Politics Become fashionable : రాజకీయాలు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం సమాజంలో చిచ్చు రేగుతోంది. నేతలు విద్వేష విషం చిమ్మడం సర్వసాధారణంగా మారింది. కులం, మతం, ప్రాంతం.. ఆఖరికి దైవం.. దేన్నీ వదలకుండా నోరుపారేసుకోడవం ఫ్యాషనైపోయింది.
దేశంలో రాజకీయల కోసం మతాల మధ్య చిచ్చుపెట్టే మహానుభావులు తయారయ్యారు. మహమ్మద్ ప్రవక్తను అవమానిస్తూ బీజేపీ నేత రాజా సింగ్ పెట్టిన వీడియో పెద్ద దుమారం రేపింది. యూట్యూబ్ నుంచి వీడియో తొలగించినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బీజేపీ రాజా సింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పోలీసులు అరెస్ట్ చేశారు. స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూఖీ అప్పుడెప్పుడో కామెడీ షోలో సీతను అవమానించాడని, అందుకే తాను ఇలాంటి వీడియో పెట్టానని, ఇంకా పార్ట్ టూ ఉందని రాజా సింగ్ చెబుతున్నారంటే ఏమనుకోవాలో అర్థం కాని పరిస్థితి.
కొద్ది నెలల క్రితం మహ్మద్ ప్రవక్తను ఉద్దేశించి అప్పట్లో బీజేపీ నేత నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపాయి. దేశ లౌకిక ముద్రకే చెడ్డపేరు వచ్చే పరిస్థితి. ముస్లిం దేశాల నుంచి తీవ్ర అభ్యంతరాలు రావడంతో.. నుపుర్ ను కూడా పార్టీ నుంచి సస్పెండే చేశారు. అయితే ఆమెపై పెట్టిన విద్వేష పూరిత వ్యాఖ్యల కేసు మాత్రం సీరియల్ లా సాగుతూనే ఉంది. ఈ సాగదీతే మరింత మంది నేతలు నోరు పారేసుకునేలా ఊతమిస్తోందనే వాదన ఉంది.
కొన్నాళ్ల్ క్రితం ఎంఐఎం నేత అక్బరుద్దీన్ వ్యాఖ్యలు కూడా ఇలాంటి దుమారమే రేపాయి. ఆ కేసులో ఆయన నిర్దోషిగా విడుదలయ్యారు. చట్టం తన పని తాను చేస్తే.. ఇలాంటి నేతలకు అలా మాట్లాడే ధైర్యం ఎలా వస్తుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఓ మతాన్ని తిట్టడం ద్వారా మరో మతానికి ఛాంపియన్ అవుతామనే భ్రాంతి నేతల్ని ఒళ్లు తెలియని స్థితికి తీసుకెళ్తోంది. అసలు ఓ వర్గాన్ని కించపరిస్తేనే మరో వర్గంలో హీరో అవుతామనే ఆలోచనే తప్పు. కనీస సంస్కారం లేకుండా మాట్లాడుతున్న నేతలు.. దాన్ని రాజకీయం పేరుతో సమర్థించుకోవడం సిగ్గుచేటు.
రామ నవమి వేడుకలను పురస్కరించుకొని ఏర్పాటుచేసిన కొన్ని కార్యక్రమాల్లో కొందరు విద్వేష వ్యాఖ్యలు చేశారు. కొన్ని రాష్ట్రాల్లో మత ఘర్షణలు కూడా చోటుచేసుకున్నాయి. తెలంగాణలో బీజేపీకి చెందిన ఒక శాసన సభ్యుడు విద్వేష వ్యాఖ్యలు చేయడంతో 2020లో ఆయన ఖాతాను ఫేస్‌బుక్ స్తంభింపచేసింది. అయితే, రామ నామం జపించని వారు భారత్ వదిలి వెళ్లాల్సి ఉంటుందని ఆయన మరో పాట పాడారు. దీనికి కొన్ని రోజుల ముందు ఉత్తర్ ప్రదేశ్‌లో ముస్లిం మహిళలపై కిడ్నాప్, అత్యాచారం చేస్తామంటూ ఓ హిందూ నాయకుడు హెచ్చరించారు. ఈ వీడియో వైరల్ కావడంతో వారం రోజుల తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన్ను అరెస్టు చేశారు.
