Site icon NTV Telugu

Story Board : ఇరాన్ యుద్ధం ఏ దిశగా సాగుతోంది..? ఇప్పటివరకు ఎవరికి ఎంత నష్టం జరిగింది..?

Story

Story

ఇరాన్ యుద్ధం నెల రోజులుగా కొనసాగుతోంది. అమెరికా ఎగ్జిట్ అవుదామనుకున్నా కుదరటం లేదు. ఇజ్రాయెల్ ఎప్పటికప్పుడు ఉద్రిక్తతల్ని పెంచుతూనే ఉంది. అటు ఇరాన్ ప్రతిఘటన కూడా రోజురోజుకీ మరింతగా బలం పుంజుకుంటోంది. ఇప్పటికే యుద్ధజ్వాలలు ప్రపంచాన్ని చుట్టుముట్టాయి. హర్మూజ్ దిగ్బంధంతో చమురు సంక్షోభం వచ్చింది. ఇప్పుడు కొత్తగా మరో జలసంధినీ మూసేస్తామన్న ఇరాన్ హెచ్చరికలతో ప్రపంచ దేశాలన్నీ హడలిపోతున్నాయి. కొత్తగా ప్రాక్సీ గ్రూపుల ఎంట్రీతో యుద్ధం కొత్త మలుపు తిరగనుందనే చర్చ జరుగుతోంది. నెల రోజుల యుద్ధం ఇరాన్‌ కు తీవ్ర నష్టం మిగిల్చింది. ఇజ్రాయెల్, అమెరికాకూ నష్టాలు తప్పలేదు. అంతేకాదు యుద్ధంతో సంబంధం లేని మిగతా దేశాలకూ కోలుకోలేని నష్టమే మిగిలింది.

ఇరాన్ యుద్ధం ప్రారంభంలో ఇరాన్‌కు మాత్రమే తీవ్ర నష్టం జరిగింది. కానీ ఆ తర్వాత ఇరాన్ బలమైన ప్రతిఘటనతో ఇజ్రాయెల్‌తో పాటు అమెరికాకూ ఎదురుదెబ్బలు తప్పలేదు. టెహ్రాన్‌పై తన దాడులను మరింత విస్తరించి, తీవ్రతరం చేస్తాం అని హెచ్చరించిన కొద్ది గంటల్లోనే ఇజ్రాయెల్ ఇరాన్ అణు సదుపాయాలపై దాడులు చేసింది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించిన ఇరాన్, సౌదీ అరేబియాలోని ఒక స్థావరంపై దాడి చేసింది. ఈ ఘటనలో అమెరికా సైనికులు గాయపడ్డారు. కొన్ని విమానాలకు నష్టం వాటిల్లింది.

యుద్ధం నెల రోజులు దాటిన సమయంలో మాత్రం ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐక్యరాజ్యసమితి అభ్యర్థన మేరకు హర్మూజ్ జలసంధి మార్గం నుంచిమానవతా సహాయం, వ్యవసాయ సరుకు రవాణాకు అనుమతి ఇస్తామని ఇరాన్ ప్రకటించింది. జెనీవాలో ఐక్యరాజ్యసమితి వద్ద ఆ దేశ రాయబారి ఈ విషయాన్ని వెల్లడించారు. అత్యవసర సహాయం ఆలస్యం కాకుండా చేరేందుకు ఇరాన్ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. యుద్ధ ప్రభావంతో సహాయ సరఫరాలపై వచ్చిన అంతరాయాలపై చర్యల కోసం ఐక్యరాజ్యసమితి ఇప్పటికే ప్రత్యేక బృందం ఏర్పాటు చేసింది.

ప్రపంచ చమురు రవాణాలో ఐదో వంతు, ఎరువుల వాణిజ్యంలో మూడో వంతు హర్మూజ్‌ జలసంధి గుండా జరుగుతుంది. చమురు, వాయువు సరఫరాల అడ్డంకులపై దృష్టి పడుతున్నప్పటికీ, ఎరువుల సరఫరా తగ్గితే ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం, ఆహార భద్రత దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సౌదీలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపై ఇరాన్ దాడిలో కనీసం 10 మంది అమెరికా సైనికులు గాయపడ్డారని అమెరికా అధికారులు తెలిపారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఇంధనం నింపే విమానాలకు కూడా నష్టం జరిగినట్లు సమాచారం.

