తెలుగు రాష్ట్రాల్లో విద్యారంగం భ్రష్టు పట్టింది. తెలుగు విద్యార్థులు మాతృభాష పేపర్ కూడా రాయలేని దుస్థితిలో ఉన్నారు. ఏపీలో టెన్త్ తెలుగు పేపర్ లీకేజ్ కలకలం రేపింది. లీకేజీ కాదు మాల్ ప్రాక్టీస్ అని తేల్చిన ప్రభుత్వం.. వాట్సాప్ గ్రూప్ పేపర్ సర్క్యులేట్ చేసిన వారిని అరెస్ట్ చేసింది. మాజీ మంత్రి నారాయణతో పాటు 69 మంది టీచర్లు అరెస్టయ్యారు. ఇందులో 35 మంది ప్రభుత్వ స్కూల్ టీచర్లు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
చదువంటే మార్కులే అనే సంస్కృతి పెరగడం వల్లే.. ఈ రేంజ్ లో లీకేజీలు, మాల్ ప్రాక్టీస్ లు జరుగుతున్నాయనేది కానదలేని సత్యం. ఒకప్పుడు టెన్త్ లో స్కూల్ కు ఒక్క విద్యార్థికే ఫస్ట్ క్లాస్ వచ్చేది. అప్పట్లో వాల్యుయేషన్ కూడా స్ట్రిక్ట్ గా జరిగేది. ఇప్పుడు అసలు ఫస్ట్ క్లాస్ కి విలువే లేదు. అందరికీ పదికి పది జీపీఏలు రావాల్సిందే . కార్పొరేట్ స్కూళ్లు వచ్చాక ఈ పిచ్చి ఇంకా ముదిరింది. వంద శాతం రిజల్ట్ పేరుతో.. వికృత క్రీడలకు తెరలేపారు. ఎక్కువ మార్కులొస్తే.. బాగా చదువొచ్చినట్టే అని సమాజంలో ఉన్న అభిప్రాయాన్ని.. కార్పొరేట్ విద్యాసంస్థలు తమకు అనుకూలంగా మలుచుకున్నాయి. ర్యాంకులు, మార్కుల కోసం ఎంతకైనా దిగజారుతున్నాయి.
మొదట్లో టెన్త్, ఇంటర్ విద్యార్థుల్ని టార్గెట్ చేసిన కార్పొరేట్ విద్యాసంస్థలు.. ఇప్పుడు ఐదో తరగతి విద్యార్థుల్ని కూడా వదలడం లేదు. ఐఐటీ జేఈఈ, నీట్ శిక్షణ పేరుతో ఆరో తరగతి నుంచే రుద్దుడు కార్యక్రమం జరుగుతోంది. అప్పట్నుంచే విద్యార్థులపై మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులు రుద్ది.. మిగతా సబ్జెక్టులు చదివించని దుస్థితి నెలకొంది. లాంగ్వేజ్ సబ్జెక్టులైతే అసలు లెక్కే వేయడం లేదు. చాలా కార్పొరేట్ స్కూళ్లలో మెజార్టీ టెన్త్ విద్యార్థులు.. అసలు తెలుగు టెక్స్ట్ బుక్ ముఖం కూడా చూడకుండా.. పబ్లిక్ పరీక్షలు రాస్తున్నారంటే నమ్మాల్సిందే. మ్యాథ్స్, సైన్స్ బాగా వస్తే చాలు. రేపొద్దున పోటీపరీక్షల్లో కూడా ఈ సబ్జెక్టుల నుంచే ప్రశ్నలు వస్తాయి. ఇంటర్లో ఎలాగో సంస్కృతం తీసుకుంటాం. ఇక తెలుగుతో ప్రయోజనం ఏముందనే వ్యాఖ్యలు టీచర్ల నుంచే వస్తున్నాయి. దీంతో విద్యార్థులు కూడా తెలుగు వేస్టని ఫిక్సైపోయారు. అందుకే తెలుగు మాతృభాషగా ఉన్న రాష్ట్రంలో.. తెలుగు పేపర్ కూడా రాయలేని దరిద్రం, తెలుగు పేపర్ కూడా లీక్ చేయాల్సిన దుస్థితి వచ్చింది.
మాస్కూళ్లో చేర్చితే సెంట్ పర్సెంట్ రిజల్ట్ ఖాయం. మా కాలేజ్ లో చేరితే ఎంసెట్లో ర్యాంక్ గ్యారెంటీ. మా అకాడెమీలో చేర్చితో ఐఐటీ సీటు వచ్చినట్టే. ఇలా ఒకటేంటి.. లెక్కలేనన్ని ప్రకటనలతో తల్లిదండ్రుల్ని బుట్టలో వేస్తున్నాయి కార్పొరేట్ విద్యాసంస్థలు. తల్లిదండ్రుల్లో కూడా చాలా మంది తమ పిల్లలకు సబ్జెక్ట్ ఎంతవరకు వచ్చింది అని ఆలోచించడం లేదు.. ర్యాంకు వచ్చిందా లేదా.. ఐఐటీలో సీటు వచ్చిందా.. లేదా అనే అంశాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. నాలుగు డబ్బులు ఎక్కువైనా సరే.. ర్యాంకు గ్యారెంటీ అనే విద్యాసంస్థకే ఓటేస్తున్నారు. చివరకు ఇంజినీరింగ్ కాలేజీల్లో కూడా జాబ్ గ్యారెంటీ ఇచ్చే వాటికే ఫుల్ డిమాండ్. ఇలా హైస్కూల్ నుంచి కాలేజీ వరకు ఉన్నత విద్య మొత్తం భ్రష్టు పట్టింది. సబ్జెక్టులపై కనీస అవగాహన లేకుండా పరీక్షల్లో వంద శాతం మార్కులు తెచ్చుకుంటున్నారు విద్యార్థులు. మార్కులు ఎలా వచ్చాయో అనవసరం.. వచ్చాయా లేదా అనేదే ముఖ్యం అనే భ్రాంతి తల్లిదండ్రులది. ఈ పిచ్చినే విద్యాసంస్థలు క్యాష్ చేసుకుంటున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ర్యాంకుల పోకడ శృతి మించడానికే కార్పొరేట్ విద్యాసంస్థలే కారణమంటే ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఇబ్బడిముబ్బడిగా పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన గొలుసుకట్టు స్కూళ్లు, కాలేజీలు.. విద్యార్థుల్ని మెషీన్లుగా మార్చేశాయి. బట్టీ చదువులు చెబుతూ.. సబ్జెక్ట్ తలకెక్కాలనే సూత్రానికి తిలోదకాలిచ్చాయి. ఏపీలో టెన్త్ పరీక్షలు మొదలైన దగ్గర్నుంచీ లీకేజీలు, మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఏకంగా ఐదు పేపర్లు లీకయ్యాయని గగ్గోలు రేగింది. అయితే తెలుగు పేపర్ లీకేజీకి సంబంధించి ఆధారాలున్నాయని అరెస్టులు జరిగాయి. గతంలో తెలంగాణలో కూడా ఇంటర్ ఫలితాల విషయంలో సమస్యలొచ్చాయి. బోర్డు చేసిన తప్పులకు కొంతమంది విద్యార్థులు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది. ఎన్ని అనుభవాలు ఉన్నా.. ఎవరూ మారడం లేదు. విద్యావిధానాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలని చెప్పడమే కానీ.. చేయడానికి ఎవరికీ చేతులు రావడం లేదు.
