భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించే టీ20 వరల్డ్ కప్ 2026 కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టును ‘ఎక్స్’ వేదికగా ఈరోజు ఉదయం వెల్లడించింది. స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ కివీస్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఉపఖండ పిచ్‌లు కాబట్టి నలుగురు స్పిన్నర్లను రంగంలోకి దించుతోంది. ఇక బ్లాక్ క్యాప్స్ జట్టులో 31 ఏళ్ల జాకబ్ డఫీ మాత్రమే కొత్త ఆటగాడు. ప్రపంచకప్ కోసం సన్నాహకంగా జనవరి చివరి వారంలో టీమిండియాతో కివీస్ ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.
బౌలర్ జాకబ్ డఫీ ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో రెండవ స్థానంలో ఉన్నాడు. అతడు ఇప్పుడు న్యూజిలాండ్ తరపున అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. 2025లో 36 మ్యాచ్‌లు ఆడి 17 సగటుతో 81 వికెట్లు పడగొట్టాడు. దాంతో సర్ రిచర్డ్ హాడ్లీ 40 ఏళ్ల (79 వికెట్స్) రికార్డును బద్దలు కొట్టాడు. డఫీతో పాటు జట్టులో ఫాస్ట్ బౌలర్లు లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, ఆడమ్ మిల్నే, ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ జిమ్మీ నీషమ్ ఉన్నారు. పేస్ బౌలింగ్ రిజర్వ్‌గా కైల్ జామిసన్ ఉన్నాడు. కెప్టెన్ మిచెల్ సాంట్నర్‌తో పాటు కివీస్ జట్టుకు నలుగురు స్పిన్ ఎంపికలు కూడా ఉన్నాయి. ఇందులో ఇష్ సోధి మాత్రమే స్పెషలిస్ట్ స్పిన్నర్. మైఖేల్ బ్రేస్‌వెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్రలు స్పిన్ బౌలింగ్ వేస్తారన్న విషయం తెలిసిందే.
బ్యాటింగ్ విభాగంలో కూడా న్యూజిలాండ్ పటిష్టంగా ఉంది. ఫిన్ అలెన్, మార్క్ చాప్‌మన్, రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, డారిల్ మిచెల్, టిమ్ సీఫెర్ట్ లాంటి టాప్ బ్యాట్స్‌మెన్ ఉన్నారు. సీఫెర్ట్ వికెట్ కీపింగ్ విధులను నిర్వహిస్తాడు. ప్రస్తుతం అతడు ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్ తరపున ఆడుతున్నాడు. ఈ టోర్నీలో 56 బంతుల్లో 102 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 మధ్య ప్రపంచకప్ జరగనుంది. గ్రూప్ స్టేజిలో ఫిబ్రవరి 8న చెన్నైలో అఫ్గనిస్థాన్‌తో, ఫిబ్రవరి 10న చెన్నైలో యూఏఈతో, ఫిబ్రవరి 14న అహ్మదాబాద్లో దక్షిణాఫ్రికాతో, ఫిబ్రవరి 17న చెన్నైలో కెనడాతో న్యూజిలాండ్ తలపడనుంది.
Also Read: MSVPG First Ticket: అభిమానం అంటే ఇది కదా.. రూ.1.11 లక్షలకు మొదటి టికెట్ కొన్న అభిమాని!
న్యూజిలాండ్ జట్టు:
మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, ఆడమ్ మిల్నే, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రాచిన్ రవీంద్ర, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధి.