100 అంతర్జాతీయ సెంచరీలు:
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ 100 అంతర్జాతీయ సెంచరీలు చేసిన తొలి, ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. సచిన్ ఖాతాలో 51 టెస్ట్ సెంచరీలు, 49 వన్డే సెంచరీలు ఉన్నాయి. ఈ ఘనత అతని అసాధారణ నైపుణ్యం, అంతర్జాతీయ క్రికెట్‌లో సుదీర్ఘ కెరీర్‌కు నిదర్శనం. 1990లో ఇంగ్లాండ్‌పై తొలి టెస్ట్ సెంచరీ, 1994లో ఆస్ట్రేలియాపై తొలి వన్డే సెంచరీతో టెండూల్కర్ 100 సెంచరీల ప్రయాణం ప్రారంభమైంది. రెండు ఫార్మాట్లలో ఎన్నో సంవత్సరాలుగా స్థిరత్వాన్ని కొనసాగించడం ఆషామాషీ కాదు. భవిష్యత్తులో మరెవరూ ఈ ఘనతను సాధిస్తారని ఊహించడం కూడా కష్టమే.
నో గోల్డెన్ డక్:
టెస్ట్ క్రికెట్‌లో రాహుల్ ద్రవిడ్ ఒక్కసారి కూడా గోల్డెన్ డక్‌గా అవుట్ కాలేదు. 286 టెస్ట్ ఇన్నింగ్స్‌లలో ద్రవిడ్ తన మొదటి బంతికి అవుట్ కాలేదు. ఈ ఫీట్ అతని అద్భుతమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. ద్రవిడ్ 164 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 52.31 సగటుతో 13,288 పరుగులు చేశాడు. ‘ది వాల్’ అని పిలువబడే ద్రావిడ్.. 36 టెస్ట్ సెంచరీలు చేశాడు.
ఒకే ఇన్నింగ్స్‌లో 400 రన్స్:
వెస్టిండీస్ మాజీ కెప్టెన్ బ్రియాన్ లారాను ఒక లెజెండరీ బ్యాట్స్‌మన్‌గా పరిగణిస్తారు. 2004లో యాంటిగ్వాలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో లారా ఒకే ఇన్నింగ్స్‌లో 400 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 582 బంతుల్లో 400 పరుగులు చేశాడు. లారా మారథాన్ ఇన్నింగ్స్ 778 నిమిషాలు కొనసాగింది. లారా తన ఇన్నింగ్స్‌లో 43 ఫోర్లు, 4బి సిక్సర్లు బాదాడు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ వియాన్ ముల్డర్ ఇటీవల లారా 400 పరుగుల రికార్డుకు దగ్గరగా వచ్చాడు. ముల్డర్ 49 ఫోర్లతో అజేయంగా 367 పరుగులు చేశాడు. ఇది టెస్ట్ మ్యాచ్‌లో రెండవ వేగవంతమైన ట్రిపుల్ సెంచరీ. అయితే లారా గౌరవార్థం ముల్డర్ తన ఇన్నింగ్స్‌ను వెస్టిండీస్ దిగ్గజం రికార్డు కంటే 33 పరుగులు ముందే డిక్లేర్ చేశాడు.
వన్డే ఇన్నింగ్స్‌లో 264 పరుగులు:
2014 నవంబర్ 13న ఈడెన్ గార్డెన్స్‌లో శ్రీలంకతో జరిగిన వన్డేలో రోహిత్ శర్మ 264 పరుగులు చేశాడు. అతను ఈ రికార్డు ఇన్నింగ్స్‌ను కేవలం 173 బంతుల్లోనే సాదించాడు. రోహిత్ ఇన్నింగ్స్‌లో 33 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. వన్డే క్రికెట్‌లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు రోహిత్. 2013లో ఆస్ట్రేలియాపై 209, 2017లో శ్రీలంకపై అజేయంగా 208 రన్స్ చేశాడు. వన్డే చరిత్రలో మరే ఇతర ఆటగాడు ఒకటి కంటే ఎక్కువ డబుల్ సెంచరీలు చేయలేదు.
టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు:
శ్రీలంక దిగ్గజ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డును కలిగి ఉన్నాడు. మురళీధరన్ 133 మ్యాచ్‌ల్లో 800 వికెట్లు పడగొట్టాడు. 1992-2010 మధ్య తన మిస్టరీ బౌలింగ్‌తో అతను ఈ ఘనతను సాధించాడు. తక్కువ టెస్ట్ మ్యాచ్‌లు ఆడే నేటి క్రికెట్‌లో మురళీధరన్ రికార్డును బద్దలు కొట్టడం దాదాపు అసాధ్యం. టెస్ట్‌లలో అత్యధిక 10 వికెట్లు (22), వన్డేలలో అత్యధిక వికెట్లు (534) తీసిన రికార్డుతో సహా మురళీధరన్ ఖాతాలో ఎన్నో రికార్డులు ఉన్నాయి.
