Story Board: మీ అభిప్రాయం నాకు నచ్చకపోవచ్చు. మీ అభిప్రాయంతో నేను ఏకీభవించకపోవచ్చు. మీ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా, నిర్భయంగా చెప్పడానికి నీకున్న హక్కును కాపాడటానికి నా ప్రాణాలైనా ధారపోస్తా అన్నాడు ఫ్రెంచ్ తత్వవేత్త వాల్తేర్. ప్రజాస్వామ్యానికి పునాది పత్రికా స్వేచ్ఛ. అలాంటి పత్రికా స్వేచ్ఛ దేశంలో…రాష్ట్రంలో ప్రమాదంలో పడింది. ఎక్కడైతే పత్రికా స్వేచ్ఛ ఉంటుందో అక్కడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ప్రజాస్వామ్యానికి నాలుగు మూలస్థంభాలున్నాయి. శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖలు. నాలుగో స్థంభమైనది మీడియా. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య మీడియా వారధిగా పనిచేస్తుంది. ప్రభుత్వ పథకాల అమలులో లోపాలను, పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నిర్మాణాత్మకమైన సూచనలు, సలహాలు ఇవ్వడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ విద్వక్తధర్మాన్ని వారి భుజస్కంధాలపై వేసుకుని తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. సమాజంలో, సర్కార్లలో మంచి చెడులను చెప్పడమే మీడియా ఏకైక బాధ్యత.
ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లను కదిలిస్తుందని కాళోజీ చెప్పిన మాటలు గుర్తు చేసుకోవాలి. ప్రజలకు నిజాలు చెప్పడం మీడియా ప్రధాన కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని విస్మరించి మౌనంగా ఉంటే ప్రభుత్వ తప్పిదాలను అంగీకరించడమే అవుతుంది. పత్రికా స్వేచ్ఛను హరించిన ఏ ప్రభుత్వం కూడా ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు. ఇది చరిత్ర చెబుతున్న కఠోర వాస్తవం. ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభమైన ఎన్టీవీపై పోలీసులు దాష్టీకంగా వ్యవహరించారు. మీడియా తన బాధ్యతలు నిర్వర్తిస్తే…జర్నలిస్టులను అర్దరాత్రి అరెస్టు చేస్తున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా…కుటుంబంతో కలిసి పండగకు వెళ్తున్న జర్నలిస్టులను అరెస్ట్ చేశారు. ఎలాంటి కారణాలు చెప్పకుండా ఎయిర్‌పోర్టులో ఎన్టీవీ తెలంగాణ ఇన్‌పుట్ ఎడిటర్ దొంతు రమేశ్‌ను ఎత్తుకెళ్లారు. మరో ఇద్దరు సీనియర్ జర్నలిస్టులు చారి, సుధీర్‌లను…టెర్రరిస్టుల్లా అర్ధరాత్రి ఇళ్లకు వెళ్లి అక్రమంగా అరెస్ట్ చేశారు.
బాధ్యతయుతంగా పని చేస్తున్న జర్నలిస్టులు ఏమైనా తాలిబన్లా ? పాకిస్తాన్ ఉగ్రవాదులా ? అంతదారుణంగా, అక్రమంగా…స్టేషన్‌కు ఈడ్చుకెళతారా ? ఎన్టీవీ జర్నలిస్టులు ఏమైన సంఘ విద్రోహ శక్తులా ? దేశ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొన్నారా ? ప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వంలో భాగంగా ఉన్న మంత్రులు, అధికారుల తప్పులను ప్రశ్నించడమే ఎన్టీవీ చేసిన తప్పా ? తెలంగాణ పోలీసులు ఎందుకు అంత అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఒక న్యూస్ ఛానల్ కార్యాలయంలోకి అక్రమంగా రావడానికి పోలీసులకు అధికారం ఎవరిచ్చారు ? ఎన్టీవీ కార్యాలయంలోకి దూసుకొచ్చి…జర్నలిస్టులను బెదిరించడమేంటి ? మందీ మార్బలంతో కార్యాలయంలోకి రావడమే కాకుండా…జర్నలిస్టులను బెదిరిస్తారా ? ఎంత పోలీసులు అయితే మాత్రమే రూల్స్ పాటించకుండా అడ్డదిడ్డంగా వ్యవహరిస్తారా ? నోటీసులు ఇవ్వకుండా కార్యాలయంలోకి ఎలా చొరబడుతారు ? పోలీసులు చట్టాలను పాటించకుండా…ప్రైవేట్ కార్యాలయాల్లోకి చొరబడవచ్చా ? ఎంత ప్రభుత్వ సర్వెంట్లు అయితే మాత్రం…అడ్డగోలుగా వ్యవహరిస్తారా ?
