T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో శుక్రవారం ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో తప్పిదం జరిగింది. ఆప్ఘనిస్తాన్ బౌలర్ ఓవర్‌కు ఐదు బంతులే వేశాడు. కానీ ఈ విషయాన్ని అంపైర్లు గమనించలేదు. కానీ లైవ్‌లో మ్యాచ్ చూస్తున్న అభిమానులు మాత్రం ఈ తప్పిదాన్ని గుర్తించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్‌గా మారింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సందర్భంగా నాలుగో ఓవర్‌ను ఆప్ఘనిస్తాన్ బౌలర్ నవీన్ ఉల్ హక్ వేశాడు. తొలి రెండు బంతులకు రెండు సింగిల్స్ వచ్చాయి. ఆ తర్వాత మూడో బంతిని మార్ష్ బౌండరీ తరలించాడు. ఇక నాలుగో బంతిని వార్నర్ డాట్‌బాల్ ఆడాడు. ఆ తర్వాత ఐదో బంతికి మూడు పరుగులు వచ్చాయి. ఓవర్ పూర్తయిందనుకున్న నవీన్ ఉల్ హక్ అంపైర్ వద్దకి వచ్చాడు.
Read Also: ఎంత చూపించినా స్టార్ డమ్ మాత్రం రాని టాలీవుడ్ హీరోయిన్లు వీరే
అటు అంపైర్ కూడా మిస్ కమ్యునికేషన్ వల్ల ఓవర్ పూర్తయిందని భావించాడు. మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్ సహా ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు కూడా ఈ తప్పిదాన్ని గుర్తించలేకపోయారు. అయితే ఓవర్ పూర్తయి మరుసటి ఓవర్ తొలి బంతి పడిన తర్వాత ఫీల్డ్ అంపైర్ తప్పిదాన్ని గమనించాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో ఒక బంతి తక్కువగా ఆడినట్లయింది. అప్పుడప్పుడు అంపైర్లు కూడా పొరపాటు చేయడం సహజం. అయితే ఇది తొలి ఇన్నింగ్స్‌లో జరిగింది కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో జరిగి ఉంటే వివాదంగా మారేది. కాగా ఆస్ట్రేలియా జట్టు ఈ మ్యాచ్ గెలవడంతో సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. ఆ తర్వాత శ్రీలంక చేతిలో ఇంగ్లండ్ ఓడితే.. కంగారూలు నేరుగా సెమీస్ చేరతారు. లేదంటే మెరుగైన రన్ రేట్ కారణంగా ఇంగ్లండ్ సెమీస్ చేరి ఆస్ట్రేలియా ఇంటి దారి పడుతుంది.