ఇరాన్ అరాక్‌లోని షాహిద్ ఖోందాబ్ హెవీ వాటర్ సముదాయం, యజ్ద్ ప్రావిన్స్‌లోని ఆర్దకాన్ యెల్లోకేక్ తయారీ కేంద్రంపై దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఎవరూ మృతి చెందలేదని, కాలుష్యం ప్రమాదం లేదని తెలిపింది. అరాక్ కేంద్రం గత ఏడాది జూన్‌లో జరిగిన దాడుల తర్వాత కార్యకలాపాలు నిలిచిపోయాయి. యెల్లోకేక్ అనేది యురేనియం శుద్ధి తర్వాత పొందే ఘన రూపం. హెవీ వాటర్ అణు రియాక్టర్లలో ఉపయోగిస్తారు. యజ్ద్ కేంద్రంలో అణు ఇంధన తయారీకి ముడిసరుకులు సిద్ధం చేస్తారని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. ఇజ్రాయెల్ చేసిన నేరాలకు ఇరాన్ భారీ మూల్యం వసూలు చేస్తుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ హెచ్చరించారు. అమెరికా, ఇజ్రాయెల్‌కు అనుబంధ సంస్థల్లో పనిచేసేవారు తమ ఉద్యోగాలు వదిలేయాలని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది.

యుద్ధం వల్ల ప్రపంచ మార్కెట్లపై ప్రభావం కనిపిస్తోంది. అమెరికా స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో వారంలో నష్టాలు చవిచూశాయి. చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అమెరికాలో గ్యాస్ ధరలు గ్యాలన్‌కు 4 డాలర్లకు చేరువయ్యాయి. ఫెడరల్ ఇంధన పన్నును తాత్కాలికంగా నిలిపివేయాలని కాంగ్రెస్ సభ్యులు కోరుతున్నారు. అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్ పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో 15 అంశాల కార్యాచరణ జాబితాను ఇరాన్‌కు అందజేసినట్లు తెలిపారు. అణు కార్యక్రమంపై నియంత్రణ, హర్మూజ్‌ మార్గం తిరిగి తెరవడం అందులో ఉన్నాయి. ఇరాన్ దీనిని తిరస్కరించి, తన ఐదు అంశాల ప్రతిపాదనలో పరిహారం, జలసంధిపై తన సార్వభౌమాధికారాన్ని గుర్తించాలనే డిమాండ్ పెట్టింది.

పాకిస్థాన్, టర్కీ సహా పలు దేశాలు అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య ప్రత్యక్ష భేటీకి ప్రయత్నిస్తున్నాయి. ఫ్రాన్స్‌లో సమావేశమైన జీ7 విదేశాంగ మంత్రులు ప్రజలు, మౌలిక సదుపాయాలపై దాడులు తక్షణం ఆపాలని కోరారు. అమెరికా అదనపు సైన్యాన్ని మధ్యప్రాచ్యానికి తరలిస్తోంది. 2,500 మేరీన్లు, 82వ ఎయిర్‌బోర్న్ దళానికి చెందిన సైనికులు మోహరించడానికి సిద్ధమయ్యారు. భూదళాల అవసరం లేకుండానే లక్ష్యాలు సాధ్యమవుతాయని ఆదేశ విదేశాంగ మంత్రి మార్కో రుబియో తెలిపారు.

