ఓ అధికారి మిమ్మల్ని ఎవరు పిలిచారంటారు..ఓ నేత సెక్యూరిటీ గార్డు ఉద్యోగమిస్తానంటాడు..ఇది నిరుద్యోగుల్ని అవమానించటం కాదా?సైనికుల త్యాగాన్ని తక్కువ చేయటం కాదా?
విధ్వంసం తప్పే..కానీ, ఈ మాటలేంటి?
అగ్నిపథ్ దేశమంతా మంటలు రేపుతోంది.నిరుద్యోగులు ఈ స్కీమ్ ని ఒప్పుకునేది లేదంటున్నారు..ప్రభుత్వం అమలు చేసి తీరుతాం అంటోంది.ఇక నుంచి రెగ్యులర్ సెలక్షన్లు ఉండవని, ఆర్మీలోకి రావాలంటే అగ్నిపథ్ ఒక్కటే మార్గమంటోంది.
అగ్నిపథ్ పథకంపై యువత నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.దీనిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అనేక నిరసన కార్యక్రమాలు జరిగాయి.చాలా చోట్ల సైనిక ఉద్యోగార్ధులు శాంతియుతంగానే నిరసనలు కొనసాగిస్తున్నారు.
కేంద్రం లక్ష్యం ఏదైనా అగ్నిపథ్ తేవాలని గట్టిగా యోచిస్తోంది. ఇది స్పష్టం. అదే సమయంలో యువతలో దీనిపై తీవ్రమైన అభ్యంతరం ఉంది. ఇదీ క్లియర్. తమ జీవితాలను తలక్రిందులు చేసే ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా విధ్వంసానికి దిగారు. రైళ్లు తగలబెట్టారు. బస్సుల అద్దాలు పగలగొట్టారు.. నిరుద్యోగుల ఆవేదన అర్థం చేసుకోతగినదే. కానీ, విధ్వంసాన్ని మాత్రం సమర్థించలేం. ఇంత వరకు క్లియర్. కానీ, ఈ సమయంలో కొందరు నేతలు అధికారుల మాటలు మాత్రం సైన్యాన్ని, సైనికులను, నిరుద్యోగులను అవమానించేదిగా కనిపిస్తోంది. అత్యంత అప్రజాస్వామికంగా, హేళనగా, నిరంకుశత్వాన్ని ధ్వనించే మాటలతో సైనికులను అవమానపరుస్తున్నారు..
మీకు నచ్చితే జాయిన్ అవ్వండి … లేకుంటే లేదు.. అసలు మిమ్మల్ని ఎవరు పిలిచారు…. మిమ్మల్ని తీసుకుంటామని ఎవరు చెప్పారు.. ఇదీ కేంద్ర మంత్రి, ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీకే సింగ్ చెప్తున్న మాట. ఆరుపదులు దాటిన వయస్సులో రిటైర్మెంట్ ను వాయిదా వేయాలంటూ కోర్టును ఆశ్రయించిన ఈ వ్యక్తి యువతను 23ఏళ్లకే రిటైర్ అవమని సూచిస్తున్నారు. పైగా మిమ్మల్ని ఎవరు పిలిచారు? తీసుకుంటామని ఎవరు చెప్పారు అని అహంకారంతో మాట్లాడుతున్నారు. ఈ దేశంలో ప్రజలే ప్రభువులు…ప్రజలే సర్వాధికారులు.. ఆర్మీ అయినా, ప్రభుత్వ పెద్దలైనా రాజ్యాంగాన్ని అనుసరించి పనిచేసే ప్రజా సేవకులు మాత్రమే అనే విషయాన్ని ఈయనగారు మర్చిపోతున్నారు. పైగా రెండు పదులు దాటని నిరుద్యోగ యువతని ఈయన అహంకారంతో గద్దిస్తున్నారు. ఎంత నిరంకుశత్వం ఇది. ఒక రాచరికంలో వినపడాల్సిన మాటలు ప్రజాస్వామ్యంలో వినిపిస్తున్నాయి. ఇక్కడ ప్రజల కోసమే వ్యవస్థలు, ప్రజల కోసమే ప్రభుత్వాలు, ప్రజల కోసమే పాలసీలు. ఈ బేసిక్ విషయాన్ని మర్చిపోయి అధికారం నెత్తికెక్కిన వీకె సింగ్ మాటలపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇక మరో అధికార పార్టీ నేత ఉన్నారు.. ఆయనైతే సైనికులను ఏకంగా సెక్యూరిటీ గార్డులను చేసేశారు. ఓ సారి ఆ మాటలూ విని తరించండి..
