వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వడ్డీ రేట్లను 40 బేసిస్ పాయింట్లు పెంచింది. ఆర్బీఐ నిర్ణయం ఎఫెక్ట్ స్టాక్ మారెట్లపై పడింది. సెన్సెక్స్ కుప్పకూలింది. నిఫ్టీ కూడా భారీగా నష్టపోయింది.
కరోనా విజృంభణ కారణంగా చాలా కాలంగా వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ వచ్చిన ఆర్బీఐ.. ఇప్పుడు ఉన్నట్టుండి పెంచేయడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. పెంచిన పాలసీ రెపో రేటు పెంపు తక్షణమే అమల్లోకి వస్తుందని ఆర్‌బీఐ తెలిపింది. వృద్ధికి మద్దతు ఇస్తూనే, ద్రవ్యోల్బణం లక్ష్యంలోపే ఉండేలా చూడటమే ఆర్బీఐ ఆలోచనగా కనిపిస్తోంది. రెపో రేటు పెంపుతో.. గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు పెరగనున్నాయి. ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరుగుతుండడంతో ఆర్‌బీఐ అప్రమత్తమైంది. సామాన్యులపై ధరల భారాన్ని తగ్గించే దిశగా చర్యలకు ఉపక్రమించింది. ఆగస్టు 2018 తర్వాత ఆర్‌బీఐ వడ్డీరేట్లను పెంచడం ఇదే తొలిసారి.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ద్రవ్యోల్బణాన్ని ఆందోళనకర స్థాయికి చేరుస్తున్నాయని ఆర్బీఐ అభిప్రాయపడింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం నెమ్మదించిందని చెప్పింది. ఆహార వస్తువులు ప్రియం కావడంతో ఫిబ్రవరిలో 6.07 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం.. మార్చిలో 6.95 శాతానికి చేరింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ధరలు భగ్గుమంటున్నాయి. కోళ్ల పెంపకానికి వాడే దాణా, పొద్దుతిరుగుడు నూనె వంటివాటి ధరలు గణనీయంగా పెరిగాయి. మరోవైపు టోకు, రిటైల్ ద్రవ్యోల్బణాల మధ్య అంతరం జనవరిలో 4.7 శాతం అయితే, ఇప్పుడు 2.3 శాతానికి తగ్గింది.
ఇక వంట వండటం కష్టంగానే మారనుంది. ఇప్పటికే సలసలమంటోన్న వంటనూనెల ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు జీలకర్ర ధరలు కూడా ఐదేళ్ల గరిష్టానికి పెరుగుతున్నాయి. జీలకర్ర పంట ఉత్పత్తి దేశీయంగా తగ్గిపోయిందని క్రిసిల్ రిపోర్టు చేసింది. ఈ పంట ఉత్పత్తి తగ్గిపోవడంతో.. ధరలు పెరుగుతున్నాయని క్రిసిల్ తెలిపింది. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే జీలకర్రలో 70 శాతం భారత్‌లోనే సాగవుతోంది. దేశీయంగా పంట ఉత్పత్తి తగ్గడం, గ్లోబల్‌గా కూడా వీటి ధరలను ప్రభావితం చేయనుంది.
ఇటీవల పామాయిల్ ధరలు కూడా గరిష్ట స్థాయిలలో నమోదవుతున్నాయి. ఈ ధరలు పెరుగుతుండటంతో స్కిన్ క్లీనింగ్ ఉత్పత్తుల ధరలపై ప్రభావం పడుతోంది. పామాయిల్ ధరల పెంపు వల్ల చాలా ఉత్పత్తుల ధరలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
కొన్ని వారాల క్రితం వరకు భారత్‌తోపాటు యావత్ ప్రపంచానికి కొవిడ్ ప్రధాన ముప్పుగా ఉంది. వరసగా మూడు దశల్లో కొవిడ్ విరుచుకుపడినా భారతదేశం అత్యధిక జనాభాకు టీకాలు వేయడం ద్వారా మహమ్మారిని అదుపుచేయగలిగింది. అంతలోనే, కొత్త సవాళ్లు ముందుకొచ్చాయి. వాటిలో ప్రధానమైనది భారత ఆర్థిక వ్యవస్థకు మళ్ళీ ఊపు తీసుకురావడమెలా అన్నది. కొవిడ్ కాలంలో క్షీణించిన జీడీపీ మళ్లీ వృద్ధి బాట పట్టినా, ధరల పెరుగుదల ప్రజలను, ప్రభుత్వాన్ని భయపెడుతోంది. ద్రవ్యోల్బణాన్ని ఆరు శాతానికి కట్టడి చేయాలన్న రిజర్వు బ్యాంకు లక్ష్యానికి గండి పడింది.
