ఒక్క రక్తపు బొట్టు నేల చిందకుండా సాకారమైన ఆశయం. పిల్లల నుంచి పెద్దల వరకు, స్కూల్ విద్యార్థి నుంచి విశ్వవిద్యాలయం స్కాలర్ వరకు, కూలీ నుంచి ఉన్నతాధికారి వరకు, ప్రతి ఒక్కరూ ఉద్యమ పతాకలైన సందర్భం తెలంగాణ ఉద్యమం. చరిత్రలో ఎన్నో ఉద్యమాలు… కొన్ని రక్తపు నేలలపై నడిచి యుద్ధాలుగా ముగిశాయి. కొన్ని లక్ష్య తీరాలను చేరి.. శాంతి పోరాటాలుగా భాసిల్లాయి. భారత స్వాతంత్ర్య పోరాటంలో కూడా ఈ రెండు మార్గాలూ కనిపిస్తాయి. అతి, మిత వాదుల గమ్యం ఒకటే అయినా దారులు వేరు. ఎంచుకున్న దారిని బట్టే గమ్యం చేరువుతుంది. అదే నిజమైన ఉద్యమం. తెలంగాణ సాధన కోసం సాగిన పోరాటం కూడా అలాంటిదే.
తెలంగాణ ఉద్యమం చాలా ప్రత్యేకం. పాటతో పెనవేసుకున్న తెలంగాణ, ఆ పాటను కూడా పోరాటంలో తూటాలా పేల్చింది. బతుకమ్మలతో సాంస్క్రుతిక ప్రత్యేకత చాటింది. వాంటావార్పులతో పోరును ఘాటెక్కించింది. మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, దీక్షలు, రాజీనామాలు, ఇలా ఏ ఉద్యమంలోనూ కనపడని విభిన్న, విశిష్ట కోణాలు తెలంగాణ పోరులో కనపడతాయి..
అమరవీరుల ప్రాణత్యాగాలు తెలంగాణ పోరును భావోద్వేగంగా మార్చాయి. శ్రీకాంతాచారి ఆత్మాహుతి, తెలంగాణ వాదుల గుండెలను మండించింది. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ విశ్వవిద్యాలయం, ఇంకా అనేక విద్యా సంస్థలు, గ్రామాల్లో విద్యార్థులు బలిదానమయ్యారు. దాదాపు 11వందల మంది యువకులను తెలంగాణ కోసం అమరులయ్యారు.
అయితే, రెండో దశ ఉద్యమంలో అయితే, ఈ మొత్తం పరిణామాలకు ఆరంభం మాత్రం, 2001, ఏప్రిల్ 7న హైదరాబాద్ జలద్రుశ్యంలో జరిగింది.
తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించిన రోజు…మలిదశ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడానికి మరో అంకురార్పణ జరిగిన రోజు…టీఆర్ఎస్ స్థాపనే తెలంగాణ స్వప్నం సాకారంలో కీలకమైన అడుగుగా చరిత్రలో నిలిచిపోయింది..
హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ సమీపంలోని జలదృశ్యం కేంద్రంగా, తెలంగాణ వాదుల సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ప్రత్యేక రాష్ట్రమే ఏకైక అజెండాగా పార్టీ పనిచేస్తుందని ప్రకటించారు. టీడీపీ పార్టీ సభ్యత్వానికి, డిప్యూటీ స్పీకర్ పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా టీఆర్ఎస్ కంటే ముందే అనేక పార్టీలు ఏర్పడ్డాయి. కొన్ని కనుమరుగయ్యాయి. మరికొన్ని కాంగ్రెస్‌లో కలిసిపోయాయి. టీఆర్ఎస్‌దీ అదేపరిస్థితి అన్న విమర్శలు అప్పట్లో వచ్చాయి. టీఆర్ఎస్ పెట్టిన కొన్ని నెలలకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థలకు ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీసీట్లు గెలుచుకుంది. పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా కేసీఆర్ తెలంగాణలోని పది జిల్లాల్లో సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారు కేసీఆర్
