Site icon NTV Telugu

Story Board: మొన్న సద్దాం.. నిన్న గడాఫీ.. ఇప్పుడు ఖమేనీ.. అమెరికాను కాదంటే ఎవరైనా అంతేనా..?

Story Board

Story Board

Story Board: ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలన్నీ ఏదో రెండు దేశాల మధ్య జరుగుతున్నవి మాత్రమే కాదు. ఎందుకంటే అమెరికా యుద్ధరీతుల్ని పూర్తిగా మార్చేసింది. గతంలో రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే.. గెలిచిన దేశం ఓడిన దేశంపై పెత్తనం చేసేది. కానీ అగ్రరాజ్యం మాత్రం అంతకు మించిన లోతైన వ్యూహాలు అమలు చేస్తోంది. తన మాట వినని దేశాధినేతల్ని తప్పించేసి.. ఆయా దేశాల్లో తమకు అనుకూల ప్రభుత్వాలు కొలువుదీరేలా పావులు కదుపుతోంది. ఇప్పుడు ఇరాన్‌లో ఖమేనీ అయినా.. అంతకు ముందు లిబియాలో గడాఫీ అయినా.. ఇంకా ముందు ఇరాక్‌లో సద్దాం హుస్సేన్ అయినా.. అమెరికా అవలంబించిన యుద్ధనీతి అదే. చివరకు వెనిజువెలాలోనూ మదురోని నిర్బంధించి.. తన అనుకూల సర్కారును ఏర్పాటుచేసింది అమెరికా.

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అంతం అనేది అమెరికా ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కానే కాదు. కొంతకాలంగా ఆయన్ను తప్పిస్తే కానీ.. పశ్చిమాసియాలో అమెరికా వ్యూహాలకు తిరుగుండదనే కోణంలోనే అమెరికా ఆలోచిస్తోంది. మధ్యలో చర్చల పేరుతో కొంత డ్రామా నడిపినా.. ఖమేనీ ఎలాగూ తలొగ్గరనే ఉద్దేశంతోనే చర్చలకు తెరతీశారనే అనుమానాలూ లేకపోలేదు. అటు ఖమేనీ కూడా అమెరికాతో రాజీపడే ప్రసక్తే లేదని పదేపదే చెబుతూ వచ్చారు. కేవలం అమెరికా వ్యతిరేకతతోనే ఇరాన్‌ను సైనికపరంగా శక్తివంతంగా మార్చారనే వాదన కూడా లేకపోలేదు. అమెరికాను దారికి తెచ్చే వ్యూహంలో భాగంగానే.. ఇజ్రాయెల్‌ను పదేపదే చీకాకుపెట్టే వ్యూహరచన కూడా చేసినట్టుగా కనిపిస్తోంది. అన్నింటికీ మించి అమెరికా దేశాలను తన చెప్పుచేతల్లో పెట్టుకుని ఆడిస్తున్న తీరుగానే.. అమెరికా మిత్రదేశాల్లో ఇరాన్ అనుకూల గ్రూపుల్ని ప్రోత్సహించి.. వాటికి వెన్నుదన్నుగా నిలవటం.. ముల్లును ముల్లుతోనే తీయాలనే సిద్ధాంతం అని వేరే చెప్పనక్కర్లేదు. అయితే అలా ఇరాన్ తయారుచేసిన ముఠాలు.. ఉగ్రవాద సంస్థలుగా రూపాంతరం చెందినా.. వాటిని గుడ్డిగా సమర్థించటం.. ఖమేనీ తెలిసి చేసిన తప్పే. అయితే ఆయన దీన్ని కూడా అమెరికా వ్యతిరేకత అనే కారణం చూపి గట్టిగా సమర్థించుకుంటారు.

ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఉన్న ఖమేనీకి దేశవ్యాప్తంగా ఏకపక్ష మద్దతు కూడా లేదు. ఆయన్ను దేవుడిగా ఆరాధించేవాళ్లు ఎంతమంది ఉన్నారో.. సైతాన్‌గా భావించేవాళ్లూ అంతేమంది ఉన్నారు. ఇస్లామిక్ విప్లవంతో వెలుగులోకి వచ్చిన ఖమేనీ.. గద్దెనెక్కాక.. ఆవిప్లవ లక్ష్యాలన్నీ తుంగలో తొక్కారని ఇరానియన్లు చెబుతారు. కేవలం మతాన్ని ప్రాతిపదికగా తీసుకుని.. ఇరాన్‌లో వ్యవస్థలన్నింటినీ గుప్పిట పట్టారు. కీలక పదవులన్నింటిలోనూ తన కుటుంబ సభ్యుల్ని, సన్నిహితుల్ని నియమించుకున్నారు. ఇరాన్‌లో పేరుకి అధ్యక్షుడున్నా.. అధికారాలన్నీ సుప్రీం లీడర్ చేతిలోనే ఉంటాయి. అసలు ఖమేనీ మూడున్నర దశాబ్దాల పాటు అధికారాన్ని సుస్థిరంగా ఉంచుకోవటం కూడా చిన్న విషయేం కాదు. ఇందుకోసం ఆయన కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇరాన్‌లో సైన్యానికి సమాంతరంగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ వ్యవస్థను అభివృద్ధి చేశారు. అలాగే అత్యున్నత నిర్ణాయక మండలిపై కూడా పట్టు సాధించారు. కేవలం ఇరాన్‌లోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా అమెరికాను వ్యతిరేకించే బలమైన నేతగా ముద్రపడ్డారు. అరుదుగా విదేశీ పర్యటనలు చేస్తూ కూడా.. ప్రపంచవ్యాప్తంగా ముస్లిం దేశాలపై ప్రభావం చూపటం ఖమేనీకే చెల్లింది.

ఖమేనీని అమెరికా మొదట్లో పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు. కానీ ఇజ్రాయెల్ ద్వారా ఉప్పందిన తర్వాత ఆయన ఎంత ప్రమాదకారో యూఎస్‌కు కూడా అర్థమైంది. ఇక హార్ముజ్ జలసంధి విషయంలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రవర్తిస్తున్న తీరు కూడా అమెరికాకు కంట్లో నలుసులా మారింది. ప్రపంచ చమురు సంపదకు నిలయంగా ఉన్న పశ్చిమాసియాలో పెత్తనానికి అమెరికా తహతహ లాడుతుంటే.. ఖమేనీ మాత్రం వ్యూహాత్మకంగా మతం పేరుతో అమెరికాను ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నాలు చేయడం అంకుల్ శామ్‌కు నచ్చలేదు. అందుకే ఖమేనీని టార్గెట్ చేసింది. అంతకుముందే కొన్నిసార్లు తిరుగుబాట్ల ద్వారా గద్దె దించాలనే ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. ఇప్పుడు కూడా రీసెంట్‌గా అమెరికా ప్రోద్బలంతో జరిగిన నిరసనలు.. ఖమేనీని కదల్చలేకపోయాయి. దీంతో ఇక ఉపేక్షిస్తే లాభం లేదని అమెరికా ఖమేనీని చంపేసింది. ప్రపంచ షియా ముస్లింలకు పెద్ద దిక్కు అన్నంతగా పేరు తెచ్చుకున్న ఖమేనీ.. అలాగని సున్నీలతోనూ విరోధం పెట్టుకునే ప్రయత్నం చేయలేదు. పైగా తోటి గల్ఫ్ దేశాలతోనూ మతం ఆధారంగా స్నేహసంబంధాలకు ప్రయత్నించారు. కాకపోతే ఖమేనీ ప్రయత్నాలు అనుకున్న ఫలితం ఇవ్వకపోయినా.. గల్ఫ్‌లో ఉన్న తమ సైనిక స్థావరాలకు ఇరాన్‌ నుంచి పొంచి ఉన్న ముప్పు కూడా అమెరికాను అప్రమత్తం చేసింది.

ఖమేనీ అధికారంలోకి వచ్చేనాటికి ఇరాన్ సైన్యం అంత శక్తివంతంగా లేదు. కానీ ఇప్పుడు ఖమేనీ పోయినా.. నిలబడి అమెరికాపై ప్రతిదాడి చేసేలా ఇరాన్ సైన్యాన్ని ఖమేనీ తీర్చిదిద్దారు. ఈ విషయంలో మాత్రం మెజార్టీ ఇరానియన్లు ఖమేనీకి కితాబిస్తారు. ఒక్క ఇరాన్ ఇజ్రాయెల్, అమెరికాకు ఎదురదొడ్డటమే కాకుండా.. తోటి గల్ఫ్ దేశాలన్నింటిలో ఉన్న అమెరికా స్థావరాలపై ఒక్కపెట్టున దాడులు చేయడం ఆషామాషీ కాదు. ఈ ఘనత సాధించటానికి ప్రధాన కారణం ఖమేనీయేననడంలో సందేహం లేదు. అదే సమయంలో సైనికపరంగా ఇరాన్‌ను తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దిన ఖమేనీ.. పౌరులపై కఠిన ఆంక్షలు విధించడం ద్వారా కావాల్సినంత వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. తాను శాశ్వతంగా అధికారంలో కొనసాగాలనే కోరికతో.. ఏ చిన్న వ్యతిరేక స్వరాన్ని సహించకుండా.. భిన్న వాదన వినిపించిన వారికి దారుణమైన శిక్షలు అమలు చేశారు. చివరకు మహిళలు అని కూడా చూడకుండా దారుణ శిక్షలకు వెనుకాడలేదు. ఇలాంటి వైఖరితోనే ఖమేనీ వ్యతిరేకతను కొని తెచ్చుకున్నారు. అందుకే ఖమేనీ కఠిన ఆంక్షలు భరించలేక కొందరు ఇరానియన్లు.. గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు జోక్యం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తులు కూడా చేశారు. ఏతావాతా ఖమేనీ నియంతే అయినా.. అమెరికాను వ్యతిరేకించిన కారణంగా తన వర్గానికి హీరోగా మిగిలిపోయారు. తమకు అనుకూలంగా ఉంటే ప్రాణాలకు ముప్పు లేదని అమెరికా చెప్పినా.. ఖమేనీ మాత్రం ధిక్కారానికే మొగ్గుచూపారు. ప్రాణాలు పోయినా పర్లేదు.. అమెరికాకు తలొగ్గకూడదన్న తెగువే.. ఆయన ప్రాణాలు పోయేలా చేసింది. అందుకే తన వర్గానికి ఖమేనీ హీరోనే. అమెరికా వ్యతిరేకత విషయంలో రాజీలేని వైఖరి.. వ్యతిరేకుల్ని కూడా ముక్కున వేలేసేకునేలా చేసేదే.

లిబియాను దశాబ్దాల పాటు పాలించిన గడాఫీని అమెరికా, నాటో బలగాలు లక్ష్యంగా చేసుకున్నాయి. 2011లో జరిగిన అంతర్యుద్ధంలో అమెరికా వైమానిక దాడులు గడాఫీ కాన్వాయ్‌ను దెబ్బతీశాయి. ఆ తర్వాత తిరుగుబాటుదారులు ఆయనను దారుణంగా హత్య చేశారు. ఏ తిరుగుబాటుతో అధికారంలోకి వచ్చాడో.. అదే తిరుగుబాటు తుపాకులకు బలయ్యాడు గడాఫీ. గడాఫీ ఆర్మీ కెప్టెన్‌గా ఉన్నప్పుడే తిరుగుబాటు ద్వారా అధికారంలోకి వచ్చాడు. క్రమంగా అతడి పాలనలో తిరుగుబాటు లేచింది. అది అంతర్యుద్ధంగా మారింది. గడాఫీ కూడా తిరుగుబాటు ద్వారా అధికారంలోకి వచ్చినా.. ఆ అధికారాన్ని సుస్థిరం చేసుకోవటానికి తానే నియంతగా మారాడు. సొంత దేశంలో ప్రజల్ని తీవ్రంగా అణచివేశాడు. తమపై అమెరికా పెత్తనం ఏంటని ధిక్కారస్వరం వినిపిస్తూనే.. లిబియాలో తనకు వ్యతిరేక వైఖరి తీసుకుంటే.. తీవ్రంగా శిక్షించాడు. అలా లిబియాలో గడాఫీ అనుకూల, ప్రతికూల వర్గాలకు చేజేతులా రూపమిచ్చాడు. మన సంపదను అమెరికా దోచుకోకుండా.. అడ్డుకుంటున్నానని గొప్పలు చెప్పిన గడాఫీ.. చివరకు ఆ సంపదను ప్రజల పరం చేయకుండా.. తానే పోగేసుకుని వ్యతిరేకతను కొని తెచ్చుకున్నాడు. ఆ వ్యతిరేకత కారణంగానే అమెరికా లిబియాపై దండయాత్ర చేసి.. గడాఫీని చంపించగలిగింది. కానీ కడదాకా అమెరికా వ్యతిరేకతకే కట్టుబడ్డ గడాఫీ ..ఆ ఒక్క విషయంలో మాత్రం తన నిబద్ధతను చాటుకున్నాడు.

