T20 World Cup: భారత్‌లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2026కు బంగ్లాదేశ్ జట్టు వెళ్లేందుకు నిరాకరించడంతో, ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ను ఎంపిక చేయనున్నారు. వేదికల వివాదంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మధ్య కొనసాగుతున్న వివాదమే ఈ పరిణామానికి ప్రధాన కారణంగా మారింది. భద్రతా కారణాలను చూపుతూ తమ గ్రూప్ మ్యాచ్‌లను భారత్‌కు బదులు సహ-ఆతిథ్య దేశమైన శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ కోరింది. అయితే, ఐసీసీ నిర్వహించిన స్వతంత్ర భద్రతా అంచనాల ప్రకారం భారత్‌లో బంగ్లాదేశ్ ఆటగాళ్లు లేదా అధికారులకు ఎలాంటి ముప్పు లేదని తేలింది. అలాగే, టోర్నమెంట్ ప్రారంభానికి అతి సమీపంలో షెడ్యూల్ మార్పులు చేయడం సాధ్యం కాదని ఐసీసీ స్పష్టం చేసింది.
Read Also: 360Hz టచ్ సాంప్లింగ్ రేట్, 3D ఫింగర్‌ప్రింట్ సెన్సర్.. 8.3mmతో Realme Neo 8 లాంచ్..
అయితే, నిన్న( జనవరి 21న) బంగ్లాదేశ్‌కు ఐసీసీ తుది గడువు విధిస్తూ, భారత్‌కు రావాలా వద్దా అనేది నిర్ణయం తీసుకోవాలని అల్టిమేటం జారీ చేసింది. నిరాకరిస్తే టోర్నమెంట్ నుంచి తొలగించి మరో జట్టును చేర్చుతామని హెచ్చరించింది. దీనికి ప్రతిస్పందనగా ఈరోజు (జనవరి 22న) జరిగిన ప్రెస్మీట్లో బీసీబీ, సమస్యకు పరిష్కారం కనుగొనడంలో ఐసీసీ విఫలమైందని ఆరోపిస్తూ చర్చను మళ్లీ రగిలించింది. యూరోపియన్ క్వాలిఫయర్స్‌లో ఇటలీ, నెదర్లాండ్స్, జెర్సీ వెనుక నిలిచి స్కాట్లాండ్ అర్హత సాధించలేకపోయినప్పటికీ, టోర్నమెంట్‌కు అర్హత పొందని జట్లలో ఐసీసీ టీ20ఐ ర్యాంకింగ్స్‌లో అత్యున్నత స్థానంలో ఉంది. అందువల్ల చివరి నిమిషంలో మార్పు అవసరమైతే స్కాట్లాండ్ సరైన ప్రత్యామ్నాయంగా ఐసీసీ భావిస్తోంది.
ఇక, ఈ పరిణామాలు భారత్- బంగ్లాదేశ్ మధ్య కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో మరింత తీవ్రమయ్యాయి. ఐపీఎల్ నుంచి పేసర్ ముస్తాఫిజూర్ రహ్మాన్ తొలగింపుపై బంగ్లాదేశ్ నిరసన వ్యక్తం చేయడం కూడా ఉద్రిక్తతలకు కారణమైంది. వరల్డ్ కప్ టోర్నీలో బంగ్లా జట్టు పాల్గొనడంపై తుది నిర్ణయం ప్రభుత్వంతో సంప్రదించి తీసుకుంటామని బీసీబీ పేర్కొంది. చివరికి బంగ్లాదేశ్ అధికారికంగా తప్పుకోవడంతో, వరల్డ్ కప్ షెడ్యూల్, టోర్నమెంట్ సమగ్రతను కాపాడేందుకు స్కాట్లాండ్ చేరికను నిర్వాహకులు ఆమోదించనున్నట్లు తెలుస్తుంది. ఇది ఐసీసీ టోర్నమెంట్ చరిత్రలో అరుదైన మార్పుగా నిలవనుంది. క్రికెట్‌కు అతీతంగా రాజకీయం, పరిపాలనా సవాళ్లు ఎలా ప్రభావం చేస్తాయో ఈ ఘటన స్పష్టంగా తెలియజేస్తుంది.