క్రికెట్‌లో తన మునుపటి స్థాయికి మరలా చేరుకున్నానని భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ ఆనందం వ్యక్తం చేశాడు. దక్షిణాఫ్రికా సిరీస్‌లో తాను ఆడిన విధానం చాలా సంతృప్తిని ఇచ్చిందని చెప్పాడు. గత 2–3 ఏళ్లలో తాను ఇలా ఆడలేదని, ఈ సిరీస్‌లోని ఆటతీరు తనకు తిరిగి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని చెప్పాడు. చాలా కాలం తర్వాత తన ఆట ఎంతో సంతృప్తిని ఇచ్చిందని వెల్లడించాడు. సిరీస్ 1-1తో సమం అయినప్పుడు జట్టు కోసం ఏదైనా ప్రత్యేకంగా చేయాలని నేను, రోహిత్ శర్మ అనుకున్నాం అని.. జట్టు విజయంలో భాగమైనందుకు ఆనందంగా ఉందని కోహ్లీ చెప్పుకొచ్చాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో కోహ్లీ (65 నాటౌట్; 45 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేశాడు.
దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌లో 302 పరుగులు చేసిన విరాట్ కోహ్లీకి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు దక్కింది. అవార్డు అందుకున్న అనంతరం కోహ్లీ మాట్లాడుతూ… ‘సిరీస్ మొత్తం నా మైండ్ చాలా ప్రశాంతంగా ఉంది. నేను ఇలాంటి ఇన్నింగ్స్‌లు ఆడగలిగితే జట్టుకు కూడా మంచి సహకారం అందించగలననే నమ్మకం పెరుగుతుంది. నేను బ్యాటింగ్‌కు దిగినప్పుడు ఏ పరిస్థితి వచ్చినా.. ఎదుర్కొనే సత్తా నాలో ఉంది. అలాంటి నమ్మకంతో ఆడితే జట్టుకు ఉపయోగం ఉంటుంది. నేను ఎక్కువ సేపు క్రీజులో నిలబడగలను, మ్యాచ్ పరిస్థితిని బట్టి షాట్లు ఆడగలను. ఒక్క తప్పిదం మీ ఇన్నింగ్స్‌ను ముగించేస్తుంది. అలాంటప్పుడు భయం, ఆందోళన సహజం. కొన్ని సార్లు నేను ఇంకా ఆడగలనా? అనే భావన వస్తుంది. అదే క్రీడ ప్రత్యేకత. ప్రతీ బంతిని ఎదుర్కొంటూ ఆ భయాన్ని జయించాలి. దీర్ఘ ఇన్నింగ్స్ ఆడినప్పుడు మళ్లీ మీరు మీ మునుపటి ఫామ్ అందుకుంటారు’ అని అన్నాడు.
Also Read: What’s Today: ఈరోజు ఏమున్నాయంటే?
‘ఏళ్ల తరబడి ఆడుతున్నా. చాలా కాలంగా ఆడుతున్నపుడు మనిషిగా కూడా మెరుగుపడతారు. ఆస్ట్రేలియా టూర్ తర్వాత ఇదే నా మొదటి మ్యాచ్. మొదటి నుంచే బంతి బాగా వస్తుందన్న భావన వచ్చింది. ఆ రోజు నాకు వచ్చిన ఎనర్జీ వేరే స్థాయిలో ఉంది. రిస్క్‌లు తీసుకునే ధైర్యం వచ్చింది. డిసైడర్ మ్యాచ్‌లే మాలోని అసలైన ఆటను బయటకు తెప్పిస్తాయి. ఈరోజు మ్యాచ్‌లో నేను టీమ్ కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకున్నా. ఇదే విషయంపై రోహిత్ శర్మతో మాట్లాడా. జట్టు విజయంలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. జట్టు అవసరాలకే నేను ప్రాధాన్యం ఇస్తాను. ఈ మూడు మ్యాచ్‌లు నాకు చాలా సంతృప్తిని ఇచ్చాయి. జట్టుకు ఇంకా నా వంతు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని కింగ్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.
