Site icon NTV Telugu

Suryakumar Yadav: మంచి మనుషులకు అంతా మంచే జరుగుతుంది.. సంజు కష్టమే గెలిపించింది!

Suryakumar Yadav Speech

Suryakumar Yadav Speech

Suryakumar Yadav Praises Sanju Samson After Match Winning 97 vs West Indies: టీమిండియా వికెట్ కీపర్ సంజు శాంసన్‌పై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రశంసలు కురిపించాడు. సంజు అసాధారణ ప్రదర్శనే తమ విజయానికి కారణం అని చెప్పాడు. మంచి మనుషులకు అంతా మంచే జరుగుతుందని సంజును ఉద్దేశించి పేర్కొన్నాడు. ఓపికగా వేచి ఉండే మంచి వ్యక్తులకు ఎప్పుడూ మంచే జరుగుతుందని నేను నమ్ముతానని.. సంజు విషయంలో ఇది నిజమైందని చెప్పుకొచ్చాడు. జట్టులో లేనప్పుడు సంజు తెర వెనుక పడ్డ కష్టం, చేసిన కృషికీ సరైన సమయంలో ఫలితం దక్కిందని సూర్యకుమార్ తెలిపాడు. టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఆదివారం కోల్‌కతాలో వెస్టిండీస్‌తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొంది సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. సంజు భారీ ఇన్నింగ్స్‌తో (97 నాటౌట్‌; 50 బంతుల్లో 12×4, 4×6) భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ… ‘ఇది గొప్ప అనుభూతి. మేము ఎలా ఆడామో చూస్తే.. అందరూ చెప్పినట్టే ఇది డూ-ఆర్-డై మ్యాచ్, క్వార్టర్ ఫైనల్‌ లాంటిదే. కఠిన పరిస్థితిలో మా ఆటగాళ్లు చూపిన ధైర్యం నిజంగా అద్భుతం. సంజు శాంసన్ అద్భుతంగా ఆడాడు. నేను అతడికి ఎప్పుడూ ఒక మాట చెబుతుంటాను. సహనం ఉన్న మంచి మనుషులకు మంచి విషయాలే జరుగుతాయని. సంజు ఆడని సమయంలో కూడా తెర వెనుక ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. ఆ కష్టమే ఇప్పుడు ఫలితంగా వచ్చింది. సరైన సమయంలో అతని కృషి ఫలించింది. అతను బ్యాటింగ్ చేసిన తీరే జట్టుకు విజయాన్ని అందించింది’ అని ప్రశంసలు కురిపించాడు.

Also Read: Sanju Samson Record: సంజు శాంసన్‌ రేర్ రికార్డు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులు బ్రేక్!

‘ప్రతి బౌలర్ ప్లాన్ ప్రకారం బౌలింగ్ చేశారు. ఈడెన్ మైదానంలో డ్యూ వల్ల రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ సులభంగా ఉంటుంది. కాబట్టి 200 పరుగులు ఛేజ్ చేయదగ్గ స్కోర్ అని మాకు తెలుసు. బ్యాటర్లు చిన్న చిన్న భాగస్వామ్యాలు నిర్మిస్తూ మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లిన తీరు కీలకం. ప్లేయర్స్ అందరూ బాగా ఆడారు. సెమీఫైనల్ చేరుకోవడం చాలా ఆనందంగా ఉంది. మొదటి మ్యాచ్ నుంచి మేము ఆడిన తీరు చూస్తే సెమీస్‌కు అర్హులమే అనిపిస్తోంది. ముంబైలో సెమీఫైనల్ జరగడం ప్రత్యేకం అనే చెప్పాలి. కానీ ఇప్పుడే సెమీఫైనల్ గురించి ఆలోచించడం లేదు. ఈరోజు విశ్రాంతి తీసుకుని రేపు ఫ్లైట్ ఎక్కుతాం. ముంబై చేరుకున్నాక సెమీఫైనల్ గురించి ఆలోచిస్తాం’ అని సూర్య చెప్పాడు.

‘జట్టుగా మైదానంలో ఏమి చేయాలో మనకు స్పష్టంగా తెలియాలి. అదే విషయాన్ని ఆటగాళ్లకు చెప్పాను. మైదానంలోని ప్రేక్షకుల నుంచి, ఇంట్లో చూసే వారి నుంచి కూడా ఒత్తిడి ఉంటుంది. కానీ ఇలాంటి మ్యాచ్‌లలో ధైర్యంగా ఆడాలి. పాజిటివ్‌గా నిర్ణయాలు తీసుకోవాలి. అందులో మేము సక్సెస్ అయ్యాము. ప్రెజర్ ఖచ్చితంగా ఉంటుంది. ఒత్తిడి లేకపోతే ఆటలో మజా ఉండదు. ఒత్తిడి ఉండదని చెబితే అబద్దమే.చాలా నర్వస్‌గా ఉంటుంది, గుండెలో టెన్షన్ ఉంటుంది. ముఖ్యంగా మన దేశంలో, మన మైదానాల్లో ఆడుతున్నప్పుడు ఒత్తిడి సహజం. కానీ దాన్ని ఎలా ఎదుర్కొంటాం అన్నదే ముఖ్యం’ అని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వివరించాడు.

Exit mobile version