Story Board : పెట్రోల్ భారం.. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. ఆర్థిక వ్యవస్థ ఎటు వైపు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Story Board : దేశంలో పెట్రోల్ మంటలు ఆందోళన కలిగిస్తున్నాయి. దశల వారీగా పెరుగుతున్న పెట్రోల్ ధరలు ఆర్థిక వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపే అవకాశాలున్నాయి. పెట్రోల్ ధరల పెంపుతో.. నిత్యావసరాల ధరలు కూడా పెరుగుతాయి. అప్పుడు ద్రవ్యల్బణం పెరిగి.. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. ఇది అంతిమంగా ఆర్థిక మాంద్యానికి దారితీస్తుంది. ఆ లెక్కన ప్రస్తుత పెట్రోల్ ధరల పెంపును మాంద్యానికి ప్రారంభ సూచనగా చూడాలంటున్నారు నిపుణులు. మరోవైపు పెట్రోల్ ధరలు ఇంకా పెరుగుతాయనే సంకేతాలు మరింతగా భయపెడుతున్నాయి.
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్ ధరపై 2 రూపాయల 61 పైసలు, లీటర్ డీజిల్‌పై 2 రూపాయల 71 పైసలు ధర పెరిగింది. పెంచిన ధరలు సోమవారం ఉదయం నుంచే అమల్లోకి వచ్చేశాయి. ఈ పెంపుతో పదకొండు రోజుల వ్యవధిలో నాలుగోసారి పెట్రోల్ ధరలు పెరిగినట్టైంది. కొన్నేళ్లుగా స్థిరంగా ఉన్న పెట్రోల్ ధరలకు.. ఇరాన్ యుద్ధం వచ్చిన దగ్గర్నుంచి రెక్కలొచ్చాయి. అయితే మన దగ్గర ఐదు రాష్ట్రాల ఎన్నికలుండటంతో.. పెంపును 78 రోజుల పాటు వాయిదా వేసిన ఆయిల్ కంపెనీలు.. ఇప్పుడు వరుసపెట్టి దశలవారీగా పెట్రోల్ బాదుడు మొదలుపెట్టాయి. దీంతో సామాన్యులపై ఇప్పటికే ఇంధన భారం పెరిగింది. ఇది చాలదన్నట్టుగా పెట్రోల్ ధరల పెంపు ప్రభావం నిత్యావసరాలపై పడితే.. ద్రవ్యోల్బణానికి రెక్కలొస్తాయి. అదే జరిగితే ఇప్పటికే జనం చేతిలో డబ్బుల్లేకపోవడంతో.. సామాన్యుడి కొనుగోలు శక్తి మరింతగా పడిపోతుంది. అప్పుడు ఆర్థిక వ్యవస్థలో లావాదేవీలు జరగక.. మాంద్యం వస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రస్తుత దశల వారీ పెట్రోల్ ధరల పెంపునే మాంద్యానికి తొలిదశగా పరిగణించాలనే హెచ్చరికలు వస్తున్నాయి.
Also Read
- Story Board: ఎల్‌నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
- Story Board : స్వతంత్ర భారత ప్రస్థానం ఎలా ఉంది..? ఇన్నేళ్లలో మనం ఏం సాధించాం..?
- Story Board : అమిత్ షా రాజీనామాకు రాహుల్ పట్టు.., కీలక బిల్లుల ముంగిట పార్లమెంట్ దారెటు?
