Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Story Board Story Board About India Assembly Elections 2026 Wb Tn Kerala Assam Puducherry Poll Predictions Analysis

Story Board: ఆ ఐదు రాష్ట్రాల్లో గెలుపెవరిది..?

Published Date :March 19, 2026 , 9:56 pm
By Sudhakar Ravula
Story Board: ఆ ఐదు రాష్ట్రాల్లో గెలుపెవరిది..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Story Board: లోక్‌ సభ ఎన్నికలు జరిగి సరిగ్గా రెండేళ్లు పూర్తయ్యాయి. మరో మూడేళ్లలో మళ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. అంటే వరుసగా మూడోసారి అధికారంలో కొనసాగుతున్న ఎన్డీఏ కూటమి పాలనకు దాదాపుగా సగం పూర్తైనట్టే. ఈ సమయంలో జరుగుతున్న రాష్ట్రాల ఎన్నికల్లో వచ్చే ఫలితాలు.. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు మూడ్‌ను నిర్దేశించవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటిదాకా రాష్ట్రాల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మెజార్టీ విజయాలు సాధించినా.. ఈసారి ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో విపక్ష పాలిత రాష్ట్రాలు కావడం.. అందులోనూ బీజేపీకి పట్టున్న రాష్ట్రాలు తక్కువగా ఉండటంతో.. ఈ ఎన్నికల ఫలితాలు అందరిలో ఆసక్తి రేపడం ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్రాల వారీగా ఎన్నికల పోరు చూస్తే.. అసోంలో మాత్రమే కాంగ్రెస్, బీజేపీ ముఖాముఖి పోటీ పడుతున్నాయి. బెంగాల్ లో బీజేపీ టీఎంసీ, కేరళలో కాంగ్రెస్ , లెఫ్ట్ కూటములు.. తమిళనాడులో త్రిముఖ పోటీ ఉంది. ఈ ఎన్నికలు కేవలం స్థానిక ప్రభుత్వాల మార్పుకే పరిమితం కాకుండా, కేంద్ర రాజకీయాల్లోనూ మార్పులు తీసుకురానున్నాయి. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం ఉన్న రాష్ట్రాల్లో జాతీయ పార్టీలు ఏ మేరకు పాగా వేస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పశ్చిమ బెంగాల్ పోరు మళ్ళీ దీదీ వర్సెస్ మోడీ గా మారింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ తన పదిహేనేళ్ల సంక్షేమ పథకాలు ,బెంగాలీ అస్తిత్వాన్ని నమ్ముకోగా, బీజేపీ అవినీతి , ప్రజల అసంతృప్తిని ప్రధాన అస్త్రాలుగా చేసుకుని బరిలోకి దిగుతోంది. గత ఎన్నికల కంటే ఈసారి బీజేపీ మరింత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండటంతో, బెంగాల్‌ గడ్డపై హోరాహోరీ పోరు తప్పేలా లేదు. ఇక్కడ చిన్నపాటి ఓట్ల చీలిక కూడా ఫలితాలను తలకిందులు చేసే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో నందిగ్రామ్‌లో దీదీకి ఓటమి రుచి చూపించిన సువేందు అధికారి.. ఈసారి భవానీపూర్‌లో మమతను ఢీకొడుతున్నారు.

