Storyboard: జీఎస్టీ స్వరూపంలో కేంద్రం కీలక మార్పులు తీసుకొచ్చింది. ఇకపై స్టాండర్డ్ , మెరిట్ పేరుతో జీఎస్టీలో రెండే శ్లాబులు ఉంటాయి. వాటిలో ఒకటి 5% కాగా రెండోది 18%. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు పదిన్నర గంటలసేపు కొనసాగిన జీఎస్టీ పాలకమండలి 56వ సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం 12%, 28% పన్ను శ్లాబులు ఇక ఉండవు. గుట్కా, పొగాకు, పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లపై మినహా మిగిలిన ఉత్పత్తులపై పన్ను మార్పులు ఈ నెల 22 నుంచే అమల్లోకి రానున్నాయి. తలనూనెలు, కార్న్‌ఫ్లేక్స్, టీవీలు, వ్యక్తిగత ఆరోగ్య ఉత్పతులు వంటివాటిపై పన్ను తగ్గనుంది. రోటీ, పరోటాలపై జీఎస్‌టీ సున్నా. ప్రాణాధార ఔషధాలపై ఎటువంటి పన్ను లేదు. ఖరీదైన కార్లు, పొగాకు ఉత్పత్తులు-సిగరెట్లపై ప్రత్యేకంగా 40 శాతం స్లాబును ప్రతిపాదించారు. దాదాపుగా వ్యక్తిగత వస్తువులన్నింటికీ పన్ను తగ్గించడం ద్వారా దేశీయ వినిమయాన్ని పెంచి.. అమెరికా సుంకాల భారం నుంచి కొంత ఉపశమనం పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. దేశీయ వాణిజ్యాన్ని పరుగు పెట్టించేందుకు, వినియోగాన్ని గణనీయంగా ప్రోత్సహించే దిశగా నిర్ణయాలు తీసుకున్న జీఎస్‌టీ మండలి.. పండగ సీజన్‌ను మరింత ఉత్సాహభరితంగా మార్చింది. వ్యక్తిగత, ఆరోగ్య బీమా పథకాలపై జీఎస్‌టీ రద్దు చేయడం.. కోట్ల మందికి బీమాను చేరువ చేసేందుకు ఉపయోగపడనుంది. అన్ని నిర్ణయాలనూ ఏకాభిప్రాయంతో తీసుకున్నామని, ఏ ఒక్క రాష్ట్రం వీటిని వ్యతిరేకించలేదని నిర్మలా సీతారామన్ తెలిపారు.
సామాన్య ప్రజల జీవితాలను మెరుగుపరచడం, ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణపై స్థూలంగా ఒక ప్రతిపాదనను కేంద్రం రూపొందించింది. దీనిపై జీఎస్టీ మండలి ఉమ్మడిగా నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ రేట్లలో కొత్త మార్పులతో చిరు వ్యాపారులు, రైతులు, మధ్యతరగతి, మహిళలు, యువతకు మేలు జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా ఇన్సూరెన్స్ రంగానికి జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చారు. అన్ని రకాల హెల్త్, లైఫ్, టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలపై జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ క్రమంలో ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గుతుంది బీమా రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ తగ్గింపు పూర్తిస్థాయిలో అమలు కాకపోవచ్చనే అంచనాలూ లేకపోలేదు. ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ సదుపాయం ఉండని తరుణంలో.. పూర్తిస్థాయిలో పన్ను తగ్గింపు బదిలీ ఇన్సూరెన్స్ చెల్లింపుదారులకు బదిలీ కాదని, కాకపోతే ప్రస్తుత ప్రీమియంలో ఎంతో కొంత తగ్గుదల ఉంటుందని ఊహిస్తున్నారు. ఇది ఎంత అనేది ఆయా కంపెనీల ఆదాయవ్యయాల నిష్పత్తిపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. ఇక్కడ ఎంత తగ్గుతుందనే విషయాన్ని పక్కనపెడితే.. ఇన్సూరెన్స్ రంగాన్ని జీఎస్టీ నుంచి మినహాయించడంతో.. చిరకాల డిమాండ్ నెరవేరిందని ఆ పరిశ్రమ వర్గాలు సంతోషపడుతున్నాయి. ఈ చర్య ఇన్సూరెన్స్ రంగ భవిష్యత్తుకు ఢోకా లేకుండా చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