ఇవాళ ఆహారం, వంటగ్యాస్, పెట్రోలు, డీజిల్, దుస్తులు, పాదరక్షలు మొదలుకొని గృహోపకరణాలు, ఎలెక్ట్రానిక్ వస్తువుల వరకు అన్నింటి ధరలూ పెరిగిపోయాయి. దేశమంతటా దాదాపు అన్నిచోట్లా పెట్రోలు ధర లీటరుకు 110 రూపాయలు దాటిపోయింది. పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడంతో సరకుల రవాణా వ్యయం పెరిగిపోయింది. కొవిడ్ వల్ల కోల్పోయిన ఉద్యోగాలు తిరిగిరాలేదు. ఉద్యోగాలు ఉన్నవారికి వేతనాలు స్తంభించిపోయాయి. వెరసి ప్రజల ఆదాయాలు పడిపోవడంతో వ్యాపారాలు దెబ్బతిన్నాయి. చేతిలో డబ్బు ఆడక ప్రజలు ఖర్చుల్ని తగ్గించుకోవడంపై దృష్టిపెట్టారు. స్తోమత ఉన్నవారూ కార్లు, ఇళ్లు కొనడం వాయిదా వేసుకుంటున్నారు. ఇటీవల ఉత్పత్తి సాధనాల వ్యయం పెరిగిపోవడంతో పరిశ్రమలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఫ్యాబ్రికేషన్ యూనిట్లకు కావలసిన మైల్డ్ ఉక్కు ధర రెండేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు రెట్టింపైంది. స్టెయిన్‌లెస్ స్టీల్ ధరలూ రెట్టింపయ్యాయి. స్టెయిన్‌లెస్ స్టీల్ తయారీకి ఉపయోగించే నికెల్, మిశ్రమ లోహాల ధరలు నాలుగింతలు పెరిగాయి. ఇక రోడ్డు, నౌకా రవాణా ఖర్చులు తలకుమించిన భారమవుతున్నాయి. 2019తో పోలిస్తే ఇప్పుడు ముంబయి నుంచి న్యూయార్క్‌కు నౌక ద్వారా ఒక కంటైనర్ పంపడానికయ్యే ఖర్చు భారీగా పెరిగింది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఏ ధరకు ఆర్డర్లు సంపాదిస్తాయో అవే ధరకు సరఫరా చేస్తుంటాయి. ముడిసరకుల ధరలు పెరిగితే తమ ఆర్డరు విలువా పెంచాలనే నిబంధనను ఒప్పందంలో పొందుపరచలేవు. అన్ని వస్తువుల ధరలూ పెరిగిపోతున్న ఈ కాలంలో నష్టమంతా ఎంఎస్‌ఎంఈ సంస్థలే భరించాల్సి రావడంతో, అవి కుదేలవుతున్నాయి. వ్యాపారంలో నిలదొక్కుకోవడం కష్టమవుతోంది.
వరుసగా రెండేళ్లపాటు కొవిడ్ వల్ల స్తంభించిపోయిన ఆర్థిక వ్యవస్థ తేరుకుంటూ, చమురుతోపాటు ఉక్కు, అల్యూమినియం, రాగి, నికెల్, జింకు తదితరాల అవసరం పెరిగింది. కానీ, అంతర్జాతీయ సరఫరా గొలుసులు విచ్ఛిన్నమైనందువల్ల గిరాకీకి తగిన సరఫరా లేక ధరలు మిన్నంటుతున్నాయి. భారత్‌లో మాత్రం అంతర్గత గిరాకీకన్నా విదేశాల నుంచి దిగుమతుల వ్యయం పెరగడం వల్లనే ద్రవ్యోల్బణం హెచ్చుతోంది. స్వదేశంలో గిరాకీ పడిపోతే పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకురారు. భారతీయ పరిశ్రమలు తమ ఉత్పత్తి సామర్థ్యంలో 65 నుంచి 70 శాతమే వినియోగించుకొంటున్నాయని ఫిక్కి వెల్లడించింది. ఉన్న సామర్థ్యాన్నే పూర్తిగా వినియోగించుకోలేకపోతే అదనపు ఉత్పత్తి సామర్థ్య సృష్టికి పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉండదు.
