పంజాబ్‌లోని జలంధర్‌లో దారుణం జరిగింది. కబడ్డీ ప్రపంచంలో ఛాంపియన్‌గా నిలిచిన అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడు, ఇండియన్ స్టార్ సందీప్ నంగల్ సోమవారం దారుణహత్యకు గురయ్యాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే సందీప్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. దాదాపు 20 రౌండ్ల కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. అయితే ఈ హత్యకు గల కారణాలపై జలంధర్ పోలీసులు విచారణ చేపట్టారు. కబడ్డీ సమాఖ్యలో గొడవల కారణంగా సందీప్‌ను హత్య జరిగి ఉండవచ్చని డీఎస్పీ లఖ్వీందర్ సింగ్ అనుమానం వ్యక్తం చేశారు.
కాగా దుండగుల కాల్పుల్లో బులెట్లు సందీప్ తల, ఛాతీ నుంచి దూసుకెళ్లడంతో అతడు అక్కడికక్కడే మరణించాడని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో మరో యువకుడి కూడా గాయపడ్డాడని… సరైన సమయంలో చిక్సిత అందించడం వల్ల అతడు ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు వారు తెలిపారు. సందీప్ ప్రపంచంలోని టాప్-5 కబడ్డీ ఆటగాళ్లలో ఒకడు. అతడు మేజర్ కబడ్డీ లీగ్ ఫెడరేషన్ అధినేత కూడా. వివిధ కబడ్డీ ప్రపంచకప్ టోర్నీలలో యునైటెడ్ కింగ్‌డమ్ జట్టుకు సందీప్ ప్రాతినిధ్యం వహించాడు. భారత్‌లోనే కాకుండా కెనడా, అమెరికా, యూకేలలో కూడా సందీప్‌కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. సందీప్‌కు తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం అతడు యూకేలో నివసిస్తుండగా.. ప్రతి ఏడాది శీతాకాలంలో కబడ్డీ టోర్నమెంట్‌లలో పాల్గొనేందుకు భారత్‌కు వస్తాడు.