దశాబ్దాల నుంచి భారత్‌లో విద్వేష వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 1990ల్లో కశ్మీర్‌లోని కొన్ని మసీదుల్లో హిందువులకు వ్యతిరేకంగా విద్వేష వ్యాఖ్యలుచేశారు. ఆ తర్వాత చోటుచేసుకున్న వివాదాల నడుమ ముస్లిం మెజారిటీగా ఉండే ఈ ప్రాంతాలను హిందువులు వదిలివెళ్లిపోవాల్సి వచ్చింది. అదే ఏడాది బీజేపీ నాయకుడు ఎల్‌కే అద్వానీ కూడా అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఓ ఉద్యమం తీసుకొచ్చారు. దీంతో శతాబ్దాల నాటి బాబ్రీ మసీదును కొందరు కూల్చేశారు. ఆ తర్వాత భయానక మత ఘర్షణలు చెలరేగాయి.
ఇటీవల కాలంలో ఈ సమస్య మరింత ఎక్కువైంది. జనాలను మతపరంగా విభజించే, రెచ్చగొట్టే విద్వేష వ్యాఖ్యలు ఎప్పటికప్పుడే కనిపిస్తున్నాయి. చిన్నచిన్న నాయకులు చేసే ఇలాంటి వ్యాఖ్యలను సోషల్ మీడియా మరింత ఎక్కువచేసి చూపిస్తోంది.
పత్రికల్లో పతాక శీర్షికల్లో నిలిచేందుకు కొందరు నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే అభిప్రాయాలు బలంగా ఉన్నాయి. ఇదివరకు ఎన్నికలకు ముందు, ఇలాంటి విద్వేష వ్యాఖ్యలు ఎక్కువగా చేసేవారు. కానీ, ఇప్పుడు ఒక ప్రాంతంలో చేసే వ్యాఖ్యలను వేరే ప్రాంతంలో రాజకీయ లబ్ధి పొందేందుకు నాయకులు ఉపయోగించుకుంటున్నారు.
విద్వేష వ్యాఖ్యలను కట్టడి చేసేందుకు మన దగ్గర సరిపడా చట్టాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. 2014లో రాజకీయ నాయకులు, మతపెద్దలు చేసే విద్వేష వ్యాఖ్యలను కట్టడి చేసేలా మార్గదర్శకాలు విడుదల చేయాలని సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. అయితే, ఈ మార్గదర్శకాలతో భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలుగుతుందని భావించి… సుప్రీం కోర్టు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే, ఈ అంశాన్ని లోతుగా పరిశీలించి ప్రభుత్వానికి సూచనలు చేయాలని లా కమిషన్‌కు సుప్రీం కోర్టు సూచించింది. 2017లో లా కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించింది. విద్వేష వ్యాఖ్యలను నేరంగా పరిగణించేలా ప్రత్యేక నిబంధనలను ఐపీసీలో చేర్చాలని కమిషన్ సూచించింది. ఈ సూచనలతో అంత ప్రయోజనం ఉండదని న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. విద్వేష వ్యాఖ్యలను నిర్వచించడం, ఆ పరిధి విస్తరించడంతో కలిగే ప్రయోజనాలు చాలా తక్కువ. ఎందుకంటే ఈ చర్యలు ఇప్పటికే ఐపీసీలోని వేరే నిబంధనల కింద నేరాలుగా పరిగణిస్తున్నారు. చట్టాల్లో కొన్ని లోటుపాట్లు ఉన్న మాట వాస్తవమే. కానీ, వాటి అమలులోనే అసలు సమస్య ఉంది. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడినా.. శిక్షలు పడటం లేదు. వీళ్లను చూసి కింది స్థాయి కార్యకర్తలు మరింత రెచ్చిపోతున్నారు. చాలా ప్రాంతాల్లో మత ఘర్షణలకు విద్వేష విషమే బీజం వేస్తోంది.