199 సెంచరీలు:
ఇంగ్లాండ్ దిగ్గజ బ్యాట్స్‌మన్ సర్ జాక్ హాబ్స్ తన ఫస్ట్-క్లాస్ క్రికెట్ కెరీర్‌లో మొత్తం 199 సెంచరీలు చేశాడు. అతను 1905 నుంచి 1934 వరకు 834 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడి 61,760 పరుగులు చేశాడు. హాబ్స్ గొప్ప ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా పరిగణించబడ్డాడు. హాబ్స్ 62 టెస్ట్ మ్యాచ్‌ల్లో 56.94 సగటుతో 5,410 పరుగులు చేశాడు. వాటిలో 15 టెస్ట్ సెంచరీలు ఉన్నాయి. అతని 199 ఫస్ట్-క్లాస్ సెంచరీల రికార్డు ఇప్పటికీ అలానే ఉంది.
అత్యధిక టెస్ట్ సగటు:
ఆస్ట్రేలియాకు చెందిన సర్ డొనాల్డ్ బ్రాడ్‌మాన్ అత్యధిక టెస్ట్ సగటు 99.94తో ప్రపంచ రికార్డును కలిగి ఉన్నాడు. తన 20 ఏళ్ల టెస్ట్ కెరీర్‌లో బ్రాడ్‌మాన్ 52 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 6,996 పరుగులు చేశాడు. వాటిలో 29 సెంచరీలు ఉన్నాయి. అతను 12 డబుల్ సెంచరీలు కూడా చేశాడు. ఈ రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. 1930లో అతను ఒకే టెస్ట్ సిరీస్‌లో 974 పరుగులు చేశాడు, ఇది మరొక రికార్డు. ఈ రికార్డులు ఏ బ్యాట్స్‌మన్ బద్దలు కొట్టలేదు. బ్రాడ్‌మాన్ కెరీర్ సగటు 99.94 అనేది క్రికెట్ చరిత్రలో బద్దలు కొట్టడం అసాధ్యం.
52 ఏళ్ల వయస్సులో అరంగేట్రం:
ఇంగ్లాండ్ క్రికెటర్ విల్ఫ్రెడ్ రోడ్స్ టెస్ట్ అరంగేట్రం చేసిన అతి పెద్ద వయస్సు గల ఆటగాడు. ఏప్రిల్ 1930లో కింగ్‌స్టన్‌లోని సబీనా పార్క్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తరపున ఆడినప్పుడు అతని వయస్సు 52 సంవత్సరాల 165 రోజులు. రోడ్స్ తన టెస్ట్ కెరీర్‌ను లోయర్ ఆర్డర్లో ప్రారంభించి.. ఆపై ఓపెనర్‌గా స్థిరపడ్డాడు.
నైట్ వాచ్‌మ్యాన్‌గా అత్యధిక స్కోరు
ఆస్ట్రేలియాకు చెందిన జాసన్ గిల్లెస్పీ నైట్ వాచ్‌మ్యాన్‌గా రికార్డు సృష్టించాడు. 2006లో చిట్టగాంగ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో గిల్లెస్పీ ఒక ఇన్నింగ్స్‌లో అజేయంగా 201 పరుగులు చేశాడు. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ అంతర్జాతీయ క్రికెట్‌లో నైట్ వాచ్‌మ్యాన్‌గా చేసిన అత్యధిక స్కోరు. గిల్లెస్పీ రెండవ ఇన్నింగ్స్‌లోనే డబుల్ సెంచరీ సాధించాడు. మైఖేల్ హస్సీతో కలిసి నాల్గవ వికెట్‌కు కీలకమైన 320 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు.
10 పరుగులకు 10 వికెట్లు:
ఇంగ్లాండ్ దిగ్గజ స్పిన్నర్ హాడ్లీ వరిటీ బౌలింగ్ రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. ఈ యార్క్‌షైర్ బౌలర్ జూలై 1932లో హెడింగ్లీలో ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అరుదైన రికార్డును నెలకొల్పాడు. నాటింగ్‌హామ్‌షైర్‌పై వెరిటీ తన 19.4 ఓవర్లలో 16 మెయిడెన్ ఓవర్లు బౌలింగ్ చేసి.. ఓ ఇన్నింగ్స్‌లో 10 పరుగులకు 10 వికెట్లు పడగొట్టాడు. ఈ అద్భుతమైన స్పెల్‌లో అతను కేవలం 15 బంతుల్లోనే హ్యాట్రిక్‌తో సహా ఏడు వికెట్లు పడగొట్టాడు. 10 పరుగులకు 10 వికెట్లు అనేది ఆధునిక క్రికెట్‌లో దాదాపు అసాధ్యం.