రోజురోజుకీ నాగరికత పెరుగోతంది. రోజుకో కొత్త టెక్నాలజీ వస్తోంది. ఇంత అత్యాధునిక సాంకేతిక యుగంలో కూడా ఇంకా మాల్ ప్రాక్టీసులు చేసి పరీక్షలు పాస్ కావాల్సిన దురవస్థ ఉండటం సిగ్గుచేటు. స్వాతంత్ర్య అమృతోత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో.. విద్యావ్యవస్థ ఎటుపోతోందో అందరూ ప్రశ్నించుకోవాల్సిన తరుణం ఇదే. నానాటికీ మెరుగుపడాల్సిన విద్యావిధానం.. అంతకంతకూ తీసికట్టుగా మారుతోంది. ఒకప్పుడు విశ్వగురువుగా చలామణీ అయిన భారత్ లాంటి దేశంలో.. ఇప్పుడు టెన్త్ పరీక్షల్లో కూడా మాల్ ప్రాక్టీసులు జరుగుతున్నాయంటే.. ఏమనాలి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కార్పొరేట్ సంస్కృతి జడలు విప్పింది. ఏ రాష్ట్రంలో లేని విధంగా మన దగ్గర చదువంటే ఇంజినీరింగ్, మెడిసినే అని విద్యార్థులు, తల్లిదండ్రుల మెదళ్లలోకి విషంలా ఎక్కించారు. మిగతావేవీ చదువులు కాదని.. చదివితే ఆ రెండే చదవాలనేలా వ్యవస్థ మారిపోయింది. అసలు తెలుగు ముఖం చూడకుండా.. తెలుగు విద్యార్థులు తెలుగు పరీక్షలు రాయడం.. ఇంటర్లో పేరుకు సంస్కృతం తీసుకుని.. అదీ తెలుగులో రాయడం.. ఇలా ఒకటేంటి.. కార్పొరేట్ విద్యాసంస్థల పుణ్యమా అని విద్యావ్యవస్థలో కనీవినీ ఎరుగని విన్యాసాలు జరుగుతున్నాయి.
చదువంటే జ్ఞానం కోసం అనేది పాత మాట. ఇప్పుడు చదువంటే మార్కులే. ర్యాంకు వస్తేనే విద్యార్థికైనా, కాలేజీకైనా గుర్తింపు. ఐఐటీలో సీటు రాకపోతే.. వాడు మనిషే కాదన్నట్టుగా చూస్తున్నారు. ఈ పోకడలే విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించాయి. ఎవరికి వారు విద్యావ్యవస్థ మారాలనుకుంటున్నారు కానీ.. ప్రస్తుత దుస్థితికి తామూ కారణమే అని ఒప్పుకోవడానికి జంకుతున్నారు. మార్కులు, ర్యాంకులే సర్వస్వమని విద్యార్థులపై రుద్దడం వల్లే.. వాళ్లపై విపరీతమైన ఒత్తిడి పెరిగిపోతోంది. వంద శాతం మార్కులు రాకపోతే.. కొంప మునిగిపోయినట్టే అని భయపడి.. ఆత్మహత్యలకు తెగబడుతున్నారు.
మాల్ ప్రాక్టీస్ విషయంలో కార్పొరేట్ విద్యాసంస్థలకు.. కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా సహకరించడం అనుమానాలకు తావిస్తోంది. ఇలా గవర్నర్నమెంట్ టీచర్లు.. ప్రైవేట్ స్కూళ్లతో చేతులు కలిపడంతో.. విద్యారంగం భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. విద్యావ్యవస్థలో దిగజారుతున్న ప్రమాణాలు.. భావితరాల భవిష్యత్తుపై ఆందోళన పెంచుతున్నాయి. సబ్జెక్టులపై కనీస అవగాహన లేకుండా.. కేవలం మార్కులు, ర్యాంకులే పరమావధిగా.. రుబ్బుడు చట్రంలో ఇరుక్కుని బయటపడుతున్న విద్యార్థులు.. రేపు ఏం చేసినా.. అంతిమంగా సమాజానికే నష్టం కలుగుతుందని అందరూ గుర్తించాలి.
కరోనా కారణంగా రెండేళ్లు పదోతరగతి పరీక్షలు తుడిచిపెట్టుకుపోయాయి. విద్యార్థుల భవిష్యత్తును గందరగోళంలో పడేశాయి. మాస్ కాపీయింగ్, లీకేజీలు, చీటీల చేరవేతలతో ఈసారి కూడా టెన్త్ విద్యార్థులకు టెన్షన్ తప్పడం లేదు.
ఏ విద్యార్థి జీవితానికైనా టెన్త్ అనేది కీలక మలుపు లాంటిది. టెన్త్ లో వచ్చిన మార్కులే చాలా మంది భవిష్యత్తును నిర్దేశిస్తాయి. అలాంటి కీలకమైన టెన్త్ పరీక్షలు ఈసారి గందరగోళంగా మారాయి. కరోనా కారణంగా సిలబస్ పూర్తికాకపోవడం, పూర్తిస్థాయిలో బడులు జరగకపోవడంతో.. విద్యార్థులు అరకొరగానే పరీక్షలకు సిద్ధమైన పరిస్థితి ఉంది. దీన్ని క్యాష్ చేసుకోవడానికే లీకేజీలు, మాల్ ప్రాక్టీసుల పర్వానికి తెరలేపారనే ఆరోపణలున్నాయి. కార్పొరేట్ విద్యా సంస్థలు, కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయుల మధ్య చీకటి ఒప్పందాలు కుదిరాయి. మీ పిల్లలకు మేంచెబుతాం… మా పిల్లలకు మీరు చెప్పండనే విధంగా మాస్ కాపీయింగ్‌కు తెరతీశారు. దీంతో ఇప్పటివరకు వేర్వేరు సబ్జెక్టులకు జరిగిన అన్ని పరీక్షలూ వివాదంలో చిక్కుకున్నాయి.
పదోతరగతి పరీక్షలు రాసే విద్యార్థులు వారి సొంత పిల్లలో, బంధువుల పిల్లలో కారు. అయినా వారిని నూటికి నూరుశాతం ఉత్తీర్ణులు చేయించేందుకు కొందరు ఉపాధ్యాయులు ఎందుకు అతిగా తాపత్రయపడుతున్నారు? ప్రశ్నపత్రాల లీకేజీలు.. మాస్ కాపీయింగ్‌లకూ ఎందుకు తెగిస్తున్నారు? ఈ క్రమంలో అరెస్టులు, సస్పెన్షన్లకు ఎందుకు గురవుతున్నారు?. తరగతి గదుల్లో బోధన, విద్యార్థులు ఎంతవరకు నేర్చుకున్నారనే అంశాలతో సంబంధం లేకుండా… ఉత్తీర్ణత విషయంలో లక్ష్యాలు సాధించడమే సమస్యగా మారుతోంది. అందుకే లీకేజీ, మాస్ కాపీయింగ్ లాంటివి జరుగుతున్నాయి. చక్కగా పాఠాలు చెప్పి, విద్యార్థులను సిద్ధం చేయడం కంటే పరీక్షల సమయంలో మాస్ కాపీయింగ్ చేయిస్తే సరిపోతుందనే భావన పెరిగిపోయింది. ఈ గందరగోళంతో నిజంగా కష్టపడి చదివిన విద్యార్థులకు మనో వేదన తప్పడం లేదు. ఎందుకంటే.. పదో తరగతి ఫలితాల ప్రాతిపదికనే ట్రిపుల్ ఐటీలలో సీట్లు వస్తాయి. ఇంటర్ ప్రవేశాల్లోనూ వీటికి ప్రాధాన్యం ఉంటుంది. తాము ఇంత కష్టపడి చదివినా.. నష్టపోతామేమోనన్న ఆవేదన వారిలో కనిపిస్తోంది.
అసలు పదోతరగతి విద్యార్థుల్లో ప్రతిభా పాటవాల సంగతి అటుంచి.. కనీస ప్రమాణాలకూ వారు దూరంగా ఉంటున్నారన్నది ఎన్‌సీఈఆర్టీ సర్వేల్లో తేలిన మాట. చాలామంది పదో తరగతి విద్యార్థులు ప్రాథమికాంశాలూ చెప్పలేకపోతున్నారని, తప్పులు లేకుండా తెలుగులోనూ రాయలేకపోతున్నారని ఎన్‌సీఈఆర్టీ గుర్తించింది. పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారమే పదో తరగతిలో గణితం, సామాన్య శాస్త్రంలో విద్యార్థి సగటు పనితీరు 41% ఉంది. సాంఘిక శాస్త్రం, ఆంగ్లం, తెలుగులో 43%. కానీ, 2019లో పదో తరగతి పరీక్షల్లో మాత్రం ఏకంగా 95% ఉత్తీర్ణులయ్యారు. ఇది ఎలా సాధ్యం? మరోవైపు పదోతరగతిలో ఇంత భారీ ఉత్తీర్ణత ఉన్నా.. ఇంటర్‌కు వచ్చేసరికి అది 65%లోపే ఉంటోంది. దీన్నిబట్టి.. విషయ పరిజ్ఞానం లేకున్నా పరీక్షల్లో మాత్రం ఉత్తీర్ణులు అయిపోతున్న వాస్తవాన్ని, మన పరీక్షా నిర్వహణ తీరుతెన్నులను ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.
