కరోనా కల్లోలమో, ఉక్రెయిన్ యుద్ధ ప్రభావమో, రెండూ కలిసి దరువేశాయోగానీ, ధరల మోత సామాన్యుల బతుకులను బండకేసి బాదింది, బాదుతోంది. ద్రవ్యోల్బణం రికార్డుస్థాయిలో పైపైకి ఎగబాకుతోంది. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదంటూ కామన్ మ్యాన్ కష్టాల రాగం ఆలపిస్తున్నాడు. ఇలా రేట్లు రాకెట్ వేగంతో దూసుకుపోతున్న టైంలో, కేంద్ర ప్రభుత్వం చెప్పుకోదగ్గ రిలీఫ్ ఇచ్చింది. పేస్ట్ నుంచి పడుకునే బెడ్ వరకు అన్ని ధరలు ప్రభావితమయ్యే పెట్రో రేట్లను కూసింతో, కాసింతో తగ్గించింది. లీటర్ పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 మేర ఎక్సైజ్ సుంకం తగ్గించింది. దీంతో హైదరాబాద్ లో పెట్రోల్ ధర లీటర్‌కు 10.91 రూపాయలు తగ్గగా, డీజిల్ పై 7.64 రూపాయలు ఊరట లభించింది. ఎక్సైజ్ సుంకంలో కోత నిర్ణయం వల్ల కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి రూ.లక్ష కోట్ల ఆదాయం కోల్పోనుందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రాష్ట్రాలు కూడా పెట్రోల్, డీజిల్‌పై పన్నులను తగ్గించాలని సూచించారు. అక్కడితో మొదలైంది స్టేట్ వర్సెస్ సెంటర్, అపోజిషన్ వర్సెస్ పొజిషన్ పెట్రో మంటల రాజకీయం.
పెట్రోల్‌పై దేశంలోనే తెలంగాణ అత్యధికంగా పన్నులు వసూలు చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. సామాన్యులపై భారం దించేందుకు కేంద్ర ప్రభుత్వం తనవంతు బాధ్యతగా లీటర్ పెట్రోల్ పై తొమ్మిదిన్నర రూపాయలు, డీజిల్ పై ఏడు రూపాయలు తగ్గించిందని, మరి రాష్ట్ర వాటాగా ప్రజలకు రిలీఫ్ ఏదని ప్రశ్నించారు కిషన్ రెడ్డి.
అటు ఏపీలోనూ పెట్రో రాజకీయం హీటెక్కిస్తోంది. సీఎం జగన్‌కు నారా లోకేష్ లేఖ రాశారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని లేఖలో డిమాండ్ చేశారు. దేశంలోనే అత్యధకంగా ఏపీలో ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించి బాదుడే బాదుడిని ఆపాలన్నారు. అటు పెట్రోలు, డీజిల్ అమ్మకాలపై రోడ్డు సెస్ పేరుతో ప్రజల నుంచి ఏటా 600 కోట్లు వసూలు చేస్తున్నారని..అయినా రోడ్లను బాగు చేసే పరిప్థితి కనిపించడం లేదన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. కనీసం పెట్రోలు, డీజిల్‌పై స్థానిక పన్నులను తగ్గించి, ఊరట కలిగించాలన్నారు.
పెట్రోల్ ధరల విషయంలో కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయం లేదనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. పెట్రోల్ జాతీయ అంశమని రాష్ట్రాలు.. రాష్ట్రాలే చూసుకోవాలని కేంద్రం దులిపేసుకుంటున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నలిగి సామాన్యుడు కుదేలవుతున్నాడు. రాష్ట్రాలు తలోదారిలో వెళ్తున్నాయి. ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు చాలా రాష్ట్రాలు తమవంతుగా కొంత సుంకాలను తగ్గించుకున్నాయి. కేరళ ప్రభుత్వం పెట్రోల్ ధరను లీటరుకు రూ.2.41, లీటర్ డీజిల్ పై రూ. 1.36 తగ్గింపును ప్రకటించింది. మహారాష్ట్ర సర్కారు పెట్రోల్‌పై లీటర్‌కు రూ.2.08, డీజిల్‌పై రూ.1.44 చొప్పున వ్యాట్‌ను కట్ చేసుకుంది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాకు ఏటా రూ.2,500 కోట్ల నష్టం కలుగుతుందని ఉద్దవ్ థాక్రే ప్రభుత్వం తెలిపింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ లీటర్ పెట్రోల్‌పై రూ. 2.48, డీజిల్‌పై రూ. 1.16 చొప్పున వ్యాట్‌ను తగ్గిస్తున్నట్లు తెలిపారు. ఒడిశా ప్రభుత్వం లీటరు పెట్రోల్‌పై రూ.2.23, లీటరు డీజిల్‌పై రూ.1.36 వ్యాట్‌ను తగ్గించింది. తెలుగు రాష్ట్రాలు మాత్రం ఇంకా తగ్గించలేదు.
