T20 World Cup 2026: పాక్‌ కంటే దారుణంగా భారత్‌..! సెమీస్‌ ముందు టీమిండియాను టెన్షన్‌ పెడుతున్న గణాంకాలు..

T20 World Cup 2026

T20 World Cup 2026

ICC Men’s T20 World Cup 2026లో టీమ్ ఇండియా సెమీఫైనల్‌కు చేరుకున్నప్పటికీ, జట్టును కలవరపెడుతున్న ప్రధాన సమస్య ఫీల్డింగ్.. కీలక మ్యాచ్‌ల ముందు భారత జట్టు క్యాచింగ్‌లో తీవ్ర బలహీనత బయటపడింది. ఒక భయంకరమైన గణాంకం ఇప్పుడు అభిమానులను, జట్టు మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. టోర్నీలో భారత్ అద్భుత విజయాలు సాధిస్తున్నా, ఫీల్డింగ్ విషయంలో మాత్రం అత్యంత వెనుకబడి ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం, క్యాచ్‌లు పట్టడంలో భారత్ ‘చివరి’ స్థానంలో నిలవడం గమనార్హం.

పాకిస్థాన్ కంటే వెనుకబడిన టీమ్ ఇండియా!
సాధారణంగా ఫీల్డింగ్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లను విమర్శిస్తుంటారు.. కానీ, ఈ ప్రపంచ కప్‌లో భారత్ వారికంటే పేలవ ప్రదర్శన చేస్తోంది టీమిండియా.. భారత్ సక్సెస్ రేటు కేవలం 72.7 శాతంగా ఉంటే పాకిస్తాన్ సక్సెస్ రేటు 83.3 శాతంగా ఉంది.. సూపర్-8కు చేరిన అన్ని జట్లలో భారత్ క్యాచింగ్ సక్సెస్ రేటు అతి తక్కువగా ఉంది. ఇంగ్లాండ్ 87.2 శాతంతో అగ్రస్థానంలో ఉండగా, భారత్ అట్టడుగున నిలిచింది.

వెస్టిండీస్ మ్యాచ్‌లో బయటపడ్డ బలహీనతలు
ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో భారత్ విజయం సాధించినా, ఫీల్డింగ్ లోపాలు స్పష్టంగా కనిపించాయి. అభిషేక్ శర్మ.. రోస్టన్ చేజ్ క్యాచ్ వదిలేశాడు (ఆ తర్వాత చేజ్ 40 పరుగులు చేశాడు).. తిలక్ వర్మ.. రూథర్‌ఫోర్డ్ క్యాచ్‌ను నేలపాలు చేశాడు.. మరోసారి అభిషేక్ శర్మ.. పావెల్ ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను వదిలివేశాడు.. ఒకవేళ వెస్టిండీస్ బ్యాటర్లు ఆ క్యాచ్‌ల తర్వాత మరింత రెచ్చిపోయి ఉంటే ఫలితం మరోలా ఉండేది.

టోర్నీలో ఇప్పటివరకు కోల్పోయిన క్యాచ్‌లు
ఈ ప్రపంచ కప్‌లో టీమ్ ఇండియా ఇప్పటివరకు మొత్తం 13 క్యాచ్‌లను నేలపాలు చేసింది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనే ఏకంగా 4 క్యాచ్‌లు వదిలేశారు. నాకౌట్ దశలో ఇంగ్లాండ్ వంటి పటిష్టమైన జట్లతో తలపడేటప్పుడు, ఒక్క క్యాచ్ వదిలేసినా అది మ్యాచ్ ఫలితాన్ని మార్చేసే ప్రమాదం ఉంది.

జట్ల వారీగా క్యాచింగ్ సక్సెస్ రేటు:
– ఇంగ్లాండ్ 87.2 శాతం
– జింబాబ్వే 85.4 శాతం
– వెస్టిండీస్ 84.6 శాతం
– పాకిస్తాన్ 83.3 శాతం
– భారత్ 72.7 శాతంగా మాత్రమే ఉంది..

అయితే, “క్యాచ్‌లు మ్యాచ్‌లను గెలిపిస్తాయి” అన్నది క్రికెట్ సామెత. సెమీఫైనల్స్ చేరిన ఆనందంలో ఉన్న సూర్యకుమార్ యాదవ్ బ్రిగేడ్, ఈ ఫీల్డింగ్ లోపాలను వెంటనే సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే సెమీస్‌లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.