NTV Telugu Site icon

Virat Kohli: అర్ష్‌దీప్ క్యాచ్ డ్రాప్‌పై కోహ్లీ స్పందన.. ఆ రోజు రాత్రంతా నిద్ర పట్టలేదు..!!

Virat Kohli

Virat Kohli

Virat Kohli: యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియాకప్ రసవత్తరంగా సాగుతోంది. ఆదివారం నాడు సూపర్-4లో భాగంగా పాకిస్థాన్‌తో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియాపై ఓడిపోవడంపై అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 18 బంతుల్లో 34 పరుగులు చేయాల్సిన దశలో అర్ష్‌దీప్ సింగ్ అసిఫ్ అలీ ఇచ్చిన క్యాచ్ డ్రాప్ చేయడంతో టీమిండియా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అర్ష్‌దీప్ క్యాచ్ విడిచిపెట్టడంపై ప్రెస్ కాన్ఫరెన్స్‌లో విరాట్ కోహ్లీని అడగ్గా.. ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఎంతో టెన్షన్ ఉంటుందని.. ఆ సమయంలో ఎవరైనా తప్పు చేసే అవకాశముందని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ఈ ఘటనను పెద్దదిగా చేసి చూడాల్సిన అవసరం లేదన్నాడు. అర్ష్‌దీప్ కుర్రాడు అని.. అతడికి ఇంకా నేర్చుకునే సమయం చాలా ఉందన్నాడు.

Read Also: జీవిత భాగస్వామిని వెతుకుతున్నారా.. ఈ విషయాలను పట్టించుకోవద్దు..

తన కెరీర్‌లోనూ ఇలాంటి ఘటన జరిగిందని కోహ్లీ గుర్తుచేసుకున్నాడు. తొలిసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతున్నప్పుడు పాకిస్తాన్‌తో ఓ మ్యాచ్ జరిగిందని.. ఆ మ్యాచ్‌లో షాహిద్ అఫ్రిది బౌలింగ్‌లో తాను ఓ చెత్త షాట్ ఆడానని… తాను ఔటయ్యాక మనసు మనసులా లేదని.. ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదని.. మరుసటి రోజు ఉదయం 5గంటల వరకు సీలింగ్ ఫ్యాన్ చూస్తూనే ఉన్నానని కోహ్లీ వివరించాడు. ఆ టైంలో తన కెరీర్ ముగిసిందని అనిపించిందన్నాడు. కానీ నెమ్మదిగా ఆటపైనే దృష్టి సారించి ఆ విషయాన్ని మరిచిపోయానని పేర్కొన్నాడు. ఇప్పుడు అర్షదీప్ సింగ్ కూడా ఈ క్యాచ్ గురించి మర్చిపోయి మున్ముందు మరింత గొప్ప ప్రదర్శన ఇచ్చేందుకు ట్రై చేయాలని కోహ్లీ సూచించాడు. ప్లేయర్లు తమ తప్పుల నుండి నేర్చుకుంటారని.. కాబట్టి ఎవరైనా తప్పు చేస్తే మన్నించాలన్నాడు. అయితే మరోసారి ఒత్తిడిలో తప్పు చేయకుండా ట్రై చేయాలని కోహ్లీ పేర్కొన్నాడు.