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత్ లో ప్రభుత్వాలు ప్రజల్ని మోసం చేస్తున్నాయి. పెట్రోల్ సామాన్యుడి అవసరంగా మారిపోయింది. సొంత వాహనాలు ఉన్నవాళ్లకే కాదు.. ప్రజారవాణా వాడేవాళ్ల మీదా భారం పడుతోంది. నిత్యావసర వస్తువుల రవాణా కూడా ప్రియంగా మారుతోంది. ప్రజలు గొడవ చేయట్లేదు కదా అని ఇష్టారాజ్యంగా ధరలు పెంచిన కేంద్రం.. గుజరాత్, హిమాచల్ ఎన్నికల దడతో దిగొచ్చింది. మొన్న ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు జరిగిన ఉప ఎన్నికల్లో ఫలితాలు కాస్త తేడారావడంతో లీటరు పెట్రోలుపై రూ.5, డీజిలుపై రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. రైతులకు బాసటగా నిలుస్తూ, ద్రవోల్బణాన్ని కట్టడి చేస్తూ, ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్కారు వెల్లడించింది. నిజంగా అందుకే అయితే, ఎన్నికల తర్వాత ధరలు ఎందుకు పెరిగాయన్న ప్రశ్నకు కేంద్ర పాలకులే సమాధానం చెప్పాలి.
అంతేకాదు, అంతకుముందు విద్యుత్ వాహనాల్ని ప్రోత్సహించడానికి పెట్రోల్ రేట్లు పెంచుతున్నామని, రేట్లు పెంచినా వినియోగం గతం కంటే పెరిగిందని కాకమ్మ కథలు చెబుతూ వచ్చారు ఢిల్లీ పెద్దలు. ఇంధన ధరలు పెరిగినప్పుడు, పెంచుతూ వచ్చిన పాలకులు, తగ్గినప్పుడు ఆ ప్రయోజనం జనాలకు దక్కకుండా ఖజానాకు మల్లించుకున్నారు. పెట్రోల్, డీజిల్ భారీగా తగ్గించామంటూ, తమది సంక్షేమ పథకమంటూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. మే 1, 2020, ప్రస్తుతం పెట్రోల్ ధరను పోలుస్తూ ట్వీట్ చేశారు. మే 1, 2020 న పెట్రోల్ ధర రూ.69.5గా ఉంది. మార్చి 1, 2022కి అది రూ.95.4కు పెరిగింది. మే 1 నాటికి రూ105.4కు చేరుకుంది. మళ్లీ మే 22నాటికి రూ. 96.50కి చేరింది. ప్రజలను మోసం చేయడం ఆపాలని, మండిపోతున్న ధరల నుంచి వారికి నిజమైన ఉపశమనం కల్పించాలన్నారు రాహుల్ గాంధీ.
కేంద్రం, రాష్ట్రం, అధికారపక్షం, రాజకీయ పక్షం, ఇలా పెట్రోల్ రేట్లపై మాటల తూటాలు బాగానే పేల్చుకుంటున్నాయి. రెండు ప్రభుత్వాలూ కలిసి దోచుకున్నాయి. కానీ సమన్వయంతో వ్యవహరించి సామాన్యులకు ఊరట ఇవ్వడం లేదు. సామాన్యులకు సాంత్వన చేకూర్చేలా- పెట్రో ఉత్పత్తులకు జీఎస్టీని వర్తింపజేయడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకతాటిపైకి వచ్చి ముందుకుసాగితేనే కామన్ మ్యాన్ కు రిలీఫ్.
