Story Board: మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఏ కూటమికీ పూర్తి సంతోషాన్నివ్వలేదు. సింగిల్ గా మ్యాజిక్ ఫిగర్ రాకపోవడం బీజేపీకి షాకిస్తే.. అనుకున్నట్టుగా ఫలితం రాకపోవడం కాంగ్రెస్‌నూ నిరాశపరిచింది. ఇలాంటి స్థితిలో ఆ తర్వాత జరిగిన వరుస అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి.. మోడీ మ్యాజిక్ తగ్గలేదని బీజేపీ సింహనాదం చేసింది. కానీ అనూహ్యంగా తెరపైకి వచ్చిన ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలు, ఓట్ల చోరీకి సాక్ష్యాలు చూపించడంతో.. కాంగ్రెస్ ఓ పద్ధతి ప్రకారం జనంలోకి బలమైన నెరేటివ్‌ను తీసుకెళ్లింది. దీంతో బీజేపీ ఘన విజయాలపైనా కొత్త సందేహాలు మొదలయ్యాయి. ఏమో అప్పుడు కూడా ఇలాంటిదేమైనా చేశారేమో అనే అనుమానాలు పొడసూపాయి. దీనికితోడు బీహార్లో రాహుల్ ఓటర్ అధికార్ యాత్ర నిర్వహించి.. ఓట్ల చోరీ గురించి విస్తృతంగా ప్రచారం చేశారు. రాహుల్ టూర్ కు మంచి స్పందన వచ్చిందని ఇండియా కూటమి చెప్పుకుంది. ఇదే సమయంలో బీహార్లో ఈసీ చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణపైనా రకరకాల అభిప్రాయాలొచ్చాయి. సాంకేతికంగా ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ అయిందనిపించినా.. రేపు పోలింగ్ రోజు ఏం చిత్రాలుంటాయో చూడాలని అప్పుడే కొన్ని పార్టీలు హింటిస్తున్నాయి. ఇలా ఓవైపు ఓట్లచోరీ.. మరోవైపు ప్రత్యేక సమగ్ర సవరణ గందరగోళం మధ్య జరుగుతున్న బీహార్ ఎన్నికల్ని అన్ని పార్టీలూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. మొన్నటిదాకా ఉచితాల్ని వ్యతిరేకించిన ప్రధాని మోడీనే.. బీహార్లో ఎన్నికల కోసం మహిళలకు, నిరుద్యోగులకు పథకాలు ప్రకటించడం, మహిళల ఖాతాల్లో ఏకంగా డబ్బులు కూడా జమచేయటం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ వివాదమే పూర్తిగా సద్దుమణగకముందే.. ఈసీ మరో బాంబు పేల్చింది. బీహార్ ఎన్నికల్లో ఏకంగా 17 సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నట్టు ప్రకటించింది. వీటిని సమయానుకూలంగా దేశమంతటికీ విస్తరిస్తామని చెప్పినా.. ఈ ఎన్నికల్లోనే ఇన్ని మార్పులు ఒకేసారి చేయాల్సిన అవసరం ఏమిటనే డౌట్లు లేకపోలేదు.
నిజానికి చాలా ముందు నుంచే బీహార్ ఎన్నికలకు పార్టీల ప్రిపరేషన్ మొదలైపోయింది. పార్టీలన్నీ వేటికవే జనం ఏమనుకుంటున్నారో ఊహించుకుని.. అందుకు తగ్గట్టుగా ప్లాన్లు రెడీ చేసుకున్నాయి. కాంగ్రెస్ ఓట్లచోరీపై ఫోకస్ చేయగా.. ఎన్డీఏ కూటమి సంక్షేమాన్ని, అభివృద్ధిని నమ్ముకున్నట్టు కనిపిస్తోంది. ఆర్జేడీ ఎప్పటిలాగే కులసమీకరణలకు తోడుగా ప్రభుత్వ వ్యతిరేకతే లక్ష్యంగా పావులు కదుపుతోంది. చిరాగ్ పాశ్వాన్ పార్టీ ఎల్జేపీ.. సొంత లక్ష్యాల సాధన దిశగా అడుగులేస్తోంది. కానీ ఏ పార్టీ అయినా ఓటర్ల మనోగతం ఏమిటో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిందా.. లేదా అనే ప్రశ్నలు అలాగే ఉన్నాయి. ఎందుకంటే సర్వేల్లో ఓటర్లు చెబుతున్న అంశాలకు.. ఇప్పటిదాకా పార్టీలు ప్రాధాన్యం ఇస్తున్న అంశాలకు పొంతన కుదరటం లేదు. ఎందుకంటే బీహారీలు ఈసారి గతానికి భిన్నంగా ఆలోచిస్తున్నారు. ఎల్లకాలం కులసమీకరణాలే గెలుపుమెట్లు ఎక్కించలేవనే కోణంలో స్పందిస్తున్నారు. పైగా మౌలిక సమస్యలకు పరిష్కారాలేవని నిలదీస్తున్నారు. మరీ ముఖ్యంగా ఉద్యోగాలు, వలసల విషయంలో తమను తృప్తిపరిచే వారికే ఓటేస్తామని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అలాగే ఎమ్మెల్యేల పనితీరు, వ్యవహారశైలిని కూడా పరిగణనలోకి తీసుకుంటామంటున్నారు. దీంతో ఈసారి బీహార్ ఎన్నికలు గేమ్ ఛేంజర్ అని పార్టీలతో పాటు ఓటర్లు కూడా నమ్ముతున్నారని తేలిపోయినట్టే.