ఎన్టీవీ కార్యాలయంలోకి అక్రమంగా దూసుకొచ్చిన పోలీసులు…లోపల ఉన్న సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారు. కథనం రాసిన సిస్టమ్ చూపెట్టకపోతే…చానల్‌లోని అన్ని కంప్యూటర్లను తీసుకెళ్తామంటూ బెదిరింపులకు దిగారు. మొత్తం ఎత్తుకుపోతాం…సర్వర్ ప్యాక్ చేయండి. అంతా తీసుకుపోతాం అంటూ పోలీసులు హడావిడి చేశారు. మాటకు ముందు మా డ్యూటీకి అడ్డు తగులుతున్నారని…తరచు ప్రవచించే పోలీసులు…రోజంతా ఎన్టీవీ జర్నలిస్టుల రెగ్యులర్ వర్క్‌కు తీవ్ర అంతరాయాలు కలిగించారు. ఎంత చెప్పినా…వినకుండా ఛానల్ సర్వర్‌ను లాగేయండి అంటూ హుంకరించారు. కేవలం ప్రభుత్వ, అధికారుల తప్పిదాలను, లోపాలను ఎత్తిచూపుతున్న మీడియాపై అక్రమ కేసులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు. నాటి బ్రిటిష్ ప్రభుత్వం 1878లో తీసుకువచ్చిన వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ గుర్తుకు వస్తోంది. ఈ చట్టం ద్వారా స్థానిక పత్రికల వార్తలను, ఎడిటోరియల్స్‌ను సెన్సార్ చేసేవారు. అతిక్రమిస్తే రాజద్రోహం కేసులు నమోదు చేసేవారు. వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ లాంటి చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చి సెన్సార్ విధించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ప్రజలకు నిజాలు చెప్పడం మీడియా ప్రధాన కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని విస్మరించి మౌనంగా ఉంటే ప్రభుత్వ తప్పిదాలను అంగీకరించడమే అవుతుంది. పత్రికా స్వేచ్ఛను హరించిన ఏ ప్రభుత్వం కూడా ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు. బ్రిటీష్ వారికి ఏ మాత్రం తీసుకోని రీతిలో వ్యవహరించారు రేవంత్ సర్కార్ పోలీసులు.
ప్రజాస్వామ్యవాదులు, ప్రజాసంఘాలు, మేధావులు అప్రమత్తంగా ఉండి రాజ్యాంగం ప్రసాదించిన ఆర్టికల్ 19(1 ఏ)ను కాపాడుకోవాలి. ఇప్పటికే టీవీలు గ్రామీణ ప్రాంతాల్లోకి చొచ్చుకుపోయాయి. వీక్షకుల సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది. ఓటర్లను ప్రభావితం చేసే శక్తి సామర్థ్యాలు మీడియాకు ఉంటుంది. కాబట్టి మీడియా బాధ్యతగా వ్యవహరించి ప్రజలకు మేలు చేసే కోణంలో కార్యక్రమాలు రూపొందిస్తే బాగుంటుంది. మీడియాపై జరుగుతున్న దాడులు నిరోధించడానికి కఠినమైన చట్టాలు తీసుకురావాలి. మీడియాపై దాడులు, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న వారి పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి సరైన సమయంలో గుణపాఠం చెప్పాలి.
ఎన్టీవీ జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేశారు హైదరాబాద్ సిటీ పోలీసులు. అర్ధరాత్రి ఇంటికొచ్చి పోలీసులు ఎన్టీవీ ప్రతినిధులను అదుపులోకి తీసుకున్నారు. జర్నలిస్టుల అక్రమ అరెస్టులను జర్నలిస్టు సంఘాలు ఖండిస్తున్నాయి. అర్థరాత్రి సమయంలో అదుపులోకి తీసుకోవడంపై మండిపడుతున్నాయి. జర్నలిస్టులను భయపెట్టడానికే ఈ తంతు అంటూ పాత్రికేయ సంఘాలు ఫైర్ అవుతున్నాయి. IASల కళ్లలో ఆనందం కోసమే.. IPSలు ఓవరాక్షన్ చేశారని అంటున్నారు. టీవీ చానెల్స్, 4 యూట్యూబ్ చానెల్స్ పై కేసులా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, కాలేరు వెంకటేశ్ సహా బీఆర్ఎస్ నేతలు సీసీఎస్ వద్ద ఆందోళన చేశారు.