రాష్ట్రాల ఎన్నికలు అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్​ పార్టీకి సవాల్​గా మారాయి. ప్రస్తుతం అసోం, పుదుచ్చేరిలో మాత్రమే బీజేపీ కూటమి అధికారంలో ఉంది. ప్రధానమైన కీలక రాష్ట్రాలు కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌‌‌‌లను బీజేపీయేతర పార్టీలు పాలిస్తున్నాయి. ఈ రాష్ట్రాల్లోని అధికార పార్టీలు కాంగ్రెస్​ సారథ్యంలోని ఇండియా కూటమికి మిత్రపక్షాలుగా వ్యవహరిస్తున్నాయి. ఇక్కడ మొత్తం పార్లమెంటు నియోజకవర్గాలను పరిగణనలోకి తీసుకుంటే 116 మంది ఎంపీలు ఉన్నారు. కానీ, 2024 లోక్‌సభ ఎన్నికల్లో వీటిలో బీజేపీ 24 మంది ఎంపీలను మాత్రమే గెలుచుకుంది. అధికసంఖ్యలో 92 మంది ఎంపీలను ఇండియా అలయన్స్ గెలుచుకుంది. దీంతో 2029 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీకి ఈ ఎన్నికలు అతి పెద్ద పరీక్ష కాబోతున్నాయి. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌‌‌‌లో ఎదగడానికి, అధికారంలోకి రావడానికి బీజేపీ నిరంతరంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇండియా కూటమిలోని మిత్రపక్షాలు ఆధిపత్యం చెలాయించే ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేక పోరాటం చేస్తోంది. 2024 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ సొంతంగా అధికారం చేపట్టలేని పేలవమైన ఫలితాలు వచ్చినప్పటికీ… హర్యానా, మహారాష్ట్ర, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో గొప్ప విజయాలు సాధించడమే కాకుండా తొలిసారి ముంబై నగరాన్ని కూడా కైవసం చేసుకుంది. ఈ ఊపులోనే ఇప్పుడు కూడా సత్తా చాటి.. దేశవ్యాప్తంగా తమకు పట్టుందని నిరూపించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. అదే సమయంలో తమకు బలం ఉన్న రాష్ట్రాల్లో విజయం సాధించి.. ఎన్డీఏను నిలువరించాలనేది ఇండియా కూటమి పట్టుదలతో ఉంది.

అసోం, కేర‌ళ‌, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. త‌మిళ‌నాడులో ఏప్రిల్ 23న ఎన్నిక‌లు జ‌రుగుతాయి. ప‌శ్చిమబెంగాల్‌లో మాత్రం ఏప్రిల్ 23, 29న రెండు ద‌శ‌ల్లో ఎన్నిక‌లు జ‌రుగుతాయి. అన్ని చోట్లా ఫలితాలు మాత్రం మే 4న వెలువ‌డ‌నున్నాయి. కాంగ్రెస్‌‌‌‌ కేరళలో గెలిచి అసోంలో తన సంఖ్యను మెరుగుపరుచుకుంటే సరిపోతుంది. కానీ, మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్​లో, స్టాలిన్​ తమిళనాడులో తప్పక గెలిచి అధికారాన్ని నిలబెట్టుకోవాలి. ఓటమిపాలైతే అది వారికి పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది. అంతేకాకుండా దీదీ, స్టాలిన్​ ఓటమి.. ఇండియా కూటమికి కూడా పెద్ద ఓటమిగా నిలుస్తుంది. ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నామమాత్రమే కావడంతో.. ఉత్తరాది మాదిరిగా ఇక్కడ మిత్రులకు కాంగ్రెస్‌పై ఓటమి నెపం నెట్టేసే అవకాశం లేదు. బెంగాల్‌లో మమతా బెనర్జీ 2011 నుంచి వరుసగా మూడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. మరోసారి ఆమె అధికారాన్ని నిలబెట్టుకుంటే ఇది వరుసగా ఆమెకు నాలుగో విజయం అవుతుంది. ప్రస్తుతం రాజకీయ పరిస్థితిని పరిశీలిస్తే మమతా బెనర్జీ విజయం ఖాయం అనేది టీఎంసీ అంచనా. పార్లమెంటు ఎన్నికల్లో టీఎంసీ భారీ విజయం సాధించిన తరుణంలో..బెంగాల్‌‌‌‌లో 30 శాతం కంటే ఎక్కువ ముస్లిం జనాభా ఉండటం కూడా మమతకు ఆధిపత్యం తెచ్చిపెడుతుందని ఆమె లెక్కలేసుకుంటున్నారు. ముస్లిం పాపులేషన్​ దాదాపు 100 అసెంబ్లీ నియోజకవర్గాలను ఆధిపత్యంలో ఉంది. 2021లో 100 నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు 30 కంటే ఎక్కువమంది ఉన్నారు. మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ వాటన్నింటినీ గెలుచుకుంది. మరోసారి ఆ ఫీట్ రిపీట్ చేయటం కష్టం కాదనేది దీదీ ఆలోచన.