ఒకవైపు తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళుతూ..మరోవైపు రాజకీయ ఎత్తుగడలు టిఆర్ఎస్ వేసింది. అందులో భాగంగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ఉంటే కాంగ్రెస్‌తో తాము కలవడానికి సిద్ధమని టీఆర్ఎస్ ప్రకటించారు. కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకోవడంతో 2004 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్, కమ్యూనిస్ట్ పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీకి దిగాయి. ఎన్నికల్లో 42 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసిన టీఆర్ఎస్ 26 స్థానాలు గెలుచుకుంది. 6 లోక్ సభ స్థానాల నుంచి పోటీ చేసి మహబూబ్ నగర్ మినహాయిస్తే మిగిలిన 5 చోట్ల గెలుపొందింది. ఇటు కేంద్రం, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. యూపీఏ కామన్ మినిమమ్ ప్రోగ్రాంలో తెలంగాణ అంశం చేర్చడంలో టీఆర్ఎస్ విజయం సాధించింది. అదే తెలంగాణ ఏర్పాటుకు కీలక అడుగయ్యింది. అప్పటి యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ కోరడంతో టీఆర్ఎస్ కేంద్రం మంత్రివర్గంలో చేరింది…విజువల్స్
మరోవైపు తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించారు కేసీఆర్. కేంద్రం ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ తెలంగాణ ఏర్పాటుపై అన్ని పార్టీల అభిప్రాయాన్ని కోరింది. తెలంగాణకు అనుకూలంగా 36 పార్టీలు లేఖ ఇవ్వడంలో టీఆర్ఎస్ పార్టీ కృషి చేసింది. కేసీఆర్ స్వయంగా జాతీయ ,ప్రాంతీయ పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ఒప్పించగలిగారు. ఇటు యూపీఏ 1 పాలన ముగింపుదశకు చేరుకున్నా, తెలంగాణ ఏర్పాటుపై ఎలాంటి ప్రకటన రాకపోవడంతో కేసీఆర్, ఆలే నరేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేశారు. ఉద్యమంలో తొలి రాజకీయ వేడి రగిలించింది రాజీనామా అస్త్రం.
ఇటు రాష్ట్ర క్యాబినెట్ లో ఉన్న టిఆర్ఎస్ మంత్రులు కూడా రాజీనామాలు చేశారు.ఈ పరిణామాలలోనే కాంగ్రెస్ నేత ఎమ్మెస్ఆర్ విసిరిన సవాలుతో ఎంపీ పదవికి రాజీనామా చేశారు కేసీఆర్ .కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ భారీ మెజారిటీతో ఎంపీగా గెలుపొందారు. రాజకీయ వ్యూహాత్మక ఎత్తుగడల్లో భాగంగా 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో టీఆర్ఎస్ జతకట్టి మహాకూటమిగా ఎన్నికల బరిలోకి దిగింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే, టీడీపీ, టీఆర్ఎస్ కలసి మహాకూటమిగా బరిలోకి దిగాయి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.10 అసెంబ్లీ స్థానాల్లో, 2 ఎంపీ స్థానాల్లోనే గెలుపొందింది టిఆర్ఎస్. మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా కేసీఆర్ గెలుపొందారు..
ప్రజల్లో పార్టీకి ఆదరణ తగ్గుతోంది , తెలంగాణ వాదం బలహీన పడుతోందని భావించిన ప్రతీసారి టీఆర్ఎస్ పార్టీ రాజీనామాలను అస్త్రంగా ప్రయోగించింది. కొన్నిసార్లు ఈ వ్యూహం దెబ్బతిన్నా, ప్రజల్లో మాత్రం ఉద్యమ సెంటిమెంట్ ను మాత్రం వేడెక్కించింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం రోశయ్య హయాంలో హైదరాబాద్ ఫ్రీ జోన్ వివాదం తెర పైకి వచ్చింది. 2009 డిసెంబర్ 9 న కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అంటూ కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. గులాబీ అధినేత దీక్షతో తెలంగాణలో ఉద్యమం ఉధృతమైంది.
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడడంతో యూపీఏ2 ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు దిశగా ప్రక్రియ ప్రారంభిస్తామంటూ 2009 డిసెంబర్ 9న ప్రకటన చేసింది. అర్ధరాత్రి అప్పటి కేంద్ర మంత్రి చిదంబరం ఆ ప్రకటన చేశారు. అయితే కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో డిసెంబర్ 23న ఆ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.