విద్యార్థుల్లో సామర్థ్యాలను పెంచి, నాణ్యమైన బోధనతో ఫలితాలు సాధించాల్సి ఉండగా.. ఇవేవీ పట్టించుకోకుండా ఫలితాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. కార్పొరేట్ స్కూళ్లలో ఎప్పట్నుంచో టీచర్లకు రిజల్ట్ విషయంలో టార్గెట్లు విధించే సంస్కృతి ఉంది. కొత్తగా గవర్నమెంట్ స్కూళ్లలోనూ ఈ పోకడ పెరిగిపోయింది. కొంతకాలంగా మాస్ కాపీయింగ్, మూల్యాంకనంలో అధికంగా మార్కులు వేసే పరిస్థితి కొనసాగుతోంది. దీంతో విద్యార్థుల స్థితిగతులేంటో తల్లిదండ్రులకు తెలియడం లేదు. వ్యవస్థీకృత మాస్ కాపీయింగ్ వల్ల మోసపోతోంది తల్లిదండ్రులు. నష్టపోతోంది విద్యార్థులు.
పరీక్ష అనేది విద్యార్థి అభ్యసన సామర్థ్యానికి గీటురాయిలా ఉండాలి. అంతేకానీ అదేదో కృత్రిమ ప్రమాణంగా మారకూడదు. ఇప్పుడు పరీక్షలు కేవలం తంతులా జరుగుతున్నాయి. విద్యార్థులకు సబ్జెక్టు బుర్రకెక్కిందా.. లేదా అని ఎవరూ అడగడం లేదు. ఏ స్కూళ్లో వంద శాతం రిజల్ట్ వస్తుందని మాత్రమే ఆరా తీస్తున్నారు. ఆ స్కూల్లో చేరితే సెంట్ పర్సెంట్ వస్తుందని చెప్పుకోవడమే కానీ.. ఫలానా చోట బాగా పాఠాలు చెబుతారనే మాటలే వినిపించడం లేదు. కార్పొరేట్ విద్యాసంస్థల తీరుతో ప్రధానంగా టెన్త్, ఇంటర్ విద్యకు పూర్తిగా చెదలు పట్టింది. టెక్స్ట్ బుక్కులు లేకుండా స్టడీ మెటీరియల్స్ చదివించడం, స్టడీ అవర్ల పేరిటే బట్టీ పట్టించడమే బోధనగా కొనసాగుతోంది. చాలా కార్పొరేట్ కాలేజీల్లో.. ఇంటర్ విద్యార్థులు టెక్స్ట్ బుక్ ముఖం చూడకుండానే ఫైనల్ పరీక్షలు రాస్తున్నారు. లెక్చరర్లే టెక్స్ట్ బుక్ లతో మీకేం పని.. కాలేజీ మెటీరియల్ చదివితే చాలు అని చెప్పేస్తున్నారు. చివరకు టెక్స్ట్ బుక్ లో ఏముందో కూడా తెలియకుండా ర్యాంకులు తెచ్చుకున్న విద్యార్థులు.. ఉన్నత విద్యకు వెళ్లేసరికి చతికిలపడుతున్న ఘటనలు మన కళ్ల ముందే ఉన్నాయి. ఒక దశలో ఐఐటీ విద్యార్థుల ఆత్మహత్యల్లో తెలుగు విద్యార్థులే మొదటి స్థానంలో ఉన్నారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే.. తెలుగు విద్యార్థులు ఐఐటీ తరహా టీచింగ్ కు త్వరగా అలవాటుపడలేకపోతున్నారని కూడా చాలా అధ్యయనాలు చెప్పాయి. దీనంతటికి కారణం బట్టీ విధానానికి ప్రాధాన్యం ఇచ్చిన కార్పొరేట్ విద్య అనే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
