట్లకు పైగా లాభపడగా, నిఫ్టీ 50 దాదాపు 580 పాయింట్లు ఎగబాకింది. దీనివల్ల కేవలం కొన్ని గంటల్లోనే భారతీయ ఇన్వెస్టర్ల సంపద రూ. 8 లక్షల కోట్లకు పైగా పెరిగింది. ఈ రాజకీయ మార్పుతో భవిష్యత్తులో ఏకపక్ష సుంకాలు , కఠిన నిర్ణయాలు తగ్గుతాయని, మార్కెట్లకు ఒక స్థిరమైన వాతావరణం లభిస్తుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిణామాలతో భారత ఆర్థిక వ్యవస్థకు ఊరట లభించింది. అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల నేపథ్యంలో భారత రూపాయి వరుసగా ఐదో రోజు కూడా లాభపడింది. అదే సమయంలో ముడి చమురు ధరలు భారీగా పతనమయ్యాయి. నేడు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 29 పైసలు బలపడి 94.35 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. నిన్న ముగింపు ధర 94.64గా ఉంది.
భారత స్టాక్ మార్కెట్లలో మంచి జోష్ కనిపిస్తోంది. వరుసగా ఆరో సెషన్లో సూచీలు మంచి లాభాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు రాణించడం, ఆ సానుకూల సంకేతాలు దేశీయ మార్కెట్లకు పాకాయి. ఇంకా క్రూడాయిల్ ధరలు భారీగా పడిపోవడం కూడా కలిసొచ్చింది. వీటన్నింటికీ కారణం అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు. అవును ఆ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ పరాజయం పాలవడంతో అనిశ్చితి తొలగిపోతుందని ఇన్వెస్టర్లు భావించడమే సానుకూల సంకేతాల్ని నింపింది. ఇదే క్రూడాయిల్ ధరల్ని పడేసింది. అమెరికా స్టాక్ మార్కెట్లను దూసుకెళ్లేలా చేసింది. అదే ఊపులో భారత స్టాక్ మార్కెట్లు కూడా దూసుకెళ్తున్నాయి. పెట్టుబడిదారీ దేశమైన అమెరికాలో.. ఆ పెట్టుబడులు, వ్యాపారాలకే వ్యతిరేకంగా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు.. ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల సంకేతాలకు దారితీశాయి. ట్రంప్ తీరు సరికాదంటూ నిపుణులతో పాటు స్వయంగా అమెరికా దిగ్గజ కంపెనీల అధిపతులూ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. ట్రంప్ మాత్రం తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న రీతిలో ముందుకెళ్లారు. చివరకు తన నిర్ణయాలతో అమెరికన్ల జీవనవ్యయాలు పెరిగిపోతున్నా సరే.. దేశం కోసం కష్టాలు భరించాలంటూ ట్రంప్ ఇచ్చిన ఉచిత సలహా సగటు అమెరికన్ గుండె మండేలా చేసిందనడంలో సందేహం లేదు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా కరెక్టే అనే పోకడతో కొనసాగిన ట్రంప్ పాలన.. చివరకు అమెరికా అస్తిత్వాన్నే ప్రమాదంలో పడేసే స్థాయికి చేరడాన్ని అమెరికన్లు జీర్ణించుకోలేకపోయారు. తమ ఆదాయం పెంచాలని కోరుతుంటే.. వలసదార్ల ఉద్యోగాలు ఊడగొడితే ఏం ప్రయోజనమనే ప్రశ్నలు కూడా దూసుకొచ్చాయి. కానీ ట్రంప్ మాత్రం ఏ దశలోనూ రివ్యూ చేసుకునే ధోరణి లేకుండా.. కేవలం ఒంటెత్తు పోకడనే నమ్ముకుని.. అమెరికాకే కాకుండా మొత్తంగా ప్రపంచానికే విలన్లా ముద్రపడ్డారు. అందుకే ప్రపంచం ముందస్తు దీపావళి సంబరాల్లో మునిగిపోయింది.
