ఇండోర్ వేదికగా జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కోహ్లీ ఒక బ్రౌన్ కలర్ డ్రింక్ తాగడం, ఆ తర్వాత అతను ఇచ్చిన వింత ఎక్స్ప్రెషన్స్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి. ముఖ్యంగా కోహ్లీ ముఖంలో కనిపించిన హావభావాలు ఈ ఆసక్తిని మరింత పెంచాయి. దీంతో ఆ డ్రింక్ ఏంటనే విషయంపై నెట్టింట ఆసక్తికర చర్చ మొదలైంది. ఆ వీడియోను చూసిన అభిమానులు, నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
విరాట్ కోహ్లీ తాగిన డ్రింక్ గురించి కొందరు నెటిజెన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు అది ఏదైనా స్పెషల్ ఎనర్జీ డ్రింక్ అయి ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. అది ‘పికిల్ జ్యూస్’ అయి ఉండే అవకాశముందని క్రీడా నిపుణులు చెబుతున్నారు. దీన్ని సాధారణంగా ఆటగాళ్లు కండరాల పట్టేయడంను తగ్గించడానికి ఉపయోగిస్తారని తెలుస్తోంది. ముఖ్యంగా ఎక్కువ సేపు బ్యాటింగ్ లేదా ఫీల్డింగ్ చేసే సమయంలో శరీరంలో ఉప్పు, ఎలక్ట్రోలైట్స్ లోపం ఏర్పడుతుంది. అలాంటి సమయంలో పికిల్ జ్యూస్ తక్షణ ఉపశమనం ఇస్తుందని నిపుణులు అంటున్నారు.
Also Read: Vijay Deverakonda-VD14: విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. ‘ది రైజ్ బిగిన్స్’!
మరికొందరు అది శక్తినిచ్చే స్పోర్ట్స్ సప్లిమెంట్ లేదా ఎలక్ట్రోలైట్ డ్రింక్ అయి ఉండొచ్చని కూడా అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో ఇలాంటి సప్లిమెంట్స్‌ను ఆటగాళ్లు ఉపయోగించడం సాధారణమే. మొత్తానికి కోహ్లీ తాగిన ఆ మిస్టరీ డ్రింక్ ఏమిటన్న దానిపై అధికారికంగా ఎలాంటి స్పష్టత లేకపోయినా.. అది ఆరోగ్యానికి, ఆట తీరుకు సహాయపడే డ్రింక్ అన్నది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. చిన్న వీడియోతోనే పెద్ద చర్చకు దారితీసిన కోహ్లీ.. మరోసారి తన క్రేజ్ ఏ స్థాయిలో ఉందో నిరూపించుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో విరాట్ రాణించిన విషయం తెలిసిందే.