కేవలం మార్కుల ఆధారంగా విద్యార్థుల ప్రతిభను అంచనా వేసే పద్ధతే మారాలని మొత్తుకుంటున్నారు విద్యావేత్తలు. విదేశాల్లో ఇప్పటికే అమల్లో ఉన్న చూచిరాత పరీక్షలు పెట్టాలనే డిమాండ్ చాలా కాలం నుంచి ఉంది. విషయాన్ని ముక్కున పెట్టుకుని చూడకుండా రాయడం కంటే.. చూసిన విషయాన్ని ఎంత బాగా విశ్లేషిస్తే.. అంత జ్ఞానం వస్తుందనేది కీలకమంటున్నారు నిపుణులు. కానీ ఈ మాటల్ని ఎవరూ చెవికెక్కించుకోవడం లేదు. ఎంత సేపూ ఉత్తీర్ణత, ర్యాంకులు, ఐఐటీ సీట్లూ.. వీటికే ప్రాధాన్యత దక్కుతోంది. ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు కూడా టెన్త్, ఇంటర్ మార్కుల్ని ప్రాతిపదికగా తీసుకోవడంతో.. మాస్ కాపీయింగ్ ధోరణి ఇంకా పెరుగుతోంది. సబ్జెక్ట్ రాకపోతే ఏంటి.. మార్కులొస్తే చాలు కదా.. ఆటోమేటిగ్గా సీటొచ్చేస్తోందనే సంస్కృతి విస్తరించింది. ఎలాగోలా తమ పిల్లలకు మార్కులు తెప్పించాలని తల్లిదండ్రులు కూడా విద్యాసంస్థల్ని అడుగుతున్నారు. ఈ పిచ్చినే కార్పొరేట్ విద్యాసంస్థలు క్యాష్ చేసుకుంటున్నాయి. అవసరమైతే అదనంగా డబ్బులు వసూళ్లు చేరి మరీ.. వెనుకబడిన విద్యార్థులకు కూడా వంద శాతం మార్కులు వచ్చేలా చేసి.. మెరిట్ ట్యాగులు తగిలిస్తున్నాయి. ఇక ర్యాంకులొచ్చిన విద్యార్థులకు ఎదురు డబ్బులిచ్చి.. తమ కాలేజీలో చదివామని చెప్పించే సంగతి సరేసరి. చదువు కాదు మార్కులే ప్రధానమనుకునే సమాజం. ర్యాంకులే పరమావధి అనుకునే కార్పొరేట్ విద్యాసంస్థలు. అన్నీ తెలిసినా.. చోద్యం చేసే ప్రభుత్వం. ఇలా విద్యావ్యవస్థ భ్రష్టు పట్టడానికి తలో చేయి వేస్తున్నారు.
కొన్నాళ్ల క్రితం సుప్రీంకోర్టు సీబీఐని పంజరంలో చిలక అని అభివర్ణించింది. కానీ కార్పొరేట్ విద్యాసంస్థల్లో విద్యార్థులు దశాబ్దాలుగా పంజరంలో చిలకలే. చదవడమా.. చావడమా అన్న రేంజ్ లో బోధన నడుస్తోంది. కనీసం నిద్రపోవడానికి, కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా గ్యాప్ లేకుండా.. అదేపనిగా స్టడీ అవర్ల పేరుతో చావగొట్టే పెడపోకడలు పెరిగాయి. అదేమంటే.. ఇదంతా మార్కులు, ర్యాంకుల కోసమే అని నిస్సిగ్గుగా సమర్థించుకున్నారు.