కొవిడ్ తరవాత 2022 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో భారత్ 5.4 శాతం వృద్ధిరేటు సాధించినా ద్రవ్యోల్బణం వల్ల క్షీణించే అవకాశం ఉంది. అందుకే రిజర్వు బ్యాంకు 2023 జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. కరోనా కాలంలో ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడానికి రిజర్వు బ్యాంకు వడ్డీరేట్లను తక్కువస్థాయిలో ఉంచింది. కానీ, ఇప్పుడు ధరలు అధికమవుతున్న నేపథ్యంలో వడ్డీ రేట్లు పెంచి మార్కెట్‌లో ద్రవ్యలభ్యతను నియంత్రించక తప్పని పరిస్థితి వచ్చిపడుతోంది. వడ్డీ రేట్లు పెంచితే పెట్టుబడి వ్యయం పెరిగి ఆర్థికాభివృద్ధి మందగిస్తుంది. వడ్డీ రేట్లు పెంచకపోతే మార్కెట్‌లో ద్రవ్య లభ్యత పెరిగి ధరలూ హెచ్చుతాయి. రిజర్వు బ్యాంకు ప్రస్తుతం ఎదుర్కొంటున్న డోలాయమాన స్థితి ఇది.
ప్రభుత్వం ఇంధనంపై పన్నులతోపాటు జీఎస్టీని తగ్గించి, పేదలకు ఉచిత ఆహార పథకాలను విస్తరించి, ఎంఎస్‌ఎంఈ రంగానికి నగదు బదిలీ చేయడం ద్వారా ఆర్థికాభివృద్ధికి ఊపునివ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. దానివల్ల ఉపాధి అవకాశాలూ పెరుగుతాయి. అయినా, కేంద్రం ఇంతవరకు ఆ దిశగా చొరవ తీసుకోవడం లేదు. 2022 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 8.4 శాతంగా ఉండబోతున్నా ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కడానికి అది చాలదు. 2023లో 14 శాతం వృద్ధిరేటు సాధిస్తే తప్ప, ఆర్థిక రథం పరుగు మొదలుపెట్టదు. ధరలను నియంత్రించడం దానికి తొలి మెట్టు కావాలి. ధరల పెరుగుదలను అరికట్టలేకపోవడం వల్లనే శ్రీలంక, పాకిస్థాన్ నేడు దివాలా స్థితికి చేరాయి. ఆ దుస్థితి భారత్‌కు పట్టకూడదంటే ధరలకు తక్షణం కళ్ళెం వేయాలి.
ఇప్పటికే కొవిడ్‌తో సతమతమవుతున్న చిన్నాపెద్దా పరిశ్రమలకు పులిమీద పుట్రలా ఉక్రెయిన్ యుద్ధం వచ్చి పడింది. రష్యా దండయాత్ర ప్రారంభించిన వెంటనే అంతర్జాతీయ విపణిలో చమురు, వ్యాపార సరకుల ధరలు చుక్కల్ని తాకసాగాయి. మార్చి ఏడున ఒక పీపా ముడి చమురు ధర 139 డాలర్లకు చేరింది. 2008 తరవాత ఇదే అత్యధిక ధర. గత డిసెంబరులో పీపా ధర 78 డాలర్లు మాత్రమే. ఇప్పుడప్పుడే యుద్ధం ముగిసే సూచనలు కనబడకపోవడంతో చమురు, గ్యాస్ ధరలు భయపెడుతూనే ఉంటాయి. ముడి చమురులో 80 శాతాన్ని విదేశాల నుంచే దిగుమతి చేసుకొనే భారత్‌కు ఇది తీరని నష్టం కలిగిస్తోంది.