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయవర్గీయ చెప్తున్నమాట ఇది. అంటే, దేశం కోసం ప్రాణాలివ్వాలని వచ్చే సైనికులకు, తమ పార్టీ ఆఫీసులో సెక్యూరిటీ సిబ్బందికి తేడా తెలియని ఈయన గారు, బిజెపి ఆఫీసుల్లో సెక్యూరిటీ సిబ్బందిగా అగ్నివీర్లకే మొదటి ప్రాధాన్యం ఇస్తారట.
కాస్తైనా సోయి ఉంటే ఇలా మాట్లాడతారా? ఈ దేశంలో సైన్యం అంటే ఓ ఎమోషన్..ఓ గౌరవం. సైన్యంపైనా, సైనికులపైనా దేశంలో ఎంతో గౌరవం ఉంటుంది. ఇది కచ్చితంగా అన్ని ఉద్యోగాల్లాంటిది కాదు. కానీ, ఈ మాటలు వింటుంటే, అధికారంలో ఉన్న పెద్దలకు నిరుద్యోగులన్నా, సైన్యం అన్నా, ఎంత చిన్న చూపు ఉందనే విషయం స్ఫష్టంగా కనిపిస్తుంది. కైలాశ్ విజయవర్గీయ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన పార్టీలు ఈ కామెంట్స్ పై మండిపడ్డాయి. అయితే టూల్‌కిట్ గ్యాంగ్ తన వ్యాఖ్యలను వక్రీకరించిందని కైలాశ్ విజయవర్గీయ అన్నారు.
దేశ యువత, ఆర్మీని అగౌరవపర్చవద్దని ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్‌లో విమర్శించారు. దేశంలోని యువతను, ఆర్మీ సిబ్బందిని అగౌరవపరచవద్దని, వారు సైన్యంలోకి వెళ్లి దేశానికి సేవ చేయాలనుకుంటున్నారు, బీజేపీ కార్యాలయం వెలుపల కాపలాగా ఉండటానికి కాదని అన్నారు.
ఏ అంశంపై అయినా భిన్నాభిప్రాయం ఉండటం సహజం. అందులో తప్పేం లేదు. పైగా ఇంత పెద్ద దేశంలో ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకునేటపుడు దానిపై కనీస చర్చ అయినా ఉండాలి కదా. అలాంటిదేం లేకుండా, రాత్రికి రాత్రే ప్రకటనలు చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటామంటే ఎలా? పైగా సైన్యంపట్ల చులకన భావం ఎంత వరకు సమజంసం. ఇప్పుడు ఆర్మీ అధికారులు, బిజెపి నేతల మాటల్లో ఇదే కనిపిస్తోంది.
మరోపక్క అగ్నిపథ్‌కు నిరసనగా పలు రాష్ట్రాల్ల్లో భారత్ బంద్ జరిగింది. అగ్నిపథ్‌ను వెనక్కి తీసుకోవాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. అగ్నిపథ్‌పై దేశవ్యాప్త ఆందోళనలతో 529 రైళ్లు రద్దయ్యాయి. 181 ఎక్స్‌ప్రెస్, 348 ప్యాసింజర్ రైళ్లు రద్దయ్యాయని రైల్వేశాఖ తెలిపింద.అగ్నిపథ్ అల్లర్లతో అన్ని రైల్వేస్టేషన్లలో భద్రత కట్టుదిట్టం చేశారు.
రాజధాని దిల్లీ సరిహద్దుల్లో పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దిల్లీ – గురుగ్రామ్, దిల్లీ – నోయిడా హైవేపై కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. అగ్నిపథ్‌పై కాంగ్రెస్ ఆందోళనల నేపథ్యంలో దిల్లీలోని పలు రహదారులను మూసివేశారు. అగ్నిపథ్ ఆందోళనల దృష్ట్యా బిహార్‌లోని రైల్వే స్టేషన్ల వద్ద భద్రతను పెంచారు. ఝార్ఖండ్‌లో ముందు జాగ్రత్త చర్యగా స్కూళ్లను మూసివేసి సెలవు ప్రకటించారు. నిరసనల నేపథ్యంలో ఉత్తరాదిలో పలు రైళ్లు రద్దయ్యాయి. మిలటరీ రిక్రూట్‌మెంట్ పథకం అగ్నిపథ్ పై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయంటూ 35 వాట్సాప్ గ్రూపులపై కేంద్రం కొరడా ఝళిపించింది. ఆ గ్రూపులను కేంద్రం నిషేధించింది.