భిన్నత్వంలో ఏకత్వానికి మారుపేరైన భారత్.. ఇప్పుడు ఇలా విద్వేష కాష్టంలో రగిలిపోవడం ఎవరికీ మంచిది కాదు. ఈ దేశంలో వందల ఏళ్లుగా అన్ని మతాల ప్రజలు సహజీవనం చేస్తున్నారు. హిందూ రాజులున్నా.. ముస్లిం సుల్తానులు పాలించినా.. మత చిచ్చు పెద్దగా రేగలేదు. కానీ ప్రజాస్వామ్యంలో ఇలాంటి దుస్థితి రావడం మాత్రం కచ్చితంగా రాజకీయ నేతలు చేస్తున్న పాపమే. రాజకీయం పేరుతో విద్వేష విషాన్ని యథేచ్ఛగా వెదజల్లడం.. జాతికి, భవిష్యత్ తరాలకు తీరని ద్రోహం చేయడమే అనడంలో ఎలాంటి సందేహం లేదు.
సిద్ధాంతాలు, అంశాల వారీగా చేయాల్సిన రాజకీయం కట్టు దాటిపోయింది. విద్వేష వ్యాఖ్యలే ప్రధాన అర్హతగా భావిస్తున్నారు నేతలు. ప్రత్యర్థులపై నోరేసుకుని పడిపోతున్నారు. సభ్య సమాజం తల దించుకునే విధంగా విద్వేష పదజాలం వాడుతున్నారు.
సందర్భం ఏదైనా విద్వేష వ్యాఖ్యలు మాత్రం మానడం లేదు నేతలు. ఎన్నికల ప్రచారం అయినా, మామూలు ప్రెస్ మీట్ అయినా, ప్రభుత్వ కార్యక్రమం అయినా.. ఎవరో ఒకర్ని కించపరచకుండా నిద్రపోవడం లేదు. కొంతమంది నేతలైతే విద్వేషానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారిపోయారు. మొన్నటివరకూ ఉత్తరాదికే పరిమితమైన విద్వేష రాజకీయం.. ఇప్పుడు దక్షిణాదికి విస్తరించింది. ఆ రాష్ట్రం.. ఈ రాష్ట్రం అనే తేడా లేకుండా అన్ని పార్టీల్లోనూ విద్వేష నేతలు వర్థిల్లుతున్నారు. ప్రజల్ని పోలరైజ్ చేయడానికి, సెంటిమంట్ పేరుతో డేంజరస్ పాలిటిక్స్ చేయడానికి ఇలాంటి నేతల్ని తురుపుముక్కలుగా వాడుకోవడం అలవాటైపోయింది. ఒక్క విద్వేష వ్యాఖ్యతో కూడా ఎన్నికల్లో గెలవచ్చని నేతలు భావిస్తున్నారంటే.. ఇక ప్రజాస్వామ్యం ఉన్నట్టా.. లేనట్టా. అసలిది ప్రజస్వామ్యమా. విద్వేషసామ్యమా అనే చర్చ జరగాల్సిన అవసరం ఉంది.
ప్రజా సమస్యలపై మాటల యుద్ధం చేయాల్సిన పార్టీలు.. ఎవరెక్కువ విద్వేషం వెదజల్లుతారా అని పోటీలు పెట్టుకున్నట్టుగా తయారయ్యాయి. ఒక ప్రజాప్రతినిధి సభ అంటే.. అక్కడ మహిళలు, చిన్నారులు కూడా ఉంటారు. వీళ్లున్నారనే సోయి కూడా లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడటం, సమాజంలో చిచ్చు పెట్టేలా మాటల తూటాలు పేల్చడం అలవాటుగా మారిపోయింది. జాతీయ పార్టీ అయినా.. ప్రాంతీయ పార్టీ అయినా.. ఇప్పుడు విద్వేషమే మంత్రం. కొన్నాళ్లుగా లైమ్ లైట్ లో లేని నేతలు ఒక్కసారిగా పతాక శీర్షికలుగా ఎక్కాలంటే.. విద్వేషానికి మించిన మందు లేదు. కొంతమంది నేతలైతే ఈ విద్వేష బ్రాండ్ తోనే రాజకీయాల్లో కొనసాగుతున్నారు.