ఇప్పటివరకు జరిగిన యుద్ధంలో ఇరాన్ చాలా మంది కీలక నేతల్ని కోల్పోయింది. ఇరాన్‌ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ, ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజాని, ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ నజిర్జాదె, చీఫ్ ఆఫ్ స్టాఫ్ అబ్దోల్ రహీమ్ మౌసావి, ఐఆర్‌జీసీ గ్రౌండ్ ఫోర్సెస్ కమాండర్ మొహమ్మద్ పాక్పోర్, బేసిజ్ కమాండర్ గోలాంరెజా సోలేమని, నావల్ కమాండర్ అలీ రెజా టాంగ్సిరి, మిలిటరీ బ్యూరో హెడ్ మొహమ్మద్ షిరాజి, డిప్యూటీ చీఫ్ ఆఫ్ సుప్రీం లీడర్స్ ఆఫీస్ అక్బర్ ఎబ్రహింజాదె, ఇంటెలిజెన్స్ హెడ్ గోలాంరెజా రెజేయాన్, హెడ్ ఆఫ్ ప్లాన్స్ అండ్ ఆపరేషన్స్ బహ్రం హోసేని మోట్లాగ్‌, హెడ్ ఆఫ్ లాజిస్టిక్స్ హస్సనాలి తాజిక్, సీనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ సలేహ్ అసాదితోపాటు ఇంకొందరు అగ్రనాయకులు, వారి సన్నిహితులు కూడా మరణించారు. అలాగే అయతొల్లా ఖమేని కుటుంబ సభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇక నూతన సుప్రీం లీడర్‌గా ఎన్నికైన మొజ్తాబా ఖమేని గురించిన ఆచూకీ ఇంకా తెలియడం లేదు. ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.

మన స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతూ వచ్చిన ఇన్వెస్టర్లకు పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ఊహించని షాక్ ఇస్తున్నాయి. భారత్‌లో రాజకీయ స్థిరత్వం, ఆదాయపు పన్ను- జీఎస్టీ రేట్ల కోత వంటి సానుకూలతలు ఉన్నప్పటికీ ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికాల మధ్య యుద్ధం ఊహించని విధంగా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి 28వ తేదీ నుంచి చూసుకుంటే.. 24 రోజుల్లోనే ఏకంగా రూ. 48.29 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. సెన్సెక్స్, నిఫ్టీ 50 సూచీలు 10 శాతానికి పైగా పడిపోయాయి. దీంతో ఇన్వెస్టర్ల పోర్ట్ ఫోలియోలు భారీ స్థాయిలో కరిగిపోయాయి. బంగారం ధరలు సైతం తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. రూపాయి ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయికి పడిపోయింది. యుద్ధం ఆగితే బాగుండునని భారత్ కోరుకుంటున్నా.. పోరు మాత్రం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. పైగా అంతకంతకూ తీవ్ర రూపం తీసుకుంటోంది.

ఇరాన్ యుద్ధం నుంచి వైదొలగటానికి అమెరికా మల్లగుల్లాలు పడుతోంది. ట్రంప్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. ఇరాన్ వాటిని సాగనివ్వటం లేదు. చివరకు ఇరాన్‌తో చర్చలకు ట్రంప్ సిద్ధమై ప్రతిపాదనలు పంపినా.. ఆ దేశం మాత్రం ససేమిరా అంటోంది. దీంతో టెన్షన్ ఎక్కడా తగ్గుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇరాన్ యుద్ధం విషయంలో అమెరికా వెనక్కి తగ్గుతున్నట్లే కనిపిస్తోంది. ఇటీవల 48 గంటల టైమ్ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఆ తర్వాత 5 రోజుల విరామం ప్రకటించారు. ఐతే.. అది యుద్ధానికి కాదు. పవర్ ప్లాంట్లపై దాడి చెయ్యకుండా ఉండటానికి మాత్రమే. ఐతే.. ఇప్పుడు ట్రంప్ కొత్త ఆలోచన చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఏకంగా నెలపాటూ యుద్ధానికి విరామం ఇచ్చి.. 15 పాయింట్లతో చర్చల ప్రక్రియ చేపట్టాలని భావిస్తున్నారని చెబుతున్నారు. అదే జరిగితే.. ప్రపంచ దేశాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటారు. కానీ ఇప్పటికే ట్రంప్‌తో చర్చల ప్రసక్తే లేదంటున్న ఇరాన్.. అమెరికాకు అంత గ్యాప్ ఇస్తుందా అనేది తేలాల్సి ఉంది.