తెలంగాణ ఏర్పాటుపై అందరి అభిప్రాయాలను సేకరించేందుకు శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది కేంద్రం. ఇటువంటి దశలో టీఆర్ఎస్ మిగిలిన పార్టీలతో కలిసి తెలంగాణ పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడింది…బైట్…
పొలిటికల్ జేఏసీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేంద్రంపై ఒత్తిడిని తీవ్రం చేసింది. టీజాక్ చేపట్టిన ఉద్యమాల్లో టీఆర్ఎస్ కీలకభూమిక పోషించింది. మిలియన్ మార్చ్, వంటా వార్పు, సాగరహారం తదితర ఉద్యమాల్లో ముందుండి నడిచింది. విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, సకల జనుల సమ్మెతో ఉద్యమాన్ని హోరెత్తించింది. పాటలు, బతుకమ్మ ఉత్సవాలు, వంటావార్పులు వంటి సృజనాత్మక ఆందోళనకు శ్రీకారం చుట్టిన ఘనత టీఆర్‌ఎస్‌దే..
ఉమ్మడి పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయంపై శ్రీకృష్ణ కమిటీకి ప్రత్యేక నివేదికలను తయారు చేసి ఇచ్చింది టిఆర్ఎస్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ఒత్తిడి తీవ్రం కావడంతో 2013 లో కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2014 మొదట్లో పార్లమెంట్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. అలా 2014లో కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించింది తెలంగాణ. స్వరాష్ట్రంలో స్వపరిపాలన మొదలైంది.
తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించింది టీఆర్ఎస్సే. ఇందులో ఎవ్వరికీ ఎలాంటి సందేహం లేదు. అయితే, మిగతా రాజకీయ పార్టీల పాత్ర లేకుంటే, తెలంగాణ కల సాకారమయ్యేది కాదు. ఈ విషయంలోనూ ఎవ్వరికీ డౌట్స్ లేవు. నాడు కేంద్రంలో వున్న కాంగ్రెస్ సాహసోపేతంగా నిర్ణయాలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ లో పార్టీ భూస్థాపితం ఖాయమని తెలిసినా, రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది. ఒక ఓటు రెండు రాష్ట్రాల నినాదం వినిపించిన బీజేపీ, ఉభయసభల్లో తెలంగాణ బిల్లుకు అండగా నిలిచింది. అలాగే తెలుగుదేశం లేఖ కూడా కీలకంగా మారింది.
తెలంగాణ ఉద్యమాన్ని టీఆర్ఎస్ ముందుండి నడిపించినా, తెలంగాణ ఏర్పాటులో మిగిలిన పార్టీల పాత్ర కూడా అత్యం కీలకమైంది. రాజకీయంగా ఆ క్రెడిట్ ను పొందడంలో కాంగ్రెస్ విఫలమైనా, రాష్ట్ర ఆవిర్భావంలో కాంగ్రెస్ ఒక ముఖ్యభూమిక పోషించిందని అందరూ ఒప్పుకుంటారు. చెన్నా రెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు అనేక ప్రయత్నాలు చేశారు. తెలంగాణ ప్రజా సమితి పార్టీ పెట్టి ఆందోళనలు ఉధ్రుతం చేశారు. సిక్స్ పాయింట్ ఫార్ములా రూపొందించడంలో సక్సెస్ అయ్యారు. చెన్నారెడ్డి తర్వాత తెలంగాణ ఉద్యమం చప్పబడినా, మళ్లీ కాంగ్రెస్ నాయకుల రాజకీయ వ్యూహాలే ఉద్యమాన్ని అప్పుడప్పుడు వేడెక్కించాయి.
తెలుగుదేశం పార్టీని ఎలాగైనా గద్దెదింపాలనుకున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004 ఎన్నికల్లో టీఆర్‌ఎస్, వామపక్ష పార్టీలతో జట్టుకట్టారు. కాంగ్రెస్ తన ఎన్నికల ప్రణాళికలో తెలంగాణ అంశాన్ని చేర్చడం ఒక కీలక పరిణామం. కామన్ మినిమమ్ ప్రోగ్రాంలోనూ యూపీఏ ప్రభుత్వం ఈ అంశాన్ని పొందుపర్చింది. 2004 జూన్ 7న రాష్ర్టపతి ప్రసంగంలోనూ తెలంగాణ ప్రతిధ్వనించింది. తెలంగాణపై విస్తృత అంగీకారం కోసం ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షతన 2004 నవంబర్‌లో కేంద్రం ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ, నాటి యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం మరో కీలక పరిణామంగా చెబుతారు. ఉద్యమం తీవ్రం కావడంతో తెలంగాణ ఏర్పాటుపై అభిప్రాయాలు స్వీకరించడానికి వైఎస్ ప్రభుత్వం 2008లో రోశయ్య కమిటీని నియమించింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి దిగింది. అధికారంలోకి వస్తే తెలంగాణ ఇస్తామని ఆ పార్టీ ప్రచారం చేసింది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 156 స్థానాలు గెలిచారు. వైఎస్ రాజశేఖర రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తూ 2009 సెప్టెంబర్ 2న నల్లమల అటవీ ప్రాంతంలోని పావురాల గుట్ట వద్ద హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ చనిపోయారు. 2009 సెప్టెంబర్ 3న రోశయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, ఉద్యమం మరో మలుపు తిరిగింది.