పెద్ద నోట్ల రద్దు, సుదీర్ఘ లాక్ డౌన్ దేశ ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం కలిగించింది. చిన్న దేశమైన బంగ్లాదేశ్ తలసరి ఆదాయం కూడా మన కంటే ఎక్కువగానే ఉంది. పదేళ్ల క్రితం మన కంటే ఎంతో వెనక ఉన్న బంగ్లాదేశ్.. ఇప్పుడు ఎగుమతుల కేంద్రంగా ఎదిగితే.. మన వృద్ధి రేటు మాత్రం ఆందోళన కలిగిస్తోంది.
ద్రవ్యోల్బణం వల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుంది. నగదు విలువ తగ్గిపోవడంతో ప్రజల పొదుపు చేసే సామర్థ్యం పడిపోతుంది. దీనికి తోడు ఉపాధి అవకాశాలు తగ్గితే, ప్రజలు కష్టాల పాలవుతారు. గడిచిన ఎనిమిదేళ్లలో దేశ ఆర్థికవిధానం , ద్రవ్య విధానం పరిశీలిస్తే ద్రవ్యోల్బణానికి కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాలు కారణమని తెలుస్తోంది.
డబ్బు సరఫరా, వడ్డీరేటు నిర్ణయాధికారం సెంట్రల్ బ్యాంక్ అధీనంలో ఉంటుంది. దీన్ని ద్రవ్యవిధానం అంటారు. పన్ను శాతం, ఖర్చు, దేశంలో అభివృద్ధిని పెంపొందించే విధంగా ఉంచే బాధ్యత కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుంది, దీన్ని ఆర్థికవిధానం అంటారు. కేంద్రం ద్రవ్య వినిమయ చట్టంలో తెచ్చిన మార్పుల వల్ల, ఆర్‌బీఐ స్వయం ప్రతిపత్తి తగ్గడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగిందని 2015 ఫిబ్రవరి నుంచి దేశంలోని ద్రవ్య విధానాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది. 2014 మే లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2015 ఫిబ్రవరిలో అప్పటి కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి , ఆర్బీఐ గవర్నర్ మధ్య మానిటరీ పాలసీ ఫ్రేమ్ వర్క్ అగ్రిమెంట్ జరిగింది. దీనిని అనుసరించి ద్రవ్యోల్బణం 4 శాతంగా ఆర్‌బీఐ ఉంచాలని, ఒకవేళ ఆర్బీఐ 3 క్వార్టర్స్ అలా ఉంచలేకపోతే ప్రభుత్వానికి వివరణ ఇవ్వవల్సిందిగా ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందానికి కట్టుబడి రఘురామ్ రాజన్ ద్రవ్యోల్బణం కట్టడికి చర్యలు తీసుకున్నారు. తాము ఆశించిన మేరకు వృద్ధి జరగడం లేదని గమనించి మోడీ సర్కారు రెపో రేట్ తగ్గించాలని ఆర్బీఐని ఒత్తిడి చేసింది.
విదేశీ పెట్టుబడిదారులకు లబ్ధి చేసేందుకు ఆర్బీఐ గవర్నర్ రెపో రేటు తగ్గించడం లేదని కేంద్ర ప్రభుత్వం ఆరోపణలు చేసింది. ఒకవేళ ఆ ఆరోపణ నిజమైతే, రెపో రేట్ తగ్గించినపుడు విదేశీ పెట్టుబడులు వాపస్ పోవాలి, కానీ ఆ విధంగా జరగలేదని మన FOREX రిజర్వ్, Sensex, Nifty గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2016 మే నెలలో ఆర్థిక మంత్రిత్వశాఖ, మానిటరీ పాలసీ ఫ్రేమ్ వర్క్ అగ్రిమెంట్లో భాగంగా ఫ్లెక్సిబుల్ ఇన్ ఫ్లేషన్ టార్గెటింగ్ ను ఆర్బీఐతో చేసుకుంది. దానిలో భాగంగా ముగ్గురు స్వతంత్ర సభ్యులను MPCలో కేంద్రం నామినేట్ చేసింది. అంటే ఆర్బీఐ ద్రవ్య విధాన స్వయంప్రతిపత్తిని కేంద్రం తన ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నంగా ఈ చర్యను చూడవలసి ఉంటుంది. అప్పట్నుంచి ఆర్బీఐ గవర్నర్లు మారినా.. కేంద్రంతో నిరంతర ఘర్షణ కొనసాగుతూనే ఉంది.