జర్నలిస్టుల అక్రమ అరెస్ట్‌లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. పండుగ సందర్భంగా ముగ్గురు జర్నలిస్టుల అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నట్టు ట్వీట్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన ప్రతీసారి ఎమర్జెన్సీని తలపిస్తోందన్నారు కేటీఆర్. తెలుగు జర్నలిస్టులను తెలంగాణ డీజీపీ నేరస్తులుగా చూడాలని నిశ్చయించుకున్నారా అని ప్రశ్నించారు. అరెస్ట్ చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల అరెస్టులపై డీజీపీతో మాట్లాడారు మాజీ మంత్రి హరీశ్ రావు. పండుగ పూట, అర్ధరాత్రి జర్నలిస్టుల ఇళ్లలోకి వెళ్లి అరెస్టులు చేయడం అవసరమా అని నిలదీశారు. ప్రొసీజర్ అనుసరించకుండా నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టులు చేస్తారని హరీష్ రావు ప్రశ్నించారు. జర్నలిస్టులు ఏమైనా క్రిమినల్సా? టెర్రరిస్టులా? ఎందుకు అంత కఠినంగా వ్యవహరిస్తున్నారని ట్వీట్ చేశారు. పండుగ పూట అరెస్టులు సరికాదన్న హరీష్ రావు.. అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలంటూ విజ్ఞప్తి చేశారు.
ఎన్టీవీ జర్నలిస్టులపై సీటీ పోలీసుల అతిగా ప్రవర్తించారు. ఇది రేవంత్ రెడ్డి సర్కార్ వికృత రాజకీయ క్రీడలో భాగమేనంటూ బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. జర్నలిస్టులపై రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతాపంపై పౌరసంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. సీసీఎస్ పోలీస్ స్టేషన్ ముందు జర్నలిస్టు సంఘాల నేతలు ఆందోళన చేశారు. ఎన్టీవీ జర్నలిస్టులను అరెస్ట్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజాసంఘాల నేతలు. అర్ధరాత్రి జర్నలిస్టుల ఇళ్లపై దాడులు చేసి, అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ పోలీసుల తీరుపై మండిపడ్డారు. సంఘ విద్రోహ శక్తులు, తీవ్రవాదులను అరెస్ట్ చేసినట్లు జర్నలిస్టులను అరెస్ట్ చేయడం ఏంటి అని ప్రశ్నించారు సెర్చ్ వారెంట్ లేకుండా ఎన్టీవీ ఆఫీసులో తెలంగాణ పోలీసులు సోదాలు చేయడాన్ని వైసీపీ నేత మల్లాది విష్ణు ఖండించారు. ఫోర్త్ ఎస్టేట్‌పై పోలీసు జులుం తగదన్నారు. వార్తపై వివరణ అడగవచ్చు కానీ అనుమతి లేనిదే మీడియా హౌస్‌లోకి వెళ్లడం, జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు మల్లాది విష్ణు.
ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్ట్‌లను వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి ఖండించారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్టీవీ జర్నలిస్టులను అరెస్ట్ చేయడం వెనుక కుట్ర దాగి ఉందన్నారు. నిష్పక్షపాతంగా, నిజాయితీగా, నిర్భయంగా..ప్రజాస్వామ్య గొంతుకను ఎన్టీవీ వినిపిస్తోందని అలాంటి ఛానెల్‌పై దాడి ప్రజాస్వామ్యాన్ని హరించివేయడమేనన్నారు భూమన కరుణాకర్‌రెడ్డి. ఎమర్జన్సీ సమయంలో కూడా ఈ రకమైన దాడులు జరగలేదన్నారు. అక్రమ అరెస్టులను ఖండించారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్‌రావు. ఇది పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలపై ప్రమాదకర దాడి అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అసలు స్వరూపం ఇదేనా అంటూ ప్రశ్నించారు రామచందర్‌రావు. అరెస్టుల విషయంలో ఇందిరాగాంధీ బాటలోనే రేవంత్ రెడ్డి ఉన్నారన్నారు. జర్నలిస్టుల అరెస్టులతో కాంగ్రెస్ సర్కార్ తన పాత ఎమర్జెన్సీ నైజాన్ని చాటుకుందని గుర్తు చేశారు. అరెస్టులను కేంద్రమంత్రి బండి సంజయ్ తప్పు పట్టారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా.. అర్ధరాత్రి అరెస్టులు చేయడమేంటని నిలదీసారు. తప్పు చేసినట్లు ప్రభుత్వం భావిస్తే.. చట్ట ప్రకారం నడుచుకోవాలని తేల్చి చెప్పారు. సీపీఐ జాతీయ నాయకుడు కే.నారాయణ కూడా ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టును ఖండించారు. పోలీసులు వ్యవరించిన తీరును తప్పబట్టారు. ఎన్టీవీ జర్నలిస్టుల అక్రమ అరెస్టులపై కాంగ్రెస్ నాయకుల్లోనూ అసహనం వ్యక్తమవుతోంది. ఈ ప్రభుత్వం మనదా..? IAS, IPSలదా..? అని ప్రశ్నించుకుంటున్నారు. IAS, IPSల ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మాటకు ముందు రేవంత్‌రెడ్డి…తనది ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటూ ఉంటారు. అంటే ఎమర్జెన్సీ కాలం నాటి ఇందిరమ్మ దాష్టీకాలు 50 ఏళ్ల తర్వాత ఇప్పుడు రేవంత్‌రెడ్డి మళ్లీ ఇలా ఆవిష్కరించాలని అనుకుంటున్నారా ? మీడియాను ఈ రూపేణ ఇలా బెదరగొట్టాలనుకుంటున్నారా ? లేక జర్నలిస్టులను అవమానకరంగా మెడపట్టి, గెంటుకుంటూ తీసుకెళ్లి మానసికంగా చంపేయాలనుకుంటున్నారా ? మీడియాతో తంపులు పెట్టుకున్న అలనాటి సమైక్యాంధ్ర పాలకులు, వివిధ రాష్ట్రాల సీఎంలు, దేశంలోని పాలక చక్రవర్తులు ఏమయ్యారో, ఏ విధంగా జనాగ్రహానికి గురయ్యారో రేవంత్, ఆయన మంత్రివర్గం ఓ సారి పునశ్చరణ చేసుకుంటే బెటర్. మీడియా తమకు భజన చేస్తూ… తమను రంజింప జేసే పనిలో మాత్రమే ఉండాలా ? తమ ఉపన్యాసాల లైవ్‌లు ఇస్తూ మా్తరమే, కరపత్రాల్లా ఉండాలా ? పత్రికలు, మీడియా ఛానల్స్ ఐ అండ్ పీఆర్ డిపార్ట్‌మెంట్‌కు ఎక్స్‌టెన్షన్ బ్రాంచిలా పని చేయాలని ఆకాంక్షిస్తోందా ? రేవంత్ రెడ్డి సర్కార్. నేరం చేసిన వాళ్లపై కేసులు పెట్టొచ్చు ! కోర్టులకు అప్పగించవచ్చు. కానీ ఓ వార్త వేయడమే అతి భయంకర నేరం అని ఏకపక్షంగా ఎలా నిర్ణయిస్తారు ?
