Story Board: ఎన్నికల్లో పోటీకి దిగాలంటే కనీసం పాతిక కోట్లు ఉండాల్సిందే అనే పరిస్థితి వచ్చేసింది. డబ్బుంటేనే ఎన్నికలు.. నిధులున్నోడే అభ్యర్థి అనేది నేటి రాజకీయం. ఎన్నికలంటే సవాలక్ష ఖర్చులుంటాయి. ప్రచారం, సభలు, మద్యం, బిర్యానీ, కార్యకర్తల రోజువారీ ఖర్చు, ప్రచారానికి వచ్చే జనానికి బేటాలు.. ఇలా ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే చాలా పోతాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి నేతల ఖర్చులు వీటికి అదనం. కులసంఘాలకూ తృణమో పణమో ముట్టజెప్పక తప్పదు. ఇక తిరగటానికి వాహనాలు, వాటికయ్యే పెట్రోల్ కూడా లెక్కేస్తే తడిసిమోపెడవుతోంది. మొత్తం మీద ఎన్నికలంటేనే పెద్ద జాతర. కాబట్టి నిధుల వరద పారాల్సిందే అంటున్నారు నేతలు. తెలుగు రాష్ట్రాల్లో ఏ నియోజకవర్గంలో బరిలోకి దిగాలన్నా.. కనీసం పాతిక కోట్లు చేతిలో పట్టుకోవాల్సిందే. అప్పటికి ఇంకా పొదుపుగా ఖర్చుపెట్టినట్టే అనే అభిప్రాయాలూ ఉన్నాయి. ఇక ఓ నియోజకవర్గంలో అన్ని పార్టీల అభ్యర్థులు చేసే ఖర్చు మొత్తం లెక్క చూస్తే.. కచ్చితంగా రూ.100 కోట్లు దాటుతుంది. సామాన్యులు కనీసం ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితులు వచ్చేశాయి.
ఈ పరిస్థితికి మొన్నటి హుజూరాబాద్ బై ఎలక్షన్స్‌నే మోడల్‌గా చూపించవచ్చు. దేశంలో ఎక్కడా లేని విధంగా హుజురాబాద్ బై ఎలక్షన్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పులివెందుల బైపోల్ పేరు మీద ఉన్న రికార్డు బద్దలైంది. దీంతో వచ్చే ఎన్నికల్లో అయ్యే ఖర్చుపై లీడర్లలో ఆందోళన మొదలైంది. కాస్ట్‌లీ ఎన్నికలపై సోషల్ మీడియాలో సైతం పోస్టులు, మీమ్స్‌తో సెటైర్స్ వేస్తూ హుజూరాబాద్ బైపోల్‌లో పార్టీలు ఎడాపెడా డబ్బులు కుమ్మరించాయి. ఉప ఎన్నిక పేరుతో మొత్తంగా దాదాపు వెయ్యి కోట్లు ఖర్చు అయింది. ముఖ్యంగా ఎన్నికను చావో, రేవో అనే పద్ధతిలో తీసుకున్న ఓ పార్టీ 800 కోట్ల రూపాయలు, మరో పార్టీ 200 కోట్లు ఖర్చు పెట్టినట్టు అంచనా. నియోజకవర్గంలోని 2.37లక్షల ఓటర్లలో సుమారు రెండు లక్షలమందికి ఒక్కో ఓటుకు ఆరువేల రూపాయల చొప్పున పంచినట్లు ప్రచారం సాగింది. డబ్బును సీల్డ్ కవర్‌లో పెట్టి మరీ పంచారు.
ఒక ఇంట్లో ఎన్ని ఓట్లు ఉంటే.. ఆ నెంబర్‌ను వేసి, కవర్‌లో పెట్టి ఇచ్చారు. ఈ లెక్కన పంచినవే 120 కోట్ల రూపాయలు. పోలింగ్‌కు ముందు జస్ట్ ఒక్క రోజులో ఓ పార్టీ 100 కోట్ల రూపాయలకు పైగా పంచింది. మరో పార్టీ నియోజకవర్గంలోని దాదాపు ఓటర్లందరికీ ఓటుకు1,500 రూపాయల చొప్పున ముట్టజెప్పింది. అంటే 35 కోట్ల రూపాయలు పంచిపెట్టింది. ఇవి కాకుండా, పార్టీలు ప్రతి ఇంటికీ మందు బాటిళ్లను పంచాయి. ఇతర పార్టీల నాయకులను తమ పార్టీలోకి ఆహ్వానించడానికి, పార్టీలో ఉన్న వాళ్లు వెళ్లకుండా కాపాడుకోవడానికి భారీగా తాయిలాలు సమర్పించుకున్నాయి. సభలు, సమావేశాలు, ప్రచారం, హంగూ ఆర్భాటాలు, గిఫ్టులు ఇలా అనేక రకాలుగా విచ్చలవిడిగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాయి.