లిబియాలో అధికారం చేపట్టిన దగ్గర్నుంచీ గడాఫీ అమెరికాకు వ్యతిరేకంగానే పావులు కదుపుతూ వచ్చాడు. అమెరికా ఆంక్షల్ని ఖాతరు చేయకుండా.. విలాసవంతమైన జీవితం గడుపుతూ.. అడుగడుగునా అగ్రరాజ్యానికి సవాల్ విసురుతూ వచ్చాడు. గడాఫీ అధికారం చేపట్టిన తర్వాత లిబియా నుంచి సహాయం అందుకుంటున్న అమెరికన్, బ్రిటీష్ సైనిక స్థావరాలను మూసివేయాలని ఆదేశించాడు. లిబియాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విదేశీ కంపెనీలు వారికి లభిస్తున్న ఆదాయంలో ఎక్కువ వాటా ఇవ్వాలని ఆదేశించాడు. గ్రెగోరియన్ క్యాలెండర్ స్థానంలో ఇస్లామిక్ క్యాలెండర్ అమలు చేశాడు. మద్యం విక్రయాలపై నిషేధం విధించాడు. 1969 డిసెంబర్‌లో, అతని రాజకీయ ప్రత్యర్థులు అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నించినప్పుడు, వారందరినీ హత్యచేశాడు. ఇటాలియన్లను, యూదు సమాజానికి చెందిన ప్రజలను లిబియా నుంచి బహిష్కరించాడు. ప్రత్యర్థులను అణచివేసేందుకు గడాఫీ చేపట్టిన విధానాలే అతని పతనానికి కారణమయ్యాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత గడాఫీ క్రమంగా అనేక దేశాల ప్రభుత్వాలపై ఆంక్షలు విధిస్తూనే ఉన్నాడు. అమెరికాకు పోటీగా తామూ ఆంక్షలు విధిస్తామంటూ గడాఫీ మొదలుపెట్టిన కార్యక్రమం మొదట్లో లిబియా ప్రజలకు ఫ్యాన్సీగా కనిపించినా.. తర్వాత అదే పిచ్చిగా మారి.. వారిని వ్యతిరేకించేలా చేసింది.

లిబియా అంతర్యుద్ధం చివరి దశలో ఉండగా 2011 అక్టోబర్ 20న గడాఫీని తన సొంత పట్టణమైన సిర్తే సమీపంలో దాడి చేసి చంపేశారు. తమ దేశాన్ని ఏకంగా 42 ఏళ్ల పాటు పాలించిన ఆయన, కాన్వాయ్‌‌‌‌లో తప్పించుకోవడానికి ప్రయత్నించగా నాటో వైమానిక దళం ఆ వాహనాలను ధ్వంసం చేశాయి. దాడి నుంచి ప్రాణాలతో బయటపడిన గడాఫీ.. డ్రైనేజీ పైపులో దాక్కుని ఉండగా తిరుగుబాటు దారులకు చిక్కాడు. గడాఫీ తన సొంత బంగారు-ఆధారిత కరెన్సీతో ఆఫ్రికన్ సెంట్రల్ బ్యాంక్‌ను స్థాపించకుండా నిరోధించడానికి నాటో చర్య తీసుకుంది. ఆ సంస్థ డాలర్ శక్తిని సవాలు చేసి, చివరకు ఆఫ్రికా దాని వలసరాజ్యాల సంకెళ్ల నుండి తప్పించుకునేలా చేసి ఉండేది. ఇక్కడ కూడా పూర్తిగా అమెరికా ప్రయోజనాలే తప్ప.. గడాఫీ నిరంకుశత్వం కారణంగా ఆయన్ను శిక్షించాలని అగ్రరాజ్యం అనుకోలేదు. అసలు గడాఫీ కేవలం లిబియాకే పరిమితమై ఎన్ని అరాచకాలు చేసినా అమెరికా పట్టించుకునేది కాదన్నా కూడా అతిశయోక్తి కాదు. కానీ గడాఫీ ఎప్పుడైతే అమెరికా ప్రయోజనాలకు భంగకరం అనే కోణం వెలుగుచూసిందో.. ఆ క్షణం నుంచే అమెరికా ఆయన్ను చంపేయాలని ఫిక్సైంది. చివరకు ప్రత్యక్షంగా కాకున్నా.. పరోక్షంగా గడాఫీని చంపేయించి.. కసి తీర్చుకుంది. అటు లిబియా ప్రజలు కూడా గడాఫీ పీడ విరగడైందని సంతోషించారు.