అగ్నిపథ్ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని రాజస్థాన్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఆ రాష్ట్ర మంత్రి మండలి ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించింది. ఈ పథకాన్ని ప్రవేశపెట్టే ముందు నిపుణులతో చర్చించి ఉండాల్సిందని అభిప్రాయపడింది. అగ్నిపథ్‌తో కేంద్రం యువతను మోసం చేస్తోందని మమత బెనర్జీ మండిపడ్డారు. ఇది కచ్చితంగా 2024 లోక్‌సభ ఎన్నికల స్టంటే అని విమర్శించారు. అగ్నిపథ్ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అగ్నిపథ్ పథకం పేరుతో యువతరాన్ని నిర్వీర్యం చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతున్నదని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. విపక్షాలతో చర్చించకుండా, రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోకుండా అగ్నిపథ్ వంటి అతిపెద్ద నిర్ణయం ఎలా తీసుకుంటారని అభయ్ ప్రశ్నించారు. ఓ పక్క నిరసనలు, విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలోనే త్రివిధ దళాల్లో అగ్నివీరుల నియామకం కోసం కేంద్ర ప్రభుత్వం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది.
అగ్నిపథ్ పథకంపై యువత నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
నిరుద్యోగుల ఆవేదన అర్థం చేసుకోతగినదే. కానీ, విధ్వంసాన్ని మాత్రం సమర్థించలేం.
అధికారుల మాటలు మాత్రం సైన్యాన్ని, సైనికులను, నిరుద్యోగులను అవమానించేదిగా కనిపిస్తోంది.
మీకు నచ్చితే జాయిన్ అవ్వండి … లేకుంటే లేదు.. అసలు మిమ్మల్ని ఎవరు పిలిచారు…. మిమ్మల్ని
ఒక రాచరికంలో వినపడాల్సిన మాటలు ప్రజాస్వామ్యంలో వినిపిస్తున్నాయి.
ఆయనైతే సైనికులను ఏకంగా సెక్యూరిటీ గార్డులను చేసేశారు. ఓ సారి ఆ మాటలూ విని తరించండి..
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయవర్గీయ చెప్తున్నమాట ఇది.కాస్తైనా సోయి ఉంటే ఇలా మాట్లాడతారా?
కైలాశ్ విజయవర్గీయ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.నిర్ణయాలు తీసుకునేటపుడు దానిపై కనీస చర్చ అయినా ఉండాలి కదా.
దేశవ్యాప్త ఆందోళనలతో 529 రైళ్లు రద్దయ్యాయి.నిరసనల నేపథ్యంలో ఉత్తరాదిలో పలు రైళ్లు రద్దయ్యాయి.
అగ్నిపథ్ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని రాజస్థాన్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.లోక్‌సభ ఎన్నికల స్టంటే అని విమర్శించారు. అగ్నిపథ్ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎంత వ్యతిరేకత వచ్చినా, ఎన్ని ఆందోళనలు జరిగినా, అగ్నిపథ్ ఆగే ప్రసక్తే లేదంటోంది రక్షణ శాఖ. నియామక షెడ్యూళ్లను కూడా త్రివిధ దళాలు ప్రకటించాయి. తొలి 4-5 ఏళ్లలో 60వేల మందిని నియమించనున్నారు. ఇక నుంచి నియామకాలు కొత్త విధానం ద్వారానే సాగుతాయని స్పష్టంచేసింది. మునుపటి విధానం కొనసాగదని చెప్తోంది. మూడు దళాలు మరో అడుగు ముందుకేసి.. అగ్నిపథ్ కింద నియామకాల కోసం ఆదివారం షెడ్యూళ్లను ప్రకటించాయి. త్రివిధ దళాల్లో సరాసరి వయసును తగ్గించడమే అగ్నిపథ్ ఉద్దేశమని ఆర్మీ అధికారులంటున్నారు. దీనికి 1989 నుంచి ప్రయత్నాలు జరిగాయని తెలిపారు. కార్గిల్ యుద్ధం అనంతరం ఏర్పాటైన సమీక్ష కమిటీ ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తంచేసిందన్నారు. ఇప్పుడు కొవిడ్-19 పుణ్యమాని ఆ ప్రతిపాదన కార్యరూపం దాలుస్తోందని చెప్తున్నారు.