ఇప్పటికే యుద్ధంలో అమెరికా అయోమయంలో పడిపోయింది. ఇరాన్ యుద్ధం గెలిచేశామని ప్రకటిస్తున్న ట్రంప్.. ఏం సాధించారో మాత్రం స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. అదేమంటే ఇరాన్ సామర్థ్యాన్ని చాలా వరకు దెబ్బతీశామంటున్నారు. కానీ ఇరాన్ ప్రతిదాడులు చూస్తుంటే.. అలా అనిపించడం లేదని ప్రపంచ దేశాలు నిట్టూరుస్తున్నాయి. కాకపోతే ట్రంప్ చర్చల కోసం పదిహేను సూత్రాల ప్రణాళిక సిద్ధం చేసినా.. అది ఏకపక్షంగా ఉండటం ఇరాన్‌కు కోపం తెప్పించింది. పైగా చర్చల విషయంలో మిత్రదేశం ఇజ్రాయెల్‌తోనూ ట్రంప్ సమన్వయం చేసుకోలేకపోతున్నారు. అమెరికా దాడులు ఆపినా.. ఇజ్రాయెల్‌ ఇరాన్‌ను దెబ్బతీస్తూనే ఉంది. అలాంటప్పుడు చర్చల ప్రతిపాదనకు అర్థం ఏముందని అమెరికా వర్గాలే ట్రంప్‌ని నిలదీస్తున్నాయి. ఇరాన్ యుద్ధం తీరు చూస్తుంటే.. ట్రంప్ కొంప నెతన్యాహునే ముంచేలా ఉన్నారని అమెరికన్లు అభిప్రాయపడుతున్నారు.

ట్రంప్ ఓవైపు ఇరాన్‌ ఓడిపోయినట్టేనని చెబుతూ.. మరోవైపు గ్రౌండ్‌ వార్‌కు రంగం సిద్ధం చేస్తుండటం ఏమిటో అంతుబట్టడం లేదు. ఇప్పటికే ట్రంప్ చర్చల వ్యాఖ్యల్ని ఖండించిన ఇరాన్.. అసలు తాము అమెరికాతో ఏ చర్చలూ జరపట్లేదనీ, తమను ఎవరూ చర్చల కోసం కలవలేదని తెలిపింది. ట్రంప్ చెబుతున్నదంతా తప్పుడు ప్రచారమేనని కొట్టిపారేసింది. ఇది రెండు దేశాల మధ్య ఉన్న టెన్షన్‌ను స్పష్టంగా చూపిస్తోంది. అసలు ట్రంప్ ఎందుకిలా మాట్లాడుతున్నారు? ఏ చర్చలూ జరగకపోయినా.. జరిగిపోయినట్లుగా, యుద్ధం తామే గెలిచేసినట్లుగా ఎందుకు చెప్పేస్తున్నారన్నది ఇరాన్‌కి మతి పోగొడుతోంది.

ఇరాన్ ఎప్పటికప్పుడు అమెరికాకు కొత్త షాకులు ఇస్తూనే ఉంది. అమెరికా దాడులు ఆపినా.. ఇరాన్ మాత్రం గల్ఫ్‌ను దెబ్బకొట్టే పని ఎక్కడా ఆపలేదు. పైగా అమెరికా గనుక గ్రౌండ్ ఫోర్స్‌ని తమ గడ్డపై దించితే.. తామేంటో చూపిస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఈ ప్రకటనకు బలమైన కారణం ఉంది. ట్రంప్.. 2,500 మంది మెరైన్లను ఇరాన్ గ్రౌండ్‌పై దింపే ప్లాన్‌లో ఉన్నారు. ఐతే.. గెరిల్లా వార్‌లో ఇరాన్ ఆరితేరింది. అమెరికా ఎప్పుడూ.. గగనతల దాడుల్లో కింగ్. కానీ.. గెరిల్లా పోరాటాల్లో అమెరికా ఓడిపోయిన చరిత్రే ఎక్కువగా ఉంది. ఇరాన్‌కి మొదటి నుంచి గెరిల్లా పోరాటాలే అలవాటు. పైగా ఆ దేశంలో పర్వతాలు ఎక్కువ. ఆ వాతావరణాన్ని అనుకూలంగా చేసుకొని.. గెరిల్లా వార్‌లో గెలవాలని ఇరాన్ ప్లాన్ చేస్తోంది.

ఇప్పటికే ఇరాన్ యుద్ధం ప్రభావం ప్రపంచ దేశాలతో పాటు భారత్‌పైనా తీవ్రంగా ఉంది. మన హైదరాబాద్‌లో ఇప్పుడు పెట్రోల్ బంక్‌కి వెళ్తే నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో కూడా పెట్రోల్ దొరకదేమో అనే టెన్షన్ పెరుగుతోంది. ఇప్పటికే గ్యాస్ సిలిండర్లు దొరకట్లేదు. హోటళ్లు మూతపడ్డాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ఈ యుద్ధం కారణంగా గల్ఫ్‌లో ఉన్న మన భారతీయ ఉద్యోగులు.. తమ సేఫ్టీ గురించి ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ చర్చలు విజయవంతమైతే ఆయిల్ ధరలు స్థిరపడి, మన ఆర్థిక వ్యవస్థకు మంచి జరుగుతుంది. కానీ ఇరాన్ తిరస్కరిస్తే యుద్ధం పొడిగించే ప్రమాదం ఉంటుంది. ఆ ప్రభావం మన ఇండియన్ స్టాక్ మార్కెట్, రూపాయి వాల్యూ, బంగారం, వెండి మీద కూడా పడుతుంది. మొత్తంగా ప్రపంచం భవిష్యత్తు అమెరికా, ఇరాన్ చేతిలో ఉన్నట్లైంది. ఈ రెండు దేశాలూ శాంతిని తేవాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. భారత ప్రధాని మోదీ కూడా.. ట్రంప్‌తో ఫోన్ కాల్‌లో మాట్లాడుతూ.. శాంతి మార్గమే అసలైన మార్గమని తెలిపారు.

కానీ ఇరాన్ తీరు చూస్తుంటే మాత్రం యుద్ధాన్ని మరింతగా పొడిగించే సూచనలే కనిపిస్తున్నాయి. అమెరికా చర్చల కోసం పదేపదే అడుగుతున్నా.. తిరస్కరిస్తున్న ఇరాన్.. మరోవైపు అమెరికాతో పాటు ఇజ్రాయెల్‌కు బుద్ధి చెప్పటానికి డెత్ ట్రాప్ రెడీ చేస్తున్నట్టు చెబుతోంది. దీంతో భవిష్యత్తులో మరిన్ని ఉద్రిక్తతలు ఖాయమనే సంకేతాలు వస్తున్నాయి. ఇరాన్‌ను అనవసరంగా రెచ్చగొట్టిన యూఎస్, ఇజ్రాయెల్.. ప్రపంచం మొత్తాన్నీ ప్రమాదంలో పడేశాయనడంలో సందేహం లేదు. ఇప్పటికే ఇరాన్ యుద్ధ ప్రభావం అమెరికా ఆర్థికవ్యవస్థపైనా కనిపిస్తోంది. చివరకు అమెరికాకు ఆయుధాల కొరత, ఇజ్రాయెల్‌కు సైన్యం కొరత రావడంతో.. ఆ రెండు దేశాలకూ దిక్కుతోచని స్థితి. మొదట తమపై దాడులు ఆపితే తామూ ఆపేస్తామని చెప్పిన ఇరాన్.. ఆ తర్వాత రోజుకో కొత్త డిమాండ్‌తో అందరికీ చుక్కలు చూపిస్తోంది. ఇరాన్ పశ్చిమాసియా మొత్తాన్నీ టేకోవర్ చేయాలని చూస్తోందని ట్రంప్ ప్రకటించడం.. యుద్ధం ద్వారా పొంచి ఉన్న ప్రమాదాన్ని అందరికీ ముందే చూపిస్తోంది. ఇప్పటికే హర్మూజ్ జలసంధిపై తమ సార్వభౌమాధికారం కోసం ఇరాన్ చేస్తున్న డిమాండ్.. ప్రపంచ దేశాలకు కొత్త భయం పుట్టిస్తోంది. ఇంకా మరిన్ని రోజులు యుద్ధం జరిగాక.. ఇరాన్ కచ్చితంగా సంక్లిష్ట డిమాండ్లు పెట్టే అవకాశం కనిపిస్తోంది.