ప్రపంచంలోని మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారు భారత్. మార్చి నుంచి ముడి చమురు దిగుమతులు సుమారు 9.7 శాతం పెరిగాయి. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ డేటా ప్రకారం, అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే దాదాపు 14.3 శాతం పెరిగి 20.87 మిలియన్ టన్నులకు చేరింది. అక్టోబర్ 2018 తర్వాత ఇదే అత్యధికం. పాశ్చాత్య ఆంక్షలతో మాస్కోతో వాణిజ్యానికి దూరంగా ఉండడంతో రష్యా తక్కువ ధరకు మనకు చమురు ఎగుమతి చేసింది. దీంతో భారత్ కంపెనీలు రష్యా నుంచి చమురు దిగుమతులు పెంచాయి. ట్యాంకర్ ట్రాకింగ్ డేటా ప్రకారం ఏప్రిల్‌లో భారతదేశానికి నాలుగో అతిపెద్ద చమురు సరఫరాదారుగా మారింది రష్యా. తక్కువ రేటుకు రష్యా నుంచి ఇంధనాలు సరఫరా అవుతుండటంతో, జనాలకు కొంత ఉపశమనంగా రేట్లు తగ్గించింది కేంద్రం. కానీ పెంచిన మేరకు తగ్గించలేదన్న విమర్శలున్నాయి.
మన్మోహన్ సింగ్ ప్రభుత్వ సమయంలో అంతర్జాతీయంగా ముడి చమురు బ్యారెల్ ధర 120 డాలర్ల వరకూ పెరిగింది. కానీ, మోడీ వచ్చాక 60 డాలర్లకే పడిపోయినా, పెట్రోల్ ధర రూ.100ను తాకింది. బ్యారెల్ చమురు ధర భారీగా తగ్గినా రేట్ల తగ్గింపుకు కేంద్రానికి అప్పుడు మనసు రాలేదు కేంద్రానికి.
బహుశా ప్రపంచంలో ఏ దేశంలోనూ పెట్రోల్‌పై ఇంత భారీగా పన్నులు లేవు. బ్రిటన్‌లో 61 శాతం, ఫ్రాన్స్‌లో 59 శాతం, అమెరికాలో 21 శాతం పన్నులు విధిస్తున్నారు. ద్రవ్యలోటును పూడ్చుకునేందుకు ప్రభుత్వం ఇంధనంపై భారీ స్థాయిలో పన్నులు విధిస్తోంది. ఇప్పటి వరకు ఈ పన్నుల ద్వారా రూ. 20 లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానాలో చేరాయి. ఇలాంటి సమయంలో రష్యా నుంచి ముడిచమురును…డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయడం వల్ల పెట్రోలు, డీజిల్ తగ్గిపోయే అవకాశం ఉందన్న ప్రచారం జరిగింది. కానీ వెంటనే జరగలేదు. ఇప్పుడు కొంత రిలీఫ్ ఇచ్చింది కేంద్రం.
పెట్రోల్ రేట్ల పెరుగుదలకు కేంద్రం చెబుతున్న మరో కారణం ఆయిల్ బాండ్లు. ప్రభుత్వ బడ్జెట్ డేటా ప్రకారం.. గత యూపీఏ ప్రభుత్వ కాలంలో జారీ చేసిన సుమారు 1.31 లక్షల కోట్ల చమురు బాండ్లను 2026 మార్చి నాటికి చమురు కంపెనీలకు చెల్లించాల్సి ఉంది. క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గణాంకాల ప్రకారం, కేంద్ర ప్రభుత్వం 2014 నుండి చెల్లించాల్సిన అసలులో రూ.3,500 కోట్లు తిరిగి చెల్లించింది. ఈ సంవత్సరం ప్రభుత్వం చెల్లిస్తోంది 10 వేల కోట్ల రూపాయల విలువైన బాండ్ల మెచ్యూరిటీ. అక్టోబర్ 16, 2006న 15 సంవత్సరాలపాటు చెల్లే విధంగా 5 కోట్ల విలువైన చమురు బాండ్లను అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆయిల్ కంపెనీలకు జారీ చేసింది.