రాష్ట్రంలో, దేశంలో ప్రభుత్వోద్యోగులు, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు, మంత్రలూ అంతా పత్తిత్తులా ! నిష్కళంక చరితులా ! వారి స్కామ్స్, గ్రంధాలు, అడ్డగోలు పనులను మీడియా ఎత్తి చూపకపోతే జనానికి వారి నిజస్వరూపాలు ఎలా తెలియాలి. ఇది మేధావులు, పబ్లిక్ వేస్తున్న ప్రశ్న. సోషల్ మీడియా కూడా విస్త్రతమైన ఈ రోజుల్లో ఎలా మూసిపెట్టగలరు. ఈ లోకము మూయగా మూకుడుండదు. అని ఏనుగు లక్ష్మణకవి ఏనాడో చెప్పాడు. ఐఏఎస్ ఆఫీసర్లు కాపురాల్లో మీడియా నిప్పులు పోస్తోందంట. మంత్రులకు కళంకం ఆపాదిస్తోందట. అసలు ఏ ప్రభుత్వమైనా సిట్లు వేయాల్సింది ఆ వార్త వేసిన మీడియా పైననా ! లేక అసలు సిలసలు వివాదంపైనా ! నిగ్గు తేల్చాల్సింది దేన్ని ? ఇది కదా అసలు పశ్న. ఆఫీసర్లను ఎడాపెడా ట్రాన్స్‌ఫర్స్ చేయిస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్న ఈ రోజుల్లో మంత్రులు కూడా ట్రాన్స్‌ఫర్స్‌లో మా ప్రమేయమే లేదు అని ప్రవచిస్తే…జనం వెర్రి వెంగళప్పల్లాగా నమ్మాలా ! ట్రాన్స్‌ఫర్స్ సీఎం ప్రిరాగెటివ్. నాదేమీ లేనే లేదని ఓ మంత్రి చెబితే…ఓహో అలా సార్ ! అని వార్తలు వేస్తూ..పత్రికలు, ఛానల్స్ బతకాలా ? మంత్రులు, ఎమ్మెల్యేల అభీష్టాల మేరకు ఎంత మంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లను బదిలీ చేయడం లేదు. ఇది కదా కొశ్చను. దీని మీద ఏ సర్కార్ అయినా సిట్ వేయగలదా ! నిగ్గు తేల్చగలదా ? ఆఫీసర్ల బదిలీలపై తన్నుకుంటున్న నేతలను, రోడ్డెక్కుతున్న వారిని ఎంత మందిని మనం చూడటం లేదు. సొంత బొక్కలు ఇన్ని పెట్టుకొని మీడియాపై ఒంటికాలితో లేవడమేంటి ? ఆ బొక్కలన్నీ బహిర్గం కాకుండా ముందస్తు జాగ్రత్తలా ఇవి ! అని ప్రజానీకం ఇప్పుడు ఆలోచిస్తున్నారు.
మీడియా స్వేచ్ఛను నియంత్రిస్తే ప్రజలంతా ఒకేలా ఆలోచిస్తారు. ఒకే అభిప్రాయాన్ని వ్యక్తీకరిస్తారు. ఇది ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాదం… మలయాళ వార్తా ఛానల్‌పై నిషేధాన్ని నిరుడు తొలగిస్తూ సుప్రీం ధర్మాసనం చేసిన వ్యాఖ్య అది. ఎలాంటి ఆధారాల్లేకుండా, దేశ భద్రత పేరిట పౌరుల హక్కుల్ని ప్రభుత్వాలు తొక్కిపట్టే ధోరణినీ అదే కేసులో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అలా ఎన్నో కేసుల్లో మరెన్నోసార్లు కోర్టులు మొట్టికాయలు వేసినా ప్రభుత్వాలు, పోలీసులు మాత్రం మారడం లేదు. పత్రికలు సహా ప్రసార మాధ్యమాల్లోని ఎందరో పాత్రికేయులపై ప్రభుత్వాలు కత్తి ఝులిపిస్తున్నాయి. వాక్ స్వాతంత్య్రాన్ని అణచివేస్తున్న వాతావరణంలో…ప్రభుత్వాల చర్యల్ని నిశితంగా విమర్శించే గళాలకు సంకెళ్లు వేసే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. పత్రికల నిర్వహణను సరళతరం చేస్తామని ఆదర్శాలు వల్లిస్తూ, కార్యాలయాల్లో ప్రవేశించి కోరిన సమాచారాన్ని రాబట్టుకునే అధికారం ఎవరిచ్చారని జర్నిటస్లు ప్రశ్నిస్తున్నారు. ఇది మీడియా స్వేచ్ఛపై ఉక్కుపాదం మోపడమే.
