Babar Azam preparing to take legal action against YouTubers: టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్థాన్ ఘోర పరాభవానికి తానే ప్రధాన కారణమంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కొందరు యూట్యూబర్‌లు, మాజీ క్రికెటర్లపై చర్యలు తీసుకోనునట్లు సమాచారం. ఇందులో పాక్ వెటరన్ క్రికెటర్ అహ్మద్ షహజాద్ కూడా ఉన్నాడని తెలుస్తోంది. ఈ మేరకు స్థానిక మీడియా జియో న్యూస్ పేర్కొంది.
టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్థాన్ గ్రూప్ దశ నుంచే ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే. గ్రూప్-ఏలో భాగంగా పసికూన అమెరికా, చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో ఓడిన పాకిస్తాన్.. కెనడా, ఐర్లాండ్‌పై గెలిచినా టోర్నీలో ముందడుగు వేయలేకపోయింది. పాక్ జట్టు వైఫల్యంపై ఆ దేశ మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు, యూట్యూబర్‌లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కెప్టెన్ బాబర్ అజామ్‌ను లక్ష్యంగా చేసుకుని ట్రోలింగ్ చేశారు. దాంతో బాబర్ లీగల్ యాక్షన్‌కు సిద్దమయ్యారు. అహ్మద్ షహజాద్‌తో పాటు యూట్యూబుల్లో పలువురు మాజీలు చేసిన వ్యాఖ్యల వీడియోలను పీసీబీ లీగల్ సెక్షన్ పరిశీలిస్తోంది. వీడియోలను పరిశీలించి లీగల్‌గా ఎలాంటి చర్యలు తీసుకోవాలో పీసీబీ కమిటీ చర్చించనుంది.
Also Read: Samsung Galaxy S24 Ultra: నయా కలర్‌లో ‘గెలాక్సీ S24 అల్ట్రా’.. లుక్ అదిరిపోలా!
టీ20 ప్రపంచకప్ లీగ్ స్టేజ్‌లోనే పాకిస్తాన్ నిష్క్రమించినప్పటికీ కొందరు ఆటగాళ్లు ఇంకా యూఎస్‌ఏలోనే ఉన్నారు. బాబర్ అజామ్, ఇమాద్ వసీమ్, హారిస్ రవూఫ్, షాదాబ్ ఖాన్, ఆజం ఖాన్ యూఎస్‌ఏలో ఉన్నారు. ఈరోజు వారు స్వదేశానికి వెళ్తారని సమాచారం. ఇక పాక్ కెప్టెన్సీ మార్పుపై ఇప్పటివరకు పీసీబీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సెలక్షన్ కమిటీని ప్రక్షాళన చేస్తున్నట్లు ఇప్పటికే పీసీబీ ప్రకటించింది. మరోవైపు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తాను వైదొలగడం లేదని, పీసీబీ ఏం ఆదేశాలు జారీ చేస్తే వాటిని పాటింస్తానని బాబర్ స్పష్టం చేశాడు.