Also Read: IND Playing 11 vs BAN: శార్దూల్, సిరాజ్ ఔట్.. బంగ్లాదేశ్‌తో బరిలోకి దిగే భారత్ తుది జట్టు ఇదే!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2011లో జరిగిన కడప పార్లమెంట్, పులివెందుల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో రికార్డ్ స్థాయిలో డబ్బులు ఖర్చు చేశారు. అన్ని పార్టీలు కలిపి కడప స్థానానికి 250 కోట్ల రూపాయలు, పులివెందులకు 150 కోట్ల రూపాయలు కుమ్మరించాయి. ఈ రెండు ఎన్నికలకు కలిపి అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఇవే విషయాలను సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ కూడా స్పష్టం చేసింది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని ఓడించేందుకు కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేసినా ఆఖరికి హస్తం పార్టీ ఓటమిని చవి చూసింది. అయితే కడప, పులివెందుల తర్వాత ఇప్పుడు వెయ్యి కోట్లతో హుజూరాబాద్ బైపోల్ ఆ రికార్డు బద్దలు కొట్టింది.
ప్రపంచంలో అమెరికా ఎన్నికలను చాలా కాస్ట్లీవిగా భావిస్తారు. 2020లో జరిగిన అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికలు అత్యంత ఖరీదైనవిగా రికార్డులకెక్కాయి. ఆ ఎన్నికల్లో అక్కడి పార్టీలు దాదాపు లక్షా మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి. 2012, 2016 రెండు ఎన్నికల ఖర్చును కలిపినా ఈ ఎన్నికల ఖర్చు కంటే తక్కువే. 2016 ఎన్నికలతో పోలిస్తే 2020లో ఖర్చు రెండింతలు అయిందని సెంటర్ ఫర్ రెస్పాన్సివ్ పాలిటిక్స్ అనే సంస్థ తెలిపింది. ఇందులో రిపబ్లికన్ల కంటే డెమొక్రాట్లకే అత్యధికంగా విరాళాలు అందడంతో ఆ పార్టీనే ఎన్నికల్లో ఎక్కువగా ఖర్చు చేసింది.
దేశంలో 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికలతో పాటు వేర్వేరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు కలిసి 55,000 కోట్ల నుంచి రూ.60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ తెలిపింది. ఇది 2014 ఎన్నికల ఖర్చుతో పోల్చితే 40 శాతం ఎక్కువని ఆ సంస్థ రీసెర్చ్‌లో తేలింది. ఎన్నికలు సజావుగా జరగడానికి ఎన్నికల కమిషన్ పెట్టిన ఖర్చుతో పాటు అభ్యర్థులు చేసిన ఖర్చు, తాయిలాలను కూడా ఇందులో లెక్క పెట్టినట్లు చెప్పింది. ఈ లెక్కల ప్రకారం ఒక్కో నియోజకవర్గంలో పార్టీలన్నీ కలిసి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు తేల్చింది. 1998 -2019 మధ్య ఆరు రెట్లు ఖర్చు పెరిగిందని తెలిపింది.
ఎన్నికల్లో ఖర్చుకు సంబంధించి ప్రత్యేకంగా రూల్స్ ఉన్నాయి. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఒక స్థానానికి గరిష్టంగా 30.80లక్షల రూపాయల వరకు ఖర్చు చేయాలి. ఈ లిమిట్ గతంలో 28లక్షల రూపాయలు మాత్రమే ఉండేది. కరోనా వల్ల ఈ ఖర్చు పెంచారు. అయితే.. ఇవి అధికారికంగా ఖర్చు చేసే లెక్కలు మాత్రమే. ఎన్నికల ఖర్చుకు సంబంధించి ప్రతి క్యాండిడేట్ కచ్చితంగా పక్కాగా లెక్క చెప్పాలి. నామినేషన్ దాఖలు చేసిన తేదీ నుంచి ఎలక్షన్ రిజల్ట్స్ ప్రకటించే తేదీ వరకు పద్దును ఎన్నికల సంఘానికి అందించాలి. ప్రతి కేండిడేట్ ప్రత్యేకంగా ఒక బ్యాంకు ఖాతా తెరవాలి. ప్రతి లావాదేవీ చెక్కుల రూపంలోనే ఉండాలనేది ఎలక్షన్ కమీషన్ పెట్టిన కట్టుబాటు. కానీ.. ఇలా చేసే అభ్యర్థులు చాలా తక్కువ. నిజానికి ఒక అభ్యర్థి తరపున పెట్టే ఖర్చు, పంచే సొమ్ము నేరుగా అతడే స్వయంగా ఇవ్వకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. కాగా ఎంపీగా పోటీ చేసే అభ్యర్థి ఖర్చును రూ. 70లక్షల నుంచి రూ. 77లక్షల వరకు పెంచారు. జనాభాను బట్టి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఈ రూల్స్ ఉన్నాయి.