ఇంట్లో ఉన్నా, కాలేజీకి పోయినా విద్యార్థి ఒంటరిగానే జీవిస్తున్నాడు. కార్పొరేట్ విద్యాసంస్కృతి ప్రవేశపెట్టిన కృత్రిమ ప్రతిభ వైపు సమాజం పరుగెడుతోంది. దేశంలోనే విద్యార్థుల ఆత్మహత్య ల్లో ఆంధ్రప్రదేశ్ రెండవస్థానంలో ఉంది. ఆధునిక సాంకేతిక ప్రపం చంలో సంపాదన, కేరీర్, జల్సాగా బతకడమే పరమావధి అయిపోయింది. ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుంటున్న వారిలో 70 శాతం మంది ఇంటర్ విద్యార్థులే. ఉదయం 4.30 గంటలకు లేస్తే రాత్రి 11.30 గంటల వరకు బోధన ఉంటుంది. పిల్లలు తల్లిదండ్రులతో వారంలో ఒక గంట మాత్రమే మాట్లాడాలి.ఖైదీల మాదిరే కార్పొరేట్ విద్యార్థులకు రేషన్ ఉంటుంది.బాల్యం బందీఖానా అవుతున్నా తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదు. విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం కార్పొరేట్ విద్యావి ధానం అని నినదిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కార్పొ రేట్ కాలేజీల గుర్తింపును రద్దు చేయడంలేదు.
కుటుంబంలోని ఆదాయం 80 శాతం విద్యార్థుల చదువులకే అయిపోతోంది. డాక్టరో, ఇంజినీర్‌నో చేయాలనే తల్లిదండ్రుల కలలను బలవంతంగా పిల్లలపై రుద్దుతున్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ఎ ప్రకారం 6 నుండి 14 ఏళ్ల లోపు విద్యార్థులకు ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయాలి. ప్రభుత్వం ఈ ఆర్టికల్ ఆధారంగా 2010లో విద్యాహక్కు చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. విద్యారంగాన్ని కార్పొరేట్ శక్తులే ఏలుతున్నాయి. విద్యార్థుల్లో ఆత్మన్యూనత భావాన్ని కార్పొరేట్ కళా శాలలు మరింత పెంచుతున్నాయి. విద్యావిధానంలో సంస్కరణలు ఎక్కువగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలని మార్కులు తీసేసి.. గ్రేడ్లు తెచ్చారు. అయినా సరే కార్పొరేట్ విద్యాసంస్థల తీరు మాత్రం మారడం లేదు. మార్కులు పోయి గ్రేడులు వచ్చాయి అంతే.. మిగతాదంతా సేమ్ టు సేమ్ అలాగే ఉంది.
కార్పొరేట్ విద్యావ్యాపారాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. విద్యను వ్యాపార వస్తువుగా చేసే సంస్కృతిని వ్యతిరేకించాలి. పోటీతత్వాన్ని, ఆత్మన్యూనతా భావాన్ని పెంపొందించే చర్యలను అరికట్టాలి. ఒకప్పుడు విద్య లక్ష్యం జ్ఞానం సంపాదించడం. వ్యక్తి తన కాళ్ళపై తాను నిలబడగలననే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవటం. కాలం మారింది. లక్ష్యాలూ మారాయి. ఇప్పుడు చదువు అంతిమ లక్ష్యం.. మంచి ఉద్యోగం, ఆరంకెల జీతం. ఉద్యోగం కూడా ఇండియాలో చేస్తే విలువ లేదు. అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వెళ్లాల్సిందే. ఆఫ్రికా అయినా పర్లేదు కానీ.. సొంత దేశంలో ఉంటే మాత్రం ఎక్కడలేని నామర్దా. 1990లో కంప్యూటర్ కోర్సులకు, 2000 దాటాక ఇంజనీరింగు విద్యకు గిరాకీ పెరిగింది. కాకా హోటళ్ళలా వాడవాడకూ ఇంజనీరింగ్ కళాశాలలు వెలిశాయి. పదో తరగతి పూర్తికాకముందే ఇంజనీరింగ్ పూర్తిచేసి, తమ పిల్లలు సాఫ్ట్‌వేర్ కంపెనీలో చేరటం, కంపెనీ ద్వారా యూ.యస్.కు వెళ్ళటం అనే లక్ష్యంతో పిల్లల తల్లిదండ్రులు కలలుకనటం, వాటి సాకారానికి ప్రయత్నించటం ఎక్కువైంది. ఈ మొత్తం వ్యవహారంలో మార్కులు, ర్యాంకులకు విపరీతమైన ప్రాధాన్యత పెరిగింది. ఎక్కడైనా, ఎంతబాగా చదువు చెప్పినా అందరికీ మంచి మార్కులు రావడం అసాధ్యం. అందుకే దొడ్డిదారిన మార్కులు తెచ్చే సంస్కృతికి తెరలేచింది. ఏం చేసైనా సరే సెంట్ పర్సెంట్ రిజల్ట్ సాధించాల్సిందే అనే ఒత్తిడి పెరిగిపోయింది. దీంతో ఎంతకైనా దిగజారుతున్నాయి కార్పొరేట్ విద్యాసంస్థలు.