2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ దీక్ష ప్రారంభించారు. తెలంగాణలో ఒక్కసారిగా ఆందోళనలు చెలరేగాయి. 2009 డిసెంబర్ 9న రాత్రి 11.30 గంటలకు హోంమంత్రి చిదంబరం తెలంగాణపై ప్రకటన చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించి, అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడతారని అని చిదంబరం తెలిపారు. సీమాంధ్రలో సమైక్య ఆందోళనలు పెరగడంతో, శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది యూపీఏ ప్రభుత్వం. 2010 డిసెంబర్ 30న శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను కేంద్ర హోంశాఖకు సమర్పించింది. 2011 జనవరి 6న కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీ నివేదికను బయటపెట్టింది. శ్రీకృష్ణ కమిటీ సమైక్యాంధ్రకు మొదటి ప్రాధాన్యతను ఇచ్చినా, కాంగ్రెస్ మాత్రం తెలంగాణపై సానుకూలంగా వుంది. 2011 అక్టోబర్ 1న ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2012 డిసెంబర్ 28న హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. 2013 జూన్ 30న హైదరాబాద్‌లో తెలంగాణ సాధన సభ పేరుతో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించింది. అనేక మేథోమథనాల తర్వాత 2013 జూలై 30న హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రకటించింది. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని 2013 ఆగస్టు 5న చిదంబరం పార్లమెంటులో ప్రకటించారు.
2014 ఫిబ్రవరి 18న తెలంగాణ బిల్లుకు లోక్‌సభ ఆమోద తెలిపింది. ఫిబ్రవరి 20న యూపీఏ ప్రభుత్వం రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టగా, ఆ రోజే బిల్లు ఆమోదం పొందింది. 2014 మార్చి 1న బిల్లుపై రాష్ర్టపతి సంతకం చేశారు. మార్చి 2న కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ పాత్ర అత్యంత కీలకమైంది. ఏపీలో పార్టీ భూస్థాపితం అవుతుందని తెలిసినా, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ ఏర్పాటుకే మొగ్గుచూపారు…
ఇక తెలంగాణ సాధనలో బీజేపీకి కూడా ఎంతోకొంత పాత్ర వుంది. ఒక ఓటు రెండు రాష్ట్రాలంటూ కాకినాడలో తీర్మానం చేసింది ఆ పార్టీనే. పార్లమెంట్ ఉభయ సభల్లో తెలంగాణాకు జైకొట్టింది కమలం. బీజేపీ ఏమాత్రం వ్యతిరేకించినా పరిస్థితి మరోలా వుండేదన్న చర్చ కూడా ఆ రోజు జరిగింది. ముఖ్యంగా నాడు బీజేపీలో కీలక లీడర్ గా వున్న దివంగత నేత సుష్మా స్వరాజ్, తెలంగాణ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. అమరుల త్యాగాలు కనిపించడం లేదా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన పెద్దమ్మ సోనియా అయితే, అందుకు సహకరించిన తాను చిన్నమ్మను అంటూ చెప్పకున్నారు సుష్మాస్వరాజ్. అరుణ్ జైట్లీ కూడా తెలంగాణ ఏర్పాటను సమర్థిస్తూ బిల్లుకు ఆమోదం పలికారు.
నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షంలో వుంది తెలుగుదేశమే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో, చంద్రబాబు కీలకంగా కనిపించారు. జాతీయ రాజకీయాల్లో చక్రంతిప్పి, ఏదైనా సాధించగలడని కేసీఆర్ కూడా చంద్రబాబును లెక్కేశారు. చంద్రబాబు అడ్డుకుంటాడేమోనని, అనేక రకాలుగా ఆలోచించిన కేసీఆర్, నిజంగా తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ, అభిమానం వుంటే, అనుకూలంగా లేఖ ఇవ్వాలని పట్టుబట్టారు. రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా లేఖ ఇస్తే, తెలంగాణలో పార్టీ మనుగడే కష్టమని తెలిసినా, సాహసం చేశారు చంద్రబాబు. టీడీపీ లేఖతో తెలంగాణ ఏర్పాటుకు అడ్డంకులన్నీ తొలగిపోయాయి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకేం సమస్య అంటూ కేసీఆర్ గట్టి వాదన వినిపించారు. అలా తెలంగాణ ఏర్పాటులో టీడీపీ లేఖ కూడా కీలకమైంది.
వామపక్ష పార్టీల్లో సీపీఐ మాత్రమే తెలంగాణకు జైకొట్టింది. ఇలా తెలంగాణ ఏర్పాటులో అనేక పార్టీల కంట్రిబ్యూషన్ వుంది. కానీ క్రెడిట్ మాత్రం టీఆర్ఎస్ కొట్టేసిందన్న వాదన వుంది. అయితే, చెన్నారెడ్ది మొదలు అనేకమంది తెలంగాణ కాంగ్రెస్ నేతలు తెలంగాణ గురించి ఆడపాదడపా మాట్లాడారు. వైఎస్ మరణం తర్వాత పరిణామాలు, రాష్ట్రం కోసం యువకుల బలిదానాలు, రాష్ట్రం అగ్ని గుండం కావడం వంటి పరిస్థితులతో, స్టేట్ ఏర్పాటుకే మొగ్గుచూపింది నాటి యూపీఏ ప్రభుత్వం. ఏపీలో పార్టీ తుడిచిపెట్టుకుపోయినా, తెలంగాణలోనైనా అధికారంలోకి వస్తుందన్న రాజకీయ వ్యూహమూ ఇందులో వుంది. కానీ అది మాత్రం వర్కౌట్ కాలేదన్నది కాంగ్రెస్ నేతల బాధ. అయితే, చరిత్రలో వాస్తవాలు మాత్రం ఎవరూ కాదనలేనివి.
మలిదశ ఉద్యమానికి స్ఫూర్తి, తొలిదశ పోరాటం. ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద పుట్టిన 1969 ఉద్యమం, మర్రిచెన్నారెడ్డి సారథ్యంలోనూ కదంతొక్కింది. అయితే అనేక కారణాలతో తొలిదశ చల్లారినా, ప్రొఫెసర్ జయశంకర్ రణవ్యూహంతో మలి ఉద్యమం ఎగిసిపడింది. జయశంకర్ అప్పగించిన తెలంగాణ కల బాధ్యతను, తన చాణక్యంతో సాకారం చేశారు కేసీఆర్. గద్దర్, నందిని సిద్దారెడ్డి, విమలక్క, గోరటి వెంకన్న, కోదండరాం ఇలా ఎందరో, మరెందరో తెలంగాణ సాకారంలో కీలక పాత్ర పోషించారు.
తెలంగాణ ఆవిర్భవించి ఎనిమిది సంవత్సరాలైనా, పోరాటానికి మాత్రం దశాబ్దాల చరిత్ర వుంది. తెలంగాణ చరిత్రలో ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం 1969లో, ఉస్మానియా యూనివర్సిటీలో మొదలైంది. మర్రి చెన్నారెడ్డి స్థాపించిన తెలంగాణ ప్రజా సమితి పార్టీ నిరసనలతో కదంతొక్కింది. విద్యార్థులు భారీ ఎత్తున ఆందోళనల్లో పాల్గొన్నారు. 1969 ఉద్యమం ఆ ఏడాది చివరి నెలలకు వచ్చేసరికి కొంత చల్లబడినా.. ఉద్యమానికి ఊపిరిలూదటానికి మర్రి చెన్నారెడ్డి ప్రయత్నాలు ఆపలేదు. చెన్నారెడ్డిని టీపీఎస్ నుంచి బహిష్కరిస్తున్నట్లు సదాలక్ష్మి వంటి నేతలు ప్రకటించారు. ప్రతిగా చెన్నారెడ్డి మళ్లీ సమావేశం పెట్టి తనను అధ్యక్షుడిగా ఎంపిక చేసుకున్నారు. ఇలా వివాదాలతో తెలంగాణ ప్రజా సమితి ప్రతిష్ఠ మసకబారడం కూడా ఉద్యమం తిరిగి పుంజుకోకపోవడానికి కారణమని చరిత్రకారులు చెబుతారు..
