Site icon NTV Telugu

Team India: టీమిండియాలో భారీ మార్పులు.. సూర్యకు వీడ్కోలు, అయ్యర్‌కు నిరాశ!

Team India T20

Team India T20

Major changes expected in Team India after the T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026 ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టులో కీలక మార్పులు జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. యువ స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ టీమిండియా కొత్త టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం గిల్ టెస్ట్, వన్డే జట్లకు కెప్టెన్‌గా ఉన్నాడు. ఇప్పుడు టీ20 ఫార్మాట్ బాధ్యతలు కూడా అతనికే అప్పగించే ఆలోచనలో భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బీసీసీఐ ముందునుంచి మూడు ఫార్మాట్లలో ఒకరినే కెప్టెన్‌గా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం టీమిండియా టీ20 కెప్టెన్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచ కప్ 2026 అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే టీ20 ఫార్మాట్‌కు కొత్త నాయకత్వం అవసరం అవుతుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ శుభ్‌మన్ గిల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను అన్ని ఫార్మాట్లకు వైస్ కెప్టెన్‌గా నియమించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. జైస్వాల్ ఇప్పటికే టీమిండియాలో కీలక ఆటగాడిగా ఎదుగుతున్న నేపథ్యంలో భవిష్యత్ నాయకత్వానికి సిద్ధం చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు టీ20 కెప్టెన్ రేసులో శ్రేయాస్ అయ్యర్ పేరు కూడా వినిపించింది. ఫిట్‌నెస్ సమస్యలు తరచూ ఎదురవుతుండటం, ప్రధానంగా వన్డే ఫార్మాట్‌కే పరిమితమవుతున్న పరిస్థితి కారణంగా అతనికి కెప్టెన్సీ అవకాశాలు తగ్గినట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే టీ20 ప్రపంచ కప్ తర్వాత టీమిండియా నాయకత్వంలో పెద్ద మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. యువ ఆటగాళ్లకు బాధ్యతలు అప్పగిస్తూ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ కొత్త వ్యూహం అమలు చేయాలని భావిస్తున్నట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.

Exit mobile version