Story Board: అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ ఎయిర్‌పోర్ట్ నుంచి లండన్ వెళ్తున్న బోయింగ్ 787 విమానం.. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. విమానంలో ప్రయాణిస్తున్న వారిలో ఒక్కరు తప్ప మిగిలనవారంతా చనిపోయారు. BJ మెడికల్ కాలేజ్ హాస్టల్‌పై కుప్పకూలడంతో.. ఈ ప్రయాణంతో ఏ సంబంధంలేని అమాయక మెడికోలు ప్రాణాలు కోల్పోయారు. ఈనెల 12న జరిగిన ప్లేన్ క్రాష్.. దేశచరిత్రలోనే ఘెరప్రమాదం. ఈ ప్రమాదం జరిగి వారం కూడా కాలేదు. ఇంకా మృతదేహాల అప్పగింత పూర్తికాలేదు. మృతుల కుటుంబసభ్యుల కళ్లల్లో కన్నీరు ఆగడంలేదు. ఇంత జరిగాక.. విమాన ప్రమాదాలు జరగవని.. నిబంధనల్ని కఠినంగా అమలుచేస్తారని అనుకుంటాం. అయితే, మళ్లీ మళ్లీ అవే రిపీట్ అవుతున్నాయి. తప్పులు పునరావృతమవుతున్నాయి. ప్రయాణికులు.. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయంతో, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వస్తోంది.
విమానాల్లో సాంకేతిక సమస్యలు కలవరపెడుతున్నాయి. లండన్-అమృత్‌సర్ వెళ్లాల్సిన AI-170 ఫ్లైట్‌ను క్యాన్సిల్ చేశారు. అలాగే.. ఢిల్లీ నుంచి పారిస్ వెళ్లాల్సిన విమానం కూడా రద్దుయ్యింది. ప్రయాణానికి ముందు చేసిన తనిఖీల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో.. విమాన సర్వీసులను రద్దు చేశారు. లండన్-బెంగళూరు ఎయిరిండియా విమానం కూడా రద్దయ్యింది. అహ్మదాబాద్ ఘటన తర్వాత వరుసగా బయటపడుతున్న లోటుపాట్లు.. టెన్షన్ పెడుతున్నాయి. హాంకాంగ్-ఢిల్లీ AI విమానం.. టేకాఫ్ అయిన 15 నిమిషాలకే వెనుదిరిగింది. AI-315 విమానం హాంకాంగ్ విమానాశ్రయం నుంచి బయల్దేరింది. ఇది ఢిల్లీలో ల్యాండ్ అవ్వాల్సి ఉండగా.. మార్గమధ్యలో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్ గుర్తించారు. వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించారు. ఈ విమానం హాంకాంగ్ ఎయిర్‌పోర్టులోనే సురక్షితంగా దిగింది. ఇక కోల్‌కతా మీదుగా వెళ్లే శాన్‌ఫ్రాన్సిస్కో-ముంబై ఎయిరిండియా విమానంలో కూడా సాంకేతిక లోపం తలెత్తింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమానాశ్రయంలో.. ప్రయాణీకులను దించేశారు. విమానం ఇంజిన్‌లో సమస్య తలెత్తడంతో విమాన సర్వీసును రద్దు చేశారు.
ఎయిరిండియా ఏఐ-159 బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం మంగళవారం మధ్యాహ్నం అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరాల్సి ఉంది. ఇందులో తనిఖీలు చేస్తుండగా.. సాంకేతిక సమస్యను గుర్తించారు. దీంతో టేకాఫ్ నిలిపివేసి సర్వీసును రద్దు చేశారు. గత వారం నాటి విమాన ప్రమాదం తర్వాత లండన్‌కు వెళ్లాల్సిన తొలి షెడ్యూల్డ్ విమానం ఇదే. అయితే, సాంకేతిక సమస్య వార్తలను ఎయిరిండియా తోసిపుచ్చింది. విమానం అందుబాటులో లేకపోవడం వల్లే సర్వీసును రద్దు చేసినట్లు తెలిపింది. గగనతల ఆంక్షలు, అదనపు ముందు జాగ్రత్త తనిఖీల కారణాలతో ఆ విమానం అందుబాటులో లేదని ప్రకటించింది. అహ్మదాబాద్ ఘటన తర్వాత AI171 ఫ్లైట్ నంబర్‌ను ఎయిరిండియా పక్కనబెట్టింది. దాని స్థానంలో ఏఐ 159 నంబరును వినియోగించింది. ఇప్పుడదే సిరీస్ విమానంలో సాంకేతిక సమస్య ఎదురైంది.