అయితే, ఆ తర్వాత ఉద్యమాన్ని భుజాన మీదకు వేసుకున్న ఒకే ఒక్కడు ప్రొఫెసర్ జయశంకర్. 1969 తెలంగాణా ఉద్యమంలో జయశంకర్ చురుగ్గా పాల్గొన్నారు. అంతకుముందు 1952లో నాన్ ముల్కీ ఉద్యమంలో, సాంబార్-ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. 1954లో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి నాయకుడిగా ఆయన ఫజల్ అలీ కమిషన్‌కు నివేదిక ఇచ్చారు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై ఆయన పలు పుస్తకాలు రాశారు. తెలంగాణలోనే కాకుండా, దేశంలోని ఇతర ప్రాంతాల్లో, విదేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గురించి ప్రసంగాలు చేశారు. జయశంకర్ తన ఆస్తిని, జీవితాన్ని తెలంగాణ కోసం అంకితం చేశారు. తెలంగాణ భావజాల వ్యాప్తిలో ఆయనదే కీలక పాత్ర. మేధావులు, రచయిల ద్వారా రచనలు చేయించారు. సామాన్య ప్రజానీకానికి సైతం అర్థళమయ్యే పాటల రూపంలో, కదంతొక్కించారు. అందుకే ప్రొఫెసర్ జయశంకర్ ను తెలంగాణ జాతిపితగా పిలుచుకుంటారు ఉద్యమకారులు.
కేసీఆర్ పై ప్రొ.జయశంకర్ కు అచంచల నమ్మకం క్షేత్రస్థాయిలో ఉద్యమాన్ని పరుగులు పెట్టించిన కోదండరాం
అయితే, తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయంతో రంగరిస్తేనే రాష్ట్రం ఏర్పడుతుందని భావించారు జయశంకర్. 1969 ఉద్యమ అనుభవాలను వడబోసి, చురుకైనా, చాణక్యుడైన రాజకీయ నాయకుడికి తెలంగాణ బాధ్యతల ఇవ్వాలనుకున్నారు. అనర్గళ ప్రసంగాలతో కోట్లాది జనాలను కదిలించగల శక్తి కేసీఆర్ కు వుందని నమ్మారు. తెలంగాణ సాధించాలన్న తన ఆశయాన్ని కేసీఆర్ కు అప్పగించారు. అదే మలిదశ ఉద్యమాన్ని మరో మలుపు తిప్పింది.
ప్రొఫెసర్ కోదండరాం. తెలంగాణ ఉద్యమం గుర్తొచ్చినప్పుడల్లా కోదండరాం పేరు, ఆయన పోరాటం మదిలో మెదలడం సాధారణం. ఒకవైపు కేసీఆర్ రాజకీయ వ్యూహాల్లో వుంటే, ఇటు క్షేత్రస్థాయిలో ఉద్యమాన్ని పరుగులు పెట్టించింది కోదండరామే. జాయింట్ యాక్షన్ కమిటీ సమన్వయకర్తగా వ్యవహరించారు. మిలియన్ మార్చ్ సక్సెస్ అయ్యిందంటే కోదండరాం చొరవే కారణం. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాలను ఏకతాటిపైకి తెచ్చారు.
తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి పాత్ర వుంది. ఎప్పుడూ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. తెలంగాణ ఆవశ్యకతను అధిష్టానానికి వివరించడంలో కీరోల్ జానాదే.పొడుస్తున్న పొద్దుమీద అంటూ తెలంగాణ పాటతో కదంతొక్కారు గద్దర్. పాటలతో ఉర్రూతలూగించారు…సాంగ్…పొడుస్తున్న పొద్దుమీద
ఇక తెలంగాణ ఉద్యమాన్ని వేడెక్కించిన పాటలెన్నో రాశారు నందిని సిద్దారెడ్డి. గోరటి వెంకన్న తన గళంతో గ్రామగ్రామాన భావజాలం వ్యాప్తి చేశారు. ఇంకా ఎందరో, ఎందరో తెలంగాణ ఉద్యమంల పాల్గొన్నారు. మొత్తానికి తెలంగాణ ఆవిర్భావంలో అనేక వ్యక్తులు, అనేక పార్టీలు, అనేక ఉద్యమ రూపాలు కీలక పాత్ర పోషించాయి. కేసీఆర్ ముందుండి ఉద్యమాన్ని నడిపించినా, మిగతా పార్టీల సహకారంలేనిదే సాధ్యమయ్యేపని కాదు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో వుండటం, ఒక ఓటు రెండు రాష్ట్రాలు అంటూ నినాదం ఎత్తుకున్న బీజేపీ ప్రతిపక్షంలో వుండటంతో, రాష్ట్రం ఆవిర్భవించింది. ఎనిమిదవ వసంతంలోకి అడుగుపెట్టింది.