2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి 10 నెలల్లో పన్నుపై వచ్చే ఆదాయం పెట్రోల్, డీజిల్ రూ. 2.94 లక్షల కోట్లకు పెరిగింది. కరోనా మహమ్మారి కారణంగా దేశంలో దీర్ఘకాలిక లాక్‌డౌన్లు విధించిన సంవత్సరంలో, పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గింది. చమురు కంపెనీల బాండ్లకు కోసం కేంద్ర ప్రభుత్వం అసలు రూ.1.31 లక్షల కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి వడ్డీ కూడా కలిపితే రెట్టింపు అవుతుంది. అప్పుడు చమురు కంపెనీలకు చెల్లించే మొత్తం రూ. 2.62 లక్షల కోట్లకు అటు ఇటుగా ఉంటుంది. ఈ మొత్తం కేంద్ర ప్రభుత్వం ఏడాదిలోపు సంపాదించిన పన్ను కంటే తక్కువ అని స్పష్టమైంది. పెట్రోల్ పై పన్నుల రూపంలో వసూలు చేస్తున్న డబ్బంతా ఎక్కడకు పోతుందో కేంద్రం స్పష్టమైన సమాధానం చెప్పడం లేదు.
పెట్రోలు, డీజిల్ మూలధరకు కేంద్రం విధించే ఎక్సైజ్ సుంకం కలపగా వచ్చే మొత్తంపై రాష్ట్రాలు అమ్మకపు పన్ను, వ్యాట్ వసూలు చేస్తాయి. తెలంగాణలో పెట్రోలుపై 35.20శాతం, డీజిల్‌పై 27శాతం చొప్పున వ్యాట్ విధిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలుపై 31 శాతం వ్యాట్, లీటరుకు రూ.4 అదనపు వ్యాట్‌తోపాటు రూ.1 చొప్పున రోడ్డు అభివృద్ధి సెస్ వసూలు చేస్తున్నారు. డీజిల్‌పై 22.25 శాతం వ్యాట్, లీటరుకు రూ.4 చొప్పున అదనపు వ్యాట్, రూ.1 చొప్పున రోడ్డు అభివృద్ధి సెస్ విధిస్తున్నారు. 2020-21లో ఈ పన్నుల రూపేణా రూ.11,014 కోట్ల రాబడి వచ్చింది.
తాజాగా ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో పెట్రోల్, డీజిల్ ధరల్లో భారీగా తగ్గాయి. అంతేకాకుండా రాష్ట్రాలు వ్యాట్ కు కోత పెట్టాయి. లీటర్ పెట్రోల్, డీజిల్ రేట్లు, చాలా రాష్ట్రాల్లో సెంచరీ దిగువకు తగ్గాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72. అయితే మే 22న, ఎక్సైజ్ సుంకం తగ్గింపు కారణంగా దీని ధర రూ.8.69 తగ్గింది. ముంబైలో లీటర్ పెట్రోల్‌పై రూ.9.16 తగ్గి రూ.111.35కి చేరుకుంది. కోల్‌కతాలో ధర రూ.9.09 తగ్గి రూ.106.03కి చేరుకుంది. చెన్నైలో ఈ ధర రూ.8.22 తగ్గడంతో రూ.102.63కి పడిపోయింది. ఇక ఢిల్లీలో లీటరు డీజిల్ ధర రూ.89.62గా ఉంది. మే 22న ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.7.05 తగ్గించారు. ముంబైలో లీటర్ డీజిల్ ధర రూ.7.49 తగ్గింపు తర్వాత రూ.97.28గా ఉంది. కోల్‌కతాలో రూ.7.07 తగ్గి రూ.92.76కి, చెన్నైలో రూ.6.7 తగ్గి రూ.94.24కి చేరుకుంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై రూ.9.83 తగ్గి ప్రస్తుతం రూ.109.67 ఉండగా, డీజిల్‌పై రూ.7.67 తగ్గి రూ.97.82కు చేరుకుంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ 103.94 వుంది.