కానీ బెంగాల్లో బీజేపీని తక్కువ అంచనా వేయటానికి గత ఎన్నికల్లో అనూహ్యంగా 77 సీట్లు గెలిచిన బీజేపీ.. ఏకంగా దీదీనే ఓడించి సంచలనం సృష్టించింది. అదే ఊపులో ఈసారి అధికారాన్ని ఒడిసిపట్టాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే బెంగాల్లో జరిగిన సర్‌పై రాజకీయ దుమారం రేగింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన గంటల వ్యవధిలో బెంగాల్లో కీలక అధికారుల మార్పు, కేంద్ర బలగాల మోహరింపుపైనా భిన్నాభిప్రాయాలున్నాయి. ఈసారి బీజేపీ తమ సంఖ్యాబలాన్ని మెరుగుపరుచుకుంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. తమిళనాడులో ప్రధాన పోటీ డీఎంకే, అన్నాడీఎంకే మధ్యే ఉన్నా.. ఇప్పుడు కొత్తగా రంగంలోకి వచ్చిన విజయ్‌ సాధించే ఓట్ల శాతంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. అదే సమయంలో ఆయన ఏ పార్టీ ఓట్లు చీల్చుతారనేది కూడా చూడాల్సి ఉంది. ప్రస్తుతం డీఎంకే 20 పార్టీలతో పొత్తు పెట్టుకుంది. తమిళనాడులో అధికార డీఎంకేకు ఎదురునిలిచే ప్రతిపక్షం విభజనకు గురైంది. ప్రముఖ నటుడు విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించడం తమిళనాడు ఎన్నికలకు అనిశ్చితిని జోడించింది. నటుడు విజయ్ డీఎంకే నుంచి ఓట్లను కొల్లగొట్టవచ్చని బీజేపీ కూటమి విశ్వసిస్తోంది. కానీ, తమిళనాడు ఓటర్లు నటుడు విజయ్ పట్ల ఎలా స్పందిస్తారో అనేది ఇంకా అస్పష్టంగానే ఉంది.

తమిళనాడులో అతిపెద్ద పరిణామం ఏమిటంటే డీఎంకే, అన్నాడీఎంకే రెండింటి మిత్రపక్షాలతో సహా అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వంలో భాగస్వామ్యాన్ని కోరుతున్నాయి. ప్రస్తుతానికి డీఎంకే కూటమి ముందంజలో ఉన్నట్లు కనిపిస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లోనూ తమిళనాడులోని 39 పార్లమెంటు స్థానాలను డీఎంకే కూటమే గెలుచుకుంది. మరోవైపు పార్టీ పునాదులు, పటిష్ఠ ఓటుబ్యాంకు సాయంతో పవర్లోకి రావాలని అన్నాడీఎంకే ప్రయత్నిస్తోంది. ఇందుకు బీజేపీ కూడా సహకారం అందిస్తోంది. కానీ విజయ్ ఓట్లే కీలకమౌతాయనే అంచనాలు ఏ పార్టీకి పూర్తి ధీమాను ఇవ్వలేకపోతున్నాయి. అసోం బీజేపీ పాలిత రాష్ట్రం. ఇక్కడ బీజేపీ బలంగా కనిపిస్తోంది. అయితే, బీజేపీ అస్సాంలో గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నందున ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ రాజకీయంగా బలపడ్డారు. కానీ అసోంలో 32 శాతం మైనారిటీ జనాభా ఉంది. మైనారిటీ ఓటర్లు సాధారణంగా బీజేపీ వ్యతిరేకులు. దీంతో బీజేపీకి గెలుపు అంత తేలిక కాదనే ఉద్దేశంతో.. గౌరవ్ గొగోయ్ నేతృత్వంలో కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది.