పర్వతప్రాంతాల్లో పనిచేసే సైనికుల్లో కొందరు ప్రతికూల వాతావరణం వల్ల చనిపోతున్నారని, అందుకు ప్రధాన కారణం వయసేనంటున్నారు ఆర్మీ అధికారులు. అగ్నిపథ్‌పై యువకులు తమ నిరసనను విరమించుకోవాలంటున్న అధికారులు, గతంలో ర్యాలీల్లో పాల్గొని శారీరక, వైద్య, ప్రవేశపరీక్షలు పూర్తిచేసి నియామక పత్రాల కోసం ఎదురుచూస్తున్నవారు కూడా అగ్నిపథ్ కింద దరఖాస్తు చేసుకోవాల్సిందేనంటున్నారు. అలాంటివారి కోసమే వయోపరిమితిని ఈ ఏడాది 23 ఏళ్లకు పెంచినట్లు చెప్పారు.
అగ్నిపథ్ కింద వైమానిక దళంలో ఈ నెల 24 నుంచి నమోదు ప్రక్రియ ఆరంభమవుతుంది. జులై 24 నుంచి తొలిదశ ఆన్‌లైన్ పరీక్ష ప్రక్రియ మొదలవుతుంది. డిసెంబరు చివరికల్లా తొలి అగ్నివీర్ బ్యాచ్ నియామకం జరుగుతుంది. డిసెంబరు 30 నుంచి వారికి శిక్షణ మొదలవుతుంది.
నేవీలో అగ్నివీరుల నియామకాల కోసం జూన్ 25కల్లా విస్తృత మార్గదర్శకాలు విడుదలవుతాయి. నవంబరు 21 కల్లా మొదటి బ్యాచ్ శిక్షణ ప్రారంభమవుతుంది. నౌకాదళంలో మహిళలకూ అగ్నివీరులుగా అవకాశం కల్పిస్తారు. వీరు యుద్ధనౌకల్లోనూ విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
ఆర్మీలో అగ్నివీర్ నియామక ప్రక్రియ కోసం ముసాయిదా నోటిఫికేషన్ వెలువడింది. జాయిన్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు పంపుకోవచ్చు. నియామకం కోసం ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరులో ర్యాలీలు జరుగుతాయి. రెండు బ్యాచ్‌లుగా నియామకం జరుగుతుంది. తొలి బ్యాచ్‌లో 25వేల మందిని డిసెంబరు రెండో వారానికల్లా నియమిస్తారు. రెండో బ్యాచ్ నియామకం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగుతుంది. ఈ రెండింటిలో కలిపి 40వేల మందిని నియమిస్తారు. దేశవ్యాప్తంగా 83 ర్యాలీలు నిర్వహిస్తారు. వచ్చే నాలుగైదేళ్లలో 50 వేల నుంచి 60వేల మందిని రిక్రూట్ చేస్తారు. ప్రస్తుతం సైనిక దళాల వద్ద 60వేల మందికి శిక్షణ ఇచ్చే సామర్థ్యం ఉంది. దీన్ని విస్తరించుకుంటూ వార్షిక నియామకాలను 90వేల నుంచి 1.20 లక్షలవరకు తీసుకెళ్తారని చెప్తున్నారు..
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయే అగ్నివీరుడికి రూ.కోటిదాకా బీమా, పరిహారం దక్కుతాయి.
18 ఏళ్లలోపు అభ్యర్థుల తరపున తల్లిదండ్రులు లేదా సంరక్షకులు సంతకాలు చేయాల్సి ఉంటుందని వాయుసేన తెలిపింది. 30 రోజుల వార్షిక సెలవులు, అనారోగ్యం ఆధారంగా సిక్ లీవ్‌లు ఉంటాయి.