అమెరికా వ్యతిరేకతే ఆయుధంగా లిబియా నియంతగా ఎదిగిన గడాఫీ.. ఆ వ్యతిరేకత కారణంగానే ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. మధ్యలో గడాఫీని నయానో భయానో లొంగదీయాలనుకున్న అమెరికా ప్రయత్నాలు ఫలించలేదు. గడాఫీ అమెరికాకు లొంగకపోగా.. ప్రతి విషయంలో లిబియాను యూఎస్‌తో పోల్చడం అంకుల్ శామ్‌కు కంటగింపుగా మారింది. ఈ వైఖరే లిబియాను అతలాకుతలం చేసినా సరే.. గడాఫీని ఓ వర్గానికి స్ఫూర్తినిచ్చేలా చేసింది. అమెరికాకు అత్యంత పెద్ద శత్రువుగా ప్రకటించిన సద్దాం హుస్సేన్‌ను గద్దె దించడానికి 2003లో అమెరికా ఇరాక్‌పై దండయాత్ర చేసింది. అప్పట్లో ఆయనను పట్టుకోవడానికి అమెరికా సైన్యం ఆపరేషన్ రెడ్ డాన్ చేపట్టింది. చివరికి ఆయనను సజీవంగా పట్టుకుని, విచారణ జరిపి 2006లో ఉరితీశారు. సద్దాం హుస్సేన్ సామూహిక విధ్వంసక ఆయుధాలను అభివృద్ధి చేస్తున్నాడని, అల్-ఖైదాతో సంబంధాలు కలిగి ఉన్నాడని అగ్రరాజ్యం ఆరోపించింది. బాత్ పార్టీపై నిషేధంతో సద్దాం అజ్ఞాతంలోకి వెళ్ళాడు. పట్టుబడిన తర్వాత సుదీర్ఘ విచారణ జరిగింది. బాగ్దాద్ సమీపంలోని ఖాద్మియాలోని ఒక కాంపౌండ్‌లో ఉన్న కాంక్రీట్ చాంబర్‌లో సద్దాంను ఉరి తీశారు. అమెరికన్లు ఈ ప్రదేశానికి క్యాంప్ జస్టిస్ అని పేరు పెట్టారు

చివరకు స్వస్థలం టిక్రీట్‌లో సద్దాం 13 డిసెంబర్ 2003లో దొరికిపోయాడు. 1979లో తొలిసారిగా ఇరాక్ పగ్గాలు సద్దాం చేతికి చిక్కాయి. అప్పటి నుంచి 2003లో సైన్యానికి చిక్కేంత వరకు అడపాదడపా అతని పాలన సాగింది. టిక్రీట్‌ సమీపంలోని ఎడ్వార్ పట్టణానికి చెందిన అలా నామిక్‌ వ్యవసాయక్షేత్రంలో చిన్న బంకర్‌లో సద్దాం తలదాచుకున్నట్టు సైనికులకు సమాచారమందింది. అక్కడికి చేరేలోగానే తప్పించుకుంటూ అమెరికన్లను ముప్పుతిప్పలు పెట్టాడు. అతని ఆచూకీ గురించి తెలిసిన అధికారులను లక్ష్యంగా చేసుకుని ఏకంగా 600 ఆపరేషన్లు చేపట్టారు. సద్దాం ఎక్కడ ఉన్నాడో చెప్పాలంటూ 300 మందిని విచారించారు. 1982లో దుజైల్ గ్రామంలో 148 మంది షియా ముస్లింల హత్యకు పాల్పడినందుకు ఇరాకీ స్పెషల్ ట్రిబ్యునల్ విధించిన మరణశిక్షను సద్దాం హుస్సేన్‌కు రెండున్నర దశాబ్దాల తర్వాత అమలు జరిపారు. చివరకు డిసెంబర్ 30, 2006న బగ్దాద్‌లోని క్యాంప్ జస్టిస్ లో సద్దాంను ఉరితీశారు. ఉరి తీసిన ప్రదేశానికి చేరుకున్నప్పుడు సద్దాం తల, మెడను కవర్ చేసేలా నల్లని ముసుగు వేయడానికి సిబ్బంది ప్రయత్నించారు. నేరస్థులను ఉరి తీసేటప్పుడు ఇలాంటి నల్లని వస్త్రాన్ని ముఖం కనిపించకుండా కప్పుతుంటారు. అయితే, సద్దాం మాత్రం దాన్ని కప్పుకోవడానికి ఇష్టపడలేదు. ఆ ముసుగు లేకుండా చనిపోతానంటూ ఆయన దాన్ని తిరస్కరించారు.