ఇంతకాలమూ పెట్రోల్ రేట్లమీద విపక్షాల దాడిని తిప్పికొట్టేందుకు చేసిన సమర్థింపు వాదనలకు పూర్తిభిన్నంగా ఇకపై నిత్యావసరాల ధరలు తగ్గుతాయనీ, ద్రవ్యోల్బణం బాగుంటుందనీ, ఆర్థికం మెరుగుపడుతుందనీ బీజేపీ నాయకులు చెబుతున్నారు. 2020లో కఠినమైన కరోనా కాలంలో కేంద్రం పెంచేసిన మొత్తాలతో పోల్చితే ఈ తగ్గింపులు చిన్నవేననీ విపక్ష నేతలు అంటున్నారు. కేంద్రం నిర్ణయం చాలా రాష్ట్రాలకు సవాలుగా మారింది. అనేక రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్ మీద తాము ఇప్పటికే తక్కువ పన్ను వసూలు చేస్తున్నామనో, చాలా ఏళ్ళుగా ఆ రేట్లను సవరించలేదనో చెబుతున్నాయి. సుదీర్ఘకాలంగా పెట్రో ధరలు పెరుగుతున్న తరుణంలో, కొన్ని రాష్ట్రాలు ఇటీవలికాలంలో ఎన్నికల కోసమో, ఇతరత్రా రాజకీయ కారణాల చేతనో వ్యాట్ ను ఇప్పటికే తగ్గించాయి. అందువల్ల, ఇప్పుడు కేంద్రంతో పోటీపడటం వాటికి సవాలుగా మారిందన్న విశ్లేషణలు జరుగుతున్నాయి.
పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్ల ఎఫెక్ట్ అన్ని అన్ని రంగాలపైనా వుంటుంది. రవాణా చార్జీలు పెరుగుతాయి. అనేక రకాల నిత్యావసరాల వస్తువుల రేట్లు ఎగబాకుతాయి. ఇప్పటికే నూనెలు, పప్పులు, కూరగాయల రేట్లు భారీగా పెరిగాయి. టమాటా కిలో 80 రూపాయలు దాటుతోంది. సామాన్యుల బతుకు బండి భారంగా సాగుతోంది. ఎన్నడూలేని స్థాయికి ద్రవ్యోల్బణం చేరింది. టోకు ద్రవ్యోల్బణం 15.08శాతానికి, రిటైల్ ద్రవ్యోల్బణం 7.79 శాతానికి చేరి ఎనిమిదేళ్ల రికార్డును తుడిచిపెట్టేసింది. సిమెంటు, స్టీల్ ధరలు పెరిగి గృహనిర్మాణంపై తీవ్రప్రభావం చూపిస్తున్నాయి. ఫలితంగా ఉపాధి కల్పన పడిపోతుండడంతో దిద్దుబాటు చర్యలకు దిగింది కేంద్ర ప్రభుత్వం.
గత ఏడాది నవంబరులో కేంద్రం లీటర్ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ఇప్పుడు రూ.8, రూ.6 చొప్పున కోత వేసింది. దీంతో ప్రస్తుతం పెట్రోల్‌పై రూ.19.9, డీజిల్‌పై రూ.15.8 చొప్పున ఎక్సైజ్ సుంకం అమల్లో ఉంటుంది. 2020లో గరిష్ఠంగా లీటర్ పెట్రోల్‌పై రూ.32.9, డీజిల్‌పై రూ.31.8 ఎక్సైజ్ సుంకం అమల్లో ఉండేది. అప్పటి నుంచి ఇప్పటివరకు పెట్రోల్ రూ.13., డీజిల్‌పై రూ.16 తగ్గించినట్టయ్యిందని నిపుణులు చెబుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం పేరుతో భారీగా వసూలు చేస్తున్నా, పన్నుల వాటా రూపంలో రాష్ట్రాలకు తిరిగిచ్చేది మాత్రం అత్యల్పమే. తాజాగా పెట్రోల్‌పై లీటర్‌కు రూ.8, డీజిల్‌పై రూ.6 తగ్గించడంతో వాటిపై వసూలు చేసే ఎక్సైజ్ డ్యూటీ వరుసగా రూ.19.90, రూ.15.80కి తగ్గిపోయింది. అయితే నిజానికి కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంచే వాటా ప్రకారం ఇందులో 41 వాతం రాష్ట్రాలకు దక్కాలి. కేంద్ర ప్రభుత్వం ఈ ఎక్సైజ్ డ్యూటీని బేసిక్, స్పెషల్ అడిషినల్, అడిషినల్ ఎక్సైజ్‌డ్యూటీల పేరుతో మూడు వేర్వేరు కేటగిరీలుగా డివైడ్ చేసింది. ఇందులో పెట్రోల్‌పై బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ కింద లీటర్‌కు రూ.1.40, డీజిల్‌పై రూ.1.80 వసూలు చేస్తోంది. ఈ మొత్తాన్ని మాత్రమే పన్ను వాటా కింద రాష్ట్రాలకు ఇస్తోంది.
15వ ఆర్థిక సంఘం చెప్పినదాని కేంద్రం నడుచుకోవడం లేదు. రాష్ట్రాలకు పెట్రోలియం ఉత్పత్తులపై విధించే బేసిక్ ఎక్సైజ్ డ్యూటీని మాత్రమే రాష్ట్రాలకు పంపిణీ చేస్తున్నామని, ప్రస్తుతం ఇది పెట్రోల్‌పై రూ.1.40, డీజిల్‌పై రూ.1.80 మాత్రమే ఉందని రాజ్యసభకు వెల్లడించింది కేంద్రం. అందుకే 2020-21 ఆర్థిక సంవత్సరంలో పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి రూ.3,71,908 కోట్లు వచ్చినా, ఇందులోరాష్ట్రాలకు రూ.19,972 కోట్లు మాత్రమే పంపిణీ ఇచ్చింది. అదే రాష్ట్రాలకు ఆగ్రహం తెప్పిస్తోంది.
పెట్రోల్ పై వేసే పన్నుల్లో సింహభాగం కేంద్రం ఖజానాకే వెళ్తున్నా.. రాష్ట్రాలూ తక్కువ తినలేదు. కనీసం తమ పరిధిలో తామైనా పన్ను తగ్గిద్దామని ఆలోచించడం లేదు. అంతెందుకు పెట్రోల్ ను జీఎస్టీలో చేర్చబోమని కేంద్రం హామీ ఇచ్చాకే.. జీఎస్టీ బిల్లుకు రాష్ట్రాలు సహకరించాయి. మొన్నటికి మొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా.. జీఎస్టీలో పెట్రోల్ ను చేర్చడానికి రాష్ట్రాలు సుముఖంగా లేవని తేల్చేశాయి. అయితే పెట్రోల్ ఆదాయం లేకుండా ప్రభుత్వాలు నడపడం కష్టమని, అందుకే ఇష్టం లేకపోయినా పన్నులు వేయాల్సి వస్తోందని రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఇలా ఎవరి లాభం వాళ్లు చూసుకుంటూ.. మధ్యలో సామాన్యుల్ని బలిపశువుల్ని చేస్తున్నారు.
రాష్ట్రాలు పెట్రో పన్నుల ఆదాయంపై ఆధారపడ్డాయా?
కేంద్రం బాటలో పెట్రోల్ పై పన్ను తగ్గించని రాష్ట్రాల జాబితాలో ఏపీ, తెలంగాణ కూడా ఉన్నాయి. ఇది బీజేపీకి గొప్ప అవకాశంగా మారింది. తెలంగాణ బీజేపీ ఈ అంశంలో మరింత దూకుడుగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. తెలుగు రాష్ట్రాలు ఇప్పటికే ఆర్థిక సమస్యల్లో ఉన్నాయి. రాజకీయం కోసమో.. మరో కారణమో కాని అలవి మాలిన అప్పులు చేసి ఆదాయం పెంచుకునే పరిస్థితి లేక అప్పులపై ఆధారపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెట్రో ధరలపై పన్ను తగ్గిస్తే ఆ భారం ఎక్కువగా ఉంటుంది. అందుకే తగ్గించే ఆలోచన చేయడం కష్టం. అయితే పన్నులు తగ్గించాలన్న రాజకీయ పార్టీల డిమాండ్‌కు ప్రజలు కూడా గొంతు కలిపితే ప్రభుత్వాలకు ఇబ్బందికర పరిస్థితులు తప్పవు.
అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా పెట్రోల్ రేట్ల ధరలు నిర్ణయిస్తున్నామని కేంద్రం కొంతకాలంగా చెవిలో పూలు పెడుతోంది. అదే నిజమైతే చమురు సంస్థలు స్వతంత్రంగా నిర్ణయించాలి. కానీ ఎన్నికల సమయంలో పెట్రోల్ ధరల పెరుగుదల ఆగిపోతోంది. ఫలితాలు రాగానే ఒక్కసారిగా పెంచేస్తున్నారు. కొంతకాలం క్రితం ఉపఎన్నికల ఫలితాలు తేడా కొట్టాగనే ధరలు దిగొచ్చాయి. ఇప్పడు గుజరాత్ ఎన్నికల వ్యూహంతో కేంద్రం రేట్లు తగ్గించిందన్న వాదన వినిపిస్తోంది. ఇవన్నీ చూస్తూ.. పెట్రోల్ తో పాలిటిక్స్ కు సంబంధం లేదంటే సామాన్యులు ఎలా నమ్ముతారో.. ప్రభుత్వాలకే తెలియాలి. ప్రజల్ని మోసం చేయడంలో ఆరితేరిపోయిన నేతలు.. మోకాలికి, బోడిగుండుకు ముడిపెడుతూ.. అర్థంపర్థం లేని లాజిక్కులు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. పెట్రోల్ రేట్లు తగ్గించండి మహాప్రభో అంటే.. ఫ్రీగా వ్యాక్సిన్ వద్దా.. స్కీములు వద్దా.. గ్రామీణ ఉపాధి హామీ పథకం వద్దా.. అంటూ ఏవేవో కబుర్లకు పరిమితం అవుతున్నారు.
ముడి చమురుధర అత్యంత కనిష్టంగా ఉన్నప్పుడు, అదనపు సుంకాలతో ఆ మేరకు ఖజానా నింపుకుంది కేంద్రం. ఇప్పుడు పెట్రోమంటలనుంచి ప్రజలకు కాస్తంత ఉపశమనం కలిగించేందుకు పదో పరకో తగ్గించింది. కరోనా కాలంలో చమురు అమ్మకాలు బాగా పడిపోయినందున కేంద్రానికి ఆదాయం తగ్గింది. ఇప్పుడు అమ్మకాలు కరోనా ముందుకాలం నాటికి చేరినందున, ఇటువంటి బహుమతులు ఎన్ని ఇచ్చినా ఆదాయానికి లోటుండదని ఆర్థికవేత్తలు అంటున్నారు. ఆర్థికం మెరుగుపడుతూ జీఎస్టీ వసూళ్ళు కూడా పెరిగినందున, ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్న చమురును ఇంకా మండించాల్సిన అవసరం లేదని కేంద్రం అనుకుని ఉండొచ్చు. దీనికి తోడు గుజరాత్ ఎన్నికల ముందుచూపుతో నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. కేంద్రం తలుచుకుంటే పెట్రోల్ ధరలు ఇంకా తగ్గించే అవకాశం ఉందని, అలా చేసినా ఖజానాకు లోటేమీ ఉండదని నిపుణులు చెబుతున్నారు. అయితే, మేము తగ్గించాం, మీరు తగ్గించాలంటూ రాష్ట్రాలకు సవాల్ విసురుతోంది కేంద్రం. పెంచింది కొండంత, తగ్గించింది గోరంత అటూ కొన్ని రాష్ట్రాలు కూడా తిప్పికొడుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నలిగిపోతోంది మాత్రం సామాన్యుడే.