RostonChase rescues West Indies for a winning start in T20 World Cup 2024: రెండుసార్లు టీ20 ప్రపంచకప్ విజేత వెస్టిండీస్.. పసికూన పాపువా న్యూగినియాపై చెమటోడ్చి గెలిచింది. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా గ్రూప్ సిలో పాపువా న్యూగినియాతో జరిగిన మ్యాచ్‌లో విండీస్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పసికూన నిర్ధేశించిన 137 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు విండీస్ ఆపసోపాలు పడింది. రోస్టన్ ఛేజ్ (42 నాటౌట్; 27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడకుంటే పరిస్థితి మరోలా ఉండేదే.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాపువా న్యూగినియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు టోనీ ఉరా (2), లెగా సియాకా (1), హిరీ హిరీ (2) సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరారు. కెప్టెన్ అసద్ వాలా (21)తో కలిసి సెసే బావు (50; 43 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) జట్టును ఆదుకున్నాడు. హాఫ్ సెంచరీ అనంతరం బావు అవుట్ కాగా.. కిప్లిన్ డోరిగా (27) కీలక పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో ఆండ్రీ రస్సెల్, అల్జారీ జోసెఫ్ 2 తలో రెండు వికెట్స్ తీయగా.. అకీలా హొసేన్, రొమారియో షెఫర్డ్, గుడాకేష్ మోటీ ఒక్కో వికెట్ పడగొట్టారు.
Also Read: Road Accident: పెళ్లిబృందం ట్రాక్టర్ బోల్తా.. 13 మంది మృతి!
స్వల్ప ఛేదనలో వెస్టిండీస్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ జాన్సన్ చార్లెస్ (0) డకౌటయ్యాడు. మరో ఓపెనర్ బ్రెండన్ కింగ్ (34; 29 బంతుల్లో 7 ఫోర్లు), హిట్టర్ నికోలస్ పూరన్ (27) స్కోరు బోర్డును ముందుకు నడిపారు. ఈ ఇద్దరితో సహా రొమన్ పావెల్ (15) పెవిలియన్ చేరారు. చివర్లో కాస్త ఉత్కంఠ ఏర్పడినా.. రస్సెల్ (15; 9 బంతుల్లో 1 సిక్స్) అండతో రోస్టన్ ఛేజ్ ధాటిగా ఆడి ఒక ఓవర్ మిగిలుండగానే విండీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. న్యూగినియా బౌలర్లలో అసద్ వాలా 2 వికెట్స్ తీశాడు.