Site icon NTV Telugu

Virat Kohli: అభిమానులపై విరాట్ కోహ్లీ ఆగ్రహం.. అసలు ఏం జరిగిందంటే..?

Virat Kohli

Virat Kohli

Virat Kohli: మైదానంలో అగ్రెసివ్‌గా ఉండే టీమిండియా క్రికెటర్లలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకడు. అతడు ఎలాంటి భావోద్వేగాన్ని దాచుకోడు. సంతోషం వచ్చినా, కోపం వచ్చినా దానిని బయటపెట్టేస్తుంటాడు. అందుకే విరాట్‌ను చాలా మంది అభిమానులు ఇష్టపడుతుంటారు. అయితే టీ20 ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా శుక్రవారం నాడు విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నాడు. ఈనెల 23న పాకిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది. ఈ సందర్భంగా మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో టీమిండియా ప్రాక్టీస్ చేస్తోంది. ఈ సమయంలో సెట్స్ వెనుక నుంచి అభిమానులు విరాట్ కోహ్లీ ఏకాగ్రత చెదరగొట్టేలా వ్యవహరించారు. కొందరు అభిమానులు ఫోన్‌లో వీడియో తీస్తూ.. కోహ్లీని ఉద్దేశించి కొడితే బాల్ గ్రౌండ్‌లో పడాలంటూ గట్టిగా కేకలు వేశారు. దీంతో కోహ్లీకి కోపం వచ్చింది.

Read Also: Infosys: ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఉద్యోగులు గిగ్ జాబ్స్ చేసుకునేందుకు అనుమతి

స్టంప్స్ వెనుక అభిమానులు అరవడంతో విరాట్ కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రాక్టీస్ సమయంలో అలా అరవొద్దని అభిమానులకు వార్నింగ్‌ ఇచ్చాడు. ఇలా అరుస్తుంటే ఆటగాళ్ల ఏకాగ్రత దెబ్బతింటుందని కోహ్లి చెప్పాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోహ్లీ ఆగ్రహంతో అభిమానులు కూడా కూల్ అయినట్లు వీడియోలో కనిపించింది. కోహ్లీ రిలాక్స్ అయ్యాక మాత్రమే అరుస్తామని అభిమానులు చెప్పడం కూడా వీడియోలో చూడొచ్చు. అనంతరం విరాట్ కోహ్లీ తన ప్రాక్టీస్‌ను కొనసాగించాడు. కాగా ఇప్పటికే టీ20 ప్రపంచకప్ కోసం ప్రాక్టీస్ మ్యాచ్‌లను టీమిండియా ఆడింది. వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో టీమిండియా ఓటమి పాలు కాగా ఆస్ట్రేలియాతో ఆడిన మ్యాచ్‌లో మాత్రం ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. న్యూజిలాండ్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ మాత్రం వర్షం కారణంగా రద్దయ్యింది. అటు పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు కూడా వరుణుడి గండం పొంచి ఉండటంతో అభిమానులు ఆందోళన పడుతున్నారు.

Exit mobile version