ఇరాక్‌లో సద్దాం హుస్సేన్‌ నిరంకుశ పాలన సాగించినా.. అమెరికా ప్రభావం తన దేశంపై పడకుండా కాచుకోవడంలో సక్సెస్ అయ్యాడు. కానీ ఆ వైఖరే అగ్రరాజ్యానికి కంటగింపుగా మారింది. అప్పటికీ సద్దాం హుస్సేన్‌తో చర్చలకు కూడా అమెరికా ప్రయత్నించింది. కానీ ఆయన మాత్రం ఒప్పుకోలేదు. చివరకు మిత్రదేశాలతో నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలించలేదు. చివరకు గల్ఫ్ యుద్ధం చేసినా కూడా అమెరికా సద్దాం హుస్సేన్‌ను పదవీచ్యుతుడ్ని చేయలేకపోయింది. అక్కడే అంకుల్ శామ్ అహం బాగా దెబ్బతింది. ఈ యుద్ధం తర్వాతే ఇరాకీలకు సద్దాం హీరోగా మారిపోయారు. అగ్రరాజ్యాన్ని ఎదురొడ్డి.. నిలవడం సద్దాంకు స్వదేశంలో కొన్నాళ్ల పాటు ఎదురులేకుండా చేసింది. కానీ అలా వచ్చిన మంచి పేరును సద్దాం తన పాలనా విధానాలతో చెడగొట్టుకున్నారు. షియా ముస్లింలపై అకారణ ద్వేషం.. ఆయనపై వ్యతిరేకత పెరిగేలా చేసింది. చివరకు తిరుగుబాట్లు తలెత్తి.. అణచలేని దుస్థితి వచ్చేసింది. అతి కష్టం మీద తిరుగుబాట్లను నియంత్రించినా.. ఆ తిరుగుబాటు గ్రూపులను పూర్తిస్థాయిలో ఇనాక్టివ్ చేయడంలో సద్దాం విఫలమయ్యారు. ఆ కారణంగానే ఇరాక్ పై దండయాత్ర సమయంలో నాటో బలగాలకు కుర్దుసేన బాగా సహకరించి.. సద్దాంను ముప్పుతిప్పలు పెట్టింది. నిజానికి భౌగోళికంగా ఇరాక్ అమెరికన్లకు కొరుకుడుపడదని సద్దాం భావించారు. కానీ స్థానికులైన కుర్దుల్ని ముందుపెట్టి కథ నడిపిన అమెరికా.. చివరకు సద్దాంను సజీవంగా పట్టుకుంది. కాకపోతే చనిపోయే ఆఖరి నిమిషంలో కూడా సద్దాం వ్వవహారశైలి కేవలం ఇరాకీలనే కాకుండా మొత్తం ప్రపంచాన్నీ కదిలించింది. ఉరిశిక్ష ఖాయమని తెలిసిన తర్వాత కూడా సద్దాం అమెరికా వైఖరిని ఎండగట్టడానికి సంకోచించకపోవటం ఆయన అమెరికా వ్యతిరేకతకు పెద్ద ఉదాహరణ.

ప్రపంచవ్యాప్తంగా అమెరికాను ధిక్కరించిన కొందరు దేశాధినేతలు హతమయ్యారు. కానీ కొందరు దేశాధినేతలు జీవితమంతా అమెరికా విధానాల్ని వ్యతిరేకిస్తూ.. చివరి శ్వాస వరకూ అగ్రరాజ్యానికి అంతుచిక్కలేదు. అలాంటి వారిలో క్యూబా నేత ఫిడెల్ క్యాస్ట్రోను ప్రధానంగా చెప్పుకోవాలి. దాదాపు ఐదు దశాబ్దాల పాటు క్యూబాను కనుసైగలతో శాసించిన క్యాస్ట్రో.. అమెరికాకు జీవితాంతం పక్కలో బల్లెంలాగే ఉన్నారు. ఓ దశలో క్యాస్ట్రో ప్రపంచంలో అమెరికా వ్యతిరేక శిబిరానికి నాయకుడిగా గౌరవం అందుకున్నారు. చివరకు క్యాస్ట్రోను చంపటానికి సీఏఐ ఎన్నో విఫలయత్నాలు కూడా చేసింది. అసలు క్యాస్ట్రో పాలన ప్రారంభంలోనే ఆయన కథ ముగించాలని అమెరికా ప్రయత్నించినా.. ఫలితం దక్కలేదు. ఈలోగా క్యూబాలో ఆయన పాలనపై ప్రజల్లోనూ సానుకూల వైఖరి వచ్చింది. క్యూబాను డాక్టర్ల దేశంగా మార్చిన క్యాస్ట్రో.. లాటిన్ అమెరికా దేశాలకు పెద్దన్నగా ఉంటూ.. అడుగడుగునా అమెరికాను ధిక్కరిస్తూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. తనపై జరిగిన హత్యాయత్నాలపైనా జోకులేసిన క్యాస్ట్రో.. అమెరికా సీఏఐకే ఆల్‌ ది బెస్ట్ చెప్పి డేర్ డెవిల్‌గా పేరు తెచ్చుకున్నారు.

ఇక వియత్నాం దిగ్గజం హోచిమిన్ కూడా అమెరికాకు వ్యతిరేకంగానే పోరాటం చేసి.. వియత్నాంకు రూపుదిద్దారు. ఆ తర్వాత కూడా వియత్నాం ప్రజల్లో అమెరికా వ్యతిరేకతను నూరిపోసి.. ఎక్కడా అగ్రరాజ్యం వలకు చిక్కకుండా జాగ్రత్తపడ్డారు. హోచిమిన్ వియత్నాం ప్రజలపై ఎంత బలమైన ముద్ర వేశారంటే.. ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే చిన్న దేశం వియత్నాం అమెరికా సైన్యాన్ని తరిమికొట్టి చరిత్ర సృష్టింఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే చిన్న దేశం వియత్నాం అమెరికా సైన్యాన్ని తరిమికొట్టి చరిత్ర సృష్టించింది. సుదీర్ఘ యుద్ధం చేసినా కూడా అమెరికా చివరకు రిక్తహస్తాలతో వెనుదిరగాల్సి వచ్చిందిచింది. సుదీర్ఘ యుద్ధం చేసినా కూడా అమెరికా చివరకు రిక్తహస్తాలతో వెనుదిరగాల్సి వచ్చింది. ఇప్పటికీ అమెరికన్లకు వియత్నాం యుద్ధం గుర్తొస్తే.. పీడకలలు వస్తాయనడంలో సందేహం లేదు.

ఇక క్యూబా దిగ్గజం క్యాస్ట్రో స్ఫూర్తితో వెనిజువెలాలో చావెజ్ అమెరికా వ్యతిరేకతను ఆయుధంగా ఉపయోగించుకుని.. స్వదేశంలో హీరో ఇమేజ్ తెచ్చుకున్నారు. వెనిజువెలాకు చమురుపై వచ్చిన ఆదాయాన్ని ప్రజా సంక్షేమానికి ఖర్చుచేయటం ఆయనకు తిరుగులేని ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఎప్పుడైనా అవసరమైతే.. క్యూబా క్యాస్ట్రో సూచనలు, సలహాలు తీసుకోవడం కూడా చావెజ్ కు కలిసొచ్చింది. చావెజ్‌ పై అనుకూలతతో పోలిస్తే వ్యతిరేకత చాలా తక్కువ కావడంతో.. ఆయన ఉన్నంతవరకూ వెనిజువెలాలో అమెరికా ఆటలు సాగలేదు. ఇప్పుడు నికోలస్ మదురో చావెజ్ అనుచరుడే అయినా.. పాలనలో మాత్రం భిన్నవైఖరి తీసుకుని.. వ్యతిరేకత మూటగట్టుకున్నాడు. అందుకే సొంత గార్డులే అమెరికాకు అమ్ముడుపోయి.. మదురోను పట్టింటారు. అదే చావెజ్ హయాంలో ఆయన కోసం ప్రాణాలివ్వటానికి సామాన్యులు కూడా ముందుకొచ్చేంత ఇమేజ్ ఉండేది. లాటిన్ అమెరికా దేశాలకు క్యాస్ట్రో తర్వాత చావెజ్ రూపంలో ఆశాకిరణం కనిపించింది. క్యాస్ట్రో వయోభారంతో కొన్ని సమావేశాలకు వెళ్లలేక తన ప్రతినిధిగా చావెజ్‌ను పంపించేంతగా ఆయన ఇమేజ్ పెరిగింది. పెరుగుతున్న చావెజ్ ఇమేజ్.. అమెరికాకు కంటిగింపుగా మారుతున్నా.. ఏమీ చేయలేక చేష్టలుడిగి చూస్తుండిపోవాల్సి వచ్చింది. అలా తిరుగులేని నేతలుగా తమ దేశాల్లో చక్రం తిప్పిన ఈ దిగ్గజాలు అమెరికాను అడుగడుగునా అడ్డుకుంటూ.. తమ దేశ వ్యవహారాల్లో జోక్యానికి అమెరికా జంకేలా చేశారనడంలో సందేహం లేదు.

