Ricky Ponting: టీ20 వరల్డ్‌కప్ 2026లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ బ్రేక్‌అవుట్ స్టార్‌గా మారతాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ జోస్యం చెప్పారు. ఈ యువ బ్యాటర్ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు సాధించే ఆటగాడిగా, అంతేకాదు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును కూడా గెలుచుకునే సత్తా అతడికి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 2018 ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అభిషేక్ కు తొలి కోచ్‌గా వ్యవహరించిన పాంటింగ్, అప్పుడే అతడిలో అసాధారణ ప్రతిభను గుర్తించానని చెప్పారు.
Read Also: Supreme Court: ఆ ఎమ్మెల్యే ప్రొఫైల్‌తో యువతులకు ఎర.. షాదీ డాట్ కామ్‌పై సుప్రీంకోర్టు ఫైర్
అభిషేక్ పై ప్రశంసలు:
అయితే, అభిషేక్ శర్మ నా కోచింగ్‌లోనే ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు.. అప్పటికి అతడి వయస్సు సుమారు 17 ఏళ్లు.. తొలి బంతినే నేరుగా బౌలర్ తలపైకి సిక్స్ లేదా ఫోర్‌గా కొట్టాడు అని రికీ పాంటింగ్ తెలిపారు. ఆ స్ట్రెయిట్ బ్యాట్ షాట్ చూస్తేనే ఇతడు ప్రత్యేకమైన ఆటగాడని అర్థమైందని తెలిపారు. అతడ్ని ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ట్రేడ్ చేయొద్దని తాను ఎంతగానో ప్రయత్నించానని గుర్తు చేసుకున్నారు. అతడు భవిష్యత్తులో సూపర్‌స్టార్ అవుతాడు అని జట్టు యాజమాన్యానికి చెప్పాను.. ఇప్పుడు అదే నిజమైందని పాంటింగ్ అన్నారు.
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌కు కీలక ఆటగాడు:
ఐపీఎల్ అరంగేట్రంలో ఢిల్లీ తరఫున 19 బంతుల్లో 46 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించిన అభిషేక్, ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. 2019 నుంచి ఇప్పటి వరకు 71 ఇన్నింగ్స్‌ల్లో 1,753 పరుగులు, 162కి పైగా స్ట్రైక్ రేట్‌తో ఆడుతూ జట్టుకు ప్రధాన బ్యాటర్‌గా మారాడు.
Read Also: MS Dhoni: 2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్, కోహ్లీ ఆడతారా?.. MS ధోనీ సంచలన వ్యాఖ్యలు
అంతర్జాతీయ క్రికెట్‌లోనూ అదరగొట్టిన అభిషేక్:
2024 జూలైలో టీ20 అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన అభిషేక్ శర్మ, ఇప్పటి వరకు 37 ఇన్నింగ్స్‌ల్లో 1,297 పరుగులు సాధించాడు. అతడి సగటు 37.05 కాగా, స్ట్రైక్ రేట్ దాదాపు 195కి చేరుకుంది. ఇందులో రెండు సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. న్యూజిలాండ్‌పై కేవలం 14 బంతుల్లో అర్ధశతకం చేయడం అతడి కెరీర్ లో హైలైట్ గా నిలిచింది.
వరల్డ్‌కప్‌లో అతడిపైనే భారత్ ఆశలు:
టీ20 వరల్డ్‌కప్‌లో అభిషేక్ ప్రదర్శనే భారత్ భవితవ్యాన్ని నిర్ణయిస్తుందని రిక్కీ పాంటింగ్ అభిప్రాయపడ్డారు. అతడు రన్స్ చేస్తే భారత్‌ను ఓడించడం చాలా కష్టం అన్నారు. అతడు ఫెయిల్ అయితే భారత్ కూడా ఇతర జట్లలాగే బలహీనంగా మారుతుంది అని జోస్యం చెప్పారు. కాగా, డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ఫిబ్రవరి 7వ తేదీన ముంబైలో అమెరికాతో తమ వరల్డ్‌కప్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఈ టోర్నీలో అభిషేక్ శర్మ కీలక పాత్ర పోషిస్తాడని క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు.