అసోం చిన్న రాష్ట్రమైనప్పటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఇది రాజకీయంగా కీలకమైనది. ఎందుకంటే ప్రస్తుతం ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో.. బీజేపీ అధికారంలో ఉన్నది కేవలం అసోంలో మాత్రమే. బీజేపీ అధికారం నిలబెట్టుకోవాలంటే అసోంను గెలవాలి. ప్రస్తుతానికి ఇక్కడ బీజేపీ గెలుపు ఖాయమనే అంచనాలున్నా.. పోలింగ్ నాటికి ఏమైనా జరగొచ్చనే వాదన కూడా వినిపిస్తోంది. కాంగ్రెస్ కొంతకాలంగా రాజకీయ దూకుడు పెంచడంతో.. ఆ పార్టీకి అసోంలో ఉన్న పునాదులు దృష్టిలో పెట్టుకుని.. హస్తం అవకాశాల్ని పూర్తిగా కొట్టిపారేయలేని స్థితి. అక్రమ వలసల్ని ఆయుధంగా మలుచుకుని బీజేపీ కాంగ్రెస్‌పై పైచేయి సాధించే ప్రయత్నం చేస్తోంది. ఈ విషయంలో హిమంత గౌరవ్ గొగోయ్‌ను పూర్తిస్థాయిలో డిఫెన్స్‌లోకి నెట్టడానికి తీవ్రంగా ప్రయత్నించారు. అయితే గౌరవ్ దీటుగా కౌంటర్లు ఇవ్వడంతో.. ఓటర్లు ఏం చేస్తారనేది తేలాల్సి ఉంది. మొత్తం మీద అసోంలో రెండు జాతీయ పార్టీల ప్రధాన శక్తులుగా ఉండటంతో.. పోటీ గట్టిగానే ఉంటుందనేది పరిశీలకుల అంచనా.

అసోం సీఎం హిమంత బిస్వ శర్మ సారథ్యంలో బిజెపి ధీమాగా ఉంది. మహాజోత్ కూటమి విచ్ఛిన్నం కావడం బిజెపికి కలిసి వచ్చే అంశం. కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ తన వ్యక్తిగత చరిష్మాతో బిజెపికి గట్టి పోటీ ఇస్తున్నారు. అయితే, అభివృద్ధి మంత్రం , హిందూత్వ కార్డుతో బిజెపి పైచేయి సాధించే అవకాశాలు ఉన్నాయని ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. కేరళంలో బీజేపీ పెద్దగా పురోగతి సాధించి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం కేరళంలో బీజేపీకి 15 శాతం ఓట్లు ఉన్నాయి. అదేవిధంగా మరో 15 శాతం సానుభూతి ఓట్లు కూడా ఉన్నాయి. కేరళంలో ప్రధాన ప్రత్యర్థులు యూడీఎఫ్, ఎల్డీఎఫ్ మాత్రమే. క్రైస్తవులు, ముస్లింలు ప్రధానంగా కాంగ్రెస్ కూటమికి మద్దతు ఇస్తున్నారు. అయితే 60 శాతం ఉన్న హిందువులు లెఫ్ట్, బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఒకవేళ కాంగ్రెస్‌‌‌‌ను ఓడించడానికి బీజేపీ శ్రేణులు, హిందూ ఓటర్లు వ్యూహాత్మకంగా ఓటింగ్ చేయాలని భావిస్తే అది సీపీఎంకు కలిసొచ్చే అవకాశం అవుతుంది. మరోవైపు సీపీఎం కూటమి బలోపేతమైతేనే అధికారం నిలబెట్టుకుంటుంది. ఎందుకంటే ప్రస్తుతం కేరళలో కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అందువల్ల కేరళలో బీజేపీ అవకాశాలు పరిమితంగా ఉన్నాయి. కాంగ్రెస్ కూటమి విజయం సాధిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, కేరళలో కాంగ్రెస్​ పార్టీకి కుమ్ములాటలే ప్రధాన సమస్య కావచ్చు. ఇక్కడ బీజేపీ నిలకడగా బలం పెంచుకుంటూ వస్తోంది. మొదటిసారిగా తిరువనంతపురం కార్పొరేషన్‌ను కూడా దక్కించుకుని జోష్‌లో కనిపిస్తోంది. కానీ దశాబ్దాలుగా పాతుకపోయిన యూడీఎఫ్‌, ఎల్డీఎఫ్‌ కూటముల్ని కేరళం ఓటర్లు వదులుకునే ప్రసక్తి లేకపోయినా.. ఈసారి బీజేపీ చీల్చే ఓట్లే విజేతను డిసైడ్ చేయొచ్చనే అంచనాలు లేకపోలేదు.