ఇరాన్ యుద్ధంలో మరో కీలక పరిణామం జరుగుతోంది. ఇరాన్‌కు మద్దతుగా ప్రాక్సీ గ్రూపులు రంగంలోకి దిగాయి. ఇప్పటికే ఇజ్రాయెల్‌తో హెజ్బొల్లా గ్రూప్ తలపడుతుంటే.. ఇప్పుడు కొత్తగా బాబ్ అల్ మండెబ్ జలసంధి దగ్గర హౌతీలు మోహరించారు. కీలకమైన హర్మూజ్ ఇంకా పూర్తిగా తెరుచుకోకుండానే.. మరో కీలక జలసంధి బాబ్ అల్ మండెబ్ రిస్క్‌లో పడటం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. రాబోయే రోజుల్లో చోటుచేసుకునే పరిణామాలతో.. అసలు యుద్ధం కాస్తా.. ప్రాక్సీ వార్‌గా రూపాంతరం చెందే అవకాశం కనిపిస్తోంది.

ప్రపంచం చూపు గత నాలుగు వారాలుగా పర్షియన్ గల్ఫ్‌లోని ఒక ఇరుకైన జలమార్గంపైనే ఉంది. అదే హర్మూజ్‌ జలసంధి. అయితే, ఇప్పుడు మరో కీలక జలమార్గం బాబ్ అల్-మండేబ్ కూడా యుద్ధ సెగతో ఎర్రబడిపోతోంది. ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ రెబల్స్ ఈ యుద్ధంలోకి ప్రవేశిస్తామని హెచ్చరించడమే దీనికి ప్రధాన కారణం.ప్రపంచ చమురులో ఐదో వంతు ప్రయాణించే హర్మూజ్ జలసంధి మార్చి ప్రారంభం నుంచే దాదాపు మూతపడింది. గల్ఫ్ ప్రాంతంలో అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత, ఇరాన్ సైన్యం ఈ వాణిజ్య మార్గాన్ని అడ్డుకుంది. ప్రస్తుతం భారత్ వంటి తటస్థ దేశాల నౌకలను మాత్రమే ఇరాన్ అనుమతిస్తోంది. చైనా కరెన్సీ యువాన్ లో ఫీజు వసూలు చేస్తోంది.

హర్మూజ్ మూతపడటంతో సౌదీ అరేబియా, కువైట్, యూఏఈ వంటి దేశాలకు తమ చమురును ప్రపంచానికి చేరవేయడానికి మిగిలిన ఏకైక మార్గం ఎర్ర సముద్రం చివరన ఉన్న బాబ్ అల్-మండేబ్ జలసంధి. అరబిక్ భాషలో దీనికి కన్నీటి ద్వారం అని అర్థం. ఇక్కడి ప్రయాణం అత్యంత ప్రమాదకరమైనది కావడంతో దీనికి ఆ పేరు వచ్చింది. ఇప్పుడు హౌతీల హెచ్చరికలతో ఇది నిజంగానే ప్రపంచానికి కన్నీళ్లు తెప్పించేలా ఉంది. యెమెన్‌లో మెజారిటీ ప్రాంతాన్ని నియంత్రిస్తున్న హౌతీ రెబల్స్, తాము అన్ని రకాల సైనిక చర్యలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అమెరికా గనుక హర్మూజ్‌ సమస్యకు తెలివితక్కువ పరిష్కారాలు వెతకాలని చూస్తే, వారు మరో జలసంధిని కూడా కోల్పోవాల్సి వస్తుందని ఇరాన్ వర్గాలు హెచ్చరించాయి.

