Site icon NTV Telugu

T20 World Cup: దెబ్బకు దిగొచ్చిన పాకిస్తాన్.. ఐసీసీ వార్నింగ్‌లో జట్టు ప్రకటన..

Pak

Pak

T20 World Cup: భారత్‌లో ఆడమని ప్రకటించి బంగ్లాదేశ్ టీ20 వరల్డ్ కప్ నుంచి బహిష్కరణకు గురైంది. బంగ్లాకు మద్దతుగా తాము కూడా టోర్నీని బహిష్కరిస్తామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్(పీసీబీ) ప్రగల్భాలు పలికింది. అయితే, టోర్నీని బాయ్‌కాట్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ఆంక్షలు విధిస్తామని ఐసీసీ హెచ్చరించింది. ఈ దెబ్బతో పాకిస్తాన్ దిగొచ్చింది. చివరకు టీ20 ప్రపంచ కప్ 2026 కోసం తన జట్టును ప్రకటించింది. ఐసీసీ హెచ్చరించిన కొన్ని గంటల్లోనే పీసీబీ 15 మందితో జట్టును వెల్లడించింది. జట్టును ప్రకటించడం ద్వారా తాము టోర్నీ ఆడబోతున్నామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. సల్మాన్ అలీ అఘా నాయకత్వంలో పాకిస్తాన్ టోర్నమెంట్‌లో పాల్గొంటుందని ధ్రువీకరించారు.

ఈ వారం ప్రారంభంలో భద్రతా కారణాలు చూపుతూ, భారత్ దేశంలో మేమే టోర్నీ ఆడలేమని బంగ్లా క్రికెట్ బోర్డ్(బీసీబీ) అనవసర వివాదాన్ని లేవనెత్తింది. తమ వేదికను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని కోరింది. అయితే, ఐసీసీ దీనికి అంగీకరించలేదు, దీంతో టోర్నీ నుంచి బయటకు వెళ్తున్నట్లు బీసీబీ ప్రకటించింది. బంగ్లాదేశ్ స్థానంలో ప్రస్తుతం టోర్నీలో స్కాట్లాండ్ ఆడబోతోంది.

బంగ్లాకు మద్దతుగా పాక్ కూడా ఇదే దారిలో నడవచ్చని అంతా అనుకున్నప్పటికీ, ఐసీసీ హెచ్చరికలు పనిచేశాయి. తాజాగా అకిబ్ జావేద్, ప్రధాన కోచ్ మైక్ హెస్సన్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ, టోర్నమెంట్ కోసం జట్టును ఎంపిక చేసింది. బాబార్ ఆజం, షాహీన్ అఫ్రిది తిరిగి జట్టులోకి రాగా, హారిస్ రౌఫ్‌ను సెలక్టర్లు పక్కన పెట్టారు. ఇటీవల టీ20 టోర్నీల్లో జట్టుకు దూరమైన బాబార్, షాషీన్ జట్టులోకి తిరిగి రావడం వారి ఫ్యాన్స్‌కు హ్యాపీ న్యూస్.

పాకిస్థాన్ టీ20 ప్రపంచ కప్ జట్టు:

సల్మాన్ అలీ ఆఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, ఖ్వాజా మహ్మద్ నఫే (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ సల్మాన్ మీర్జా, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్ (వికెట్ కీపర్), సైమ్ అయూబ్, షాహీన్ షా అఫ్రిది, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), ఉస్మాన్ తారిఖ్.

పాకిస్తాన్ ICC T20 ప్రపంచ కప్ 2026 షెడ్యూల్:

ఫిబ్రవరి 7 – కొలంబోలో పాకిస్తాన్ vs నెదర్లాండ్స్

ఫిబ్రవరి 10 – కొలంబోలో పాకిస్తాన్ vs USA

ఫిబ్రవరి 15 – కొలంబోలో భారతదేశం vs పాకిస్తాన్

ఫిబ్రవరి 18 – కొలంబోలో పాకిస్తాన్ vs నమీబియా

Exit mobile version