లండన్ నుంచి చెన్నైకి బయల్దేరిన బ్రిటిష్ ఎయిర్‌వేస్ బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానంలో సమస్య తలెత్తడంతో అర్థంతరంగా తిరిగి లండన్‌లోని హీత్రూ విమానాశ్రయానికి మళ్లించారు. శని, ఆదివారాల్లో ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానాల్లో సమస్యలు తలెత్తి సహనాన్ని పరీక్షించాయి. ఈ రెండూ కోల్‌కతాకు వెళ్లాల్సినవే. శనివారం రాత్రి 9 గంటలకు బయల్దేరాల్సిన ఐఎక్స్-1226.. గువాహటి ఎయిర్‌పోర్టులో మరుసటి రోజు సాయంత్రం మూడు గంటలకు బయల్దేరింది. ఆదివారం ఉదయం 7 గంటలకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్ నుంచి బయల్దేరాల్సిన ఐఎక్స్ 1511.. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు కదిలింది. అంతే.. ఈ సాంకేతిక సమస్యల వల్ల.. ప్రయాణికులు ఎన్ని అవస్థలు పడ్డారో అర్థం చేసుకోవచ్చు. త్వరగా ప్రయాణాలు పూర్తికావాలనే విమానయానాన్ని ఎంచుకుంటారు.. అలాంటిది టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల గంటలతరబడి లేట్ అవుతుంటే.. ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అటు సేఫ్టీ లేక.. ఇటు సమయపాలన లేక.. విమానయాన సంస్థలు.. ప్యాసెంజర్లకు చుక్కలు చూపిస్తున్నాయి.
అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత.. అన్ని బోయింగ్ 787 విమానాల్లో భద్రతా తనిఖీలు చేపట్టాలని ఆదేశించింది. ఈ మేరకు తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలని ఎయిర్ ఇండియాకు రెండు వారాల గడువు విధిస్తూ డీజీసీఏ ఆదేశాలు ఇచ్చింది. ఈలోపే వరుసగా సాంకేతిక లోపాలతో ఘటనలు వెలుగులోకి వస్తుండడంతో డీజీసీఏ అప్రమత్తమైంది. ఎయిరిండియా ప్రతినిధులతో వర్చువల్ సమావేశం నిర్వహించింది. విమానాల రద్దు, సాంకేతిక సమస్యలపై ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ నిపుణులతో కూడా చర్చిస్తోంది DGCA. ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ చీఫ్‌కు సమన్లు కూడా జారీ చేసింది. బోయింగ్ విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంపై ప్రశ్నిస్తోంది. ప్రస్తుతం ఎయిరిండియాతో పాటు ఇండిగో విమానయాన సంస్థ బోయింగ్ 787 విమానాలను ఉపయోగిస్తోంది. ఎయిరిండియా దగ్గర బోయింగ్ 787-8 విమానాలు 26, బోయింగ్ 787-9 విమానాలు ఏడు ఉన్నాయి. జెన్‌ఎక్స్ ఇంజిన్లతో కూడిన బోయింగ్ 787-8, 787-9 విమానాలకు సంబంధించి.. అదనపు నిర్వహణకు చర్యలు చేపట్టాలని కూడా ఎయిరిండియాను డీజీసీఏ ఆదేశించింది. బోయింగ్ డ్రీమ్‌లైనర్ 787-8 విమానాలను నిలిపివేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు సమాచారం. తొలుత తాత్కాలికంగా సేవలు నిలిపివేసి.. భద్రతా సమీక్ష నిర్వహించిన అనంతరం పూర్తిగా ఆపాలా? కొనసాగించాలా? అన్నదానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎయిరిండియాతోపాటు విమాన నిర్వహణ విధానంపై ఇతర విమానయాన సంస్థలకు కూడా కేంద్రం నోటీసులు ఇవ్వనుంది.
విమానాల్లో వరుసగా సమస్యలు బయటపడుతుండటం.. బోయింగ్ సంస్థ స్టాండర్డ్స్‌ను ప్రశ్నార్థకం చేస్తోంది. ప్రపంచంలోని వివిధ సంస్థల తయారీ విమానాలతో పోల్చినప్పుడు బోయింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు సాంకేతికత, భద్రత, వేగం, ఇంధన వినియోగం పరంగా అత్యున్నతమైనవనే అభిప్రాయం ఉంది. అయితే, అహ్మదాబాద్ ప్రమాదం నేపథ్యంలో బోయింగ్ విమానాలు ఏ మేరకు సురక్షితమైనవనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. డ్రీమ్‌లైనర్ 787-8 విమానం బాడీని 50% కంటే ఎక్కువ కార్బన్ ఫైబర్ సమ్మేళనాలతో నిర్మిస్తారు. ఇది స్టీల్ కంటే దృఢమైనది. అల్యూమినియం కంటే తేలికైనది. దీంతో ఇంధనాన్ని సమర్థంగా వినియోగించుకొంటుంది. పర్యావరణహితమైనదిగా దీనికి పేరుంది. అత్యాధునిక నేవిగేషన్ వ్యవస్థలు దీని సొంతం. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నా.. విమానాల్లో సమస్యలు ఎందుకు వస్తున్నాయనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారుతోంది.