సాధారణంగా కేరళంలో ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారుతుంటుంది, కానీ గత ఎన్నికల్లో పినరయి విజయన్ ఆ సంప్రదాయాన్ని చెరిపివేశారు. ఇప్పుడు ఎల్.డి.ఎఫ్ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధించాలని చూస్తోంది. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని పట్టుదలతో ఉంది. బిజెపి ఇక్కడ బలమైన మూడో శక్తిగా ఎదగడానికి ప్రయత్నిస్తోంది. త్రిముఖ పోటీ జరిగే కొన్ని నియోజకవర్గాల్లో బిజెపి ఓట్లు ఎవరిని ముంచుతాయో అన్నది కీలకం. ప్రతి రాష్ట్రంలోనూ స్థానిక సమస్యలతో పాటు జాతీయ అంశాలు కూడా ఓటర్లపై ప్రభావం చూపుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు అటు అధికార పక్షానికి, ఇటు విపక్ష కూటమికి అత్యంత ప్రతిష్టాత్మకం కానున్నాయి. ఈ ఎన్నికల తీర్పు భారత రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే అవకాశం ఉంది. మొత్తం మీద నాలుగు రాష్ట్రాల్లో ఒక్కోచోట ఒక్కో రకంగా కనిపిస్తున్న రాజకీయ సమీకరణాలు.. ఉత్కంఠకు దారితీస్తున్నాయి. గతానికి భిన్నంగా ఈసారి తనకు అంతగా పట్టులేని ప్రతి రాష్ట్రంలోనూ బీజేపీ ఎంతోకొంత పోటీ ఇవ్వటానికి ప్రయత్నించడం కీలక పరిణామంగా చూస్తున్నారు. ఓవైపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు రాష్ట్రాల్లో ఓట్లు తగ్గుతున్న తరుణంలో.. తమ ఓటుబ్యాంకు పెంచుకోవటానికి ఇదే అదను అని బీజేపీ భావిస్తోంది. కానీ కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ బీజేపీ బలమైన ప్రత్యామ్నాయంగా ఎదగలేకపోతోంది. కాకపోతే ఫలితాలతో సంబంధం లేకుండా ఎన్నికల్లో కడదాకా పోరాడటంలో ఆరితేరిన బీజేపీ.. ప్రత్యర్థులకు విజయం కేక్‌వాక్‌ కాదని నిరూపించే ప్రయత్నంలో ఉంది. గత లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణాది నుంచి ఎక్కువ సీట్లు ఆశించిన బీజేపీ.. ఆ మేరకు ఫలితాలు సాధించలేకపోయింది. కానీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణాది నుంచి మెరుగైన సీట్లు రావాల్సిందేనని భావిస్తున్న బీజేపీ.. అందుకు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో పునాదులు వేసుకోవాలనే ఉద్దేశంతో కనిపిస్తోంది.

పుదుచ్చేరిలో బీజేపీ కూటమి సీఎం ఎన్. రంగస్వామి ప్రభావం ఉంది. బలమైన పరిపాలనా వ్యవస్థ, ఓటర్ల బేస్​ను బట్టి బీజేపీ కూటమి పుదుచ్చేరిని నిలుపుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో పుదుచ్చేరిలో ఏకైక ఎంపీ స్థానం దక్కించుకున్న కాంగ్రెస్.. పూర్తిగా ఆశలు వదులుకోలేదు. పుదుచ్చేరిలో ఎవరు గెలిచినా.. ఆ ప్రభావం పెద్దగా ఉండదనేది చరిత్ర చెబుతున్న సత్యం. మోడీ కొన్నాళ్లుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న బెంగాల్, తమిళనాడు, కేరళలో బీజేపీ బలం పుంజుకోవటం చాలా అవసరం. ఈ మూడు రాష్ట్రాల్లో ఒక్కచోట గెలిచినా.. తాము పెద్ద విజయం సాధించినట్టే అనేది కాషాయ పార్టీ వర్గాల మాట. కాంగ్రెస్ మాటకొస్తే.. ఆ పార్టీ కేరళంలో కచ్చితంగా గెలవాలి. ఎందుకంటే గాంధీ కుటుంబం పట్ల అక్కడ సానుకూలత ఎక్కువగా ఉంది. అలాగే అసోంలోనూ బీజేపీతో హోరాహోరీగా పోరు సాగించాలి. లేకపోతే కాంగ్రెస్ పుంజుకోవటం అంత తేలిక కాదనే ప్రచారం మళ్లీ ఊపందుకునే ప్రమాదం ఉంది.