కోచింగ్ సంస్థలే యువకుల్లో ఆశలు రేపి రెచ్చగొడుతున్నాయని ఆర్మీ అధికారులంటున్నారు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న అల్లర్లలో పాల్గొనేవారికి త్రివిధ దళాల్లోకి ప్రవేశం ఉండబోదని చెప్తున్నారు. నియామకాలకు ముందు పోలీసు పరిశీలన ఉంటుంది. అగ్నిపథ్‌లో ఎంపికైన అభ్యర్థులు తాము ఎలాంటి నిరసనలు, దాడుల్లో పాల్గొనలేదని ప్రతిజ్ఞపత్రం ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. అగ్నివీరుల్లో 60-70 శాతం మంది పదో తరగతివారే ఉండబోతున్నారు. సర్వీసు నుంచి బయటికొచ్చేనాటికి వారి వయసు 21 ఏళ్ల నుంచి 25 ఏళ్లలోపు ఉంటుంది. నాలుగేళ్ల తర్వాత అగ్నివీరుల్లో 25% మందిని రెగ్యులర్ సర్వీసులో చేర్చుకుంటారు. మిగిలిన 75% మందికి కేంద్ర సాయుధ బలగాల్లో, రక్షణ శాఖ నియామకాల్లో 10% చొప్పున ప్రాధాన్యం ఇస్తామని అధికారులు చెప్తున్నారు. బయటికొచ్చేవారి చేతిలో దాదాపు 12 లక్షల సొమ్ము ఉంటుంది.
మరోవైపు, అగ్నిపథ్ స్కీమ్ ని వ్యతిరేకించటంలో కీలకమైన అంశం.. 75శాతంమందిని కేవలం నాలుగేళ్ల తర్వాత ఇంటికి పంపటం. దీంతో ఈ అంశంపై ఉన్న అసంతృప్తిని తొలగించేలా కేంద్ర కొన్ని సడలింపులు ఇచ్చింది. కేవలం నాలుగేళ్ల సర్వీసు మాత్రమే అంటే, ఉద్యోగ భద్రతను దూరం చేస్తుందనీ, భవిష్యత్తుని అనిశ్చితం చేస్తుందని నిరసనకారులు ఆందోళన చేస్తున్నారు.
ఈ క్రమంలోనే కేంద్రంతో పాలు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలను ప్రకటించాయి. అవి ఖాళీలలో రిజర్వేషన్ నుండి, రాష్ట్ర ఉద్యోగాలలో ప్రాధాన్యతనిస్తాయనే హామీ వరకు ఉన్నాయి. అగ్నివీరులుగా పనిచేసిన వారికి కేంద్ర సాయుధ బలగాల్లో రిజర్వేషన్ కల్పిస్తామని హోంశాఖ ప్రకటించింది. అగ్నిపథ్ కింద ఆర్మీకి ఎంపికై నాలుగేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారికి.. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, అస్సామ్ రైఫిల్స్‌లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని వెల్లడించింది. ఈ రెండు దళాల్లో నియామకాల్లో గరిష్ట వయో పరిమితిని అగ్నివీరులకు 3 ఏళ్ల పాటు పెంచుతామని కేంద్రం తెలిపింది. అగ్నివీర్ తొలి బ్యాచ్ వారికి .. కేంద్ర సాయుధ బలగాల నియామకాల్లో గరిష్ట వయో పరిమితి 5 ఏళ్లు సడలింపు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
ఫిజికల్ టీచర్లుగా నియమించే విషయం ఆలోచిస్తామని కేంద్ర క్రీడలు మరియు యువజన వ్యవహారాల మంత్రి అనురాగ్ ఠాకూర్ అంటున్నారు. అటు సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ కూడా అగ్నివీరులకుఏ రకమైన ఉద్యోగాలకు అవకాశం ఉందో ఓ జాబితా విడుదల చేసింది. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ కూడా అగ్నివీర్స్ కోసం ఆరు సేవా మార్గాలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఇక కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వ రంగ బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థల అధిపతులతో వారి సంబంధిత సంస్థల్లో అగ్నివీరులకు ఉపాధి అవకాశాలను అన్వేషించడానికి సమావేశం నిర్వహించింది. యూపీ, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, అస్సాం, హర్యానా, కర్నాటక లాంటి బిజెపి పాలిత రాష్ట్రాలు పోలీస్ రిక్రూట్ మెంట్ లో అగ్నివీర్లకు ప్రాధాన్యత ఇస్తామని ఇప్పటికే తెలిపాయి.
అటు ఆర్మీ తగ్గనంటోంది.ఇటు బిజెపి నేతలు, మాజీ ఆర్మీఅధికారుల మాటల్లో నిరుద్యోగుల పట్ల చులక భావం వ్యక్తమౌతోంది.
