ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియాకు షాక్ తగిలింది. కీలకమైన టెస్ట్ మ్యాచ్ ఆరంభానికి ముందే మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కరోనా బారిన పడి జట్టుకు దూరమయ్యాడు. కరోనా కారణంగా లండన్ విమానం కూడా అశ్విన్ ఎక్కలేదు. అయితే ప్రస్తుతం ఐదో టెస్ట్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న కోహ్లీకి కరోనా ఉందని వార్తలు రావడంతో జట్టు వర్గాలలో అయోమయం నెలకొంది. ఈనెల 24 నుంచి లీసెస్టర్ షైర్‌తో జరిగే ప్రాక్టీస్ మ్యాచ్ జరుగుతుందో లేదో అన్న అనుమానాలు భారతజట్టు శిబిరంలో వ్యక్తమవుతున్నాయి.
కాగా ఇటీవల దక్షిణాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్న విరాట్ కోహ్లీ తన సతీమణి అనుష్క శర్మతో కలిసి మాల్దీవులకు వెళ్లాడు. అక్కడ కోహ్లీ తన కుటుంబంతో బాగా ఎంజాయ్ చేశాడు. వెకేషన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కోహ్లీ కరోనా పాజిటివ్ బారిన పడినట్లు ఓ జాతీయ పత్రిక తన కథనంలో పేర్కొంది. అయితే కోహ్లీకి పాజిటివ్ అన్న విషయం బీసీసీఐ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో కోహ్లీ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఇటీవల కోహ్లీ భారత ఆటగాళ్లతో అత్యంత సన్నిహితంగా ఉండి ఫోటోలు దిగాడు. ఆయా ఫోటోలను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశాడు. ప్రస్తుతం కోహ్లీ ఆరోగ్యంగానే ఉన్నాడని జట్టు వర్గాలు అంటున్నాయి. కానీ అసలు విషయం బయటకు పొక్కడం లేదు. షెడ్యూల్ ప్రకారం జూలై 1 నుంచి భారత్-ఇంగ్లండ్ మధ్య గత ఏడాది వాయిదాపడ్డ ఐదో టెస్ట్ మ్యాచ్ జరగాల్సి ఉంది.
BCCI: రోహిత్, విరాట్ కోహ్లీలకు బీసీసీఐ హెచ్చరిక.. కారణం ఇదే..!!