Rishab Pant Injury: టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో డెహ్రాడూన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. హరిద్వార్ జిల్లాలో మంగళూరు, నర్సన్ మధ్య ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్వయంగా కారు డ్రైవ్ చేసిన పంత్.. నిద్రమత్తులో కారు నడపడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో రిషబ్ పంత్ ఒక్కడే కారులో ఉన్నాడని, కారు అద్దాలను పగలగొట్టుకొని బయటకు వచ్చాడని చెప్పారు. ప్రమాదం తీవ్రత చూస్తుంటే అదృష్టవశాత్తూ పంత్ ప్రాణాలతో బయటపడ్డాడని తెలిపారు.
Read Also: Rishab Pant: రిషబ్ పంత్ ఆరోగ్యంపై బులెటిన్ విడుదల చేసిన వైద్యులు
కాగా పంత్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టిన 6 నిమిషాల తర్వాత మంటలు వ్యాపించాయి. మంటలు రావడానికి ముందే అటుగా వెళ్తున్న వాహనదారులతో పాటు స్థానికులు, కారు ప్రమాదాన్ని గుర్తించారు. కారుకు దూరంగా పడి ఉన్న పంత్‌కు స్థానికులు సాయం చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ప్రమాద సమయంలో వేగంగా కారు వద్దకు వచ్చిన కొంతమంది జనాలు కారులో ఇరుక్కున్న రిషబ్ పంత్‌ను రక్షించడానికి బదులుగా అందులో ఉన్న విలువైన నగలు, వస్తువులు తీసుకుని పారిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని ఉత్తరాఖండ్ పోలీసులు ధృవీకరించాల్సి ఉంది.