Site icon NTV Telugu

T20 World Cup: ఈనెల 16న మెగా టోర్నీకి భారత జట్టు ప్రకటన.. బుమ్రా పరిస్థితేంటి?

T20 World Cup

T20 World Cup

T20 World Cup: అక్టోబరులో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం ఈనెల 16న బీసీసీఐ సెలక్షన్ కమిటీ భారత జట్టును ప్రకటించనుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ వంటి మేటి జట్లన్నీ టీ20 ప్రపంచకప్ కోసం తమ జట్టును ప్రకటించేశాయి. అయితే ఇటీవల ఆసియాకప్‌లో టీమిండియా ఘోర వైఫల్యం చెందడంతో టీ20 ప్రపంచకప్‌కు జట్టు ఎలా ఉండబోతుందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఆల్‌రౌండర్ జడేజా మోకాలి గాయంతో జట్టుకు దూరం కావడం భారత జట్టుపై తీవ్ర ప్రభావం చూపనుంది. జడేజా స్థానంలో అక్షర్ పటేల్‌ను తీసుకుంటారా లేదా దీపక్ హుడాకు అవకాశమిస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది.

Read Also: YouTube Player For Education: ఎడ్యుకేషనల్‌ కంటెంట్‌ ఇంప్రూవ్‌మెంట్‌ కోసం త్వరలో ‘యూట్యూబ్‌ ప్లేయర్‌’

మరోవైపు స్టార్ పేస్ బౌలర్ బుమ్రా టీ20 ప్రపంచకప్‌కు జట్టులోకి తిరిగి వస్తాడా రాడా అన్నది కూడా ఆసక్తి రేపుతోంది. ఈ మేరకు బుమ్రా, హర్షల్ పటేల్‌కు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహించనున్నారు. వాళ్ల గాయాలపై స్పష్టత రాగానే జట్టును ప్రకటిస్తామని సెలక్షన్ కమిటీ చెప్తోంది. బుమ్రా వెన్ను నొప్పి గాయంతో.. హర్షల్ పటేల్ పక్కటెముకల గాయంతో ఆసియా కప్‌కు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం హర్షల్ పటేల్ కోలుకున్నట్లు కనిపిస్తున్నా.. బుమ్రా గాయంపైనే అనుమానాలు నెలకొన్నాయి. టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగే జట్టు వివరాలను అందజేయడానికి సెప్టెంబర్ 16వ తేదీని ఐసీసీ డెడ్‌లైన్‌గా విధించింది. అందుకే భారత సెలెక్షన్ కమిటీ అదే రోజు సమావేశమై జట్టును ప్రకటించనుంది.

Exit mobile version