నిరుద్యోగ యువత చేసింది తప్పే కావచ్చు.కానీ, కెరీర్ నాశనమౌతుంటే ఆ బాధలో చేసిన అరాచకం అది. అయినా క్షమించాల్సిన పనిలేదు..చట్టప్రకారం పబ్లిక్ ప్లాపర్టీని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవలసిందే.కానీ, ఇక్కడి వరకు ఎందుకొచ్చారో కూడా ఆలోచించాలి కదా..దేశ రక్షణ కోసం ప్రాణాలివ్వటానికి కూడా సిద్ధమైన యువకులు రైళ్లు తగలబెట్టడానికి ఎందుకు సిద్ధమయ్యారో అర్థం చేసుకోవాలి కదా..అది చేయకపోగా, మిమ్మల్ని ఎవరు పిలిచారు.. మీరెవరు? ఎవరు ఇస్తామన్నారు.. అనటం ఎంత అహంకారం..
పైగా దేశరక్షణ కోసం పనిచేయాల్సిన యువకులను …దేశానికి వాచ్ మెన్ లా పనిచేయాల్సిన యువకులు…ఆఫీసుల్లో వాచ్ మెన్ లను చేస్తామనటం ఏమంత తెలివైన మాట?మిలిటరీ అంటనే ఓ సెంటిమెంట్ ఉంటుంది. ఓ స్పిరిట్ ఉంటుంది.
కేవలం ఉద్యోగం, ఉపాధి అనే భావన మాత్రమే కాదు..అదే కావాలంటే దేశంలోపల ఏదైనా పనిచేసుకోవచ్చు..
ప్రాణాలకు తెగించే ఉద్యోగంలోకి ఎందుకు వెళ్తారు..
మనదేశంలో సైన్యంలో పనిచేయటం అంటే ఓ గౌరవం.సైన్యంలో ఉద్యోగం అంటే దేశం పనిచేస్తున్న తృప్తి ఉంటుంది..
సరిహద్దులో నిలబడి ఆయుధం పట్టిన సైనికుడిలో దేశం కోసం జీవితాన్ని అంకితం చేసిన భావన అణువణువునా ఉంటుంది.
అలాంటి అవకాశం కోసం ఈ దేశంలో కోట్లమంది యువత ఎదురు చూస్తుంటారు.అందుకే దేశంలో కొన్ని గ్రామాల్లో ప్రతి ఇంటి నుండి మిలిటరీకి వెళ్లిన వాళ్లు కనిపిస్తారు.సైన్యం అంటే ఈ దేశ ఆత్మగౌరవం కదా..అందుకే…సైనికుడికి అంతటి విలువ..అలాంటి సైనికుడి గౌరవాన్ని తగ్గించేలా బిజెపి నేతల మాటలు ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి
రోజూ యుద్ధం రావాలని ఎవరూ కోరుకోరు..రోజూ తుపాకులు పేలాలని, బాంబులు విసరాలని, సరిహద్దులు మండిపోవాలని ఎవరూ ఆశించరు.కానీ, యుద్ధమంటూ వచ్చిన రోజున సైన్యం అవసరం ఎంతో, యుద్ధం లేకున్నా,దేశానిక ఓ ధీమాని ఇచ్చేది కచ్చింతంగా సైన్యం మాత్రమే.సరిహద్దులు లేని, సైన్యం అవసరం లేని ఆధునికానంతర మానవీయ ప్రపంచ కలలు బాగానే ఉంటాయి.
కానీ, పక్కనే ఉన్న చైనా, పాకిస్తాన్ వాస్తవం..వాటితో పంచుకునే వేల కిలోమీటర్ల సరిహద్దు…
ఆ సరిహద్దులో నిత్యం జరిగే అరాచకాలు..ఆయుధాల చేరవేత, ఉగ్రమూకల చొరబాట్లు..ఇవన్నీ వాస్తవాలే…
వీటిని ఎదుర్కోవాలంటే, వాస్తవ ప్రపంచంలో చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలకు సమాధానం చెప్పాలంటే సైన్యం బలంగా ఉండాల్సిందే..
పైగా యుద్ధం లేనంత మాత్రాన సైనికులు ఖాళీగా ఏమీ ఉండరు.ఎన్నో సందర్భాల్లో ఏ ఇతర సిబ్బందీ చేయలేని సాహసాలకు సిద్ధంగా ఉంటుంది.ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు లక్షలాదిమందిని కాపాడిన చరిత్ర దేశ సైన్యానికి ఉంది.