బీహార్ సమస్యల విషయానికొస్తే.. గతంలో లాంతర్ పాలనతో పోలిస్తే.. నితీష్ పాలన మెరుగే అనే విషయంలో అందరికీ ఏకాభిప్రాయం ఉంది. కానీ నితీష్ కూడా అనుకున్నంత మార్పు తీసుకురాలేదనే అసంతృప్తి కూడా లేకపోలేదు. అందుకే కొంతకాలంగా నితీష్ జేడీయూ పార్టీకి క్షేత్రస్థాయిలో బలం తగ్గుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగాలు, వలసల విషయంలో ఎన్డీఏ కూడా చెప్పినట్టుగా చేయలేకపోయిందనే భావన బీహారీల్లో ఉందన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికీ వలసలు ఎక్కడా తగ్గలేదని, కొత్త ఉద్యోగాల ఊసు లేదని కొన్ని వర్గాల ఓటర్లు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఆర్జేడీ కూడా చీకటి పాలన ముద్ర చెరిపేసుకుని.. తేజస్వి నేతృత్వంలో కొత్త జోష్‌ను సంతరించుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తేజస్వి ప్రసంగాలు, ప్రచారానికి యువత బాగా కనెక్ట్ అవుతారని, అలాగే ఆర్జేడీ సంప్రదాయ ఓటుబ్యాంకు కూడా సంఘటితమౌతున్న సూచనలున్నాయని అంటున్నారు. ఈసారి కాంగ్రెస్ కూడా ఎక్కడలేని ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. బీహార్ ఎన్నికలు మోడీ పాలన ముగింపుకు నాంది పలుకుతాయన్న ఖర్గే ప్రకటనను తక్కువ చేసి చూడలేమనే అభిప్రాయాలు వస్తున్నాయి.
మొత్తం మీద ఎన్నికల అజెండా విషయంలో పార్టీల్లో ఇంకా కన్ఫ్యూజన్ ఉందేమో కానీ.. ఓటర్లు మాత్రం పక్కా క్లారిటీతో ఉన్నట్టు కనిపిస్తున్నారు. మరిప్పుడు ఏ పార్టీ ఓటర్ల అజెండాను రిసీవ్ చేసుకుంటుంది.. ఏ పార్టీ తన అజెండాకే ఓటర్లను కన్విన్స్ చేస్తుంది అనేది కీలకంగా మారనుంది. గత రెండు దశాబ్దాల ఎన్నికల ఫలితాల్ని విశ్లేషిస్తే.. బీహార్ ఓటర్ల పరిణతి ఏంటో ఇట్టే తెలిసిపోతుంది. పార్టీలు ఇంకా బీహార్ ఓటర్లంటే అంతేలే అనే మూస ధోరణిలో ఆలోచిస్తే ఎదురుదెబ్బ తప్పదని విశ్లేషకులు అంటున్నారు. ఒకప్పుుడు కేవలం ఉపాధి కోసమే ఇతర రాష్ట్రాలకు వెళ్లి.. పండగలకు స్వరాష్ట్రానికి రావటానికే బీహారీలు పరిమితమయ్యేవారు. కానీ కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి వారిని ఆలోచనలో పడేసింది. తమ భాగస్వామ్యంతో అన్ని రాష్ట్రాలూ అభివృద్ధి పథంలో పరుగులు తీస్తుంటే.. తమ రాష్ట్రంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటోందని వారు గ్రహిస్తున్నారు. అప్పటికీ సుశాసన్ బాబుగా ముద్రపడ్డ నితీష్‌కు వరుస అవకాశాలిచ్చి మార్పు కోసం ఓపికగా ఎదురుచూశారు. కానీ నితీష్ రానురాను అభివృద్ధిపై ఫోకస్ తగ్గించి.. అధికారంపై యావ పెంచుకున్నారని గ్రహించారు. ఈలోగా యువకెరటం తేజస్వి దూసుకురావడంతో.. యువకుడు, ఉత్సాహవంతుడు కాబట్టి.. ఏమైనా మంచి చేస్తాడేమో అని కొన్ని వర్గాలు అటువైపు మొగ్గు దిశగా ఆలోచిస్తున్నాయి. ఇక కులసమీకరణాల విషయానికొస్తే.. అవి రెండో స్థానానికి వెళ్లిపోయాయనే వాదన వినిపిస్తోంది. మనం ఐక్యంగా ఆలోచించి.. గట్టిగా ఓటేయకపోతే.. నేతలు మన జీవితాలతో ఆడుకుంటూనే ఉంటారని సగటు బీహారీ ఓ నిశ్చయానికి వచ్చినట్టు కనిపిస్తోంది. అందుకే గతానికి భిన్నంగా బీహారీలు సంక్షేమ పథకాల ప్రకటనలకు పొంగిపోవటం లేదు. ఎవరేం చెప్పినా వింటున్నారే కానీ.. ఎవరికీ పూర్తిస్థాయిలో కనెక్ట్ కావడం లేదు. పార్టీల హామీల్ని, నేతల మాటల్ని వాస్తవ పరిస్థితులతో పోల్చి చూస్తున్నారు. జాతీయ పార్టీలు ఇతర రాష్ట్రాల్లో ఏం చేస్తున్నాయి.. ఇక్కడేం చెబుతున్నాయి అని బేరీజు వేస్తున్నారు. తమను తక్కువ అంచనా వేస్తే.. ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని ఫిక్స్ అవుతున్నారు. అందుకే ముందస్తు సర్వేల్లో గతంలో గమనించని పోకడలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా ఈసారి ఎన్నికల అజెండాను ఓటర్లు ముందే ఫిక్స్ చేయడంతో.. వారిని కన్విన్స్ చేయటం పార్టీలకు అంత తేలిక కాదనే అభిప్రాయాలున్నాయి