కేంద్ర ప్రభుత్వ తాజా ప్రకటనపై పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తంచేశారు. దీపావళి కానుక అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. ఇప్పుడు కిరాణ సామగ్రి తక్కువకే లభిస్తుంది. ఆరోగ్య సంరక్షణ ఖర్చు తగ్గుతుంది. విద్య అందుబాటు ధరలో ఉంటుంది. రైతులకు మద్దతు దొరుకుతుందని ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ఎక్స్‌లో పోస్టు పెట్టారు. లే.. మేలుకో.. గమ్యం చేరేవరకు విశ్రమించొద్దు. దయచేసి మరిన్ని సంస్కరణలు తీసుకురండని మరో పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఎక్స్‌లో పేర్కొన్నారు. అయితే జీఎస్టీ హేతుబద్ధీకరణతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే నష్టం పరిస్థితేంటనే చర్చ కూడా జరుగుతోంది. అయితే ఈ విషయంలో కూడా కేంద్రం ముందే వ్యూహరచన చేసిందని నిపుణులు చెబుతున్నారు. జీఎస్టీ రేట్ల తగ్గింపు కారణంగా మొదట్లో ఆదాయం తగ్గినా.. క్రమంగా పూర్వస్థితికి వస్తామని చెబుతున్నారు. పైగా జీఎస్టీ సంస్కరణ లక్ష్యమైన వినియోగం పెరిగితే.. కచ్చితంగా నష్టం పూడుతుందని కూడా కేంద్రం ధీమాగా ఉంది. అయితే రాష్ట్రాలు మాత్రం తమ రెవిన్యూ నష్టంపై ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే విపక్ష పాలిత రాష్ట్రాలు తమ సంగతేంటో తేల్చాలని కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. ఈ పరిస్థితుల్లో జీఎస్టీ 2.0 లాభనష్టాలపై ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ఆశాజనకంగానే ఉండటం ఊరట కలిగిస్తోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
జీఎస్టీ 2.0తో రాష్ట్రాలకు నికరంగా లాభమేనని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ నివేదిక విశ్లేషించింది. జీఎస్‌టీ 2.0 పేరుతో విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని పేర్కొంది. రాష్ట్రాల ఆదాయాన్ని 14 శాతం పెంచి, రక్షించాలని జీఎస్‌టీ విధానాన్ని రూపొందించగా.. గత అయిదేళ్లలో రాష్ట్రాలు రూ.63,265 కోట్లు అదనంగా పొందాయని తెలిపింది. జీఎస్‌టీ ఆదాయం పెంచుకోవడం ద్వారా ప్రతి రూ.100 జీఎస్‌టీలో రాష్ట్రాలకు దాదాపు రూ.70.5 వస్తున్నట్లు వివరించింది. జీఎస్‌టీ ప్రవేశ పెట్టినప్పుడు రాష్ట్రాలకు అయిదేళ్ల వ్యవధిలో 14 శాతం వార్షిక ఆదాయ పెరుగుదలకు హామీ ఇచ్చారు. విలాస వస్తువులు, హానికర ఉత్పత్తులపై సెస్ వసూలు చేసి, ఆదాయ లోటును భర్తీ చేస్తామనీ పేర్కొన్నారు. కానీ, కరోనా మహమ్మారి కారణంగా ఆదాయ లోటు పెరిగింది. కేంద్రం రూ.2.69 లక్షల కోట్ల రుణాలు తీసుకుని, ఆ మొత్తాన్ని రాష్ట్రాలకు అందించింది. మొత్తంగా రాష్ట్రాలు రూ.9.14 లక్షల కోట్ల పరిహారం పొందాయి. ఇది హామీ ఇచ్చిన మొత్తంతో పోలిస్తే రూ.63,265 కోట్లు అధికమని ఎస్‌బీఐ రీసెర్చ్ పేర్కొంది.