మెరుపు వేగంతో పరుగు తీస్తున్న దేశ ఆర్థిక జవనాశ్వానికి పెద్ద నోట్ల రద్దు కళ్లెం వేసింది. అప్పట్నుంచీ ఆర్థిక వ్యవస్థ కోలుకున్న పాపాన పోలేదన్నది నిపుణులు చెప్పే మాట. ఇక ఆ తర్వాత వచ్చి పడ్డ కరోనా పులి మీద పుట్రలా మారింది. డిసెంబర్ 2019 కరోనా ముందే ద్రవ్యోల్బణం 6.7 శాతానికి చేరుకుంది. జనవరి-మార్చి మధ్యలో కూడా 6.7 శాతం నమోదైంది. నోట్ల రద్దు, తప్పుడు జీఎస్టీ విధానాల వల్ల దేశ ఆర్థికవ్యవస్థ ఛిన్నాభిన్నమై దేశ వృద్ధి రేటు పడిపోతుంటే, రెపో రేట్ తగ్గించి వృద్ధి రేటు పడిపోకుండా కేంద్రం ప్రయత్నించినప్పటికీ కరోనా కంటే ముందే వృద్ధి రేటు 4 శాతానికి పడిపోయి, భారత దేశం అభివృద్ధి చెందే దేశమనే గుర్తింపు 2019 నాటికే కోల్పోయింది. అంటే నోట్లరద్దు, జీఎస్టీ భారత ఆర్థికవ్యవస్థను ఎంత దెబ్బకొట్టాయో అర్థం చేసుకోవచ్చు.
కరోనా సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్, నోబెల్ గ్రహీతలు అభినవ్ బెనర్జీ, అమర్త్యసేన్‌తో పాటు అనేక మంది ఆర్థిక నిపుణులు హెలికాప్టర్ మనీ ద్వారా ప్రజలకు డబ్బు చేరవేయడం ద్వారా నే ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందని, తద్వారానే ఆర్థికచక్రం మళ్లీ గాడిలో పెట్టవచ్చని కేంద్రానికి సూచించారు. ఆ సూచనలు కేంద్రం పెడచెవిన పెట్టింది. దీంతో ప్రజల కొనుగోలుశక్తి తగ్గడంతో పాటు ద్రవ్యోల్బణం పెరిగింది. ఆర్బీఐ రెపో రేట్ పెంచితే అత్యధికంగా నమోదు కాబోయే నెగెటివ్ గ్రోత్‌కు కేంద్రం జవాబు చెప్పాల్సి ఉంటుంది. కేంద్రం, ఆర్బీఐ తమ బాధ్యతల నుంచి తప్పించుకునేందుకు 2020 ఏప్రిల్, మే నెలల ద్రవ్యోల్బణాన్ని గుర్తిచండం లేదని, లాక్‌డౌన్ కారణంగా ఆ సంఖ్యలకు ప్రామాణికత లేదని అభిప్రాయపడి, ద్రవ్యోల్బణం లెక్క లు జూలై నుంచి పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని తాము ఆమోదించలేమని డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆర్థిక మంత్రిత్వశాఖకు తెలిపింది. అంతేకాకుండా తాము గణాంకాలు ప్రకటించే ముందు ఆర్థికశాఖ అనుమతితోనే ప్రకటించామని, ఇప్పుడు మార్చుకోలేమని తెలిపారు. డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అభిప్రాయాన్ని బుట్టదాఖలు చేస్తూ, ఆర్థికశాఖ ఏప్రిల్, మే ద్రవ్యోల్బణ గణాంకాలను తిరస్కరించి, జూలై నుంచి ద్రవ్యోల్బణం పరిగణనలోకి తీసుకునేవిధంగా ఆదేశాలు జారీచేసింది.
