రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ సీజన్‌లో ఎంత నిరాశజనకమైన ప్రదర్శన కనబరిచాడో అందరూ చూశారు. ఆరంభంలో వన్‌డౌన్‌లో, ఆ తర్వాత ఓపెనర్‌గా వచ్చినా కోహ్లీ.. తన మార్క్ బ్యాటింగ్ కనబర్చలేకపోయాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన 67వ మ్యాచ్‌లో మాత్రమే కోహ్లీ చెలరేగిపోయాడు. అది చూసి.. పాత కోహ్లీ తిరిగొచ్చాడని అభిమానులు సంబరపడిపోయారు. కానీ, ఆ తర్వాతి మ్యాచుల్లో కోహ్లీ మళ్ళీ పాత పాటే పాడాడు. పేలవ ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపరిచాడు.
ముఖ్యంగా.. క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో కోహ్లీ విధ్వంసం సృష్టిస్తున్నాడని ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గుజరాత్‌పై చెలరేగినట్టే, ఇందులో భారీ షాట్లతో పరుగుల వర్షం కురిపిస్తాడని ఆశించారు. మొదటి ఓవర్‌లోని చివరి బంతికి అతడు సిక్స్ కొట్టగానే, వింటేజ్ కోహ్లీని చూడబోతున్నాడని ఫిక్సయ్యారు. కానీ, ఆ తర్వాతి నాలుగు బంతులకే కోహ్లీ వారి ఆశలపై నీళ్ళు చల్లేశాడు. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి కోహ్లీ పెవిలియన్ చేరాడు. దీంతో, అతని బ్యాటింగ్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.
మాజీ క్రికెటర్ విరేందర్ సెహ్వాగ్ కూడా కోహ్లీ బ్యాటింగ్ తీరుపై స్పందిస్తూ.. బహుశా అతడు ఈ సీజన్‌లో చేసినన్ని తప్పులు తన కెరీర్ మొత్తంలోనే చేయలేదేమోనంటూ కుండబద్దలు కొట్టాడు. ‘‘ఆటగాళ్ళు ఫామ్‌లో లేనప్పుడు, ప్రతి బంతిని ఆచితూచి ఆడి, ఆత్మవిశ్వాసాన్ని పొందాలి. కుదురుకున్నాక తనదైన శైలిలో రెచ్చిపోవాలి. కోహ్లీ మొదటి ఓవర్‌లో ఆచితూచి ఆడాడు కానీ, ఆ తర్వాత అలా జరగలేదు. దూరంగా వెళ్ళే బంతిని వేటాడి ఔటయ్యాడు. ఇలా ఆడినప్పుడు కొన్నిసార్లు అదృష్టి కలిసి రావొచ్చు, మరికొన్నిసార్లు రాకపోవచ్చు, ఇక్కడ కూడా అదే జరిగింది’’ అని సెహ్వాగ్ అన్నాడు.
అసలు మనకు తెలిసిన కోహ్లి ఇతడు కానే కాదని, ఈ కోహ్లీ మరెవరో అని సెహ్వాగ్ చెప్పాడు. ఈ సీజన్‌లో కోహ్లీ చేసినన్ని పొరపాట్లు బహుశా తన కెరీర్ మొత్తంలో చేసి ఉండడని.. ఈ ఎడిషన్‌లో ఒక బ్యాట్మ్సన్ ఎన్ని విధాలుగా ఔట్ అవ్వగలడో, అన్ని విధాలుగానూ అతడు ఔటయ్యాడని అన్నాడు. కీలక మ్యాచ్‌లో ఇలాంటి ఆట తీరుతో ఆర్సీబీ ఫ్యాన్స్‌ను కోహ్లీ తీవ్రంగా నిరాశపరిచాడు సెహ్వాగ్ పేర్కొన్నాడు. కాగా.. ఈ సీజన్‌లో 16 ఇన్నింగ్స్‌లో ఆడిన కోహ్లీ, మొత్తం 341 పరుగులే సాధించాడు. అందులో అత్యధిక స్కోరు 73.