స్వతంత్ర భారతావనిలో పత్రికా స్వేచ్ఛ ఏ పాలకుల దయాధర్మం కాదు. పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛకు భరోసా ఇస్తున్న రాజ్యాంగంలోని 19వ అధికరణమే పత్రికా స్వాతంత్య్రానికి శ్రీరామరక్ష. పత్రికలు తీవ్ర పదజాలంతో వ్యాఖ్యానం చేయగలిగినప్పుడే…పత్రికా స్వాతంత్య్రానికి నిజంగా గౌరవం దక్కినట్లు అంటూ జాతిపిత గాంధీ ఎప్పుడో చెప్పారు. పాత్రికేయుల వృత్తిగత వస్తు సామగ్రిని…తలచిందే తడవుగా జప్తు చేసే అధికారాన్ని సహించలేమని సుప్రీంకోర్టు ఇటీవలే స్పష్టం చేసింది. అలాంటిది పత్రికా కార్యాలయాలపై సోదాల పేరిట ప్రభుత్వం దండెత్తే ధోరణులను ప్రభుత్వాలు మానుకోవాలి. ప్రభుత్వాల తప్పొప్పులపై జనాన్ని జాగరూకుల్ని చేసే మీడియా…ప్రజల స్వేచ్ఛా గళానికి రాజ్యాంగ ప్రతీకలు. ఘాటు విమర్శల్ని సహించలేక పత్రికా స్వేచ్ఛనే కాటు వేయాలన్న పెడ పోకడలను జర్నలిస్టులు తీవ్రంగా ఖండిస్తున్నారు.
మరోవైపు ఎన్టీవీ జర్నలిస్టుల అక్రమ అరెస్టులపై ఢిల్లీ అధిష్టానం ఆరా తీస్తోంది. ఇలా ఎందుకు జరిగింది అంటూ రాష్ట్రనేతలను వివరణ కోరినట్లు తెలుస్తోంది. రేవంత్ చర్యలపై ఆరా తీస్తోంది ఢిల్లీ అధిష్టానం. పండుగ రోజు తెలుగు వారిపై ఇదే పని అని అధిష్టానం ఫైర్ అయినట్టు తెలుస్తోంది. తెలంగాణలో ప్రభుత్వం మనదా..? IAS, IPSలదా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఎన్టీవీలో వచ్చిన ఓ కథనంపై ఓవర్ రియాక్షన్ మోడ్‌లో రేవంత్ సర్కార్ ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ పోలీసుల చర్యలను టీపీసీసీ నేతలు ఖండిస్తున్నారు. ఇదేమి ఖర్మ అంటూ అధికార కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఎవరెవరిదో సమస్య తమకు చుట్టుకుందన్న భావనలో టీపీసీసీ నేతలు ఉన్నారు. IAS, IPS సంఘాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రేవంత్‌పై నేతలు రుసరుసలాడుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ ఇమేజ్.. గంగలో కలిసే రోజు వచ్చినట్లుంది అనుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు.
కొన్ని పాలక పక్షాలు జర్నలిస్టులను తమ దారికి తెచ్చుకొనేందుకు పోలీసుల ఉసిగొల్పుతున్నాయి. ప్రభుత్వ సంస్థల నుంచే కాకుండా రాజకీయ నాయకులు, నేరస్థులు, అవినీతిపరుల బెదిరింపులకు దిగుతున్నాయి. కొన్నిసార్లు వారిని నిర్బంధిస్తున్నారు. ఒక్కోసారి వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు పాత్రికేయులు ప్రాణాలకు తెగించి మరీ సాహసించాల్సి వస్తోంది. ప్రభుత్వ నిర్ణయాలు, వ్యవస్థల్లో జరిగే అవినీతి, అక్రమాలను వెలుగులోకి తీసుకురావడమే జర్నలిస్టుల పాలిట శాపంగా మారుతోంది. మీడియా సంస్థలు, జర్నలిస్టులపై చేసే దాడులు అంతిమంగా ప్రజాస్వామ్య వ్యవస్థకే చేటు చేస్తాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు అద్దం పడుతున్న మీడియా సంస్థలను ప్రభుత్వాలు, పోలీసులు తమ దారిలోకి తెచ్చుకునేందుకు అనేక ఎత్తుగడలు వేస్తున్నారు. మీడియా డిజిటల్ సాధనాలను స్వాధీనం చేసుకోరాదన్న నిబంధన విధించడం ఎంతో అవసరం. మీడియా సిబ్బందికి, వారి డిజిటల్ ఉపకరణాల్లోని డేటాకు భద్రత కల్పించాలి. మీడియా సంస్థలు, పాత్రికేయుల భావవ్యక్తీకరణ స్వేచ్ఛ సంకెళ్లు తెంచుకున్న నాడే దేశంలో ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది.