Vaibhav Sooryavanshi-BCCI: వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ.. బీసీసీఐకి పెద్ద తలనొప్పి!

Vaibhav Suryavanshi World Records

Vaibhav Suryavanshi World Records

Vaibhav Sooryavanshi-BCCI: భారత టీ20 జట్టులో ఓపెనింగ్ బ్యాటర్ల ఎంపిక ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. 2026 టీ20 ప్రపంచ కప్ విజయంలో అభిషేక్ శర్మ, సంజు శాంసన్ కీలక పాత్ర పోషించినప్పటికీ.. తాజాగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ రాకతో జట్టు సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఇటీవల జింబాబ్వేతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో 151 పరుగులతో అదరగొట్టిన బుడ్డోడు.. ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు కూడా గెలుచుకున్నాడు. తన దూకుడు ఆటతో వైభవ్ ఓపెనింగ్ స్థానాన్ని దాదాపు ఖాయం చేసుకున్నాడు.

మరోవైపు అభిషేక్ శర్మ వరుసగా ఐదు ఇన్నింగ్స్‌ల్లో పరుగులు చేయలేకపోవంతో అతనిపై ఒత్తిడి పెరిగింది. ప్రపంచ నంబర్-1 టీ20 బ్యాటర్‌గా గుర్తింపు పొందిన అభిషేక్ ఫామ్‌పై ప్రశ్నలు తలెత్తుతున్న వేళ.. సంజు శాంసన్‌కు మళ్లీ భారత జట్టులో అవకాశం ఇవ్వాలనే డిమాండ్ బలపడుతోంది. ఈ అంశంపై భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా స్పందించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అభిషేక్ బ్యాటింగ్‌ను ప్రత్యర్థి జట్లు బాగా అర్థం చేసుకున్నాయని, అందుకే ఇప్పుడు సెలెక్టర్లు కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. సంజుకు మళ్లీ జట్టులో అవకాశం రావడం ఖాయమని, సెలక్షన్ కమిటీ ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలని క్రిస్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నారు.

సంజు శాంసన్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భారత క్రికెట్‌లో కొనసాగుతున్న తీవ్ర పోటీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇకపై ఆ ‘ర్యాట్ రేస్’లో భాగం కావాలని అనుకోవడం లేదని, 2026 టీ20 ప్రపంచ కప్‌కు ముందే ఆ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. ‘నేను ఆటను ఆస్వాదించాలని మాత్రమే కోరుకుంటున్నాను. దేవుడి దయతో ఇప్పటికే చాలా సాధించాను. ప్రస్తుతం నాకు 31 సంవత్సరాలు. ఇంకా కొన్ని సంవత్సరాలు క్రికెట్ ఆడే అవకాశం ఉంది. అందుకే ఇకపై నా నిర్ణయాల ప్రకారమే ఆడతాను. ఎలా బ్యాటింగ్ చేయాలో, ఏమి చేయాలో ఎవరూ నాకు చెప్పాల్సిన అవసరం లేదు’ అని శాంసన్ స్పష్టం విమర్శకులకు గట్టిగా బదులిచ్చాడు.

వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శన, అభిషేక్ శర్మ పేలవ ఫామ్, సంజు శాంసన్ అనుభవం నేపథ్యంలో భారత టీ20 జట్టులో ఓపెనింగ్ జోడీ ఎంపిక సెలెక్టర్లకు ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది. రానున్న సిరీస్‌లలో భారత జట్టు యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మొత్తంగా వైభవ్ ఎంట్రీతో ఇప్పుడు సెలెక్టర్లకు పెద్ద తలనొప్పి మొదలైంది. ముగ్గురిని ఎంపిక చేసినా.. ఇద్దరే ఓపెనింగ్ చేస్తారు. అప్పుడు కూడా బీసీసీఐపై విమర్శలు వస్తాయి. మరి దీనిని బీసీసీఐ ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి.