ఇటీవలి కాలంలో భారత్, బంగ్లాదేశ్ దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. బంగ్లాలో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 నుంచి ముస్తాఫిజుర్ రెహమాన్‌ను బీసీసీఐ రిలీజ్ చేసింది. ఐపీఎల్ 2026 వేలంలో రెహమాన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.9.20 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. కానీ బీసీసీఐ సూచనల మేరకు కేకేఆర్ అతడిని విడుదల చేసింది. దాంతో వచ్చే నెలలో ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్ 2026 మ్యాచ్‌లను భారతదేశంలో కాకుండా వేరే వేదికకు తరలించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) డిమాండ్ చేసింది.
భారత్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ 2026లో బంగ్లాదేశ్ నాలుగు లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది. అందులో మూడు కోల్‌కతాలో, ఒకటి ముంబైలో షెడ్యూల్ అయి ఉంది. భారత్ నుంచి మరో వేదికకు మ్యాచ్‌లను తరలించాలనే బీసీబీ డిమాండ్‌ను ఐసీసీ తిరస్కరించింది. దాంతో భద్రతా కారణాల దృష్ట్యా బంగ్లాదేశ్ ఆటగాళ్లను ప్రపంచకప్ మ్యాచ్‌ల కోసం భారత్‌కు పంపబోమని బీసీబీ పట్టుదలతో ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చూస్తోంది.
Also Read: MSVG : ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఓవర్సీస్ రివ్యూ.. అనిల్ రావిపూడి దొరికేశాడా?
టీ20 ప్రపంచకప్ 2026లో బంగ్లాదేశ్ మ్యాచ్‌లను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి పీసీబీ ప్రతిపాదించింది. అయితే పీసీబీ ప్రతిపాదనను ఐసీసీ అంగీకరించే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే హోటల్, ప్రయాణ టిక్కెట్లు ఇప్పటికే షెడ్యూల్ ప్రకారం బుక్ చేయబడ్డాయి. బంగ్లాదేశ్ తప్పక భారత్ రావాల్సి ఉంటుంది. లేదా మెగా టోర్నీ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. పాకిస్తాన్ తన అన్ని మ్యాచ్‌లను శ్రీలంకలోనే ఆడుతుంది. ఫిబ్రవరి 7 ఆరంభం అయ్యే టీ20 ప్రపంచకప్.. మార్చి 8న ముగుస్తుంది.
