Site icon NTV Telugu

T20 World Cup 2026: ఓడిపోతారని పాకిస్థాన్‌కు ముందే తెలుసు.. అందుకే ఈ డ్రామా!

T20 World Cup 2026 Batting Lineup

T20 World Cup 2026 Batting Lineup

టీ20 వరల్డ్‌కప్‌ 2026లో భారత్‌తో జరిగే గ్రూప్‌ దశ మ్యాచ్‌కు పాకిస్థాన్‌ దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం క్రికెట్‌ ప్రపంచంలో తీవ్ర చర్చకు దారి తీసింది. ఫిబ్రవరి 15న జరగాల్సిన ఈ హై వోల్టేజ్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ ఆడడం లేదని ఆ దేశ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అయితే పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు (పీసీబీ) నుంచి మాత్రం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి ఇంకా అధికారికంగా చెప్పలేదు. ఏదేమైనా పాకిస్థాన్‌ ప్రభుత్వ నిర్ణయంపై భారత రాజకీయ, క్రీడా వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నాయి. మాజీ భారత క్రికెటర్‌, టీఎంసీ ఎంపీ కీర్తి ఆజాద్‌ పాకిస్థాన్‌ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించారు.

‘భారత్‌పై గెలవలేమన్న భయంతోనే పాకిస్థాన్‌ మ్యాచ్‌ ఆడకుండా తప్పించుకుంటోంది. పరువు కాపాడుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్ లాంటి ఒక విఫల దేశం మనతో ఆడటానికి నిరాకరిస్తోంది’ అని ఎంపీ కీర్తి ఆజాద్‌ అన్నారు. 2025లో పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో భారత్‌ అప్పుడే ఛాంపియన్ ట్రోఫీ నుంచి తప్పుకొని ఉంటే.. అంతర్జాతీయంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బలమైన సందేశం వెళ్లేదని ఆయన అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్‌ ప్రపంచంలోనే అతిపెద్ద ఉగ్రవాద దేశం అనే విషయం స్పష్టంగా తెలియజేయాల్సిందని కీర్తి ఆజాద్‌ అన్నారు.

బీజేపీ ఎంపీ శశాంక్‌ మణి కూడా పాకిస్థాన్‌ వైఖరిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘గెలవలేమని తెలిసినప్పుడు కొందరు మైదానం వదిలి పారిపోతారు. అలా పారిపోయేవారినే ‘రణ్‌ఛోడ్‌’ అంటారు. ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటే వివక్ష లేకుండా ఆడాలి. ఆపరేషన్‌ సిందూర్‌, ఇతర యుద్ధాల్లో భారత్‌ ఎలా గెలిచిందో.. ఇక్కడ కూడా గెలిచేది మనమే. అందుకే పాకిస్థాన్‌ ఆడటానికే భయపడుతోంది’ అని ఎంపీ శశాంక్‌ చెప్పుకొచ్చారు.

భారత్‌తో ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌లలో పాకిస్థాన్‌ రికార్డు దారుణంగా ఉంది. ఇప్పటివరకు ఇరు జట్లు ఎనిమిది సార్లు తలపడగా.. భారత్‌ ఏడు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, పాకిస్థాన్‌ ఒకసారి మాత్రమే గెలిచింది. ప్రస్తుతం టీమిండియా అద్భుత ఫామ్‌లో ఉంది. న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకొని వరల్డ్‌కప్‌కు సిద్దమైంది. ఈ వరల్డ్‌కప్‌ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. డిఫెండింగ్‌ చాంపియన్ భారత్‌ గ్రూప్‌–ఏలో నమీబియా, నెదర్లాండ్స్‌, యూఎస్‌ఏ, పాకిస్థాన్‌లతో కలిసి ఉంది. భారత్‌ ఫిబ్రవరి 7న యూఎస్‌ఏతో తొలి మ్యాచ్‌, ఫిబ్రవరి 12న తదుపరి మ్యాచ్‌ ఆడనుంది.

Exit mobile version