అలాగని వీరిని గద్దె దించటానికి అమెరికా అసలు ప్రయత్నాలు చేయలేదని కాదు. కాకపోతే చేసిన ప్రతిసారీ చేతులు కాల్చుకుంది. ఏదో రకంగా దెబ్బతీయటానికి ప్రయత్నించినా భంగపడింది. చివరకు వారి ఇమేజ్‌ను పాడుచేసే కుట్రలకు కూడా పాల్పడింది. కానీ తిరుగులేని ప్రజాదరణ కారణంగా ఈ దిగ్గజాలు అగ్రరాజ్యానికి విజయవంతంగా ఎదురొడ్డి నిలిచారు. కడదాకా అమెరికాను ధిక్కరించి పోరాట యోధులుగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పటికీ అమెరికాను వ్యతిరేకించే, వ్యతిరేకించాలనుకునే దేశాలు, దేశాధినేతలకు వీరే ఆదర్శం అనడంలో సందేహం లేదు. అమెరికాను దెబ్బకొట్టాలంటే క్యాస్ట్రోలా ఆలోచించాల్సిందేననే విషయం అగ్రరాజ్యం శత్రువులంతా ఒప్పుకునేదే. అలాగే బలహీన దేశంలోనూ తిరుగులేని నేతగా ఎదిగి అమెరికాను ఎలా సవాల్ చేయాలో చావెజ్‌ ను చూసి నేర్చుకోవాలి. ఇక హోచిమిన్‌ సాధించింది మామూలు విజయం కాదు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాన్ని.. ఓ చిన్న దేశం సుదీర్ఘకాలం యుద్ధంలో ముప్పుతిప్పలు పెట్టి చివరకు తోక ముడిచేలా చేయడం అసాధారణం. ఆ ఫీట్ వెనుక ఉన్న స్ఫూర్తి, సిద్ధాంత శక్తి హోచిమిన్.

మొత్తం మీద అమెరికా ఎంత అగ్రరాజ్యమైనా.. ఆ దేశాన్ని అంతే బలంగా ఎదిరించిన దేశాధినేతలు లేకపోలేదు. కానీ అమెరికా తన వ్యతిరేకులందర్నీ ఏరేసే ఉద్దేశంతో ఎన్ని యుద్ధాలు చేసినా.. అమెరికా వ్యతిరేక భావజాలాన్ని పూర్తిస్థాయిలో లేకుండా చేయడం అసాధ్యం. ఎందుకంటే యుద్ధాలు ఎప్పుడూ కొత్త సమస్యలకే దారితీస్తాయి కానీ.. పరిష్కారాలు చూపలేవు. దీనికి తోడు అమెరికా ఆడుతున్న ప్రమాదకరమైన క్రౌన్ గేమ్.. అటు తిరిగి ఇటు తిరిగి ఆ దేశానికే ముప్పుగా పరిణమిస్తుందని ఇప్పటికే ఇరాక్, అఫ్గాన్ ఉదాహరణలు చాటిచెప్పాయి. చిన్న సమస్యను తప్పించపోయి.. పెద్ద సమస్యను అమెరికానే కొనితెచ్చుకుంటుంది. ఇప్పుడు ఖమేనీ హతమైనంత మాత్రాన.. మరో ఖమేనీ పుట్టుకురారని, మరింత మంది దేశాధినేతలు అమెరికాను వ్యతిరేకించబోరనే గ్యారంటీ ఏమీ లేదు. అమెరికా ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోకపోతే.. ఎన్ని యుద్ధాలు చేసినా.. కొత్త శత్రువులు పుడుతూనే ఉంటారని గుర్తుపెట్టుకోవాలి.

Exit mobile version