ప్రజలు ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకునేది సమస్యల పరిష్కారం కోసం. అంతేకానీ విద్వేషాలు రెచ్చగొట్టడానికి కాదు. ఈ మాత్రం కనీస జ్ఞానం లేకుండా నేతలు వ్యవహరిస్తున్నారు. సమాజాన్ని సరైన దారిలో నడిపించాల్సి నేతలే.. విద్వేష వ్యాఖ్యలు చేయడం.. దిగజారుడుతనానికి పరాకాష్ట. పైగా ఆ మాత్రం చేయకపోతే విలువేముంది అనే వ్యాఖ్యానాలు మరీ పైత్యం. మొదట్లో కొందరు అతి నేతలే విద్వేషాన్ని వెదజల్లేవారు. కానీ తాచెడ్డ కోతి వనమంతా చెరిచిందన్నట్టుగా తయారైంది ఇప్పుడు పరిస్థితి. విద్వేషానికి బ్రాండ్ అంబాసిడర్ నేతలు ఫైర్ బ్రాండ్లుగా ముద్ర పడటంతో.. అందరూ నోటికి పని చెబుతున్నారు. నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుందో లేదో తెలియదు కానీ.. నోరు చెడ్డదైతే.. ఊరు నెత్తిన పెట్టుకుంటుందనే కొత్త పోకడ ప్రచారంలోకి వచ్చింది. ఈ విషయంలో ఇసుమంత నిజం లేకపోయినా.. నేతలు మాత్రం తెచ్చిపెట్టుకున్న ఆవేశంతో రెచ్చిపోతున్నారు. తమ కారణంగా శాంతిభద్రతలు అదుపుతప్పలని, ఘర్షణల్లో తలకాయలు పగలాలని కోరుకుంటూ పైశాచిక ఆనందం పొందుతున్నారు.
నిజం చెప్పులేసుకునేలోగా.. అబద్ధం ఊరంతా చుట్టొస్తుంది. ఇప్పుడు మంచిమాట పెదవి దాటేలోపే.. విద్వేష వ్యాఖ్యలు మాత్రం ప్రపంచ భ్రమణం చేస్తున్నాయి. ఈ ఊపులో నేతలు మరింతగా విచక్షణ కోల్పోతున్నారు. నోటికి అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. పార్టీలు కూడా పైకి చర్యలు తీసుకుంటున్నట్టు నటించినా.. పరోక్షంగా సదరు నేతల్ని ప్రోత్సహిస్తున్నాయనే వాదన ఉంది. అందుకే అరెస్టులు చేసినా.. కేసులు పెడుతున్నా.. విద్వేష నేతల ప్రభ వెలుగుతూనే ఉంది. కొన్ని పార్టీలు విద్వేష నేతల్ని నమ్ముకుంటే.. మరికొన్ని పార్టీలే విద్వేషంపై ఆధారపడి మనుగడ సాగిస్తున్నాయి. ఏ పండగ జరిగినా.. ప్రశాంతంగా ఉత్సవం జరిగితే.. పెద్ద వార్తగా చెప్పుకోవాల్సిన ఖర్మ వచ్చిపడింది. జనం రెచ్చిపోకపోయినా.. వాళ్లను రెచ్చగొట్టి ఘర్షణ సృష్టించడంలో విద్వేష నేతలు ఆరితేరారు. గతంలో మాదిరిగా వీధుల్లోకి రావాల్సిన పనిలేదు. ఇంట్లో కూర్చుని సోషల్ మీడియాలో వీడియో పెడితే చాలు.. కాగల కార్యం గంధర్వులే చూసుకుంటారు.
ఉగ్రవాదానికి ఐసిస్ పరాకాష్ట. అఫ్గానిస్తాన్లో రాక్షస పాలనకు తాలిబన్లు కేరాఫ్ అడ్రస్. విద్వేష నేతలు అంతకు మించి అనే చెప్పాలి. వీళ్లను రాజకీయ ఉగ్రవాదులు అనాలేమో. ఇంకా చెప్పాలంటే రాజకీయ ఉన్మాదులు అనే మాట సరిగ్గా సరిపోతుంది. ఒక వ్యక్తిని చంపితేనే హంతుకుడు అంటున్నాం. మరి విద్వేష వ్యాఖ్యలతో గొడవలకు కారణమౌతున్న వారిని రాక్షసులు అనుకూడదా. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య సూత్రాలకు నేతలు ఎప్పుడో నీళ్లొదిలేశారు. ఎవరికి తోచిన విద్వేష వ్యాఖ్యలు వాళ్లు చేస్తూ.. అదే రాజకీయమని అబద్ధపు వాదనలు కూడా వినిపిస్తున్నారు. నువ్వెందుకు నోరు జారావంటే.. మొన్న నువ్వు కాలుజారలేదా అని అడుగుతారు. అంతేకానీ చేసింది తప్పు అనే భావన కూడా ఎవరికీ లేదు. పైగా ఓ వర్గాన్ని రెచ్చగొట్టి.. తద్వారా మరో వర్గానికి మనఃశాంతి కలుగుతుందనే వాదనేంటో వాళ్లకే తెలియాలి.