స్టాలిన్ తమిళనాడులో వరుసగా రెండవసారి అధికారంలోకి రావాలి. డీఎంకే ఓడిపోతే ఆ పార్టీ బలం తమిళనాడులో అతివేగంగా క్షీణించిపోతుంది. అదే సమయంలో అన్నాడీఎంకే ఈ ఎన్నికల్లో ఓడితే.. ఆ పార్టీ బలం కూడా తగ్గుతుందనడంలో సందేహం లేదు. ఇక కొత్తగా పార్టీ పెట్టిన విజయ్‌ రాజకీయ భవిష్యత్తును ఈ ఎన్నికలే నిర్ణయిస్తాయి. మమతా బెనర్జీ బెంగాల్లో గెలిస్తేనే జాతీయ రాజకీయాల్లో టీఎంసీ మాటకు విలువుంటుంది. లేకపోతే దీదీని ఎవరూ ఖాతరు చేయకపోవచ్చు. ఇలా ప్రతి రాష్ట్రమూ విడివిడిగా.. ఎన్నికలు జరిగే రాష్ట్రాలన్నీ కలిసికట్టుగా కూడా జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపించే అవకాశం ఉండటమే.. ఈసారి ఎన్నికల ప్రత్యేకతగా చెబుతున్నారు. కాబట్టే ఈసారి అసెంబ్లీ సీట్ల సంఖ్య ఆధారంగా కాకుండా.. రాజకీయ సమీకరణాలు, ఫలితాలు చూపే ప్రభావం ఆధారంగా రాష్ట్రాల ఎన్నికల గురించి చర్చ జరుగుతోంది. ఎన్నికలు కేవలం అసెంబ్లీ ఫలితాలకే పరిమితమయ్యే అవకాశం లేదు. బీజేపీ విస్తరణ ఆకాంక్షలకు జనం మద్దతు ఉందా లేదా… కాంగ్రెస్ కు పూర్వవైభవం వచ్చే ఛాన్స్ ఉందా.. లేదా అనే విషయాలు తేల్చనున్నాయి. అసోం ఫలితాలు సీఏఏపై నిర్ణయాన్ని ప్రభావితం చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటున్నారు విశ్లేషకులు. తమిళనాడులో డీఎంకే కూటమికి అధికారం వస్తే పర్వాలేదు.. అలా కాకుండా త్రిశంకు సభ ఏర్పడితే మాత్రం సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెరతీసినట్టే అవుతుంది.