- Story Board : తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన SIR ప్రక్రియ.. గందరగోళం మధ్యే డిజిటలైజేషన్
నిజానికి ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు శనివారమే పెట్రోల్ ధరను 87 పైసలు, డీజిల్ ధరను 91 పైసల చొప్పున పెంచాయి. మళ్లీ కేవలం.. రెండు రోజుల వ్యవధిలో.. సోమవారం మళ్లీ ఇంధన ధరలను పెంచడం ఆందోళన కలిగిస్తోంది. పశ్చిమాసియా యుద్ధం, ఇంధన కొరత, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరల పెరుగుదల తరుణంలో నష్టాన్ని పూడ్చుకునేందుకని ఆయిల్ కంపెనీలు మే 15వ తేదీ నుంచి వరుసగా నాలుగు రోజులకోసారి ధరలను పెంచాయి. తాజాగా సోమవారం నాటి పెంపుతో రెండు వారాల్లోనే ఇంధన ధరలు నాలుగోసారి పెరగడంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా, పెట్రోల్‌పై లీటరుకు రూ. 24 వరకు, డీజిల్‌పై లీటరుకు రూ. 30 వరకు ధరల వ్యత్యాసాన్ని పరోక్షంగా భరించారనే వాదన ఇప్పటికే ఉంది. 2021, 2024 మధ్య కాలంలో చమురు సంస్థలు రూ. 24,500 కోట్ల మేర నష్టాలను చవిచూశాయని, ఎల్ పీజీ వినియోగదారులకు ఉపశమనం కలిగించడానికి 2024-25లో రూ. 40,000 కోట్ల భారాన్ని భరించామని పేర్కొన్నాయి. మే 15 న లీటర్ కు రూ. 3, మే 19 న 90 పైసలు ధర పెరగ్గా.. మే 23 న పెట్రోల్ పై 87 పైసలు పెరిగింది. ఈ పెంపు చాలదన్నట్టుగా మే 25న మళ్లీ లీటర్ పై రూ.2.61 పైసలు వడ్డించారు. మొత్తంగా చూస్తే ఈ 11 రోజుల్లో లీటర్ ఇంధనంపై దాదాపు రూ. 8 భారం పెరిగింది. దీంతోపాటు దిల్లీ లాంటి నగరాల్లో సీఎన్జీ ధర కిలోకు రూ. 1 మేర పెరిగింది.
ఇక గత పన్నెండేళ్లలో పెరిగిన పెట్రోల్ ధరను చూస్తే.. ఏకంగా 43 శాతం పెంపు కనిపిస్తోంది. 2014లో లీటర్ పెట్రోల్ ధర రూ.71, రూ.72 మధ్య కదలాడింది. అయితే 2016లో క్రూడ్ ధర 110 డాలర్ల నుంచి 31 డాలర్లకు పడిపోయింది. కానీ దేశంలో ధరలు మాత్రం తగ్గించలేదు. పైగా ఎక్సైజ్ డ్యూటీ పెంచి.. ద్రవ్యలోటు పూడ్చుకున్నారు. ఇక 2017 నుంచి పెట్రోల్ ధరల విషయంలో రోజువారీ సవరణ విధానం అమల్లోకి వచ్చింది. 2017-19 మధ్య కాలంలో పెట్రోల్ సగటు ధర రూ.68 నుంచి రూ.74 మధ్య ఉంది. అప్పట్లో ప్రపంచ చమురు మార్కెట్లలో స్వల్పంగా రికవరీ కనిపించింది. దానికి అనుగుణంగానే మన దేశంలోనూ పెట్రోల్ ధరలున్నాయి. ఇక కరోనా వచ్చిన 2020-21 సమయంలో ప్రపంచ చమురు డిమాండ్ భారీగా పడిపోయినా.. మన దగ్గర మాత్రం ధర తగ్గలేదు. అప్పుడు కూడా మరోసారి ఎక్సైజ్ డ్యూటీ పెంచారు. ఇక 2021లో చమురు డిమాండ్ పెరగడంతో.. దేశంలో ప్రధాన మెట్రో నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర తొలిసారి రూ.100 మార్క్ దాటి రికార్డులు సృష్టించింది. అయితే ఆ తర్వాత 2022-25 మధ్యకాలంలో ఉక్రెయిన్ యుద్ధం కారణంగా.. రెండుసార్లు ఎక్సైజ్ డ్యూటీ తగ్గించారు. తద్వారా లీటర్ పెట్రోల్ ధర రూ.18 తగ్గి.. ద్రవ్యోల్బణం అదుపులో ఉండటానికి సహాయపడింది. ఈ కారణంగా మెట్రో నగరాల్లో పెట్రోల్ సగటు ధర రూ.96 నుంచి 100 మధ్యే కదలాడింది. కానీ ఈ ఏడాది మాత్రం ప్రపంచ చమురు మార్కెట్ ఆకాశమే హద్దుగా దూసుకెళ్లింది. ఇరాన్ యుద్ధంతో.. పశ్చిమాసియాలో సంక్షోభం వచ్చి.. ప్రపంచం మొత్తానికీ చమురు రవాణాకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. దీంతో క్రూడ్ ఆయిల్ ధర కూడా భారీగా పెరుగుతూ వచ్చింది. అప్పటికీ దేశంలో పెట్రోల్ ధర అదుపులో ఉంచటానికి ఎక్సైజ్ సుంకాన్ని లీటర్‌కు రూ.10 మేర తగ్గించినా.. దేశీయ చమురు కంపెనీలకు నష్టాలు తప్పలేదు. దీంతో ఇక తప్పనిసరై మాత్రమే పెట్రోల్ రేట్లు దశలవారీగా పెంచుతున్నామని ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. కానీ ఈ పెంపు మాత్రం మన ఆర్థికవ్యవస్థపై దుష్ప్రభావం చూపడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.