కార్పొరేట్ విద్యలో ర్యాంకులకే ప్రాధాన్యత. విషయ పరిజ్ఞానం పెరగదు. ఇతర విషయాలు తెలియవు. విద్యా ర్థులకు నేర్పేది, వారు నేర్చుకునేది, వివిధ రకాల ప్రశ్నలు, వాటి జవాబులు మాత్రమే. అంతేకాని పాఠ్యాంశంపై పట్టు ఉండదు. అసలు సబ్జెక్టుపై పట్టు ఉండాలని ఎవరూ కోరుకోవడం లేదు. ఏ కోర్సు చదివితే ఏ ఉద్యోగం వస్తుంది.. ఏ ఉద్యోగం ఎక్కువ జీతం వస్తుంది.. ఎక్కడ చూసినా ఇవే లెక్కలు. ఎక్కువ జీతాలు వచ్చే ఉద్యోగాలకు ఉపయోగపడే చదువులు, సబ్జెక్టులకే పెద్దపీట. మిగతావి చదవటం టైమ్ వేస్ట్ అనే అభిప్రాయం. టెన్త్ అయితే మ్యాథ్స్, సైన్స్ చదివితే చాలు. మిగతా పరీక్షల్లో మార్కుల సంగతి విద్యాసంస్థలే చూసుకుంటాయి. ఇంటర్ అయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మాత్రమే విద్యార్థులకు సంబంధం. ఇక ఇంగ్లీష్ సంస్కృతం సంగతి లెక్చరర్ల పని. అవసరమైతే కోర్ సబ్జెక్టుల్లో కూడా మాస్ కాపీయింగులు ప్రోత్సహించి.. సెంట్ పర్సెంట్ రిజల్ట్ తెప్పిస్తారు. తల్లిదండ్రులు కూడా వంద శాతం ఫలితాలు వచ్చాయా.. లేదా అని చూస్తున్నారు కానీ.. ఎలా వచ్చాయని ఎవరూ అడగడం లేదు. విజయానికి దొడ్డిదారులుండవనే విషయం చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ వాస్తవంలో విజయం సాధించడానికి ఉన్న ప్రాధాన్యత.. ఆ విషయం ఎలా వచ్చిందనే విషయానికి లేదు. సరిగ్గా ఈ పాయింట్ పట్టుకునే కార్పొరేట్ విద్యాసంస్థలు చెలరేగిపోతున్నాయి. విచ్చలవిడిగా లీకేజీలు, మాల్ ప్రాక్టీసులతో విద్యార్థుల్ని చెడగొడుతున్నాయి.
విద్యార్థులకు మార్కులు కావాలి. తల్లిదండ్రులకు ర్యాంకులు కావాలి. కార్పొరేట్ విద్యాసంస్థలకి బిజినెస్ జరగాలి. అంతే కానీ చదువు మాత్రం ఎవరికీ అక్కర్లేదు. చదువు పేరుతో మొత్తం వ్యవహారం జరుగుతోంది. కానీ ఎవరికీ చదువుపై పెద్దగా పట్టింపు లేదు. ఈ పెడధోరణి పరాకాష్టకు చేరే.. మాల్ ప్రాక్టీస్ ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా మనం మారకపోతే.. పరీక్షలు చూసి రాయకపోతే.. చూడకుండా రాస్తారా అని దబాయించే సంస్థలు కూడా పుట్టుకొస్తాయి. మాస్ కాపీయింగ్ పెద్ద నేరం కాదనే ధోరణి కూడా పెరిగే ప్రమాదం ఉంది. మార్కులు, ర్యాంకులకు కాకుండా.. చదువుకు ప్రాధాన్యత పెరిగితేనే.. విద్యారంగం బాగుపడుతుంది. లేకపోతే ఎప్పటిలాగే మేడిపండు చందంగా మిగిలిపోతుంది.