ఒకవేళ హర్మూజ్‌, బాబ్ అల్-మండేబ్ రెండు మార్గాలు మూతపడితే పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఇప్పటికే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 120 డాలర్లకు చేరుకుంది. యుద్ధం ముగిసినా మళ్లీ పాత స్థితికి రావడానికి కనీసం నాలుగు నెలలు పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎర్ర సముద్రానికి ఉత్తరాన సూయజ్ కాలువ, దక్షిణాన బాబ్ అల్-మండేబ్ జలసంధి ఉన్నాయి. సౌదీ అరేబియా తన చమురును పైప్‌లైన్ ద్వారా యన్బు ఓడరేవుకు చేర్చి, అక్కడ నుండి మండేబ్ జలసంధి ద్వారా ఆసియా దేశాలకు, సూయజ్ కాలువ ద్వారా యూరప్‌కు పంపుతుంది. అయితే ఇక్కడో చిక్కు ఉంది.హర్మూజ్‌ ద్వారా రోజుకు 7.2 మిలియన్ బ్యారెళ్ల చమురు సరఫరా అయ్యేది. కానీ, సౌదీ పైప్‌లైన్ సామర్థ్యం కేవలం 5 మిలియన్ బ్యారెళ్లు మాత్రమే. అంటే హార్ముజ్‌కు బాబ్ అల్-మండేబ్ పూర్తి ప్రత్యామ్నాయం కాలేదు. ఒకవేళ హౌతీలు మండేబ్ వద్ద దాడులు ప్రారంభిస్తే, నౌకలు మొత్తం ఆఫ్రికా ఖండాన్ని చుట్టుకుని వేల మైళ్ల దూరం ప్రయాణించాల్సి వస్తుంది. దీనివల్ల రవాణా ఖర్చులు పెరిగి, సామాన్యుడిపై పెట్రోల్, డీజిల్ భారం విపరీతంగా పెరుగుతుంది.

ఎవరూ తమ నౌకలను, సిబ్బందిని ప్రమాదంలోకి నెట్టాలని అనుకోరు. కానీ ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లోనే ఎక్కువ లాభాలు వస్తాయి. ఎందుకంటే చివరికి చమురు భారాన్ని మోయాల్సింది మాత్రం సామాన్య వినియోగదారులే. అమెరికా, ఇజ్రాయెల్ సహా దాని మిత్రదేశాలు తమపై ఒత్తిడిని పెంచితే, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్ ఇప్పటికే హెచ్చరికలు చేసింది. ఈ క్రమంలో వ్యూహాత్మక బాబ్ ఎల్ మండేబ్ జలసంధిని దిగ్బంధించి, ఊహించని యుద్ధ క్షేత్రాలను తెరుస్తామని హెచ్చరించింది. హర్మూజ్ జలసంధి సమీపంలోని ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోడానికి అమెరికా ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఇరాన్ ఈ హెచ్చరికలు చేసింది. హర్మూజ్ జలసంధిలో అనవసరంగా అమెరికా జోక్యం చేసుకుంటే, కొత్త సంక్షోభాలను సృష్టించడమే అవుతుందని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. పర్షియన్ గల్ఫ్, ఒమన్ సముద్రం, ఇరాన్ దీవులలో సైన్యాలను మోహరించి తమపై ఒత్తిడికి ప్రయత్నిస్తే.. శత్రువులకు రెట్టింపు నష్టాలు తప్పవని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ వర్గాలు హెచ్చరించాయి.

