Team India Record: జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మేరకు టీమిండియా ఒకే ఏడాదిలో ఈ ఘనత సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఈ ఏడాది జులైలో ఇంగ్లాండ్‌ను 10 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. అప్పుడు భారత ఓపెనర్లు 197 పరుగుల టార్గెట్‌ను వికెట్ కోల్పోకుండా ఛేదించారు. ఇప్పుడు జింబాబ్వేపై 192 పరుగుల టార్గెట్‌ను కూడా వికెట్లేమీ కోల్పోకుండా ఛేజ్ చేసి గెలిపించారు. ఈ మ్యాచ్ ద్వారా కేఎల్ రాహుల్ సారథ్యంలో తొలిసారి భారత్ వన్డే మ్యాచ్ గెలుపొందింది. దీపక్ చాహర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
Read Also: షియోమి ‘కుంగ్ ఫూ రోబో’ ప్రత్యేకతల గురించి తెలుసా?
అటు జింబాబ్వేపై ఓటమి అనేది లేకుండా వరుసగా 13 విజయాలను అందుకుని టీమిండియా మరో ఘనత సాధించింది. 2013 నుంచి 2022 వరకు జింబాబ్వేపై వన్డేల్లో భారత్‌కు ఓటమి అనేది ఎదురు కాలేదు. అటు 1988-2004 మధ్య కాలంలో బంగ్లాదేశ్‌పై 12 వరుస విజయాలను భారత్ సాధించింది. 1986-88 మధ్య న్యూజిలాండ్‌పై వరుసగా 11 వన్డేల్లో భారత్ గెలుపొందింది. 2002-2005 మధ్య కాలంలో జింబాబ్వేపై వరుసగా 10 వన్డేల్లో టీమిండియా విజయకేతనం ఎగురవేసింది. టీమిండియానే కాదు.. ఈరోజు జరిగిన తొలి వన్డేలో జింబాబ్వే కూడా ఓ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. 110 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన దశలో ఏకంగా 9వ వికెట్‌కు 70పరుగులు భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఇండియాపై అత్యుత్తమ 9వ వికెట్ భాగస్వామ్యాన్ని జింబాబ్వే నెలకొల్పింది. జింబాబ్వే టెయిలెండర్లు ఎంగర్వా (34), ఎవాన్స్ (33) వీరోచితంగా పోరాడారు.