నోట్ల రద్దు, జీఎస్టీ, కార్పొరేట్ టాక్స్‌ను తగ్గించడం వంటి చర్యల వల్ల ద్రవ్యలోటు పెరిగింది. దాన్ని పూరించేందుకు పెట్రోల్‌పై సెస్‌ను కేంద్రం పెంచింది. పెట్రోల్‌పై విధిస్తున్న మొత్తం సుంకంలో కేంద్రం వసూలు చేస్తున్న ది 63 శాతం కాగా, రాష్ర్టాలు వసూలు చేస్తున్నది 37 శాతం మాత్రమే. అయినప్పటికీ రాష్ర్టాలను వ్యాట్ తగ్గించమని మోడీ చెప్పడం రాజకీయ లబ్ధి కోసమే. పెట్రోల్ రేట్ల పెంపు ద్వారా లక్షల కోట్లు వెనకేసుకున్న కేంద్రం.. ఈ పెరుగుదలకు అంతమెప్పుడో కూడా దిక్కుతెలియని స్థితిలో ఉందంటే నమ్మాల్సిందే.
గత పదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ ఏ రేంజ్ లో పతనమైందో ఇటీవలే విడుదలైన ఐఎంఎఫ్ గణాంకాలు కళ్లకు కడుతున్నాయి. పదేళ్ల క్రితం చిన్న దేశం బంగ్లాదేశ్ కంటే తలసరి ఆదాయంలో ఎంతో ముందున్న ఇండియా.. ఇప్పుడు అంతకతంకూ దిగజారిపోతోంది. 2026-27 వరకూ మన కంటే బంగ్లాదేశ్ తలసరి ఆదాయం ఎక్కువగా ఉంటుందని ఐఎంఎఫ్ అంచనాలు చెబుతున్నాయి. అప్పటికీ దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే.. బంగ్లాదేశ్ ఆధిపత్యం భవిష్యత్తులోనూ కొనసాగుతుందని బాంబు పేల్చింది. మనం ఎక్కడ తప్పులు చేస్తున్నామో తెలుసుకోకుండా.. ఇప్పటికీ వాస్తవాన్ని గుర్తించడానికి ఇష్టపడకపోతే.. అది మరింత నష్టం కలగజేస్తుంది. కొన్నాళ్లుగా బంగ్లాదేశ్ ఎగుమతులపై దృష్టి కేంద్రీకరించి.. ఎగుమతుల కేంద్రంగా ఎదిగింది. కానీ కరోనా తర్వాత మన ఎగుమతులు డీలా పడ్డాయి. ఈ సంవత్సరం రికార్డు స్థాయి ఎగుమతులు చేసినా.. అది మన జీడీపీతో పోలిస్తే పెద్ద ఎక్కువేం కాదు. అటు సామాజిక సూచీల్లో కూడా బంగ్లాదేశ్ ఇండియాను అధిగమించింది. ఉపఖండంలో అతి పెద్ద ఆర్థిక శక్తిగా ఉన్న ఇండియా.. ఇలా బంగ్లాదేశ్ లాంటి దేశం కంటే కిందకు దిగజారడం ఎవరికీ మంచిది కాదు. ప్రస్తుతం మాల్దీవులు, భూటాన్, నేపాల్ కంటే మెరుగ్గా ఉన్నామని సరిపెట్టుకుంటే.. అంతకంటే ఆత్మవంచన మరొకటి ఉండదు. పాకిస్తాన్, శ్రీలంక లాంటి సంక్షోభాలు లేవు కదా అని రిలాక్సైతే.. ఊహించని సంక్షోభం తప్పదనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
దేశంలో పడిపోతున్న కొనుగోలు శక్తి కూడా ఆందోళనకు దారితీస్తోంది. కరోనా తర్వాత ఇంతవరకూ ప్రజల ఆదాయాలు పెరగలేదు. ఓవైపు నిత్యావసరాల ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. కానీ సామాన్యుడు మాత్రం ఏమీ కొనలేని స్థితిలో ఉన్నాడు. ఎన్నో సంక్షోభాలు చూసిన భారత్ కు ఈ సమస్యను కూడా ఎదుర్కునే సత్తా ఉన్న మాట నిజం. కానీ దానికి ప్రభుత్వ చొరవ మాత్రం అత్యావశ్యకం.