ఇప్పటికే హర్మూజ్‌ను ఇరాన్ నియంత్రించడంతో చమురు, గ్యాస్ సరఫరాపై ప్రభావం తీవ్రంగా ఉంది. ఒకవేళ, బాబ్ ఎల్ మండేబ్‌ మూతపడితే.. ప్రపంచం మొత్తం అల్లకల్లోలం కాక తప్పదు. ఇప్పటికే చర్చలకు ఐదు షరతులను ఇరాన్ విధించింది. చర్చల్లో తమ డిమాండ్లను నేరవేర్చుకుని, అమెరికా షరతులకు అంగీకరించబోమని ఇరాన్ స్పష్టం చేసినట్టయ్యింది. హిందూ మహాసముద్రాన్ని ఎర్ర సముద్రం, సూయజ్ కాలువతో కలిపే ఒక ప్రధాన జలమార్గం బాబ్ ఎల్ మండేబ్. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద జల మార్గమైన దీనిని మూసేస్తే సూయజ్ కాలువ నుంచి ప్రయాణించే నౌకలు హిందూ మహాసముద్రంలోకి చేరలేవు. సముద్ర మార్గంలో జరిగే సరుకు రవాణాకు, ముఖ్యంగా క్రూడాయిల్, ఇంధనానికి ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన మార్గాలలో ఒకటి. ప్రపంచ చమురు వాణిజ్యంలో సుమారు 12 శాతం, ఎల్ఎన్జీలో 8 శాతం బాబ్ అల్-మండేబ్ ద్వారానే జరుగుతుంది. అందువల్ల ఈ జల సంధిలో ఏదైనా ఆటంకం ఏర్పడితే అనేక దేశాలను నేరుగా ప్రభావితం చేస్తుంది. సూయజ్ కాలువ ద్వారా మధ్యధరా సముద్రం నుంచి ఎర్ర సముద్రంలోకి ప్రవేశించే నౌకలు హిందూ మహాసముద్రంలోకి వెళ్లేందుకు ఈ జలసంధిని ఉపయోగిస్తాయి. అమెరికా, ఐరోపా, భారత్, చైనాకు వచ్చే నౌకలు సూయజ్ కాలువ గుండా వెళ్లేందుకు బాబ్ అల్-మండేబ్ ప్రధానం. ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 12 శాతం దీని ద్వారా జరుగుతుంది. గల్ఫ్ నుంచి యూరప్, అమెరికాలకు చమురు, LNG రవాణాలో ఇది ఒక కీలక మార్గం. రోజూ లక్షలాది బ్యారెళ్ల క్రూడాయిల్ దీని గుండా వెళుతుంది. ఇరాన్ దీనిని అడ్డుకుంటే, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఊహించనవిధంగా పెరిగే అవకాశం ఉంది. అందుకే తాజాగా ఇరాన్ ఈ అస్త్రాన్ని బయటకు తీసి, అమెరికాను మరింత ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ జల మార్గానికి భారీ ముప్పును కలిగించే సామర్థ్యం తమకు ఉందని ఇరాన్ అంటోంది. వాణిజ్య నౌకలపై దాడికి యెమెన్‌లోని హౌతీ రెబల్స్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు. గాజా యుద్ధ సమయంలో ఎర్ర సముద్రంలో నౌకలపై హౌతీలు గతంలో దాడులు చేశారు. హర్ముజ్‌తో పాటు బాబ్ ఎల్ మండేబ్‌లో కలిగే ఏ అంతరాయమైనా ప్రపంచవ్యాప్త పరిణామాలు ఉంటాయి.

అంతిమంగా ఇరాన్ యుద్ధం ఎవరూ ఊహించని విషాదానికి దారితీస్తుందా అనే సందేహాలు బలపడుతున్నాయి. యుద్ధంలో ఒక్కో వారం గడిచేకొద్దీ ఉద్రిక్తతలు మరో స్థాయికి వెళ్తున్నాయి. ఇప్పుడు నెల తర్వాత ఏకంగా యుద్ధమే మరో స్థాయికి వెళ్లి.. అంతర్జాతీయ సరకు రవాణాను పూర్తిగా నిలిపేసే దిశగా సాగుతుందా అనే భయం ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ఎందుకంటే గతంలో హౌతీల దాడుల్ని అడ్డుకోవటానికి ఎర్రసముద్రంలో కొన్ని దేశాలతో కలిసి అమెరికా సంయుక్త నేవీని ఏర్పాటుచేసినా భంగపాటు తప్పలేదు. ఇప్పుడు మరోసారి హౌతీలు పూర్తిస్థాయిలో రంగంలోకి దిగితే.. వారిని అడ్డుకోవడం కుదురుతుందా అనే సందేహాలు అందర్నీ భయపెడుతున్నాయి. అదే సమయంలో హెజ్బొల్లా గ్రూప్, అరకొరగా మిగిలిన హమాస్ ఫైటర్లు కూడా ఇరాన్‌కు మద్దతుగా యుద్ధక్షేత్రంలోకి అడుగుపెడితే.. పరిస్థితులు ఏ మలుపు తీసుకుంటాయో ఎవరూ చెప్పలేరు. మొత్తం మీద నెల రోజుల తర్వాత ఇరాన్ యుద్ధం ముగింపు దిశగా సాగకపోగా.. మరింత సంక్లిష్టంగా మారుతూ.. ప్రపంచానికి హెచ్చరిక సంకేతాలు పంపిస్తోంది.

Exit mobile version