నాయకుడంటే సమాజాన్ని నడిపించాలి. అంతేకానీ ప్రశాంతమైన సమాజంలో అశాంతి రేపకూడదు. ప్రజాస్వామ్యం కాస్తా మూకస్వామ్యంగా మారుతోంది. అడుగడుగునా అసహనం, అశాంతి పెరిగిపోయి.. విద్వేషం ఏరులై పారుతోంది. మన వాదన కరెక్ట్ అని చెప్పడానికి ఎదుటివాడిని చంపినా తప్పులేదనే వాదన ఉగ్రవాదానికి అసలు సిసలు నిర్వచనం. ఎక్కడో ఉన్న ఉగ్రవాదులు సృష్టించే మారణహోమం కంటే.. సమాజంలోనే తిరుగుతున్న విద్వేష ఉగ్రవాదులు చేస్తున్న హాని చాలా ఎక్కువ. దీన్ని గ్రహించి విద్వేష నేతలకు అడ్డుకట్ట వేయకపోతే.. భవిష్యత్తుల రాజకీయం అంటే.. విద్వేషమే అనే మాట స్థిరపడే ప్రమాదం ఉంది.
ఆధునిక కాలంలో.. మధ్యయుగాల నాటి ధోరణులు.. జాతి తిరోగమనానికి సాక్ష్యాలు. ఏ మతమూ హింసను ప్రోత్సహించలేదు. మరో మతంపై విషం చిమ్మమని ఏ ప్రవక్తా చెప్పలేదు. అయినా సరే నేతలు మాత్రం మిడిమిడి జ్ఞానంతో ప్రజల్ని విష రాగ గంగా ప్రవాహంలో ముంచేస్తున్నారు.
నరకంలో పాపులు వైతరణీ నది దాటాలని చెబుతారు. ఆ నది సమీపంలో ఉండటం కూడా కష్టమే అంటారు. కానీ రాజకీయ వైతరణి అంతకు మించి ఉందనే అభిప్రాయాలున్నాయి. వ్యక్తి నుంచి దేవుడి వరకు ఎవర్నీ వదలకుండా నోరు పారేసుకోవడం బాగా పెరిగింది. గ్లోబల్ గా ఫేమస్ అవ్వాలంటే.. విద్వేషానికి మించిన మందు లేదనే ధోరణి ఎప్పుడో శృతి మించిపోయింది. గతంలో రాజకీయాల్లోకి వస్తే మురికి గుంట అనుకునేవాళ్లు. కానీ ఇప్పుడు మన చుట్టుపక్కల రాజకీయ నేతలు ఉన్నా.. విద్వేష కాలుష్యం తప్పడం లేదు. నేతలకు పైత్యం ప్రకోపించి, పిచ్చి పరాకాష్టకు చేరి.. విద్వేషం కవిత్వంలా ఆశువుగా తన్నుకొస్తోంది.
