Weightlifter Lovepreet Singh Wins Bronze In Commonwealth Games: బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతోన్న కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత అథ్లెట్లు దూసుకెళ్తున్నారు. ప్రత్యర్థులకు గట్టి పోటీనిస్తూ.. పతకాలు సాధిస్తున్నారు. ఇప్పుడు ఆరో రోజు భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. పురుషుల వెయిట్‌లిఫ్టింగ్ 109 కేజీల విభాగంలో.. భారత వెయిట్‌లిఫ్టర్ లవ్‌ప్రీత్ సింగ్ కాంస్య పతకం సాధించాడు. స్నాచ్ రౌండ్‌లో 163 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్ రౌండ్‌లో 192 కేజీలు ఎత్తిన లవ్‌ప్రీత్ సింగ్.. మొత్తంగా 355 కేజీల బరువు ఎత్తి మూడో స్థానంలో నిలిచాడు. కెమరూన్‌కు చెందిన పెరిక్లెక్స్ నగాడ్జా మొత్తం 361 కేజీలు ఎత్తి స్వర్ణం సాధించగా.. సమోవాకు చెందిన జాక్ హిటిలా 358 కేజీలు ఎత్తి రజత పతకం సొంతం చేసుకున్నాడు.
లవ్‌ప్రీత్ సింగ్ సాధించిన పతకంలో.. భారత్ పతకాల సంఖ్య 14కి చేరింది. ఇందులో ఐదు స్వర్ణాలు, ఐదు రజతాలు కాగా, నాలుగు కాంస్య పతకాలున్నాయి. ఒక్క వెయిట్ లిఫ్టింగ్‌లోనే భారత్ 9 పతకాలు సాధించడం విశేషం. అంతకుముందు భారత సీనియర్ వెయిట్ లిఫ్టర్ వికాస ఠాకూర్ వరుసగా మూడోసారి ఈ కామన్‌వెల్త్ క్రీడల్లో మెరిశాడు. పురుషుల 96 కేజీల విభాగంలో అతడు రజతం సొంతం చేసుకున్నాడు. స్నాచ్ రౌండ్‌లో 155, క్లీన్ అండ్ జెర్క్ రౌండ్‌లో 191 కేజీలు కలిపి.. మొత్తంగా 346 కేజీల బరువెత్తి, రెండో స్థానంలో నిలిచాడు. కాగా.. జూడోలో 100 కేజీల విభాగంలో భారత ఆటగాడు దీపక్ దేశ్వాలో పోరాటం ముగిసింది. ఫిజీ జూడో ఆటగాడు తెవితా తకయవా చేతిలో అతడు ఓటమిపాలయ్యాడు.