మొత్తం మీద ఈసారి రాష్ట్రాల ఎన్నికలు అన్ని పార్టీలనూ టెన్షన్ పెడుతున్నాయి. ఎందుకంటే రాజకీయ సమీకరణాలు సంక్లిష్టంగా ఉన్నాయి. ఏ పార్టీ కూడా గుండె మీద చేయి వేసుకుని ధీమాగా ఉండే పరిస్థితి లేదు. అలాగే ఏ పార్టీ కూడా రేసులో లేదని పూర్తిగా చెప్పే స్థితి కూడా కనిపించడం లేదు. అందరూ పోటీదారులే ఉన్నప్పుడు రేస్ కచ్చితంగా రసవత్తరంగానే ఉంటుంది. సహజంగా ప్రతిసారీ రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీల ప్రచార వ్యూహాలే కీలకం. కానీ ఈసారి షెడ్యూల్ విడుదలకు ముందే మొదలైన రాజకీయం.. చాలా త్వరగానే రసపట్టులోకి వచ్చేసింది. పోలింగ్‌కు సరిగ్గా నెల రోజుల సమయం కూడా లేకపోవడంతో.. అన్ని పార్టీలు హడావుడిగా బలాబలాలు బేరీజు వేసుకుంటున్నాయి. కచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరాలని ప్రతి పార్టీ తన క్యాడర్‌కు నూరిపోస్తోంది. కీలక నేతల భవితవ్యం కూడా ఈ ఎన్నికల్లో తేలిపోనుంది. గతంలో మాదిరిగా కాకుండా.. ఈసారి సరైన ఫలితాలు చూపించకపోతే.. కఠిన చర్యలు తప్పవని జాతీయ పార్టీలు కూడా స్థానిక నేతలకు గట్టిహెచ్చరికలు జారీ చేశాయి. దీంతో ఇదివరకటిలా సాకులు చెప్పే అవకాశం లేదు. ప్రచారంలో ఎన్నిరోజులైనా పాల్గొంటాం. ఎలాంటి సహాయసహకారాలైనా అందిస్తాం. మాకు మాత్రం విజయం తప్ప మరో మాట వినిపించొద్దని బీజేపీ నేతలకు మోడీ, అమిత్‌షా తేల్చిచెప్పేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ కూడా స్థానిక నేతలకు కీలక ఆదేశాలిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు. ప్రతి రాష్ట్రంలోనూ పోటీ చాలా గట్టిగా ఉన్న తరుణంలో.. ప్రతి ఓటునూ కీలకంగా తీసుకోవాలని పార్టీలు డిసైడయ్యాయి. అందుకే ఎవరు ఓటేయకపోయినా పర్లేదనే ధోరణికి కాలం చెల్లిందని అభిప్రాయపడుతున్నాయి.

ఎవరేమనుకున్నా.. తమ రాజకీయ ఆధిపత్యం ప్రదర్శిస్తామని బీజేపీ ధీమాగా చెబుతోంది. కానీ ఈసారి కాషాయ పార్టీకి షాకిస్తామని కాంగ్రెస్ అంతే గట్టిగా చెబుతోంది. మరోవైపు జాతీయ పార్టీల విస్తరణవాదానికి అడ్డుకట్ట వేస్తామని ప్రాంతీయ పార్టీలు తొడ గొడుతున్నాయి. ప్రతి రాష్ట్రంలోనూ జాతీయ, రాష్ట్ర స్థాయి అంశాలు సమాంతరంగా ప్రయాణిస్తున్నాయి. దీంతో పోలింగ్ నాటికి ఏ అంశాలు పైచేయి సాధించి.. ఏ పార్టీ పుట్టి ముంచుతాయనేది ఎవ్వరూ నిర్దిష్టంగా చెప్పలేకపోతున్నారు. అందుకే ప్రీపోల్ సర్వేలు కూడా ఓటరు నాడి పట్టలేక చేతులెత్తేస్తున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Actor Vijay TVK Party Impact Tamil Nadu
  • Assam Election 2026 BJP vs Congress
  • Assembly Elections 2026 India
  • Himanta Biswa Sarma Assam Election
  • Kerala Assembly Polls 2026 LDF vs UDF

తాజావార్తలు

  • Story Board: ఆ ఐదు రాష్ట్రాల్లో గెలుపెవరిది..?

  • Surekha – Chiranjeevi : నాకు దోశలు వేయడం నేర్పించింది ఆయనే

  • Dhurandhar 2 Breaks Pushpa 2 Records: ‘ధురందర్ 2’ సునామీ.. కొట్టుకుపోయిన ‘పుష్ప 2’ ఆల్-టైమ్ రికార్డు..

  • IPL: టాప్-10 లీగ్‌ల జాబితా ప్రకటన.. ఐపీఎల్‌కు ఎన్నో ర్యాంక్ వచ్చిందంటే..

  • Xiaomi Book Pro 14: షావోమీ బుక్ ప్రో 14 లాంచ్.. ఇంటెల్ కోర్ అల్ట్రా X7 358Hతో శక్తివంతమైన ల్యాప్‌టాప్, 72Wh బ్యాటరీ

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions