NTV Telugu Site icon

Suryakumar Yadav: మొదటిసారి అవార్డు వచ్చింది.. ఎవరికీ ఇవ్వను: సూర్య

Suryakumar Yadav

Suryakumar Yadav

Suryakumar Yadav on Player of the Match: టీ20 ప్రపంచకప్ 2024 సూపర్‌-8లో అఫ్గాన్‌ను భారత్ చిత్తుచేసింది. టీమిండియా విజయంలో మిస్టర్ 360, టీ20ల్లో టాప్ ర్యాంకర్‌ సూర్యకుమార్‌ యాదవ్ (53: 28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) కీలక పాత్ర పోషించాడు. నాలుగు కీలక వికెట్స్ కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును సూర్య అద్భుత హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. హార్దిక్ పాండ్యాతో కలిసి జట్టు స్కోరును 150 దాటించాడు. దాంతో భారత్ 181 పరుగులు చేసి.. అఫ్గాన్‌ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఆపై బౌలర్లు చెలరేగడంతో రోహిత్ సేన ఘన విజయం సాధించింది.

హాఫ్ సెంచరీతో సత్తా చాటిన సూర్యకుమార్‌ యాదవ్‌‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. టీ20 ప్రపంచకప్ 2024లో ఓ భారత బ్యాటర్ ఈ అవార్డు అందుకోవడం ఇదే మొదటిసారి. దాంతో సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మెగా టోర్నీలో భారత బ్యాటర్లకు దక్కిన తొలి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అని సూర్య సంతోషం వ్యక్తం చేశాడు. భారత బౌలర్లు కూడా అద్భుత ప్రదర్శన చేశారని, అవార్డు అందుకునేందుకు వారిలో ఒకరు అర్హులని పేర్కొన్నాడు. అయితే అవార్డును మాత్రం ఎవరికీ ఇవ్వనని సరదాగా అన్నాడు. దాంతో అక్కడ అందరూ నవ్వుకున్నారు.

‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు తీసుకున్న అనంతరం సూర్యకుమార్‌ యాదవ్‌‌ మాట్లాడుతూ… ‘చాలా హార్డ్‌వర్క్ చేశాను. గత కొన్ని రోజులుగా నేను పడ్డ కష్టానికి ఈరోజు మంచి ఫలితం దక్కింది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఏమి చేయాలనుకున్న దానిపై స్పష్టంగా ఉన్నా. ఈ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ను ఓ భారత బౌలర్‌కి ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే ఈ టోర్నీలో మొదటిసారి భారత బ్యాటర్‌కి అవార్డు వచ్చింది. దీనిని ఎవరికీ ఇవ్వాలనుకోవడం లేదు’ అని చెప్పాడు.

Also Read: Shah Rukh Khan Mansion: అమెరికాలో షారుఖ్ ఖాన్ మాన్షన్‌.. ఒక రాత్రికి 2 లక్షలు!

‘రషీద్ ఖాన్‌ బౌలింగ్‌లో ఆడటం చాలా కష్టం. ప్రపంచంలోనే అతడు అత్యుత్తమ స్పిన్నర్. రషీద్ బౌలింగ్‌లో నేను జాగ్రత్తగా బ్యాటింగ్ చేశాను. ఎప్పుడైనా పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లు ఆడాల్సి ఉంటుంది. హార్దిక్ పాండ్యా క్రీజులోకి వచ్చినప్పుడు ఇదే ఇంటెంట్‌తో బ్యాటింగ్ కొనసాగిద్దామని చెప్పా. హార్దిక్ బాగా ఆడాడు. 180 స్కోర్‌ చేయడం సంతోషంగా అనిపించింది. ఇదే ఆటను కొనసాగిస్తాము’ అని సూర్యకుమార్‌ యాదవ్‌‌ తెలిపాడు.