2025-26 ఆర్థిక సంవత్సరంలోనూ రాష్ట్రాలు జీఎస్‌టీ పేరంగా నికర ఆదాయంతోనే ఉంటాయని ఎస్‌బీఐ రీసెర్చ్ అంచనా వేసింది. 9.5 శాతం నికర జీఎస్‌టీ రేటుతో అదనంగా రూ.52,000 కోట్ల ఆదాయం వస్తుందని, దీంట్లో రాష్ట్రాలకు, కేంద్రానికి రూ.26,000 కోట్ల చొప్పున వస్తుందని వివరించింది. రాష్ట్రాల వారీగా అంచనాలు కూడా నివేదికలో పేర్కొంది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎస్‌టీ అంచనా ఆదాయం రూ.35,863 కోట్లుగా ఉండగా, జీఎస్‌టీ సవరణ అనంతరం రూ.52,622 కోట్ల వరకూ ఆదాయం లభిస్తుందని ఎస్‌బీఐ రీసెర్చ్ అంచనా వేసింది. అంటే, రూ.16,759 కోట్ల వరకూ ఆదాయం పెరగనుందని పేర్కొంది. తెలంగాణ విషయానికి వస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎస్‌టీ ఆదాయం రూ.42,075 కోట్లు వచ్చే అవకాశం ఉండగా, సవరణ తర్వాత రూ.8,705 కోట్లు అదనంగా మొత్తం రూ.50,779 కోట్లు రావొచ్చని నివేదిక వెల్లడించింది. గతంలో జులై 2018, అక్టోబరు 2019లో రేట్లు తగ్గించినప్పుడు తాత్కాలికంగా 3-4% రాబడి తగ్గినా తర్వాత 5-6% వృద్ధితో రాష్ట్రాలకు మరింత ఆదాయం వచ్చిందని పేర్కొంది. మొత్తంగా రూ.లక్ష కోట్ల అదనపు ఆదాయం వచ్చిందని పేర్కొంది. జీఎస్‌టీ వ్యవస్థ గిరాకీని పెంచడమే కాకుండా, పన్ను వ్యవస్థను సరళీకరించిందని తెలిపింది.
ఈ అంచనాలను దృష్టిలో పెట్టుకున్నా.. గత ఎనిమిదేళ్ల జీఎస్టీ ఆదాయాన్ని విశ్లేషించినా అంత కంగారు పడాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దేశంలో జీఎస్టీ ప్రవేశపెట్టినప్పుడు కూడా పలురకాల పన్నులు ఎత్తేసి.. ఒకటే పన్ను అంటే ఆదాయం తగ్గుతుందని భయపడ్డారని గుర్తుచేశాయి. కానీ వాస్తవం వేరేగా ఉందని గణాంకాలు రుజువు చేశాయని తెలిపాయి. జీఎస్టీ ఆదాయ స్థిరీకరణకు కాస్త సమయం పట్టిందని, ఒక్కసారి జీఎస్టీ ఆదాయ స్థిరీకరణ జరిగిన తర్వాత.. పన్ను వసూళ్లు క్రమంగా పెరిగాయని విశ్లేషించాయి. ఇప్పుడు కూడా నష్టాలు, వాటిని పూడ్చుకోవడంపై పక్కా అంచనాలు వేసుకున్నాకే.. కేంద్రం జీఎస్టీ హేతుబద్ధీకరణ నిర్ణయం తీసుకుందని చెబుతున్నాయి.