కొత్త ఆర్థిక సంవత్సరం తొలి మాసంలో భారత వస్తూత్పత్తి రంగంలో ముఖ్యంగా వినియోగ వస్తువుల తయారీలో ఎలాంటి పురోగతి లేదని తాజా సర్వే వెల్లడించింది. భారత ఆర్థిక వ్యవస్థ నేడు ఎదుర్కొంటున్న వాస్తవిక పరిస్థితికి ఈ సర్వే దర్పణం పడుతున్నది. ఆర్థిక మాంద్యం, ఆ పై, కోవిడ్ మహమ్మారి విరుచుకుపడడంతో ఛిద్రమైన ప్రజల జీవితాలు కొత్త ఆర్థిక సంవత్సరంలోనైనా మెరుగుపడతాయని ఆశించినవారికి ఈ తొలి సంకేతాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఒక పక్క విపరీతంగా పెరిగిపోతున్న ధరలు, మరో పక్క పడిపోతున్న వేతనాలు, అంతులేని నిరుద్యోగం ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఎస్ అండ్ పి గ్లోబల్ ఇండియా మ్యానుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ సర్వే వెల్లడించిన అంశాల్లో ప్రధానమైనది వినియోగ వస్తువుల తయారీ రంగం ఇప్పటికీ నేల చూపులు చూడడం. బిజినెస్ కాన్ఫిడెన్స్ లెవెల్స్‌లో కొంత మెరుగుదల ఉన్నప్పటికీ స్థూలంగా చూసినప్పుడు ఇప్పటికీ చాలా కంపెనీలు ముఖ్యంగా చిన్న మధ్య తరహా పరిశ్రమలు కష్టాల్లో కొట్టుమిట్టాడుతూనే ఉన్నాయి. వాటి ఉత్పత్తి కార్యకలాపాలు మామూలు సామర్ధ్య స్థాయికి చేరుకోడానికి ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది.
ఉత్పత్తి సామర్థ్యం పెరగకుండా ఉపాధి అవకాశాలు మెరుగుపడవు. ఉత్పత్తి పెరగాలంటే మార్కెట్‌లో సరకులకు గిరాకీ పెరగాలి. మార్కెట్‌లో వినియోగ వస్తువులకు గిరాకీ పెరగాలంటే ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి. అదే ఇప్పుడు లోపించింది. దీనికి అధిక ద్రవ్యోల్బణం, ఉపాధి అవకాశాలు సన్నగిల్లడం, వేతనాలు పడిపోవడం ముఖ్య కారణాలు. ఓ ఆర్థిక వేత్త చమత్కరించినట్లుగా ద్రవ్యోల్బణం అనేది చట్టంతో నిమిత్తం లేకుండా ప్రజలపై సాగించే పన్నుల దాడి. దీని ప్రభావం ప్రతి ఒక్కరిపైనా ఉంటుంది. ప్రత్యేకించి పేదలు, మహిళలపై దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ముడి సరుకుల ధరలు పెరగడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరిగితే ఆ భారాన్ని కంపెనీలు భరించవు. వాటిని వినియోగదారులపైకే నెట్టివేస్తాయి. ఇలా అన్ని వైపుల నుంచి మోపుతున్న భారాల నుంచి ప్రజలకు ఊరట కలిగించడానికి బదులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు, యూజర్ ఛార్జీలు, సెస్సులు, సర్‌చార్జీలు, విద్యుత్, ఆర్టీసీ చార్జీలను పెంచుతూ వారి నడ్డి విరుస్తున్నాయి.
పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం ఎడాపెడా పెంచుతూ పోతోంది. ఉక్రెయిన్ సంక్షోభాన్ని సాకుగా చూపి వంట నూనెలు, ఆహార వస్తువుల ధరలు ముండుతున్నాయి. పారిశ్రామిక మాంద్యం నుంచి బయటపడేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కోవిడ్ సమయంలో ప్రకటించిన 21 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో ప్రజలకు ఇచ్చింది ఒక శాతం మాత్రమే. తక్కినదంతా కార్పొరేట్లకు దోచిపెట్టింది కేంద్రం. ఎంఎస్‌ఎంఇలకు ఇచ్చింది అత్యల్పమే. ఇటువంటి ఈ ప్రజా వ్యతిరేక విధానాల ప్రభావం జిడిపిపై కూడా పడింది. ఈ ఆర్థిక సంవత్సరం జిడిపి అంచనాలు తలకిందులయ్యే పరిస్థితి నెలకొంది. కోవిడ్ మహమ్మారికి ముందున్న స్థితికి మన ఆర్థిక వ్యవస్థ తిరిగి చేరుకోడానికి మరో పది సంవత్సరాలు పట్టేలా ఉంది. ఈ పరిస్థితి మారాలన్నా, ప్రజల కష్టాలు తొలగాలన్నా ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు మార్చుకోవటం ఒక్కటే మార్గం.