Also Read: Rahul Gandhi: బొగ్గు కుంభకోణం చేసిన అదానీ.. అందుకే కరెంట్ రేటు పెరిగింది
హుజూరాబాద్లో ఓటుకు ఆరు వేల రూపాయల చొప్పున పంచారనేది లెక్కలోకి తీసుకుంటే, ఒక్కో నియోజకవర్గానికి 120 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి. అంటే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో 119 నియోజకవర్గాలకు 15 వేల కోట్ల రూపాయల దాకా ఖర్చవుతుంది. జస్ట్ ఇవి ఓట్ల కోసం ఓటర్లకు పంచడానికి మాత్రమే. మరో ఐదు వేల కోట్లు ఇతర ఖర్చుల కోసం కావాలి. 2018 ఎన్నికల్లో ఒక్కో సీటుకు 25 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రకటించింది. ఈ లెక్కన చూస్తే… 119 నియోజకవర్గాలకుఖర్చు మూడు వేల కోట్లు కూడా దాటలేదు.
పదిహేనేండ్ల క్రితం ఎమ్మెల్యే ఎన్నికలకు నియోజకవర్గంలో ఒక్కో పార్టీ ఐదు కోట్ల రూపాయలకు మించి ఖర్చు పెట్టేది కాదు. ఓటుకు 100 నుంచి 200 ఇచ్చి, క్వార్టర్ సీసా ఇచ్చేవాళ్లు. ఇప్పుడు ఒక్క ఓటుకు ఆరు వేల రూపాయలు ఇవ్వడంతో వచ్చే ఎన్నికల్లోనూ ఓటర్లు ఇదే విధంగా డిమాండ్ చేసే అవకాశం ఉందని పొలిటికల్ ఎనలిస్ట్‌లు చెబుతున్నారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, కొత్తగా టికెట్ వచ్చిన వాళ్లు వందల కోట్లు ఖర్చు తప్పదని ప్రిపేరై ఉంటున్నారు.
బరిలో ఉన్న పార్టీలు ఖర్చు పెట్టడంతో పాటు అధికార పార్టీ ప్రభుత్వ నిధుల ద్వారా లాభం పొందే ప్రయత్నం చేస్తున్నాయి. హుజూరాబాద్లో మూడు నెలల్లోనే 4,359 కోట్ల రూపాయల నిధులు కుమ్మరించారు. నిలిచిపోయిన స్కీంలను కూడా తిరిగి ప్రారంభించారు. దళిత బంధు స్కీంను పైలెట్ ప్రాజెక్ట్‌గా హుజూరాబాద్ను ఎంపిక చేసి, 2,200 కోట్ల రూపాయలు దళితుల అకౌంట్లలో జమ చేశారు. వెల్ఫేర్ స్కీంలకు 960కోట్ల రూపాయలు విడుదల చేసింది. మహిళా సంఘాలకు మూడేండ్లుగా మూడు వేల కోట్ల బాకీ ఉన్న సర్కారు బైపోల్‌ను దృష్టిలో ఉంచుకుని 200 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది. వీటిలో 120 కోట్ల రూపాయలు హుజూరాబాద్‌లోని మహిళల అకౌంట్లలోనే జమ చేసింది. సీసీ రోడ్లకు 600 కోట్ల రూపాయలు, కుల సంఘాలకు స్థలాలు, భవనాలు, ఇతర పనుల కోసం నిధులు ఇచ్చింది. ఈ లెక్కన ఎన్నిక ఎన్నికకూ ఖర్చు పెరుగుతుందే కానీ.. తగ్గే ప్రసక్తే లేదు. అందుకే రాజకీయమంటే అదేదో ధనవంతుల వ్యవహారంగా మారిపోయింది. సామాన్యులు ఈవైపు కన్నెత్తి చూడటానికే భయపడే పరిస్థితులు దాపురించాయి.