నాయకులు ప్రజల్ని బాగుచేయకపోయినా పర్లేదు.. పాడు చేయకుండా ఉంటే అంతే చాలు అనుకోవాల్సిన దుస్థితి. అసలు మతం గురించి పూర్తి అవగాహన లేని చిన్నారుల మెదళ్లను కూడా విషంతో నింపేస్తున్నారు నేతాశ్రీలు. ఎప్పుడూ వినని విద్వేష వ్యాఖ్యలను వీనుల విందుగా వినిపిస్తున్నారు. అదేమంటే జనంలో చైతన్యం తెస్తున్నామన సమర్థించుకుంటున్నారు. ఎవరో ఎవరికో అన్యాయం చేస్తున్నారని, సదరు బాధితులకు తామే ఉద్ధారకులమనే భ్రాంతిలో బతికేస్తున్నారు. ఉన్న సమస్యలు పరిష్కరించకపోగా.. లేని సమస్యలు సృష్టిస్తున్నారు. ఏటా కల్లోలిత ప్రాంతాల జాబితా పెరగడంలో.. రాజకీయ నేతలదే కీలక పాత్ర. మనం ఉన్న చోట అంతా ప్రశాంతంగా ఉంటే.. మనల్ని గుర్తించేదెవరు అనేది నేతల ధోరణి. కాబట్టి ఏదో విధంగా గలాటా చేయాలి. కుదిరితే గొడవలు పెట్టాలి. కుదరకపోతే మాటలతో అయినా మంటలు రేపాల్సిందే. అసలు రాజకీయం అంటేనే నిత్యాగ్నిహోత్రంలా వెలగాల్సిందే అనే వాదనతో.. రావణకాష్టాలు రగిలిస్తున్నారు.
మతాలకు సొంత భాష్యాలు చెప్పడం, ప్రవక్తల మాటలకు విపరీత వ్యాఖ్యానాలు చేయడం, లేని ఆచారాలు ఆపాదించడం.. ఇలా ఒకటేమిటి.. విద్వేష విషం పొంగించడానికి మన నేతలు పడే పాట్లు అన్నీ ఇన్నీకాదు. ఏం చేసైనా సరే విద్వేషాగ్ని రగిలించాల్సిందే. దీన్ని అమృతమథనం కంటే పవిత్రకార్యంలా భావిస్తున్నారు. కొన్నిసార్లు నేతల విపరీత వ్యాఖ్యలు లేనిపోని కల్లోలం రేపుతున్నాయి. నేతలు చేప్పేదే నిజమనుకుని.. జనం తెలియకుండానే కొట్టుకుంటున్నారు. కొన్నేళ్ల క్రితం ఢిల్లీలో జరిగిన అల్లర్లలో పాల్గొన్నవారిలో చాలా మందికి కారణం తెలియదు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లైనా.. ప్రజాస్వామ్యం పరిపక్వం కాకపోగా.. తిరోగమనంలో సాగడం అందర్నీ ఆందోళనకు గురిచేస్తోంది.
రవీంద్రుడు ఊహించిన దేశానికి, నేటి పరిస్థితికి నక్కకూ, నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. గాంధీ చేసింది రాజకీయం. నేటి నేతలు చేసేది మాత్రం కచ్చితంగా రాక్షసక్రీడ అని చెప్పాల్సిందే. ప్రజల బాగు కోసం ప్రజాస్వామ్యం అయితే.. పిడివాదం కోసం ప్రజలు చచ్చినా పర్లదనుకోవడం విద్వేషస్వామ్యం. మనం ఏ స్థితిలో బతుకుతున్నామో ఎవరికి వారే ఆలోచించుకోవాలి. గత వెయ్యేళ్లలో ఏ దేశం మీదా దండయాత్ర చేయని రికార్డు ఉన్న భారత్.. ఇప్పుడు సొంత కుంపటిని ఆర్పలేకపోతోంది. విద్వేష విషం ఏరులై పారుతున్నా.. కనీసం గుర్తించలేని దుస్థితి.
తన కోపమే తన శత్రువు అన్నారు పెద్దలు. కోపమే శత్రువైతే.. ఇక విద్వేషం గురించి ఏం చెప్పాలి. జాతి నిర్మాణం చేయాల్సిన నేతలు.. దేశానికి గోతులు తవ్వే పనిలో బిజీగా ఉన్నారు. అదేమంటే పునాదులు గట్టిగా ఉండాలని విపరీత వ్యాఖ్యానాలు. అనంత సాగరంలా సాగిపోతున్న విద్వేష విషానికి అడ్డుకట్ట వేసేదెవరనేది మిలియన్ డాలర్ల ప్రశ్నేం కాదు. దీనికి మందు ప్రజల చేతుల్లోనే ఉంది. ఇలా నోరు పారేసుకునే నేతల్ని దూరం పెడితే.. మళ్లీ సహజీవనం వెల్లివిరుస్తుంది. విద్వేషాలకు కాలం చెల్లుతుంది. సమాజంలో సౌభ్రాతృత్వం మొగ్గ తొడుగుతుంది.