దేశంలో ఇంధన ధరలు మరోసారి పెరగడంతో సామాన్య ప్రజలకు అదనపు భారం తప్పడం లేదు. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.12కు చేరుకోగా, డీజిల్ ధర రూ.95.20కు పెరిగింది. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ.115.58కు చేరుకోగా, డీజిల్ ధర రూ.103.74కు పెరిగింది. అలాగే విజయవాడలో పెట్రోల్ ధర రూ.117.19, డీజిల్ ధర రూ.104.88కు చేరింది. ఇంధన ధరల పెరుగుదల వెనుక అంతర్జాతీయ పరిణామాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. చమురు సరఫరాలో అంతరాయాలు ఏర్పడే అవకాశాలు ఉండటంతో గ్లోబల్ మార్కెట్లో ధరలు ఎగబాకుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ముడి చమురు ధరల ప్రభావాన్ని చమురు మార్కెటింగ్ సంస్థలు నేరుగా వినియోగదారులపై మోపుతున్నాయి. ఇంధన ధరల పెరుగుదల ప్రభావం కేవలం వాహనదారులపైనే కాకుండా రవాణా ఖర్చులు, నిత్యావసర వస్తువుల ధరలపై కూడా పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక రాబోయే రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు ఎలా ఉంటాయనేదానిపై ఇంధన ధరల భవిష్యత్ ఆధారపడి ఉండనుంది. ధరల పెరుగుదల ఇలాగే కొనసాగితే సామాన్య ప్రజలపై మరింత ఆర్థిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇది దేశంలో సామాన్యుడి జీవన ప్రమాణాన్ని దెబ్బతీస్తుంది. మరీ ముఖ్యంగా కరోనా తర్వాత నాలుగైదేళ్ల పాటు మన ఆర్థిక వ్యవస్థలో కనిపించిన సానుకూల సంకేతాలు.. ఇప్పటికే రివర్స్ అవుతున్నాయనే అభిప్రాయాలు అందర్నీ భయపెడుతున్నాయి. మొదట్నుంచీ మన ఆర్థిక వ్యవస్థ పెట్రోల్ ధరల విషయంలో ఓవర్ సెన్సిటివ్‌గానే ఉంటోంది. ఇప్పుడీ దశల వారీ పెంపు.. అంతకు మించి భవిష్యత్తులోనూ పెట్రో భారం తప్పదనే అంచనాలు.. ఆర్థిక వ్యవస్థ సెంటిమెంట్ దెబ్బతీసే అవకాశాలున్నాయి. మరోవైపు ఇరాన్ తో అమెరికా శాంతి ఒప్పందం ఖరారైనా కూడా.. వెంటనే పెట్రోల్ ధరలు తగ్గే అవకాశాల్లేవని నిపుణులు చెబుతున్నారు. అంటే సమీప భవిష్యత్తులో పెట్రోల్ మంటలే కానీ.. ఉపశమనం ఉండబోదనే సంకేతాలు గట్టిగానే వస్తున్నాయి.
- Tags
- ntv
- petrol
- story board
తాజావార్తలు
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్‌లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
-
Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఫైర్
-
School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!