దేశంలో నిరుద్యోగిత రేటు పెరిగింది. ఈ ఏడాది మార్చిలో 7.6%గా ఉన్న నిరుద్యోగిత రేటు ఏప్రిల్‌కు 7.83 శాతానికి పెరిగిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ వెల్లడించింది. మొత్తంగా గత నెలలో గ్రామీణ ప్రాంతాలతో పోల్చుకుంటే పట్టణ ప్రాంతాల్లో ఈ రేటు పెరిగింది. గ్రామాల్లో స్వల్పంగా తగ్గింది. పట్టణాల్లో మార్చితో పోల్చుకుంటే ఏప్రిల్‌లో నిరుద్యోగిత రేటు 8.28% నుంచి 9.22%కు చేరగా, ఇదే సమయంలో గ్రామాల్లో 7.29%గా ఉన్న నిరుద్యోగ రేటు 7.18%కి తగ్గింది. ఏప్రిల్ నెలకు సంబంధించి సీఎంఐఈ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. హర్యానాలో నిరుద్యోగం తీవ్రస్థాయిలో ఉన్నది. అక్కడ 34.5 శాతం ఉండగా, తరువాతి స్థానాల్లో రాజస్థాన్, బీహార్ ఉన్నాయి. హిమాచల్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అస్సాం తక్కువ నిరుద్యోగిత రేటు నమోదు చేసుకున్నాయి.
ఆర్థిక మందగమనం వల్లే దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోంది. దేశీయంగా డిమాండ్ మందగించడం, పెరుగుతున్న ధరలతో ఆర్థిక వ్యవస్థ రికవరీ నెమ్మదించడం వలన ఉద్యోగ అవకాశాలు దెబ్బతిన్నాయి. నిరుద్యోగ సమస్యకు.. ఉద్యోగాల కల్పన లేమితో పాటు.. కోట్లాది మంది ఉద్యోగాల వేట ఆపేయడం కూడా ఓ కారణం. చాలా మంది కార్మిక శక్తి నుంచి తప్పుకోవడం కూడా ఆందోళన కలిగిస్తోంది. మార్చి నెలలో లేబర్ ఫోర్స్ 38 లక్షలు తగ్గింది. ఆర్థిక వ్యవస్థలో సరిపడా ఉద్యోగాలను సృష్టించేందుకు వృద్ధి రేటు 6-8% మధ్య ఉంటే సరిపోదని, అంతకుమించి ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. మన దేశానికి సంబంధించినంత వరకు 2003-13 మధ్య కాలం జీడీపీకి సువర్ణాధ్యాయం అనే చెప్పాలి. ఆ దశాబ్దంలో వృద్ధిరేటు పరుగులు పెట్టింది. కానీ ఆ తర్వాతే మందగమనం మొదలైంది. సంక్షోభాలు మన దేశానికి కొత్తేం కాదు. కోవిడ్ లాంటి ఆరోగ్య మహమ్మారి నుంచి కూడా అతి తక్కువ నష్టంతో బయటపడ్డ సమర్థత మనకుంది. ఇప్పుడు పొంచి ఉన్న ఆర్థిక సంక్షోభాన్ని కూడా నివారించే మార్గాలున్నాయి. అయితే దీనికి ప్రభుత్వమే చొరవ చూపాల్సి ఉంటుంది. ఆర్థిక వేత్తల సూచనలు ఆచరణలో పెడితే.. విధానాల పరంగా ఉన్న లోపాలు దిద్దుకుంటే.. త్వరగానే ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకుంటుంది. ఎప్పటిలాగే వాస్తవాలు దాచేసి.. గణాంకాల గారడీ చేద్దామనుకుంటే మాత్రం.. పెద్ద షాక్ తప్పదు.