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్‌కు షాక్ తగలడంతో.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ముగుస్తాయన్న ఆశలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒకే రోజు 8 శాతానికి పైగా కుప్పకూలాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు దాదాపు 94 డాలర్ల దిగువకు చేరగా, యూఎస్ డబ్ల్యూటీఐ ధర 86-88 డాలర్ల వద్ద నిలిచింది. ఈ వారంలోనే చమురు ధరలు ఏకంగా 16 శాతం మేర తగ్గాయి. చమురును భారీగా దిగుమతి చేసుకునే భారతదేశానికి ఇది అతిపెద్ద ఊరట. దీనివల్ల దేశీయంగా ద్రవ్యోల్బణం తగ్గి, దిగుమతి ఖర్చులు భారీగా తగ్గుతాయి. అంతర్జాతీయ ఇంధన విపణిలో ముడి చమురు ధరలు అనూహ్యంగా కుప్పకూలాయి. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ విజయభేరీ మోగించి, కాంగ్రెస్‌లోని ఉభయ సభలపై పట్టు సాధించడం రాజకీయ చిత్రపటాన్ని మార్చివేసింది. ఈ ఎన్నికల ఫలితాలు పశ్చిమాసియాలో ఇరాన్‌తో కొనసాగుతున్న సైనిక వివాదం త్వరలోనే ముగింపునకు రావచ్చుననే అంచనాలను బలోపేతం చేయడంతో.. చమురు మార్కెట్లో ట్రేడర్లు భారీగా లాభాల స్వీకరణకు పూనుకున్నారు. డెమోక్రాట్లు శాసనసభల పగ్గాలు చేపట్టడంతో పాటు ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇరాన్-అమెరికా శాంతి చర్చల్లో పురోగతి కనిపిస్తుండటంతో చమురు సరఫరా ఆటంకాలకు సంబంధించిన భౌగోళిక రాజకీయ భయాలు తగ్గుముఖం పట్టాయి.ఈ రాజకీయ మార్పుపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందిస్తూ.. రిపబ్లికన్ పార్టీ ఎన్నికల ఫలితాలపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం తీవ్రంగా పడిందని పేర్కొనడం మార్కెట్ అంచనాలకు మరింత ఊతమిచ్చింది. కాంగ్రెస్ డెమోక్రాట్ల హస్తగతం కావడం వల్ల అమెరికా సైనిక వ్యయం, విదేశీ విధానాలపై కఠినమైన నియంత్రణలు రానున్నాయని, ఇది పశ్చిమాసియా పోరాటాన్ని త్వరగా ముగించేలా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఒత్తిడి పెంచుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. చమురు సరఫరా తిరిగి సాధారణ స్థితికి వస్తుందనే ఆశలతో ధరలలో ఇప్పటివరకు ఉన్న జియోపొలిటికల్ రిస్క్ ప్రీమియం కరిగిపోతోంది.
తాజావార్తలు
-
Off The Record: మంత్రి శ్రీధర్‌బాబు vs ఎంపీ గడ్డం వంశీ.. ఎన్నికల తర్వాత ఇద్దరి మధ్య గ్యాప్.?
-
Milk Adulteration: హైదరాబాద్‌లో కల్తీ పాల కలకలం.. పోచారంలో తయారీ కేంద్రం గుర్తింపు!
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
Story Board: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్‌నకు షాక్… ప్రపంచవ్యాప్తంగా సానుకూల పరిణామాలు..!
-
Doping Test: డోపింగ్ పరీక్షలో దొరికిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్.. కానీ ఓ ట్విస్ట్!
ట్రెండింగ్
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!
-
37 గంటల బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్డ్ ANC ఫీచర్లు, Bose సౌండ్ టెక్నాలజీతో Moto Buds 2 Ultra లాంచ్..!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 12 రోజుల బ్యాటరీ లైఫ్, డ్యూయల్ GPS, gOLED డిస్ప్లేతో Moto Watch 2 Fit లాంచ్..!
-
200MP పెరిస్కోప్ కెమెరా, ఏడేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7000mAh బ్యాటరీతో Motorola Signature 27 లాంచ్..!
-
IND vs SL 1st ODI: బీసీసీఐ కీలక నిర్ణయం.. విశాఖలో తొలి వన్డే.. వేదిక మార్పుకు కారణం ఇదే!