ఎక్కడో సరిహద్దులో ఉన్న సైన్యానికి తప్ప, దేశంలో ఇతర ప్రాంతాల్లో ఉండే మిలిటరీకి పనేముంటుందని భావించవచ్చు..
కానీ, ఏడాదిలో అవసరమైన ఆ ఒక్కరోజు…ప్రాణాలకు తెగించి పనిచేసేది సైనికుడు మాత్రమే..
యుద్ధం లేకున్నా, సైన్యం దేశంలోపల నిర్తర్తించే విధులు చిన్నవేం కాదు..ఈ విషయాల్ని మర్చిపోయి, సైనికులని ఆఫీసు వాచ్ మెన్లుగా పోల్చటం ఎంత అవమానం..
ఇవన్నీ కాదు.. అగ్నిపథ్ తీసుకురావాలనుకుంటే ప్రభుత్వం ఏం చేయాలి?అన్ని వర్గాలతో చర్చించాలి..లాభనష్టాలపై ఓ అంచనాకు రావాలి..చట్టసభల్లో చర్చ నడవాలి..ఇప్పటికే సగంలో ఉన్న రిక్రూట్ మెంట్ పూర్తిచేయాలి..ముందస్తు తేదీ ఒకటి చెప్పి అప్పటినుండి అగ్నిపథ్ ద్వారా మాత్రమే రిక్రూట్ చేస్తామని చెప్పాలి.ఇవన్నీ చేయకుండా ఫిజికల్ టెస్టులు పాసైన వాళ్లకి రిటెన్ టెస్టులు వాయిదాలు వేస్తూ పోయిచివరికి నోటిఫికేషన్ రద్దు చేస్తామంటారా?దీన్నే కదా విపక్షాలు నిరంకుశత్వం అంటున్నాయి.
అధికారం చేతిలో ఉంటే ఏదైనా చేస్తారా అని ప్రశ్నిస్తున్నాయి.ప్రభుత్వ నిర్ణయాల ఫలితమే ఈ గందరగోళానికి కారణం కాదా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
అధికార పీఠంపై ఉన్నవాళ్లు సహేతుక నిర్ణయాలు తీసుకోవాలి.ఒక నిర్ణయం తీసుకుంటే దాని ఫలితం ఎలా ఉంటుందో ఊహించి నిర్ణయాలు తీసుకోవాలి.అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని అడుగులు వేయాలి..కానీ, అదెక్కడా కనిపించ లేదు. సహేతుకమైన నిర్ణయం తీసుకోకపోవడం వల్లే అగ్నిపథ్ అలజడి రేగింది.పార్లమెంటులో అగ్నిపథ్ పై చర్చించి..అవసరం అయితే, చిన్నా చితకా అవసరమైన మార్పులు చేసి..అమలులోకి తెచ్చి ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవి.
అత్యంత క్రమశిక్షణతో ఆర్మీ పరీక్షలకు సిద్ధమౌతూ,సైన్యమే జీవిత ఆశయంగా ఎదురు చూస్తున్న యువకులు ఎందుకు అరాచకంగా ప్రవర్తించారో..ప్రభుత్వం గమనించాలి. అది చేయకపోగా సైనికులను తేలిక చేసేలా మాట్లాడటం ఎంత మాత్రం సమంజసం కాదు..ఆర్మీ అంటే ఆయుధాలని ప్రభుత్వం అనుకుంటోంది.ఆర్మీ అంటే సాంకేతికత మాత్రమే అని నమ్ముతోంది..
ఆర్మీ కూడా లాభనష్టాల తక్కెడలో చూసే రంగమే అని భావిస్తోంది.కానీ, ఇది సరికాదు.. ఆర్మీలో యువత ఎంత అవసరమో.. అనుభవం కూడా అంతే అవసరం.పైగా దీని జమాఖర్చులు లెక్కించటం పూర్తిగా తప్పు అవగాహన. అది సైనికులను అవమానించటమే.నాలుగేళ్లలో ఆర్మీ నుండి బయటికి వచ్చి జీవితాన్ని ప్రశ్నార్థకం చేసుకోలేకనే యువత ఇంత మథన పడుతోందని ప్రభుత్వ పెద్దలకు అర్థం కాకపోవటం అత్యంత విచారకరం.