NTV Telugu Site icon

Rohit Sharma: మేం కాదు.. ప్రపంచకప్‌ అందుకోవడానికే అతనే పూర్తి అర్హుడు: రోహిత్

Rohit Sharma Press Conference

Rohit Sharma Press Conference

Rohit Sharma Heap Praise on Rahul Dravid: 11 ఏళ్ల ఐసీసీ టైటిల్ నిరీక్షణకు తెరపడింది. టీ20 ప్రపంచకప్‌ 2024 ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఓడించిన భారత్.. విశ్వవిజేతగా నిలిచింది. ఓటమి ఖాయం అనుకున్న దశలో అద్భుతంగా పోరాడింది. నరాలు తెగే ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2023 వన్డే ప్రపంచకప్‌ను తృటిలో చేజార్చుకున్న భారత్.. ఈసారి ట్రోఫీ సాధించి 140 కోట్ల భారతీయులను ఆనందాల్లో ముంచెత్తింది. ఆటగాళ్లతో పాటు కోచ్ రాహుల్ ద్రవిడ్ ఎమోషనల్ అయ్యారు.

గత 20–25 ఏళ్లుగా భారత క్రికెట్‌కు చేసిన సేవలకు గాను ఆటగాళ్ల కంటే హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రపంచకప్ ట్రోఫీ అందుకోవడానికి అసలైన అర్హుడు అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడుతూ… ‘మా (ప్లేయర్స్) కంటే ఎక్కువగా ప్రపంచకప్ ట్రోఫీకి రాహుల్ ద్రవిడే అర్హుడు. గత 20-25 ఏళ్లుగా అతను భారత క్రికెట్‌కు ఏం చేసాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిన్నటి వరకు ద్రవిడ్ ఖాతాలో ప్రపంచకప్ ఒక్కటి మాత్రమే లేదు. ఇప్పుడు అది కూడా సంపూర్ణం అయ్యింది. ఇప్పుడు జట్టు సంతోషంగా ఉంది. అతను ఎంత గర్వంగా ఉన్నాడో, ఎంత ఉత్సాహంగా ఉన్నాడో మీరు చూస్తున్నారు. ద్రవిడ్ కోసం ట్రోఫీ సాధించిందుకు ఆనందంగా ఉంది’ అని రోహిత్ చెప్పాడు.

Also Read: Rohit Sharma Robo Walk: రోబోలా నడుచుకుంటూ వచ్చి.. ప్రపంచకప్‌ ట్రోఫీని అందుకున్న రోహిత్‌ శర్మ!

164 టెస్టులు, 344 వన్డేలు, 1 టీ20 మ్యాచ్ ఆడిన రాహుల్ ద్రవిడ్.. టీమిండియాకు ఎన్నో విజయాలు అందించాడు. ఆటగాడిగా 2003లో తృటిలో వన్డే ప్రపంచకప్‌ టైటిల్ మిస్ అయింది. సారథిగా 2007 వన్డే ప్రపంచకప్‌లో విఫలమయ్యాడు. 2011లో భారత్ కప్ గెలిచినా.. అప్పటికే అతడు వీడ్కోలు పలికాడు. ఇక జాతీయ క్రికెట్ అకాడమీ బాధ్యతలు చేపట్టిన ద్రవిడ్.. రెండేళ్ల క్రితం భారత జట్టుకు హెడ్ కోచ్ అయ్యాడు. ఎట్టకేలకు తన మార్గనిర్ధేశంలో జట్టుకు ట్రోఫీ అందించాడు. టీ20 ప్రపంచకప్‌ 2024తో ద్రవిడ్ పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే.